Victoria Memorial Home
-
‘వీఎం హోమ్'అనాథల అమ్మఒడి
హుడాకాంప్లెక్స్:ఆ భవనం నిర్మించింది ఒకందుకైతే.. అనుకోకుండా మరొకరికి బహుమతిగా వెళ్లింది.ఆ తర్వాత వారి నుంచి మహోన్నత యజ్ఞానికి కేంద్రమైంది. అదే ‘వీఎం హోమ్’గా పిలుస్తున్న విక్టోరియా మెమోరియల్ హోమ్. సరూర్‌నగర్‌లోని హుడాకాంప్లెక్స్‌కు ఆనుకుని ఉన్నఈ 117 యేళ్ల చారిత్రక కట్టడం వేలాది మంది అనాథలకు గుడిగా మారింది. సువిశాల మైదానం, చుట్టూ చిన్నా, పెద్దా చెట్లతో పచ్చని వన సంపదతో అలరారుతూ తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక గుర్తింపునుసొంతం చేసుకున్న ఈ హెరిటేజ్సంపదకు నిజాం కాలంలోపునాది రాయి పడింది. నిజాం భార్య జ్ఞాపకార్థం కట్టడం హైదరాబాద్ సంస్థానం పాలకుడిగా నిజాం నవాబ్ మీర్ మహబూబ్ అలీఖాన్ ఉన్నప్పుడు తన భార్యకు బహుమతిగా ఇచ్చేందుకు ప్రస్తుత సరూర్‌నగర్‌లోని 73 ఎకరాల సువిశాల స్థలాన్ని ఎంపిక చేశారు. అందులో 1901లో ఓ భవంతి నిర్మాణం చేపట్టారు. అయితే, ఆ భవంతిని తన భార్య జ్ఞాపకార్థం విక్టోరియా మహారాణికి 1903 జనవరి 1న బహుమతిగా ఇచ్చిరు. అప్పటికే విక్టోరియా మహారాణి హైదరాబాద్‌లో అనాథ బాలల రక్షణ, సంక్షేమం, విద్య కోసం ఓ ట్రస్ట్ ఏర్పాటు చేశారు. అయితే, ఆ పిల్లలకు ఓ భవనం అవసరమని భావించిన విక్టోరియా మహారాణి ఈ భవంతిని ఆ ట్రస్ట్ కోసం కేటాంచారు. ఆనాటి నుంచి అదే స్ఫూర్తితో అనాథ బాలలకు సేవలందిస్తూ ప్రత్యేక విద్యాలయంగా విరాజిల్లుతోంది వీఎం హోమ్. ఈ భవనం చారిత్రక ఖ్యాతి నేపథ్యంలో సినిమా షూటింగ్‌లు సైతం ఇక్కడ జరుగుతుంటాయి. నిత్యం వందలాది మంది వాకర్స్ ఇక్కడి మైదానంలో తమ ఆరోగ్య రక్షణకు కసరత్తులు చేస్తుంటారు. ఉత్తీర్ణతలో నంబర్–1 రాష్ట్ర రక్షణ విభాగాలలో ఉద్యోగాలు సాధించేందుకు ఎందరో యువకులు ఈ భవనం మైదానంలో తర్ఫీదు పొందుతుంటారు. అలా వేలమంది ఉద్యోగాలు సొంతం చేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో వీఎం హోమ్ గురుకుల పాఠశాలగా రూపొంతరం చెందింది. ఇటీవల విడుదలైన ఎస్ఎస్సీ ఫలితాల్లో ఈ హోమ్‌లో చదువుకున్న 74 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా అందులో 73 మంది విజయం సాధించి 99 శాతం ఉత్తీర్ణతను సొంతం చేసుకుంది. రంగారెడ్డి జిల్లాలో అత్యుత్తమ గురుకుల పాఠశాలగా వీఎం హోమ్ గుర్తింపు పొందింది. ఇందులో 25 మంది ఉపాధ్యాయులు, 15 మంది సిబ్బందితో గురుకులంగా కొనసాగుతున్న ఈ ట్రస్ట్‌ను కేజీ టు పీజీ మహా విద్యాలయంగా తీర్చిదిద్దాలనే ప్రతిపాదన వుంది. పదో తరగతి వరకే కాకుండా అనంతరం ఉన్నత విద్యను అందిస్తే ఇక్కడి విద్యార్థులంతా ఉత్తమ పౌరులుగా ఎదిగే అవకాశం ఉందని, ఆ దిశగా హోమ్ ప్రిన్సిపల్ కొల్లు వెంకట్‌రెడ్డి కృషి చేస్తున్నారు. ప్రభుత్వ నిర్వహణలో.. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో తెలంగాణలో నిర్వహిస్తోన్న ఏకైక అనాథ విద్యార్థుల కేంద్రం వీఎం హోమ్ ఒక్కటే. ఎంతో మంది అనాథ బాలల జీవితాల్లో వెలుగులు నింపిన చారిత్రక హోమ్ ఇది. ప్రారంభంలో ఐటీఐ కోర్సుల్లో శిక్షణనిచ్చేవారు. ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, కార్పెంటింగ్, టైలరింగ్, మెకానికల్, బుక్ బైండింగ్ వంటి కోర్సులు అందుబాటులో ఉండేవి. కాలక్రమంలో శిక్షణ ఇచ్చేవారు కరువై ఆ కోర్సులను రద్దు చేశారు. అనంతరం 1994లో రెసిడెన్షియల్ స్కూల్‌గా మారుస్తూ ప్రభుత్వం జీఓ ఇచ్చింది. స్కూల్లో విద్యార్థుల సంఖ్య 900 ఉండడంతో గురుకుల సొసైటీ నుంచి 18 మంది ఉపాధ్యాయులను డిప్యూటేషన్‌పై నియమించారు. ఎన్నో సమస్యలను అధిగమించి ఇప్పుడు 25 మంది ఉపాధ్యాయులు, ఐదుగురు నాన్ టీచింగ్ స్టాఫ్‌తో హోమ్ కొనసాగుతోంది. ఇంగ్లిష్ మాధ్యమానికి ప్రాధాన్యమిస్తూ ఒకటి నుంచి నాలుగో తరగతి వరకు ప్రవేశాలకు జిల్లా విద్యాశాఖ అనుమతినివ్వడంతో హోమ్‌లో ప్రవేశాలు సైతం పెరిగింది. ప్రస్తుతం ఒకటి నుంచి 6వ తరగతి వరకు ఇంగ్లిష్ మీడియం, 7 నుంచి 10వ తరగతి వరకు తెలుగు మీడియంలో విద్యాబోధన జరుగుతోది. ఇక్కడి పిల్లలకు పౌష్టికాహారం అందిస్తూ వారి ఆరోగ్య సంరక్షణను సైతం చూస్తున్నారు. ఎంతో ప్రతిభావంతులు మా విద్యార్థులు క్రీడల్లో రాణించేందుకు పీఈటీలను నియమించాం. కంప్యూటర్, సంగీతంలోనూ శిక్షణనిస్తున్నాం. మాకు ప్రభుత్వ సహకారం ఎంతో ఉంది. దాంతో పాటు ఇతరులు కూడా విరాళాలు ఇచ్చి సహరిస్తున్నారు. దాతల సాయంతో మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశాం. స్వచ్ఛంద సంస్థలు ఇక్కడి పిల్లల కోసం ఉచిత వైద్య శిబిరాలు సైతం ఏర్పాటు చేస్తున్నాయి. మా విద్యార్థులు చదువులో ఎప్పుడూ ముందే ఉన్నారు. ఇటీవల పదోతరగతి ఫలితాల్లో దాదాపు అందరూ ఉత్తీర్ణులయ్యారు. విద్యార్థుల ప్రగతి కోసం రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి ఎంతో కృషి చేశారు. హోమ్ సంక్షేమ బడ్జెట్‌ను రూ.1.65 కోట్ల నుంచి రూ.5 కోట్లకు పెంచడంతో ఎన్నో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసుకోగలిగాం. హోమ్ గౌరవ కార్యదర్శి ఎ.శంకర్ కృషి కూడా ఎంతో ఉంది. – కొల్లు వెంకట్‌రెడ్డి, వీఎం హోమ్ ప్రిన్సిపల్ -
‘విక్టోరియా హోం’ లీజు రద్దు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో మరో ఎదురుదెబ్బ తగిలింది. రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్‌లోని నిజాం కాలం నాటి విక్టోరియా మెమోరియల్ హోం రెసిడెన్షియల్ స్కూల్‌కు చెందిన భూమిని రాచకొండ పోలీస్ కమిషనరేట్‌కు లీజుకిస్తూ జారీ చేసిన జీవోలను హైకోర్టు రద్దు చేసింది. దేవాదాయ భూముల విషయంలో ప్రభుత్వం ఇష్టానుసారం వ్యవహరించడానికి వీల్లేదని తేల్చిచెప్పింది. భూమి విషయంలో ఏ నిర్ణయమైనా చట్టానికి లోబడి తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ జి.శ్యాంప్రసాద్‌తో కూడిన ధర్మాసనం మంగళవారం తీర్పు వెలువరించింది. విక్టోరియా హోంకు చెందిన భూమిని రాచకొండ పోలీస్ కమిషనరేట్ నిర్మాణానికి లీజుకిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోలను సవాల్ చేస్తూ విక్టోరియా మెమోరియల్ హోం అనాథ పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు ఎల్.బుచ్చిరెడ్డి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం మరోసారి విచారణ జరిపింది. ఈ సందర్భంగా పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది సరసాని సత్యంరెడ్డి, ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సంజీవ్‌కుమార్ వాదనలు వినిపించారు. 11 ఏళ్ల లీజు చట్టవిరుద్ధం.. అనంతరం ధర్మాసనం తీర్పు వెలువరిస్తూ.. రికార్డులను పరిశీలిస్తే, విక్టోరియా హోం భూములను స్వాధీనం చేసుకునేందుకు కథ నడిపించినట్లు కనిపిస్తోందని వ్యాఖ్యానించింది. దేవాదాయ భూమి ఎప్పటికీ ప్రభుత్వ భూమి కాదని ధర్మాసనం మరోసారి గుర్తు చేసింది. ‘దేవాదాయ చట్ట నిబంధనల ప్రకారం మూడేళ్లకు మాత్రమే లీజు ఇచ్చే అధికారం కమిషనర్‌కు ఉంది. ఒకవేళ అంతకు మించిన గడువుతో లీజుకివ్వాలంటే గరిష్టంగా ఐదేళ్లకు మాత్రమే ఇవ్వొచ్చు. అది కూడా ప్రభుత్వ అనుమతితోనే చేయాలి’అని ధర్మాసనం స్పష్టం చేసింది. విక్టోరియా భూమిని 11 ఏళ్లకు లీజుకివ్వడాన్ని తప్పుబట్టింది. ఏ అధికారంతో అంత కాలానికి లీజుకిచ్చారని నిలదీసింది. ఐదేళ్లకు మించి లీజుకివ్వాలంటే బహిరంగ వేలం నిర్వహించాలని, అలా చేయకుండా 11 ఏళ్లకు లీజుకివ్వడం చట్ట నిబంధనలకు విరుద్ధమని, దేవాదాయ ట్రస్ట్‌కు చెందిన ఆ భూమిని లీజుకివ్వాలంటే ట్రస్ట్ కార్యవర్గమే స్వయంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉందని పేర్కొంది. కార్యవర్గం నుంచి లీజుకు అనుమతినివ్వాలని ప్రభుత్వాన్ని కోరుతూ చేసిన వినతి రికార్డుల్లో ఎక్కడా తమకు కనిపించలేదంది. ట్రస్ట్ లేకపోతే ప్రభుత్వం ట్రస్ట్‌ను ఏర్పాటు చేయాలని, అయితే ప్రస్తుత కేసులో అందుకు విరుద్ధంగా ప్రభుత్వం వ్యవహరించినట్లు స్పష్టమవుతోందని ధర్మాసనం తెలిపింది. అది ఎప్పటికీ ప్రభుత్వ భూమి కాదు.. దేవాదాయ భూమికి ప్రభుత్వం ధర్మకర్త మాత్రమేనని, ఆ భూమిని స్వాధీనంలోకి తీసుకోవడానికి.. ఆ భూమిపై ఆధిపత్యం చెలాయించడానికి వీల్లేదని తేల్చిచెప్పింది. అవసరమైన పక్షంలో ఆ భూమిని పరిహారం చెల్లించి భూసేకరణ కింద తీసుకోవచ్చని స్పష్టం చేసింది. ‘అవసరం మీదే.. భూమి కావాలని కోరేదీ మీరే.. భూమి ఇచ్చేదీ మీరే.. ఇలా అయితే ఎలా?’అని ప్రశ్నించింది. లీజు మొత్తాన్ని గణనీయంగా తగ్గించడాన్ని కూడా ధర్మాసనం తన తీర్పులో తప్పుబట్టింది. దేవాదాయ భూమిని దానం చేసిన దాతలకు గానీ, వారి వారసులకు గానీ ఆ భూమిని దేవాదాయ అవసరాలకు కాక మరో అవసరానికి కేటాయిస్తున్నట్లు ఎక్కడ సమాచారం ఇచ్చారని ప్రశ్నించింది. ముందు 11 ఏళ్ల లీజు, ఆ తర్వాత 33 ఏళ్లు, ఆ తర్వాత భూమి మాదేనంటారని ప్రభుత్వాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించింది. విక్టోరియా హోంకి నిధులిస్తున్నారన్న సాకుతో క్రమంగా దానికి చెందిన భూములను స్వాధీనం చేసుకోవాలని చూస్తున్నట్లు కనిపిస్తోందని, కావాలంటే నిధులు ఇవ్వడం మానుకోవాలని, అంతే తప్ప ఇలా చట్టవిరుద్ధంగా భూములను స్వాధీనం చేసుకోవడానికి వీల్లేదని తెగేసి చెప్పింది. దేని ఆధారంగా లీజుకివ్వాలని దేవదాయ కమిషనర్ నిర్ణయం తీసుకున్నారో అర్థం కావడం లేదంటూ, లీజు ఉత్తర్వులను రద్దు చేసింది. -
విక్టోరియా మెమోరియల్ హోమ్ ఇక చరిత్రే?
క్రమక్రమంగా చేజారిపోతున్న ట్రస్టు స్థలాలు - ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు వరుసగా కేటాయింపులు - మొత్తంగా ఉన్నది 73 ఎకరాలు - పండ్ల మార్కెట్, జగ్జీవన్‌రామ్ భవన్, రిలయన్స్ బంకు, రోడ్డు విస్తరణతో 28 ఎకరాలు ఫట్.. ఆక్రమణలతో మరో రెండెకరాలు మాయం - ఇప్పుడు రాచకొండ పోలీస్ కమిషనరేట్‌కు 10 ఎకరాలు కేటాయింపు - మరో 26 ఎకరాల్లో మల్టీస్పెషాలిటీ ఆస్పత్రికి ప్రతిపాదనలు - బాల బాలికల వసతిగృహాలు, తరగతి గదుల ఏర్పాటుకు స్థలాభావం సాక్షి, హైదరాబాద్: విక్టోరియా మెమోరియల్ (వీఎం) హోమ్... అనాథలు, తల్లి దండ్రులను కోల్పోయిన పిల్లలకు వసతి కల్పిస్తూ విద్యా బుద్ధులు నేర్పిస్తున్న విద్యాలయం. కానీ ఇప్పుడీ హోమ్‌కు కష్టాలు వచ్చిపడ్డాయి. మెల్లమెల్లగా ఈ హోమ్ భూమి అంతా కుంచిం చుకుపోతోంది. వివిధ ప్రభుత్వ కార్యాలయా లు, ఇతర అవసరాలకు ప్రభుత్వం వీఎం హోమ్ భూములను కేటాయిస్తూ పోతుండ టంతో.. రెసిడెన్షియల్ స్కూలుకే సరిపడే స్థలం లేకుండా పోయే పరిస్థితి ఏర్పడుతోంది. తొలుత వీఎం హోమ్‌కు 73 ఎకరాల స్థలం ఉండగా.. ఇప్పు టికే 43 ఎకరాలకు చేరుకుంది. తాజాగా రాచకొండ పోలీస్ కమిషనరేట్, మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రుల ఏర్పాటు ప్రతి పాదనల తో కేవలం ఎనిమిది ఎకరాలే మిగలనుంది. అవసరాలు అనేకం.. ప్రస్తుతం వీఎం హోమ్ ట్రస్టు ఆధ్వర్యంలో అనాథ పిల్లలు, నిర్లక్ష్యానికి గురై వదిలి వేయబడిన పిల్లల కోసం రెసిడెన్షియల్ పాఠ శాల కొనసాగుతోంది. ఇందులో మొత్తం 676 మంది పిల్లలున్నారు. ఒకటో తరగతి నుంచి ఏడో తరగతి వరకు కో–ఎడ్యుకేషన్, ఎనిమిది నుంచి పదోతరగతి వరకు బాలలు, బాలికలకు వేరువేరుగా తరగతులు నిర్వహిస్తారు. బాల బాలికలకు ప్రత్యేక డార్మిటరీలు ఉన్నాయి. వాస్త వానికి వీఎం హోమ్ రెసిడెన్షియల్ స్కూల్లో 900 మంది పిల్లలను చేర్చుకునే సామర్థ్యం ఉంది. 2017–18లో ట్రస్టు ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహించడంతో పిల్లల చేరిక సైతం పెరిగింది. ఈ లెక్కన పూర్తి స్థాయిలో విద్యార్థులు చేరితే వసతుల సమస్య తలెత్తే అవకాశముంది. బాలికల వసతిగృహా లను రెండేళ్ల క్రితమే నిర్మించినా.. బాలుర వసతిగృహాలు మాత్రం ఇప్పటికే శిథిలావస్థలో ఉన్నాయి. తరగతి గదులను సైతం కొత్తగా నిర్మించాల్సి ఉంది. ప్రస్తుత మున్న భవనం చారిత్రక కట్టడంకావడంతో కొత్తగా తలపెట్టే నిర్మాణాలన్నీ ఇతర ఖాళీ స్థలంలో నిర్మించాలి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ సంస్థలకు భూ కేటాయింపులు జరిపితే రెసిడెన్షియల్ స్కూల్ నిర్వహణ ఇబ్బందికరం కానుంది. మరోపక్క వీఎం హోమ్ భూములను రాచకొండ కమిష నరేట్కు అప్పగించవద్దని, అనాథ బాలల పాఠశాల భూములను కాపాడమంటూ విద్యార్థులు పోస్ట్ కార్డుల ఉద్యమం చేప ట్టారు. ఈ మేరకు భూములను కాపాడాలని తెలంగాణ విద్యార్థి వేదిక ఆధ్వర్యంలో హైకోర్టుకు బుధవారం వీఎం హోమ్ అనాథ విద్యార్థులు లేఖలు రాసి పంపారు. అనాథలకు చేదోడుగా.. ఆరో నిజాం నవాబు మీర్ మహమూద్ అలీఖాన్ నిర్మించిన విక్టోరియా ప్యాలెస్‌ను కొన్ని కారణాల వల్ల 1903లో అనాథల కోసం కేటాయించారు. రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్ మండల పరిధిలో ఉన్న ఈ ప్యాలెస్ అనంతరం విక్టోరియా మెమోరియల్ ట్రస్టుగా మారి సేవలందిస్తోంది. అనాథలు, తల్లిదండ్రులను కోల్పోయి నిర్లక్ష్యానికి గురైన పిల్లలను అక్కున చేర్చుకుని వారికి విద్యాబుద్ధులు నేర్పిస్తోంది. ఎస్సీ అభివృద్ధి శాఖ పర్యవేక్షణలో ఉన్న ఈ ట్రస్టుకు కార్యనిర్వాహక చైర్మన్‌గా ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి, సభ్యులుగా ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శి, విద్యాశాఖ కమిషనర్, సాంకేతిక విద్య, కార్మిక, దేవాదాయ శాఖల ఉన్నతాధి కారులు ఉన్నారు. కానీ 115 సంవత్సరాలుగా సేవలందిస్తూ.. సుదీర్ఘ చరిత్ర ఉన్న విక్టోరియా మెమోరియల్ హోమ్ చరిత్ర ఇప్పుడు చెదిరిపోతోంది. హోమ్ పేరిట ఉన్న సువిశాల స్థలాన్ని క్రమక్రమంగా ప్రభుత్వ సంస్థల ఏర్పాటుకు కేటాయిస్తుండడంతో కుంచించుకుపోతోంది. రోజురోజుకూ తగ్గిపోతోంది.. వీఎం హోమ్‌కు 73 ఎకరాల స్థలం ఉంది. 1997లో అప్పటి ప్రభుత్వం వీఎం హోమ్ భూముల నుంచి 20 ఎకరాలను పండ్ల మార్కెట్‌కు లీజురూపంలో కేటాయించింది. తర్వాత రిలయన్స్ పెట్రోల్ బంక్‌కు రెండెకరాలు ఇవ్వగా.. మరో రెండున్నర ఎకరాల్లో బాబూ జగ్జీవన్‌రామ్ ఆడిటోరియాన్ని నిర్మించారు. ఇంకో రెండెకరాల స్థలం ఆక్రమ ణలకు గురైంది. హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారి విస్తరణలో మరో నాలుగె కరాలు పోయింది. ఇలా ఇప్పటికే ముప్పై ఎకరాలకుపైగా స్థలం కోల్పోయిన వీఎం హోమ్‌పై ఇప్పుడు మరో పిడుగు పడింది. ఉన్న భూమిలోంచి పదెకరాల స్థలాన్ని రాచకొండ పోలీస్ కమిషనరేట్‌కు లీజుకిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. మరో 26 ఎకరాల స్థలంలో మల్టీస్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటుకు వైద్యారోగ్య శాఖ ప్రతిపాదనలు రూపొందించింది. ప్రస్తుతం ఈ ఫైలు ప్రభుత్వ పరిశీలనలో ఉంది. దీనికి ఆమోదం లభిస్తే ఇక వీఎం హోమ్‌కు మిగిలేది కేవలం ఎనిమిది ఎకరాలు మాత్రమే. భూకేటాయింపులను అడ్డుకుంటాం ‘‘అనాథల కోసం నిజాం ఇచ్చిన భూము లను ఇతర సంస్థలకు కేటాయించడం ట్రస్టు నిబంధనలకు విరుద్ధం. హైదరా బాద్ చుట్టూ పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములున్నాయి. వాటిల్లో ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేసుకోవచ్చు. రాచకొండ కమిషనరేట్‌కు, మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రికి కేటాయించాలన్న ప్రతిపాదనలు ఉపసం హరించుకోవాలి. వీఎం హోమ్ విద్యార్థు లకు కొత్త వసతిగృహాలు నిర్మించాలి. అందులో జూనియర్, డిగ్రీ, పీజీ కాలేజీ లను ఏర్పాటు చేయాలి. ప్రభుత్వం స్పం దించకుంటే న్యాయపోరాటం చేస్తాం..’’ – బి.రవీందర్ రెడ్డి, వీఎం హోమ్ పూర్వ విద్యార్థుల సంఘం ప్రతినిధి -
‘విక్టోరియా’లో అవతరణ వేడుకలు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: రాష్ట్ర అవతరణ వేడుకలను సరూర్‌నగర్‌లోని విక్టోరియా మెమోరియల్ హోంలో ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ రఘునందన్‌రావు తెలిపారు. ఈ ఉత్సవాలకు సంబంధించి అధికారులకు అప్పజెప్పిన పనులను సకాలంలో పూర్తిచేయాలన్నారు. గురువారం కలెక్టరేట్లో అవతరణ వేడుకలపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. జూన్ 2న ఉదయం 8.30గంటలకు అమరవీరుల స్తూపం ఆవిష్కరణతో ఉత్సవాలు ప్రారంభమవుతాయన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు, తెలంగాణ సంస్కృతి ఉట్టిపడే కార్యక్రమాలు ఘనంగా నిర్వహించాలన్నారు. అనంతరం జేసీ రజత్‌కుమార్ సైనీ మాట్లాడుతూ జిల్లాస్థాయిలో 30, మండల స్థాయిలో 10, మున్సిపల్ స్థాయిలో 15 అవార్డులు అందజేయనున్నట్లు చెప్పారు. సమావేశంలో జేసీ ఆమ్రపాలి, సబ్‌కలెక్టర్ అలగు వర్షిణి తదితరులు పాల్గొన్నారు.