క్రమక్రమంగా చేజారిపోతున్న ట్రస్టు స్థలాలు
- ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు వరుసగా కేటాయింపులు
- మొత్తంగా ఉన్నది 73 ఎకరాలు
- పండ్ల మార్కెట్, జగ్జీవన్‌రామ్ భవన్, రిలయన్స్ బంకు, రోడ్డు విస్తరణతో 28 ఎకరాలు ఫట్.. ఆక్రమణలతో మరో రెండెకరాలు మాయం
- ఇప్పుడు రాచకొండ పోలీస్ కమిషనరేట్‌కు 10 ఎకరాలు కేటాయింపు
- మరో 26 ఎకరాల్లో మల్టీస్పెషాలిటీ ఆస్పత్రికి ప్రతిపాదనలు
- బాల బాలికల వసతిగృహాలు, తరగతి గదుల ఏర్పాటుకు స్థలాభావం
సాక్షి, హైదరాబాద్: విక్టోరియా మెమోరియల్ (వీఎం) హోమ్... అనాథలు, తల్లి దండ్రులను కోల్పోయిన పిల్లలకు వసతి కల్పిస్తూ విద్యా బుద్ధులు నేర్పిస్తున్న విద్యాలయం. కానీ ఇప్పుడీ హోమ్‌కు కష్టాలు వచ్చిపడ్డాయి. మెల్లమెల్లగా ఈ హోమ్ భూమి అంతా కుంచిం చుకుపోతోంది. వివిధ ప్రభుత్వ కార్యాలయా లు, ఇతర అవసరాలకు ప్రభుత్వం వీఎం హోమ్ భూములను కేటాయిస్తూ పోతుండ టంతో.. రెసిడెన్షియల్ స్కూలుకే సరిపడే స్థలం లేకుండా పోయే పరిస్థితి ఏర్పడుతోంది. తొలుత వీఎం హోమ్‌కు 73 ఎకరాల స్థలం ఉండగా.. ఇప్పు టికే 43 ఎకరాలకు చేరుకుంది. తాజాగా రాచకొండ పోలీస్ కమిషనరేట్, మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రుల ఏర్పాటు ప్రతి పాదనల తో కేవలం ఎనిమిది ఎకరాలే మిగలనుంది.
అవసరాలు అనేకం..
ప్రస్తుతం వీఎం హోమ్ ట్రస్టు ఆధ్వర్యంలో అనాథ పిల్లలు, నిర్లక్ష్యానికి గురై వదిలి వేయబడిన పిల్లల కోసం రెసిడెన్షియల్ పాఠ శాల కొనసాగుతోంది. ఇందులో మొత్తం 676 మంది పిల్లలున్నారు. ఒకటో తరగతి నుంచి ఏడో తరగతి వరకు కో–ఎడ్యుకేషన్, ఎనిమిది నుంచి పదోతరగతి వరకు బాలలు, బాలికలకు వేరువేరుగా తరగతులు నిర్వహిస్తారు. బాల బాలికలకు ప్రత్యేక డార్మిటరీలు ఉన్నాయి. వాస్త వానికి వీఎం హోమ్ రెసిడెన్షియల్ స్కూల్‌లో 900 మంది పిల్లలను చేర్చుకునే సామర్థ్యం ఉంది. 2017–18లో ట్రస్టు ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహించడంతో పిల్లల చేరిక సైతం పెరిగింది.
ఈ లెక్కన పూర్తి స్థాయిలో విద్యార్థులు చేరితే వసతుల సమస్య తలెత్తే అవకాశముంది. బాలికల వసతిగృహా లను రెండేళ్ల క్రితమే నిర్మించినా.. బాలుర వసతిగృహాలు మాత్రం ఇప్పటికే శిథిలావస్థలో ఉన్నాయి. తరగతి గదులను సైతం కొత్తగా నిర్మించాల్సి ఉంది. ప్రస్తుత మున్న భవనం చారిత్రక కట్టడంకావడంతో కొత్తగా తలపెట్టే నిర్మాణాలన్నీ ఇతర ఖాళీ స్థలంలో నిర్మించాలి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ సంస్థలకు భూ కేటాయింపులు జరిపితే రెసిడెన్షియల్ స్కూల్ నిర్వహణ ఇబ్బందికరం కానుంది. మరోపక్క వీఎం హోమ్ భూములను రాచకొండ కమిష నరేట్‌కు అప్పగించవద్దని, అనాథ బాలల పాఠశాల భూములను కాపాడమంటూ విద్యార్థులు పోస్ట్ కార్డుల ఉద్యమం చేప ట్టారు. ఈ మేరకు భూములను కాపాడాలని తెలంగాణ విద్యార్థి వేదిక ఆధ్వర్యంలో హైకోర్టుకు బుధవారం వీఎం హోమ్ అనాథ విద్యార్థులు లేఖలు రాసి పంపారు.
అనాథలకు చేదోడుగా..
ఆరో నిజాం నవాబు మీర్ మహమూద్ అలీఖాన్ నిర్మించిన విక్టోరియా ప్యాలెస్‌ను కొన్ని కారణాల వల్ల 1903లో అనాథల కోసం కేటాయించారు. రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్ మండల పరిధిలో ఉన్న ఈ ప్యాలెస్ అనంతరం విక్టోరియా మెమోరియల్ ట్రస్టుగా మారి సేవలందిస్తోంది. అనాథలు, తల్లిదండ్రులను కోల్పోయి నిర్లక్ష్యానికి గురైన పిల్లలను అక్కున చేర్చుకుని వారికి విద్యాబుద్ధులు నేర్పిస్తోంది. ఎస్సీ అభివృద్ధి శాఖ పర్యవేక్షణలో ఉన్న ఈ ట్రస్టుకు కార్యనిర్వాహక చైర్మన్‌గా ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి, సభ్యులుగా ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శి, విద్యాశాఖ కమిషనర్, సాంకేతిక విద్య, కార్మిక, దేవాదాయ శాఖల ఉన్నతాధి కారులు ఉన్నారు. కానీ 115 సంవత్సరాలుగా సేవలందిస్తూ.. సుదీర్ఘ చరిత్ర ఉన్న విక్టోరియా మెమోరియల్ హోమ్ చరిత్ర ఇప్పుడు చెదిరిపోతోంది. హోమ్ పేరిట ఉన్న సువిశాల స్థలాన్ని క్రమక్రమంగా ప్రభుత్వ సంస్థల ఏర్పాటుకు కేటాయిస్తుండడంతో కుంచించుకుపోతోంది.
రోజురోజుకూ తగ్గిపోతోంది..
వీఎం హోమ్‌కు 73 ఎకరాల స్థలం ఉంది. 1997లో అప్పటి ప్రభుత్వం వీఎం హోమ్ భూముల నుంచి 20 ఎకరాలను పండ్ల మార్కెట్‌కు లీజురూపంలో కేటాయించింది. తర్వాత రిలయన్స్ పెట్రోల్ బంక్‌కు రెండెకరాలు ఇవ్వగా.. మరో రెండున్నర ఎకరాల్లో బాబూ జగ్జీవన్‌రామ్ ఆడిటోరియాన్ని నిర్మించారు. ఇంకో రెండెకరాల స్థలం ఆక్రమ ణలకు గురైంది. హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారి విస్తరణలో మరో నాలుగె కరాలు పోయింది. ఇలా ఇప్పటికే ముప్పై ఎకరాలకుపైగా స్థలం కోల్పోయిన వీఎం హోమ్‌పై ఇప్పుడు మరో పిడుగు పడింది. ఉన్న భూమిలోంచి పదెకరాల స్థలాన్ని రాచకొండ పోలీస్ కమిషనరేట్‌కు లీజుకిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. మరో 26 ఎకరాల స్థలంలో మల్టీస్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటుకు వైద్యారోగ్య శాఖ ప్రతిపాదనలు రూపొందించింది. ప్రస్తుతం ఈ ఫైలు ప్రభుత్వ పరిశీలనలో ఉంది. దీనికి ఆమోదం లభిస్తే ఇక వీఎం హోమ్‌కు మిగిలేది కేవలం ఎనిమిది ఎకరాలు మాత్రమే.
భూకేటాయింపులను అడ్డుకుంటాం
‘‘అనాథల కోసం నిజాం ఇచ్చిన భూము లను ఇతర సంస్థలకు కేటాయించడం ట్రస్టు నిబంధనలకు విరుద్ధం. హైదరా బాద్ చుట్టూ పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములున్నాయి. వాటిల్లో ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేసుకోవచ్చు. రాచకొండ కమిషనరేట్‌కు, మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రికి కేటాయించాలన్న ప్రతిపాదనలు ఉపసం హరించుకోవాలి. వీఎం హోమ్ విద్యార్థు లకు కొత్త వసతిగృహాలు నిర్మించాలి. అందులో జూనియర్, డిగ్రీ, పీజీ కాలేజీ లను ఏర్పాటు చేయాలి. ప్రభుత్వం స్పం దించకుంటే న్యాయపోరాటం చేస్తాం..’’
– బి.రవీందర్ రెడ్డి, వీఎం హోమ్ పూర్వ విద్యార్థుల సంఘం ప్రతినిధి