‘వీఎం హోమ్‌'అనాథల అమ్మఒడి | Victoia Mahal Special Story on Orphan Children Education | Sakshi
Sakshi News home page

‘వీఎం హోమ్‌'అనాథల అమ్మఒడి

Published Mon, May 20 2019 7:29 AM | Last Updated on Sat, May 25 2019 12:24 PM

Victoia Mahal Special Story on Orphan Children Education - Sakshi

సరూర్‌నగర్‌లోని విక్టోరియా మెమోరియల్‌ హోమ్‌

హుడాకాంప్లెక్స్‌:ఆ భవనం నిర్మించింది ఒకందుకైతే.. అనుకోకుండా మరొకరికి బహుమతిగా వెళ్లింది.ఆ తర్వాత వారి నుంచి మహోన్నత యజ్ఞానికి కేంద్రమైంది. అదే ‘వీఎం హోమ్‌’గా పిలుస్తున్న విక్టోరియా
మెమోరియల్‌ హోమ్‌. సరూర్‌నగర్‌లోని హుడాకాంప్లెక్స్‌కు ఆనుకుని ఉన్నఈ 117 యేళ్ల చారిత్రక కట్టడం వేలాది మంది అనాథలకు గుడిగా మారింది. సువిశాల మైదానం, చుట్టూ చిన్నా, పెద్దా చెట్లతో పచ్చని వన సంపదతో అలరారుతూ తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక గుర్తింపునుసొంతం చేసుకున్న ఈ హెరిటేజ్‌సంపదకు నిజాం కాలంలోపునాది రాయి పడింది.  

నిజాం భార్య జ్ఞాపకార్థం కట్టడం
హైదరాబాద్‌ సంస్థానం పాలకుడిగా నిజాం నవాబ్‌ మీర్‌ మహబూబ్‌ అలీఖాన్‌ ఉన్నప్పుడు తన భార్యకు బహుమతిగా ఇచ్చేందుకు ప్రస్తుత సరూర్‌నగర్‌లోని 73 ఎకరాల సువిశాల స్థలాన్ని ఎంపిక చేశారు. అందులో 1901లో ఓ భవంతి నిర్మాణం చేపట్టారు. అయితే, ఆ భవంతిని తన భార్య జ్ఞాపకార్థం విక్టోరియా మహారాణికి 1903 జనవరి 1న బహుమతిగా ఇచ్చిరు. అప్పటికే విక్టోరియా మహారాణి హైదరాబాద్‌లో అనాథ బాలల రక్షణ, సంక్షేమం, విద్య కోసం ఓ ట్రస్ట్‌  ఏర్పాటు చేశారు. అయితే, ఆ పిల్లలకు ఓ భవనం అవసరమని భావించిన విక్టోరియా మహారాణి ఈ భవంతిని ఆ ట్రస్ట్‌ కోసం కేటాంచారు. ఆనాటి నుంచి అదే స్ఫూర్తితో అనాథ బాలలకు సేవలందిస్తూ ప్రత్యేక విద్యాలయంగా విరాజిల్లుతోంది వీఎం హోమ్‌. ఈ భవనం చారిత్రక ఖ్యాతి నేపథ్యంలో సినిమా షూటింగ్‌లు సైతం ఇక్కడ జరుగుతుంటాయి. నిత్యం వందలాది మంది వాకర్స్‌ ఇక్కడి మైదానంలో తమ ఆరోగ్య రక్షణకు కసరత్తులు చేస్తుంటారు.

ఉత్తీర్ణతలో నంబర్‌–1
రాష్ట్ర రక్షణ విభాగాలలో ఉద్యోగాలు సాధించేందుకు ఎందరో యువకులు ఈ భవనం మైదానంలో తర్ఫీదు పొందుతుంటారు. అలా వేలమంది ఉద్యోగాలు సొంతం చేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో వీఎం హోమ్‌ గురుకుల పాఠశాలగా రూపొంతరం చెందింది. ఇటీవల విడుదలైన ఎస్‌ఎస్‌సీ ఫలితాల్లో ఈ హోమ్‌లో చదువుకున్న 74 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా అందులో 73 మంది విజయం సాధించి 99 శాతం ఉత్తీర్ణతను సొంతం చేసుకుంది. రంగారెడ్డి జిల్లాలో అత్యుత్తమ గురుకుల పాఠశాలగా వీఎం హోమ్‌ గుర్తింపు పొందింది. ఇందులో 25 మంది ఉపాధ్యాయులు, 15 మంది సిబ్బందితో గురుకులంగా కొనసాగుతున్న ఈ ట్రస్ట్‌ను కేజీ టు పీజీ మహా విద్యాలయంగా తీర్చిదిద్దాలనే ప్రతిపాదన వుంది. పదో తరగతి వరకే కాకుండా అనంతరం ఉన్నత విద్యను అందిస్తే ఇక్కడి విద్యార్థులంతా ఉత్తమ పౌరులుగా ఎదిగే అవకాశం ఉందని, ఆ దిశగా హోమ్‌ ప్రిన్సిపల్‌ కొల్లు వెంకట్‌రెడ్డి కృషి చేస్తున్నారు.

ప్రభుత్వ నిర్వహణలో..
రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో తెలంగాణలో నిర్వహిస్తోన్న ఏకైక అనాథ విద్యార్థుల కేంద్రం వీఎం హోమ్‌ ఒక్కటే. ఎంతో మంది అనాథ బాలల జీవితాల్లో వెలుగులు నింపిన చారిత్రక హోమ్‌ ఇది. ప్రారంభంలో ఐటీఐ కోర్సుల్లో శిక్షణనిచ్చేవారు. ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, కార్పెంటింగ్, టైలరింగ్, మెకానికల్, బుక్‌ బైండింగ్‌ వంటి కోర్సులు అందుబాటులో ఉండేవి. కాలక్రమంలో శిక్షణ ఇచ్చేవారు కరువై ఆ కోర్సులను రద్దు చేశారు. అనంతరం 1994లో రెసిడెన్షియల్‌ స్కూల్‌గా మారుస్తూ ప్రభుత్వం జీఓ ఇచ్చింది. స్కూల్‌లో విద్యార్థుల సంఖ్య 900 ఉండడంతో గురుకుల సొసైటీ నుంచి 18 మంది ఉపాధ్యాయులను డిప్యూటేషన్‌పై నియమించారు. ఎన్నో సమస్యలను అధిగమించి ఇప్పుడు 25 మంది ఉపాధ్యాయులు, ఐదుగురు నాన్‌ టీచింగ్‌ స్టాఫ్‌తో హోమ్‌ కొనసాగుతోంది. ఇంగ్లిష్‌ మాధ్యమానికి ప్రాధాన్యమిస్తూ ఒకటి నుంచి నాలుగో తరగతి వరకు ప్రవేశాలకు జిల్లా విద్యాశాఖ అనుమతినివ్వడంతో హోమ్‌లో ప్రవేశాలు సైతం పెరిగింది. ప్రస్తుతం ఒకటి నుంచి 6వ తరగతి వరకు ఇంగ్లిష్‌ మీడియం, 7 నుంచి 10వ తరగతి వరకు తెలుగు మీడియంలో విద్యాబోధన జరుగుతోది. ఇక్కడి పిల్లలకు పౌష్టికాహారం అందిస్తూ వారి ఆరోగ్య సంరక్షణను సైతం చూస్తున్నారు.

ఎంతో ప్రతిభావంతులు
మా విద్యార్థులు క్రీడల్లో రాణించేందుకు పీఈటీలను నియమించాం. కంప్యూటర్, సంగీతంలోనూ శిక్షణనిస్తున్నాం. మాకు ప్రభుత్వ సహకారం ఎంతో ఉంది. దాంతో పాటు ఇతరులు కూడా విరాళాలు ఇచ్చి సహరిస్తున్నారు. దాతల సాయంతో మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేశాం. స్వచ్ఛంద సంస్థలు ఇక్కడి పిల్లల కోసం ఉచిత వైద్య శిబిరాలు సైతం ఏర్పాటు చేస్తున్నాయి. మా విద్యార్థులు చదువులో ఎప్పుడూ ముందే ఉన్నారు. ఇటీవల పదోతరగతి ఫలితాల్లో దాదాపు అందరూ ఉత్తీర్ణులయ్యారు. విద్యార్థుల ప్రగతి కోసం రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి ఎంతో కృషి చేశారు. హోమ్‌ సంక్షేమ బడ్జెట్‌ను రూ.1.65 కోట్ల నుంచి రూ.5 కోట్లకు పెంచడంతో ఎన్నో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసుకోగలిగాం. హోమ్‌ గౌరవ కార్యదర్శి ఎ.శంకర్‌ కృషి కూడా ఎంతో ఉంది.     – కొల్లు వెంకట్‌రెడ్డి, వీఎం హోమ్‌ ప్రిన్సిపల్‌  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement