సాక్షి, హైదరాబాద్: సామూహిక నిమజ్జనాన్ని తిలకించేందుకు వచ్చిన యువతులను సెల్‌ఫోన్ ద్వారా వీడియో రికార్డింగ్ చేసిన వ్యక్తి చర్యలను న్యాయస్థానం తీవ్రంగా పరిగణించింది. సిటీ షీ–టీమ్స్‌కు చిక్కిన ఇతడికి కోర్టు 27 రోజుల జైలు శిక్ష విధించినట్లు అదనపు సీపీ (నేరాలు) షికాగోయల్ బుధవారం తెలిపారు. మరో ఇద్దరికి సామాజిక సేవ చేసే శిక్ష విధించగా... యువతిని వేధిస్తున్న మరో వ్యక్తికి జరిమానా విధించినట్లు ఆమె పేర్కొన్నారు.
గత నెల 23న సామూహిక గణేష్ నిమజ్జనం జరిగింది. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా పోలీసులు అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ ఆదేశాల మేరకు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా షీ–టీమ్స్‌ను రంగంలోకి దింపారు. ఈవ్ టీజర్లకు చెక్ పెట్టేందుకు 100 షీ–టీమ్ బృందాలను వివిధ ప్రాంతాల్లో మోహరించారు. ట్యాంక్‌బండ్ మీద ఉన్న క్రేన్ నెం.3 వద్ద మాటేసిన షీ–టీమ్స్‌కు సుశికాంత్ పాండ దొరికాడు. ఒడిస్సాకు చెందిన ఇతను నగరానికి వలసవచ్చి కుక్‌గా పని చేస్తున్నాడు. నిమజ్జనం నేపథ్యంలో ట్యాంక్‌బండ్ పైకి వచ్చిన ఇతను స్మార్ట్‌ఫోన్‌తో యువతులను వారి అనుమతి లేకుండా చిత్రీకరిస్తుండటాన్ని గుర్తించిన షీ–బృందాలు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నాయి. పూర్తి ఆధారాలతో 16వ స్పెషల్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. కేసు పూర్వాపరాలు పరిశీలించిన న్యాయమూర్తి సుశికాంత్‌కు 27 రోజుల జైలు, రూ.250 జరిమానా విధించారు.
అదే రోజు ట్యాంక్‌బండ్‌పై యువతులను వెకిలి చేష్టలతో వేధిస్తున్న మీర్‌పేటకు చెందిన జూనియర్ ఆర్టిస్ట్ పి.కృష్ణ, మౌలాలీకి చెందిన బీకే దిలీప్‌లను సైతం పట్టుకుని కోర్టులో హాజరుపరిచాయి. వీరికి న్యాయస్థానం రెండు రోజుల పాటు సామాజిక సేవ చేసేలా శిక్షతో పాటు రూ.100 జరిమానా విధించింది. మరోపక్క ఓ యవతిని ఫోన్ ద్వారా వేధిస్తున్న కుషాయిగూడకు చెందిన వ్యాపారి కె. నాగరాజుకు షీ–టీమ్స్ చెక్ చెప్పాయి. ఇతడికి కోర్టు రూ.250 జరిమానా విధించినట్లు షికా గోయల్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment