
ఇబ్రహీంపట్నం: పోలీస్ ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా శిక్షణ పొందుతున్న ఓ యువకుడు గుండెపోటుతో మృతి చెందాడు. ఈ విషాద సంఘటన గురువారం ఉదయం ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎల్మినేడు అనుబంధ గ్రామం మెటిల్లకు చెందిన యాదయ్య, నాగమ్మ దంపతుల ఏకైక కుమారుడు ఏకాంబరం(23) నగరంలో ఉన్నతవిద్య అభ్యసించాడు. పోలీసు శాఖలో ఉద్యోగం సాధించడం అతడి కల. తన స్వప్నాన్ని సాకారం చేసుకునే దిశగా ప్రయత్నాలు ప్రారంభించాడు.
ఈ క్రమంలో రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీసు ఉద్యోగాల శిక్షణ శిబిరానికి ఎంపికయ్యాడు. పోలీస్ రిక్రూట్‌మెంట్ ప్రాథమిక పరీక్షల్లో అర్హత సాధించాడు. ఈ నెల 23న జరగనున్న దేహదారుఢ్య పరీక్షలకు సన్నద్ధమవుతున్నాడు. ఎప్పటి మాదిరిగానే ఖానాపూర్ సమీపంలోని సెయింట్ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో గురువారం ఉదయం శిక్షణకు హాజరయ్యాడు. పరుగు తీస్తూ ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. స్నేహితులు స్థానిక అస్పత్రికి తరలించేలోపే మృతి చెందాడు.
Comments
Please login to add a commentAdd a comment