అతిపెద్ద కమిషనరేట్ ‘రాచకొండ’
- ఈ ఏడాదే వీఎం హోంలో కొత్త కమిషనరేట్ పనులు
- సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటాం
- వాట్సాప్ ఫిర్యాదుల నంబర్ 9490617111
- ‘మీట్ ది ప్రెస్’లో రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్
సాక్షి, హైదరాబాద్: నగరంలోని రాచకొండ పోలీసు కమిషనరేట్ దేశంలోనే అతి పెద్ద పోలీసు కమిషనరేట్ అని..ఈ కమిషనరేట్‌కు ఈ ఏడాదిలోనే నూతన కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని అమెరికా ప్రభుత్వ రియల్‌హీరో అవార్డు గ్రహీత, రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ మురళీధర్ భగవత్ అన్నారు. నూతన కార్యాలయం ఏర్పాటుకు సరూర్‌నగర్ విక్టోరియా మెమోరియల్ (వీఎం) హోంలో పది ఎకరాల భూమి లీజు ఇవ్వడానికి ప్రభుత్వం ఇప్పటికే జీవోను విడుదల చేసిందన్నారు. హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ శనివారం నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’లో ఆయన మాట్లాడుతూ వ్యవస్థీకృత నేరాల మూలాలను గుర్తించి కూకటివేళ్లతో పెకలిస్తున్నట్లు తెలిపారు.
నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ ప్రజలకు 24/7 అందుబాటులో ఉంటామన్నారు. నేర నివారణ, పరిశోధనకు పెద్దపీట వేస్తూ, మహిళలు, పిల్లల రక్షణ, గౌరవం కోసం అత్యంత ప్రాధాన్యం ఇస్తామన్నారు. యాదాద్రి దేవాలయానికి తిరుమల తరహాలో ఐదంచెల భద్రత వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
మహిళల భద్రతకు పెద్దపీట
మహిళల భద్రత కోసం భువనగిరిలో మహిళా పోలీస్ స్టేషన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థినులకు భరోసా కల్పించేందుకు ఇటీవల ‘షీ ఫర్ హర్’కార్యక్రమాన్ని ప్రారంభించి వారిచే వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయించామన్నారు. ఆన్‌లైన్ సెక్స్ రాకెట్ నిర్మూలనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు.
తల్లిదండ్రుల్లో ఆందోళన వద్దు
గంజాయి రవాణాను అడ్డుకునేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఏడాదిలో 4,500 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నామన్నారు. డ్రగ్స్ కేసుల్లో మీడియా సంయమనం పాటించాలన్నారు. కల్తీ విత్తనాలు, కల్తీ ఆహార పదార్ధాల కేసులో నిందితులపై చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ప్రజలు తమ చుట్టూ జరిగే నేరాలు, అక్రమ దందాలు, నిబంధనల ఉల్లంఘనలపై రాచకొండ వాట్సాప్ నంబర్ 94906 17111కు సమాచారం అందించాలన్నారు.
అభ్యర్థులను తయారు చేయడంలోనే సంతృప్తి
తనకు రియల్ హీరో అవార్డు కన్నా సివిల్స్‌కు అభ్యర్థులను తయారు చేయడంలోనే ‘రియల్’సంతృప్తి ఉందన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహరాష్ట్రలో తన వద్ద శిక్షణ తీసుకున్నవారిలో 84 మంది సివిల్స్‌కు ఎంపికకావడం ఓ టీచర్‌కు ఉండే ఆనందం దక్కిందన్నారు. అనంతరం మహేశ్ భగవత్‌ను ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు రాజమౌళి చారి, ప్రధాన కార్యదర్శి శ్రీగిరి విజయ్‌కుమార్ రెడ్డి ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ప్రెస్‌క్లబ్ ఉపాధ్యక్షుడు జనార్దన్, సంయుక్త కార్యదర్శి దగ్గు రఘు, కోశాధికారి శ్రీనివాసరెడ్డి, ఈసీ సభ్యులు అనుమల్ల గంగాధర్, నరేందర్, అనిల్, హరిప్రసాద్, యశోద పాల్గొన్నారు.