నిందితుడు నరేశ్
సాక్షి, సిటీబ్యూరో: కరోనా ముందు వరకు వారిద్దరు స్నేహితులు. ఒకే గదిలో ఉన్నారు.. ఎవరి ఉద్యోగాలు వారు చేశారు. సాఫీగా సాగుతున్న వీరి ప్రయాణం కరోనా రాకతో కకావికలమైంది. ఉద్యోగం పోగొట్టుకున్న ఓ మిత్రుడు సొంతూరుకు వెళ్లాడు. అతనికి ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి. మరో స్నేహితుడు నగరంలోనే ఉండి తనకు వచ్చే జీతంలో డబ్బులు ఆదా చేసుకోవడం అతనికి కనిపించింది. తన మనసులో పుట్టిన దుర్బుద్ధితో ఏకంగా స్నేహితుడి డబ్బుల్నే కాజేసి కటకటాలపాలయ్యాడు. నిందితుడి నుంచి కీసర పోలీసులు రూ.29.5 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాలను బుధవారం నేరేడ్‌మెట్‌లోని రాచకొండ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో సీపీ మహేష్ భగవత్ వెల్లడించారు. చదవండి: చిట్టీల పేరుతో మోసం
24 గంటల్లోనే కేసు ఛేదన..
వరంగల్ జిల్లా ధర్మసాగర్‌లోని వ్యవసాయ కుటుంబానాకి చెందిన ఆవుల నరేశ్ ఇదే జిల్లా హన్మకొండలోని ఎస్‌వీఎస్ కాలేజీలో ఇంజినీరింగ్ చదువును మధ్యలోనే ఆపేశాడు. హైదరాబాద్‌కు వచ్చి చర్లపల్లిలోని ఓ కంపెనీలో చేరాడు. కుషాయిగూడలోని ఓ హాస్టల్‌లో ఉండేవాడు. ఇక్కడే యోగేశ్వరరావు, మణికంఠ, లక్ష్మణ్‌లతో నరేశ్‌కు ఏర్పడిన పరిచయం స్నేహంగా మారింది. ఆ తర్వాత వీరు నలుగురూ కీసర మండలంలోని నగరం గ్రామంలోని సాయి సదన్ అపార్ట్‌మెంట్‌లోని ఓ ఫ్లాట్ అద్దెకు తీసుకున్నారు. ఆ సమయంలో ఈ నలుగురికి ఫ్లాట్‌కు సంబంధించి తాళచెవులు ఒక్కొక్కరి వద్ద ఒక్కొక్కటి ఉంది. కాప్రా జీహెచ్‌ఎంసీలో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ ఇంజినీర్‌గా పని చేస్తున్న సంగారెడ్డి జిల్లా కాలేరు మండలం మర్ది గ్రామానికి చెందిన యోగేశ్వరరావు తన ఖాళీ సమయాల్లో కన్సల్టెన్సీల ద్వారా ఉద్యోగ పనులు చేసి పొదుపు చేసిన రూ.29.5 లక్షల నగదు వీఐపీ సూట్‌కేసులో ఉండటాన్ని నరేశ్ గమనించాడు.
ఇదే సమయంలో తన వద్ద మెయిన్ డోర్ తాళపు చెవి ఎక్కడో పడిపోయిందంటూ కరోనా సమయంలో బీటెక్ చదువు మధ్యలోనే ఆపేసిన నరేశ్ స్నేహితులతో చెప్పాడు. ఆ తర్వాత ఉద్యోగాలు పోవడంతో నరేశ్, లక్ష్మణ్‌లు ఆ ఫ్లాట్ ఖాళీ చేసి సొంతూళ్లకు వెళ్లిపోయారు. ఆర్థికంగా ఇబ్బందులు ఎక్కువ కావడంతో తన స్నేహితుడి డబ్బులు కాజేయాలని నరేశ్ ప్లాన్ చేశాడు. ఈ మేరకు ఈ నెల 17న వచ్చి తన స్నేహితులు యోగేందర్, మణికంఠ ఉద్యోగాల విధులకు వెళ్లే వరకు ఎదురుచూసి తన వద్ద ఉన్న తాళం చెవితో ఫ్లాట్ డోర్ తెరిచి లోపలికి వెళ్లాడు. వీఐపీ సూట్‌కేసును బద్దలుకొట్టి అందులోని రూ.29.5 లక్షల డబ్బు తీసుకొని తన బ్యాగ్‌లో వేసుకుని పరారయ్యాడు. పగటి సమయంలో సొంతూరుకు వెళ్లేందుకు భయపడిన నరేశ్ నగరంలోనే ఉన్నాడు.
అదే సమయంలో యోగేశ్వరరావు ఫోన్ చేయగా వరంగల్‌లో ఉన్నానని తప్పుడు సమాచారమిచ్చాడు. దీంతో యోగేశ్వరరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన కీసర సీఐ నరేందర్‌గౌడ్ నేతృత్వంలోని బృందం సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా నిందితుడిని గుర్తించింది. సెల్‌ఫోన్ సిగ్నల్ ట్రేస్ చేసి బుధవారం తెల్లవారుజామున ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద నరేశ్ వరంగల్ వెళ్లే బస్సు ఎక్కుతుండగా కీసర పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి రూ.29.5 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. కేసును 24 గంటల్లో ఛేదించిన కీసర సీఐ నరేందర్ గౌడ్‌తో పాటు ఇతర సిబ్బందిని సీపీ మహేష్ భగవత్ రివార్డులతో సన్మానించారు. కార్యక్రమంలో అడిషనల్ సీపీ సుధీర్‌బాబు, మల్కాజ్‌గిరి డీసీపీ రక్షితా కే మూర్తి, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment