సాక్షి, హైదరాబాద్ : ఓ ఖాకీచకుడి బరితెగింపు ఇది. నగర నిఘా విభాగమైన స్పెషల్ బ్రాంచ్‌లో (ఎస్బీ) ఈస్ట్ జోన్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తూ సస్పెన్షన్‌కు గురైన కె.చంద్రకుమార్ బాధితురాలితో అత్యంత హేయంగా ప్రవర్తించాడు. తన కోరిక తీర్చకుంటే యాసిడ్ పోసి చంపేస్తానంటూ బెదిరించాడు. నగ్నంగా వీడియో కాల్స్ చేస్తూ వేధించాడు. ఈ అంశంపై వనస్థలిపురం పోలీసులు నమోదు చేసిన ప్రాథమిక సమాచార నివేదికలో (ఎఫ్‌ఐఆర్) దర్యాప్తు అధికారులు ఈ వివరాలు పొందుపరిచారు. ప్రస్తుతం వనస్థలిపురంలో నివసిస్తున్న బాధితురాలు వరంగల్‌లో ఫుడ్ ఇన్‌స్పెక్టర్‌గా పని చేస్తున్నారు. కొన్నేళ్ల క్రితం తన పదో తరగతి సర్టిఫికెట్లు పోవడంతో ఫిర్యాదు చేయడానికి మిర్యాలగూడ పోలీసుస్టేషన్‌కు వెళ్లారు.
ఈ నేపథ్యంలోనే అప్పట్లో అక్కడ ఎస్సైగా పని చేస్తున్న చంద్రకుమార్‌తో బాధితురాలికి పరిచయమైంది. ఆ సర్టిఫికెట్లు రికవరీ చేసి ఇచ్చిన చంద్రకుమార్ అప్పటి నుంచి అప్పుడప్పుడు బాధితురాలికి ఫోన్లు చేయడం, సందేశాలు పంపడం చేసేవాడు. ఐదేళ్ల క్రితం ఆమె వ్యక్తిగత పనికి సంబంధించిన ఫైల్‌ను సచివాలయంలో క్లియర్ చేయిస్తానంటూ రూ.5 లక్షలు తీసుకున్నాడు. ఆ తర్వాత యాచారం ఇన్‌స్పెక్టర్‌గా బదిలీపై వచ్చిన చంద్రకుమార్ బాధితురాలికి తరచూ ఫోన్లు, ఎస్సెమ్మెస్‌లు పంపుతూ వేధించడం మొదలుపెట్టాడు. తన కోరిక తీరిస్తే వేధింపులు ఆపేస్తానంటూ బెదిరించడంతో బాధితురాలు అతడిని దూరంగా ఉంచడం మొదలెట్టారు. దీంతో ఆమె ఇంటికి వెళ్లి యాసిడ్ పోసి చంపేస్తానంటూ బెదిరించాడు. పిల్లల్నీ హత్య చేస్తానంటూ హెచ్చరించాడు. బాధితురాలి తండ్రికీ ఫోన్లు చేసి దుర్భాషలాడాడు.
రాచకొండ పోలీసుల కౌన్సెలింగ్
బాధితురాలు రాచకొండ పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా అతడికి కౌన్సెలింగ్ ఇచ్చారు. బాధితురాలి జోలికి వెళ్లనని, ఆమె నుంచి తీసుకున్న నగదు కూడా తిరిగి ఇచ్చేస్తానంటూ చెప్పి చర్యల నుంచి తప్పించుకున్నాడు. ఆ తర్వాత కూడా ఇన్‌స్పెక్టర్ తన ధోరణి మార్చుకోలేదు. బాధితురాలికి నగ్నంగా వీడియో కాల్స్ చేయడం మొదలెట్టాడు. చంద్రకుమార్ వ్యవహారం శ్రుతి మించుతుండటంతో బాధితురాలు హైదరాబాద్ పోలీసు కమిషనర్‌తోపాటు వనస్థలిపురం పోలీసులకు సోమవారం ఫిర్యాదు చేశారు. దీంతో నగర కొత్వాల్ అతడిని సస్పెండ్ చేయగా వన స్థలిపురం పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, ఓ మహిళతో అత్యంత హేయంగా ప్రవర్తించిన చంద్రకుమార్‌పై కేసు నమోదైన విషయాన్ని మాత్రం వనస్థలిపురం పోలీసులు గోప్యంగా ఉంచడం గమనార్హం.
చంద్రకుమార్‌ను అరెస్ట్ చేయాలి
తనను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నా ఎస్బీ సీఐ చంద్రకుమార్‌ను ఇప్పటివరకూ అరెస్ట్ చేయలేదని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. వనస్థలిపురం పోలీసులు ఆయనను రక్షిస్తున్నారని ఎఫ్‌ఐఆర్ నమోదై మూడు రోజులు గడుస్తున్నా అరెస్ట్ చేయలేదన్నారు. మహిళలను మానసికంగా వేధిస్తున్న సీఐ చంద్రకుమార్‌ను వదలకూడదని ఆమె డిమాండ్ చేశారు. కాగా ఆరోపణలు ఎదుర్కొంటున్న చంద్రకుమార్‌ను హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ మూడు రోజుల క్రితం విధుల నుంచి సస్పెండ్ చేశారు. ఆయనపై ఇప్పటికే నిర్భయ కేసు నమోదు అయింది.
Comments
Please login to add a commentAdd a comment