షీ టీమ్ బృందంతో మహిళా భద్రత విభాగం ఐజీ స్వాతి లక్రా (ఫైల్)
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో మహిళల భద్రత విషయంలో వినూత్న కార్యక్రమాలు చేపడుతున్న పోలీస్ శాఖ షీటీమ్స్‌తో మంచి విజయం సాధించింది. ఈవ్‌టీజింగ్, వేధింపుల నియంత్రణకు విశేష స్థాయిలో కృషిచేస్తున్న ఈ బృందాల వల్ల ఏటా వేధింపుల కేసులు తగ్గుతున్నాయని మహిళా భద్రతా విభాగం ఐజీ స్వాతిలక్రా శుక్రవారం విడుదలు చేసిన ఒక పత్రికా ప్రకటనలో స్పష్టంచేశారు.హైదరాబాద్ కమిషనరేట్‌లో ప్రవేశపెట్టిన షీటీమ్స్ గత రెండేళ్లుగా జిల్లాల్లోనూ ఏర్పాటు చేశామని, ఈ సందర్భంగా షీటీమ్స్ ఈ ఏడాది చేసిన కృషి, వార్షిక నివేదికను స్వాతిలక్రా విడుదల చేశారు.
మొత్తంగా 320 నిర్భయ కేసులు...
రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాలు, వివిధ వేదికలు, సోషల్ మీడియాలో మహిళలు, యువతులను లైంగిక వేధింపులకు గురిచేయడం, ఈవ్‌టీజింగ్‌కు పాల్పడటం కింద 1,655 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసినట్టు స్వాతిలక్రా వెల్లడించారు. వీటిలో 320 నిర్భయ యాక్ట్ కేసులు, 73 ఐటీ యాక్ట్ కేసులు, 104 పోక్సో యాక్ట్ కేసులున్నట్టు పేర్కొన్నారు. సాధారణంగా వేధింపులకు పాల్పడుతున్న వారిలో మార్పు కోసం అవకాశాలిస్తున్నామని, వీరిలో చాలా మంది మారినా కొంత మంది మాత్రం పదే పదే వేధింపులకు పాల్పడటంతో ఈ కేసులు నమోదు చేసినట్టు వెల్లడించారు. ఇలాంటి వారిపై పీడీయాక్ట్‌కు సైతం వెనుకాడటం లేదని తేల్చిచెప్పారు. 3,876 పెట్టీ కేసులను నమోదు చేయగా, 10,644 మందికి కౌన్సెలింగ్ ఇవ్వడంతో పాటు వారిపై నిఘా పెట్టినట్టు తెలిపారు.
ఇకపోతే 4,008 మందికి కఠిన వైఖరితో వ్యవహరిస్తామని హెచ్చరించామని, మరోసారి వేధింపులకు పాల్పడితే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసేలా ఆదేశాలిస్తున్నామని తెలిపారు. ఇకపోతే రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్లు, కళాశాలలు, వసతి గృహాలు ఇతర ప్రాంతాల్లో అవగాహన చేపట్టినట్టు తెలిపారు. ఇలా 7,354 అవగాహన సదస్సుల ద్వారా 40.12లక్షల మందికి షీటీమ్స్ ఉద్దేశం చేర్చినట్టు తెలిపారు. 2018లో 2,709 మంది నేరుగా షీటీమ్స్‌కు ఫిర్యాదు చేయగా, వాట్సాప్ ద్వారా 2,825మంది, డయల్ 100 ద్వారా 2,270మంది, ఫేస్‌బుక్ పేజీల ద్వారా 26మంది, ఈమెయిల్స్ ద్వారా 351మంది, హాక్‌ఐ ద్వారా 100 మంది ఫిర్యాదు చేసినట్టు స్వాతిలక్రా తెలిపారు. గడిచిన ఏడాదిలో 8,578మందిని పట్టుకున్నామని, వీరిలో 771మందిపై ఎఫ్‌ఐఆర్ నమోదు కాగా, 1,351మందిపై పెట్టీ కేసులు, 3,379మందికి కౌన్సెలింగ్, 3,077మందిని హెచ్చరించినట్లు తెలిపారు.
వేధింపులకు పాల్పడుతున్న వారిలో 18ఏళ్లలోపు 12శాతం మంది ఉండగా, 19–24 ఏళ్ల వారు 38.06శాతం, 25–35ఏళ్లలోపు వారు 36.02శాతం, 36–50ఏళ్ల లోపు 13శాతం, 50ఏళ్ల పైబడిన వారు 0.02శాతం ఉన్నట్టు తేలిందన్నారు. ఇక వేధింపులు సైతం రకరకాలుగా ఉన్నాయని, వీటిలో ఎక్కువ శాతం టీజింగ్, అసభ్యప్రవర్తన కిందే 38శాతం ఉన్నట్టు గుర్తించామన్నారు. ఫోన్లలో వేధింపులు 31శాతం, 10.5శాతం స్టాకింగ్‌కు గురి అవుతున్నట్టు వెల్లడించారు. సామాజిక మాధ్యమాల ద్వారా 6శాతం మంది, అభ్యంతరకర సందేశాలతో 13శాతం మంది, అసంబద్ధ తాకడాల ద్వారా 1.5శాతం మంది వేధింపులకు పాల్పడ్డారని స్పష్టంచేశారు.
ఆధారాలతో సహా...
వేధింపులకు పాల్పడుతున్న వారిని పూర్తి స్థాయి వీడియో ఆధారాలతో సహా పట్టుకుంటున్నామని స్వాతిలక్రా తెలిపారు. ఇది ఒక పద్ధతి అయితే, బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించి డెకాయి ఆపరేషన్ ద్వారా కూడా వేధింపుల నియంత్రణకు కృషిచేస్తున్నామని తెలిపారు. షీటీమ్స్ పనితీరుతో ఏటా మహిళల వేధింపుల కేసులు భారీ స్థాయిలో తగ్గుముఖం పట్టినట్టు స్పష్టంచేశారు. 2014–15లో 26శాతం మంది మైనర్లు లైంగిక వేధింపులకు పాల్పడగా, 2017–18లో 12శాతానికి తగ్గుముఖం పట్టినట్టు తెలిపారు. ఇదే రీతిలో మిగిలిన వారిలోనూ మార్పు వస్తుందని, రాష్ట్రంలో మహిళా భద్రత విషయంలో రాజీపడే సమస్యలేదని స్పష్టంచేశారు.
Comments
Please login to add a commentAdd a comment