రాశీఖన్నాతో కరచాలనం చేస్తున్న రోబో మిత్ర
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ పోలీస్ శాఖ, షీ టీమ్స్ సంయుక్తంగా పోలీస్ ఎక్స్‌పోను ప్రారంభించారు. నగరంలోని పీపుల్స్‌ప్లాజాలో నిర్వహించిన ఈ ప్రదర్శనను రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ప్రారంభించారు. రెండు రోజుల పాటు జరుగనున్న ఈ ఎక్స్‌పోలో పలు విషయాలపై అవగాహన కల్సించనున్నారు. ఈ కార్యక్రమానికి నటి రాశీఖన్నాతో పాటు, తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి, షీటీమ్స్ ఇన్‌చార్జ్ స్వాతి లక్రా తదితరులు పాల్గొన్నారు. ఎక్స్ పో ప్రారంభం అనంతరం నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ పోలీస్ ఎక్స్‌పో ఏర్పాటు చేసినందుకు సంతోషంగా ఉందన్నారు. మహిళల భద్రతను తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందని తెలిపారు. స్వాతిలక్రా నేతృత్వంలో షీ టీమ్స్ అద్భుతంగా పనిచేస్తున్నాయని.. షీ టీమ్స్ దేశానికే ఆదర్శమని కొనియాడారు.
రోబో మిత్రా సందడి
గతేడాది జరిగిన గ్లోబల్ ఎంటర్‌పెన్యూర్‌షిప్ సమ్మిట్‌లో(జీఈఎస్) ప్రారంభ వేడుకల్లో ప్రధాన ఆకర్షణగా నిలిచిన మర మనిషి ' మిత్ర' ఈ ఎక్స్‌పోలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఎక్స్‌పోకు వచ్చిన అతిథులకు స్వాగతం పలకడంతో పాటు స్వాగతోపన్యాసం కూడా చేసింది. కార్యక్రమంలో పాల్గొన్న రాశీఖన్నాకు రోబో షేక్‌హ్యాండ్ ఇచ్చి సందడి చేసింది. రెండు రోజుల పాటు స్టాల్స్ వద్దే ఉండి సందర్శకులతో మమేకం కానుంది. గంటకు 30 కిమీ వేగంతో పరుగెట్టే సామర్థ్యం కలిగిన మిత్ర ఆదివారం జరుగనున్న షీ టీమ్స్ రన్‌లోనూ పాల్గొననుంది.
Comments
Please login to add a commentAdd a comment