నో యాక్ట్‌.. నో..యాక్షన్‌ | no special act to 'she teams' | Sakshi
Sakshi News home page

నో యాక్ట్‌.. నో..యాక్షన్‌

Published Mon, Mar 20 2017 11:37 PM | Last Updated on Tue, Sep 5 2017 6:36 AM

నో యాక్ట్‌.. నో..యాక్షన్‌

నో యాక్ట్‌.. నో..యాక్షన్‌

ప్రత్యేక చట్ట మంటూ లేని ‘షీ–టీమ్స్‌’
రెండేళ్ల క్రితమే ప్రతిపాదించిన వైనం
తమిళనాడు తరహా ముసాయిదా సమర్పణ
ఇప్పటికీ ప్రభుత్వం వద్ద పెండింగ్‌లోనే...


 సిటీబ్యూరో: ‘ఆ వ్యక్తి చేష్టలతో యువతులు కొన్ని నెలల పాటు విసిగిపోయారు. అనేక సందర్భాల్లో తీవ్ర ఆందోళనకు, దిగ్భ్రాంతికి, అభద్రత భావానికీ లోనయ్యారు. అయితే ఆ పోకిరీకి పడిన శిక్ష రూ.50 జరిమానా మాత్రమేనా.?’  ‘షీ–టీమ్స్‌’ ఫేస్‌బుక్‌ పేజీలో ఈ తరహా పోస్టింగ్స్‌ ఎన్నో. దీనికి పరిష్కారంగా అధికారులు రూపొందించిన ప్రతిపాదనే ‘తెలంగాణ ప్రొహిబిషన్‌ ఆఫ్‌ ఈవ్‌ టీజింగ్‌ యాక్ట్‌’. తమకో ప్రత్యేక చట్టం కావాలంటూ ‘షీ–టీమ్స్‌’ రెండేళ్ల క్రితమే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినా... ఇప్పటికీ స్పందన రాలేదు. ఈ ఫైల్‌ న్యాయ విభాగం వద్ద పెండింగ్‌లో ఉండిపోయింది. సరైన చట్టం లేని కారణంగా అనేక మంది పోకిరీలు స్వల్ప శిక్షలతో తప్పించుకునే పరిస్థితి నెలకొంది.

మూడేళ్లవుతున్నా చట్టం లేదు...
రోడ్లపై ఉండే పోకిరీల మొదలు ఆన్‌లైన్‌లో, సోషల్‌మీడియా ద్వారా అదును చూసి కాటు వేస్తున్న నయవంచకుల వరకు... ఎందరో మృగాళ్ళ బారినుంచి అతివల్ని రక్షిస్తున్న హైదరాబాద్‌ ‘షీ–టీమ్స్‌’ అమలులోకి వచ్చి మూడేళ్లు కావస్తోంది. ఇప్పటికే గణనీయమైన ఫలితాలు సాధిస్తున్న ఈ బృందాల పని తీరును మరింత మెరుగుపరచడంతో పాటు మహిళలు/యువతులకు పూర్తి స్థాయి భరోసా ఇవ్వడానికి ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈవ్‌ టీజర్లకు కఠిన శిక్షలు పడేలా చేసేందుకు ప్రత్యేక చట్టం అవసరమని నిర్ణయించారు. తమిళనాడులో అమలులో ఉన్న ‘తమిళనాడు ప్రొహిబిషన్‌ ఆఫ్‌ ఈవ్‌ టీజింగ్‌ యాక్ట్‌’ తరహాలో రూపొందించిన ముసాయిదాను రెండేళ్ళ క్రితమే ప్రభుత్వానికి సమర్పించారు.

చిక్కుతున్నా చిన్న కేసులే...
బహిరంగ ప్రదేశాల్లో యువతులు/మహిళల్ని వేధిస్తున్న పోకిరీలను నిత్యం ‘షీ–టీమ్స్‌’ పట్టుకుంటున్నా... తీవ్రత, ఆధారాలు ఉంటే తప్ప అందరి పైనా ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ (ఐపీసీ)తో పాటు నిర్భయ, యాంటీ ర్యాగింగ్‌ యాక్ట్‌ల ప్రకారం కేసులు నమోదు చేయడం సాధ్యం కావట్లేదు. దీంతో మూడేళ్లలో సీసీఎస్‌ ఆధీనంలోని ‘షీ–టీమ్స్‌’కు చిక్కిన పోకిరీల్లో దాదాపు సగం మంది చిన్న (పెట్టీ) కేసులు, నామమాత్రపు జరిమానాతో సరిపెట్టాల్సి వచ్చింది. ఈవ్‌–టీజింగ్‌కు పాల్పడుతూ రెండోసారీ చిక్కిన ఓ వ్యక్తితో పాటు తీవ్రమైన స్థాయిలో రెచ్చిపోయిన వారిపైనే కేసులు నమోదు చేయగలిగారు. పోకిరీల వేధింపులు అనేవి చూడటానికి చిన్న విషయంగా కనిపించినా యువతులు/మహిళలపై వాటి ప్రభావం తీవ్రంగా ఉండటంతో పాటు సమాజం, పోలీ సులపై ఏహ్యభావం ఏర్పడే అవకాశం ఉంటుంది.

ప్రత్యేక యాక్ట్‌తోనే కట్టడి...
ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకున్న సీసీఎస్‌ ఉన్నతాధికారులు ఈవ్‌ టీజర్లను పూర్తి స్థాయిలో కట్టడి చేయడానికి ప్రత్యేక చట్టం అవసరమని భావించారు. దీంతో పలు ప్రాంతాల్లో అమలులో ఉన్న విధానాలను అధ్యయనం చేసి... చివరకు తమిళనాడులో అమలులో ఉన్న చట్టం ఉపయుక్తంగా ఉందని నిర్థారించారు. ఈవ్‌–టీజింగ్‌ బారినపడి పలువురు అతివలు గాయపడటం, కొందరు మరణించడం సైతం జరగడంతో అక్కడి సర్కారు 1998లోనే ప్రత్యేక చట్టాన్ని తీసుకువచ్చింది. ఆ ఏడాది జూలై 30 ఆర్డినెన్స్‌ రూపంలో, కొన్ని నెలలకే చట్టంగా అమలులోకి వచ్చిన ఈ యాక్ట్‌ మంచి ఫలితాలు ఇచ్చినట్లు అధికారులు తమ పరిశీలనలో గుర్తించారు.

ప్రభుత్వానికి ముసాయిదా ప్రతి...
దీంతో అక్కడి చట్టంలోని అంశాలతో పాటు ఇతర పరిణామాలను చేరుస్తూ ఓ ముసాయిదాను రూపొం దించిన ఉన్నతాధికారులు రెండేళ్ల క్రితమే ప్రభుత్వానికి పంపారు. న్యాయ మంత్రిత్వ శాఖ వద్ద పెండింగ్‌లో ఉండిపోయిన ఈ ఫైలు ఒక్క అడుగూ ముందుకు వేయలేదు. ఈ ముసాయిదా చట్ట రూపం దాలిస్తే తెలం గాణలోనూ మంచి ఫలితాలు ఉంటాయని అధికారులు పేర్కొంటున్నారు.

ముసాయిదాలోని ముఖ్యాంశాలు
బహిరంగ ప్రదేశాలు, పని చేసే ప్రాంతాలు, మాల్స్‌...ఎక్కడైనా ఈవ్‌ టీజింగ్‌కు పాల్పడుతూ చిక్కిన పోకిరీపై నేరం నిరూపణైతే ఏడాది జైలు లేదా రూ.10 వేల జరిమానా లేదా రెండూ పడతాయి.
ఈవ్‌ టీజింగ్‌ చేయడానికి పోకిరీలు వాహనాలను వినియోగిస్తే వాటిని పోలీసులు స్వాధీనం చేసుకునే అవకాశం ఏర్పడుతుంది.
దేవాలయాలతో పాటు మాల్స్, సినిమా హాల్స్, విద్యాసంస్థలు తదితర చోట్ల జరిగే ఈవ్‌ టీజింగ్‌ను నిరోధించాల్సిన బాధ్యత వాటి నిర్వాహకులపై ఉంటుంది. అలాంటి సమాచారాన్ని తక్షణం సంబంధిత పోలీసులకు చేరవేయాల్సిందే.
దీనికి భిన్నంగా వ్యవహరిస్తే ఆ నేరానికి యాజమాన్యాలనూ బాధ్యుల్ని చేయవచ్చు. వీరికి న్యాయస్థానం జరిమానా విధించే అవకాశం ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement