womens security
-
‘‘మహిళలు కూడా ఉద్యోగాలు చేయవచ్చు’’.. ఇప్పుడు బుల్లెట్ ట్రైన్స్ కూడా!
గత కొన్ని దశాబ్దాలపాటు ఆంక్షల నడుమ జీవనం సాగించిన సౌదీ అరేబియా మహిళ లు.. యువరాజు మొహమ్మద్ బీన్ సల్మాన్ నిర్ణయాలతో ఇతర దేశాల్లోని మహిళల వలే స్వేచ్ఛావాయువులు పీలుస్తున్నారు. వివిధ రంగాల్లో ఉద్యోగాల్లో చేరుతూ తమ సత్తాను నిరూపించుకుంటున్నారు. 2018 వరకు ఆంక్షల్లో ఉన్న... మహిళల డ్రైవింగ్, మగతోడు లేకుండా ఒంటరిగా బయటకు వెళ్లడం, ఒంటరి ప్రయాణాలకు అవకాశం కల్పించడం, ఆర్మీలో చేరడానికి ఒప్పుకోవడం వంటి సంచలనాత్మక నిర్ణయాలతో అక్కడి మహిళలు సంకెళ్ల నుంచి బయటపడ్డట్టుగా భావిస్తున్నారు. మహిళా సాధికారతే లక్ష్యంగా అడుగులు వేస్తోన్న సౌదీలో ఇటీవల మక్కా మసీదులో మహిళా భద్రతా సిబ్బందిని కూడా నియమించడం సంచలనం సృష్టించింది. మొన్నటిదాకా ప్రపంచంలోనే మహిళా ఉద్యోగుల శాతం అతి తక్కువగా ఉన్న సౌదీలో.. ప్రస్తుతం ఉద్యోగాలకోసం మహిళలు వేలల్లో పోటీ పడుతున్నారు. ‘‘మహిళలు కూడా ఉద్యోగాలు చేయవచ్చు’’ అంటూ నిబంధనలు సడలించడంతో వివిధ రంగాల్లో పనిచేసేందుకు అక్కడి మహిళలు అవకాశాల కోసం తీవ్రంగా వెతుకుతున్నారు. తాజాగా బుల్లెట్ ట్రైన్స్ నడపడానికి మహిళా డ్రైవర్ల కోసం నోటిఫికేషన్ ఇవ్వగా.. దాదాపు 30 వేలమంది పోటీపడ్డారు. ఈ ఏడాది జనవరి మొదట్లో సౌదీ రైల్వే పాలిటెక్నిక్ ప్రాజెక్ట్‌లో భాగంగా మహిళలు రైళ్లు నడిపేందుకు ట్రైనింగ్ ఇవ్వాలని నిర్ణయించారు. సౌదీలో అత్యంత పవిత్ర నగరాలైన మక్కా, మదీనా మధ్య రైలు సేవలు అందించడమే ఈ ప్రాజెక్టు ఉద్దేశం. ఇందులో భాగంగా ఈ ప్రాజెక్టును నిర్వహిస్తోన్న స్పానిష్ సంస్థ మహిళా ట్రైన్ డ్రైవర్ల కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ ప్రకటనతో సౌదీ మహిళల నుంచి దరఖాస్తులు వెల్లువలా వచ్చిపడ్డాయి. 30 ఖాళీలకుగానూ 28 వేల దరఖాస్తులు వచ్చాయి. దీనిలో ఎంపికైన అభ్యర్థులకు ఏడాదిపాటు వేతనంతో కూడిన శిక్షణను ఇస్తారు. తరువాత మక్కా నుంచి మదీనా వరకు నడిచే హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్ లను నడుపుతారు. కొన్నేళ్లుగా అనేక పరిమితులు, ఆంక్షలతో ఇటువంటి అవకాశం, నోటిఫికేషన్ రావడం ఇదే మొదటిసారి కావడంతో వేలాదిమంది మహిళలు ట్రైన్ డైవర్లు అయ్యేందుకు పోటీ పడ్డారు. యువరాజు మొహమ్మద్ బీన్ సల్మాన్ .. మహిళల అభ్యున్నతి, సాధికారతకు తీసుకుంటున్న నిర్ణయాలతో.. సౌదీలో కూడా ఉద్యోగాలు చేసే మహిళల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గడిచిన ఐదేళ్లల్లో మహిళా ఉద్యోగుల సంఖ్య రెట్టింపు అయ్యిందని పలు నివేదికలు చెబుతున్నాయి. ప్రైవేటు సెక్టార్లలో కూడా మహిళా ఉద్యోగుల సంఖ్య గణనీయంగా పెరిగింది. హోటల్స్, ఫుడ్ ఇండస్ట్రీస్‌లో మహిళా ఉద్యోగుల సంఖ్యలో నలభై శాతం పెరుగుదల ఉండగా, ఉత్పాదక రంగంలో 14 శాతం, నిర్మాణ రంగంలో 9 శాతం వృద్ధి నమోదైంది. సౌదీ మహిళలకు ఇప్పటిదాకా టీచర్లుగా, హెల్త్ వర్కర్లుగా మాత్రమే పనిచేసే అవకాశం ఉంది. మిగతా రంగాల్లో మగవాళ్లకు మాత్రమే అనుమతి ఉండడంతో వారి ఉద్యోగపరిధి అక్కడితోనే ఆగిపోయింది. ఇప్పుడు ఈ ట్రైన్ డ్రైవర్ల నియామక స్ఫూర్తితో సౌదీలో మహిళల సారథ్యంలో రైళ్లు మరింత వేగంగా ముందుకు దూసుకుపోతాయని ఆకాంక్షిద్దాం. -
‘దిశ వన్ స్టాప్’.. మహిళలపై వేధింపులకు ఫుల్స్టాప్
సాక్షి, అమరావతి: దిశ వన్‌స్టాప్ సెంటర్లు మహిళల భద్రతకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నాయి. పోలీస్ స్టేషన్‌కు వెళ్లేందుకు వెనకంజ వేసే బాధిత మహిళలకు అండగా నిలుస్తూ భరోసా కల్పిస్తున్నాయి. కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ ఇవ్వడం నుంచి అవసరమైన కేసుల్లో ఎఫ్ఐఆర్ నమోదు వరకు పూర్తి బాధ్యత వహిస్తున్నాయి. దాంతో గతానికి భిన్నంగా బాధిత మహిళలు ధైర్యంగా ముందుకు వచ్చి వన్‌స్టాప్ సెంటర్ల ద్వారా సత్వర న్యాయాన్ని పొందుతున్నారు. ఐదు రకాలుగా భరోసా బాధిత మహిళలకు సత్వర న్యాయం చేసే దిశగా రాష్ట్రంలోని 13 జిల్లా కేంద్రాల్లో వన్‌స్టాప్ సెంటర్లను తీర్చిదిద్దడంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక కార్యాచరణ నిర్దేశించారు. దిశ వ్యవస్థ పరిధిలోకి వీటిని తీసుకువచ్చి ‘దిశ వన్‌స్టాప్ సెంటర్లు’గా తీర్చిదిద్దారు. దాంతో దిశ వన్‌స్టాప్ సెంటర్లు మహిళల సమస్యల పరిష్కారంలో సమర్థవంతమైన పాత్ర పోషిస్తున్నాయి. జిల్లాలో ప్రభుత్వ ఆస్పత్రి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ సెంటర్లకు ప్రభుత్వం ప్రత్యేకంగా సబ్ ఇన్స్పెక్టర్ సహా 18 మంది సిబ్బందిని నియమించింది. వీరిలో వీలైనంత వరకు మహిళలనే నియమించారు. ఈ సెంటర్లు 24 గంటలూ అందుబాటులో ఉంటూ బాధిత మహిళలకు ఐదు రకాల సేవలు అందిస్తున్నాయి. గృహ హింస, అత్యాచారాలు, లైంగిక వేధింపులు, బాల్య వివాహాలు, బాధిత మహిళలకు ఆశ్రయం కల్పించడంలో కీలక భూమిక పోషిస్తున్నాయి. బాధిత మహిళలకు ఐదు రోజుల వరకు ఆశ్రయం కల్పించేందుకు వసతి ఏర్పాట్లు చేశారు. సమస్య పూర్తిగా పరిష్కారమయ్యే వరకు.. పోలీస్ స్టేషన్‌కు వెళ్లేందుకు భయపడే మహిళల పరిస్థితిని గుర్తించి వారికి తగిన సహాయం చేసి సమస్య పరిష్కారానికి వన్‌స్టాప్ సెంటర్లు చొరవ చూపిస్తున్నాయి. అందుకోసం మహిళా, శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. దిశ యాప్, 108 కమాండ్ కంట్రోల్, పోలీస్ స్టేషన్ల నుంచి వన్‌స్టాప్ సెంటర్లకు సమాచారం వస్తుంది. ఆ వెంటనే ఇక్కడి సిబ్బంది బాధిత మహిళలతో మాట్లాడి వారి సమస్య గురించి క్షుణ్ణంగా తెలుసుకుంటున్నారు. వారి సమస్య పూర్తి పరిష్కారమయ్యే వరకు వారికి అండగా ఉంటున్నారు. గృహ హింస, బాల్య వివాహాల కేసుల్లో కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. అత్యాచారం, లైంగిక దాడుల కేసుల్లో బాధితులకు అవసరమైన వైద్య పరీక్షల నిర్వహణ, అనంతరం ఎఫ్ఐఆర్ నమోదు వరకు వన్‌స్టాప్ సెంటర్ల సిబ్బంది బాధ్యత వహిస్తున్నారు. ఉచితంగా న్యాయ సహాయాన్ని అందిస్తున్నారు. బాధిత మహిళలకు పూర్తి భరోసా కలిగేంత వరకు వన్‌స్టాప్ సెంటర్లే బాధ్యత తీసుకుంటుండటం విశేషం. 35 శాతం పెరిగిన కేసుల పరిష్కారం వన్‌స్టాప్ సెంటర్‌ను ఆశ్రయిస్తే చాలు తమకు న్యాయం జరుగుతుందన్న భరోసా కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విజయవంతమైంది. మహిళలపై వేధింపులను ప్రభుత్వం తీవ్రమైన అంశంగా పరిగణిస్తూ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించడమే దీనికి కారణం. దాంతో గతంలో కంటే బాధిత మహిళలు ధైర్యంగా వన్‌స్టాప్ సెంటర్లను ఆశ్రయిస్తున్నారు. 2018 నాటితో పోలిస్తే వన్‌స్టాప్ సెంటర్ల ద్వారా మహిళలపై వేధింపుల కేసుల పరిష్కారం 35 శాతం పెరగడం విశేషం. కొత్తగా 5 వన్‌స్టాప్ కేంద్రాల నిర్మాణం రాష్ట్రంలో ప్రస్తుతం 8 జిల్లా కేంద్రాల్లో వన్‌స్టాప్ సెంటర్లకు శాశ్వత భావనాలు ఉన్నాయి. మిగిలిన ఐదు జిల్లాల్లో కూడా వన్‌స్టాప్ సెంటర్లకు శాశ్వత భవనాలను నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టింది. కర్నూలు, తూర్పు గోదావరి, కృష్ణా, శ్రీకాకుళం, ప్రకాశం జిల్లాల్లో శాశ్వత భవనాలు 2022 ఏప్రిల్ నాటికి పూర్తి చేయాలని నిర్ణయించారు. బాధిత మహిళలకు పూర్తి భరోసా బాధిత మహిళల సమస్యల పరిష్కారం కోసం వన్‌స్టాప్ సెంటర్లు పూర్తిస్థాయిలో సహకారం అందిస్తున్నాయి. అవసరమైతే బాధిత మహిళల ఇంటికే సిబ్బంది వెళ్లి మరీ సమస్య పరిష్కారానికి చొరవ చూపిస్తున్నారు. కౌన్సెలింగ్ నిర్వహించడంతోపాటు అవసరమైన మహిళలకు ఆశ్రయం కల్పిస్తున్నాం. తీవ్రమైన కేసుల్లో మహిళలకు వైద్య పరీక్షల నిర్వహణ, ఎఫ్ఐఆర్ నమోదు చేయడం వరకూ అన్నీ వన్‌స్టాప్ సెంటర్ల సిబ్బందే పర్యవేక్షిస్తున్నారు. – కృతికా శుక్లా, కమిషనర్, మహిళా–శిశు సంక్షేమ శాఖ -
AP: ఇద్దరు యువతులను కాపాడిన ‘దిశ’
నరసరావుపేట రూరల్: గుంటూరు జిల్లాలో దిశ యాప్ ఇద్దరు విద్యార్థినులను ఆకతాయిల బారి నుంచి కాపాడింది. నరసరావుపేట రూరల్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రొంపిచర్ల మండలం గోగులపాడుకు చెందిన ఇద్దరు యువతులు ఆదివారం సాయంత్రం నరసరావుపేటకు వచ్చి తిరిగి వెళ్తుండగా ఇక్కుర్రు గ్రామ శివారులో వారి ద్విచక్ర వాహనం టైర్ పంక్చర్ అయింది. దీంతో వారు సహాయం కోసం ఎదురు చూస్తుండగా ఇద్దరు ఆకతాయిలు వారితో అసభ్యంగా ప్రవర్తిస్తూ వేధించడం ప్రారంభించారు. దీంతో ఆ యువతులు దిశ యాప్‌లోని ఎస్ఓఎస్ బటన్ నొక్కారు. సమాచారం అందుకున్న నరసరావుపేట రూరల్ ఎస్ఐ శ్రీహరి ఎనిమిది నిమిషాల్లో ఘటనా స్థలానికి చేరుకున్నారు. యువతులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న లింగంగుంట్ల గ్రామానికి చెందిన ఆదినారాయణ, బుజ్జిలను అదుపులోకి తీసుకున్నారు. వీరు ప్లిప్ కార్ట్, అమెజాన్‌లో డెలివరీ బాయ్‌లుగా పని చేస్తున్నారు. వీరి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చినట్లు రొంపిచర్ల ఎస్ఐ హజరత్తయ్య తెలిపారు. వెంటనే స్పందించిన రూరల్ ఎస్ఐ శ్రీహరిని జిల్లా రూరల్ ఎస్పీ విశాల్‌గున్ని, డీఎస్పీ విజయభాస్కర్, సీఐ అచ్చయ్య అభినందించారు. -
‘దిశ’ మౌలిక వసతుల కోసం రూ.4.50 కోట్లు
సాక్షి, అమరావతి: మహిళా భద్రత కోసం ఏర్పరచిన దిశ వ్యవస్థకు మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రభుత్వం రూ.4.50 కోట్లు మంజూరు చేసింది. కేసుల సత్వర విచారణకు దిశ ల్యాబ్‌లను బలోపేతం చేసేందుకు అవసరమైన 7 రకాల పరికరాల కొనుగోలుకు ఈ నిధులను వెచ్చిస్తారు. ఈ నిధులతో గ్యాస్ క్రోమటోగ్రఫీ పరికరాలు 2, ఫోరెన్సిక్ అనాలిసిస్ కోసం స్పెస్టోక్సోపీ పరికరాలు 3, హైయండ్ ఫోరెన్సిక్ వర్క్ స్టేషన్లు 2, ఫోరెన్సిక్ హార్డ్‌వేర్‌రైట్ బ్రాకర్ కిట్ ఒకటి, యూఎఫ్‌ఈడీ పీసీ ఒకటి, డీవీఆర్ ఫోరెన్సిక్ ఎగ్జామినర్ ఒకటి, ఫోరెన్సిక్ ఆడియో ఎనాలిసిస్, స్పీకర్ ఐడెంటిఫికేషన్ సాఫ్ట్వేర్ ఒకటి కొనుగోలు చేస్తారు. ఈ మేరకు హోం శాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ మంగళవారం ఉత్తర్వులిచ్చారు. -
దిశ యాప్ డౌన్లోడ్, వినియోగంపై దృష్టి పెట్టాలి: సీఎం జగన్
సాక్షి, అమరావతి: మహిళల భద్రతపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం అధికారులతో అత్యున్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. 'మహిళా భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. దిశ యాప్‌పై పూర్తి చైతన్యం కలిగించాలి. యాప్ ఎలా వాడాలన్న దానిపై పూర్తి అవగాహన కలిగించాలి. ఇంటింటికీ వెళ్లి అక్కచెల్లెమ్మల ఫోన్లలో యాప్‌ను డౌన్లోడ్ చేసేలా చూడాలి. గ్రామ సచివాలయాల్లోని మహిళా పోలీసులు, వాలంటీర్లతో అక్క చెల్లెమ్మలకు అవగాహన కలిగించాలి. ముందుగా మహిళా పోలీసులకు, వలంటీర్లకు శిక్షణ ఇచ్చి వారి ద్వారా అక్క చెల్లెమ్మలకు అవగాహన కలిగించాలి. ప్రమాదకర పరిస్థితుల్లో ఈ యాప్‌ను ఎలా ఉపయోగించాలన్న దానిపై అక్క చెల్లెమ్మలకు చెప్పాలి. దీన్ని ఒక డ్రైవ్‌గా తీసుకోవాలి. కాలేజీలు, విద్యాసంస్థల్లో కూడా విద్యార్థినులకు యాప్ వినియోగంపై అవగాహన కలిగించాలి. ఈ చర్యల వల్ల దిశ యాప్ వినియోగం పెరుగుతుంది. అక్క చెల్లెమ్మలను ఆదుకునేలా ఆ మేరకు వెనువెంటనే చర్యలు తీసుకునేలా యంత్రాంగం సిద్ధం కావాలి. దిశ పోలీస్స్టేషన్లు, స్థానిక పోలీస్స్టేషన్లు సత్వరమే స్పందించేలా వారిని సన్నద్ధం చేయాలి. పోలీస్ స్టేషన్లలో అవసరమైనన్ని పెట్రోలింగ్ వాహనాలను సమకూర్చాలి’ అని తెలిపారు. ఈ సమావేశానికి హోంమంత్రి సుచరిత, డీజీపీ గౌతమ్‌సవాంగ్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. చదవండి: ఐటీ పాలసీపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష -
మహిళల భద్రతకు డ్రోన్లు వాడాలి
సాక్షి, హైదరాబాద్ : మహిళల భద్రత విషయంలో అత్యాధునిక సాంకేతికతతో కూడిన డ్రోన్లు వాడటం వల్ల నేరాలు తగ్గే అవకాశముందని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కె.తారక రామారావు అభిప్రాయపడ్డారు. గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌లో నిర్మించిన పబ్లిక్ సేఫ్టీ ఇంటిగ్రేటెడ్ ఆపరేషన్ సెంటర్ అండ్ డేటా సెంటర్‌ను హోంమంత్రి మహమూద్ అలీ, విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డితో కలసి ఆయన బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ‘డయల్ 100కు కాల్ చేయడం వల్ల ఐదు నిమిషాల్లో ఘటనకు చేరుతారు, అదే ఎస్‌వోఎస్ బటన్ నొక్కి డ్రోన్లు వినియోగించడం వల్ల ఒక నిమిషం వ్యవధిలో అక్కడికి చేరుతారు. అదే సమయంలో పోలీసు సైరన్ మోగిస్తే నిందితుడు పారిపోతాడు. దీనివల్ల బాధిత మహిళ నేరం బారినపడకుండా ఉంటుంది. పోలీసులు బాధితురాలికి భరోసా ఇచ్చి నిందితులను పట్టుకోవచ్చు’అని అన్నారు. వీటి వినియోగం కోసం డీజీసీఏ అనుమతులు తీసుకునే అంశాల్నీ పోలీసులు పరిశీలించాలని సూచించారు. నేరం చేయాలంటే దొంగలు భయపడుతున్నారు.. ‘దేశంలో ఉన్న సీసీటీవీ కెమెరాల్లో 60 శాతం హైదరాబాద్‌లోనే ఉన్నాయి. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ‘నేను సైతం’ప్రాజెక్టులో భాగంగా సీసీ కెమెరాలు బిగించుకుంటు న్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఐదు లక్షల సీసీ కెమెరాలున్నాయి. వీటిని పది లక్షలు చేసే దిశగా ముందుకెళుతున్నాం. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్లలోని ఈ సీసీటీవీలు సైబరాబాద్‌లోని పబ్లిక్ సేఫ్టీ ఇంటిగ్రేటెడ్ ఆపరేషన్ సెంటర్ అండ్ డేటా సెంటర్ అనుసంధానం చేయడం వల్ల నేరాలు పూర్తిస్థాయిలో తగ్గే అవకాశముంది. ఇప్పటికే హైదరాబాద్‌లో దొంగత నాలు చేయాలంటే అంతర్రాష్ట ముఠాలు భయపడుతున్నాయి. ఒకవేళ చేసినా 24 గంటలు గడవక ముందే సీసీటీవీల సహాయంతో పట్టేస్తున్నారు. అయితే ఈ డేటా సెంటర్ ద్వారా అన్ని ప్రభుత్వ విభాగాలను ఒకేతాటిపైకి తీసుకురావాలి, ఆయా పనులను కలిసికట్టుగా చేయడం వల్ల ప్రజాధనం దుర్వినియోగం కాకుండా ఉంటుంది’ అని కేటీఆర్ పేర్కొన్నారు. ఎఫెక్టివ్ పోలీసింగ్ వల్లే రాష్ట్రానికి, ముఖ్యంగా హైదరాబాద్‌కు పెట్టుబడులు వస్తున్నాయని మంత్రి చెప్పారు. మారుతున్న సమాజానికి అనుగుణంగా పెరుగుతున్న సైబర్ నేరాలు నిలువరించేలా ఎప్పటికప్పుడూ సిబ్బంది సైబర్ వారియర్లుగా మారి ఆధునిక టెక్నాలజీని అర్థం చేసుకుంటూ ముందుకెళ్లాలని ఆయన సూచించారు. అంబులెన్స్ వాహనాలను అనుసంధానించాలి... ‘ఈ సెంటర్ ద్వారా పోలీసు పెట్రోలింగ్ వాహనాలు ఏ ఏ సమయంలో ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకునే వీలుంది. నేరం జరిగిన ప్రాంతానికి ఏ వాహనం దగ్గరగా ఉంటే వారికి సమాచారమిచ్చి సులువైన మార్గంలో వెళ్లేలా సెంటర్ సిబ్బంది మార్గదర్శనం చేస్తారు. ఇదే మాదిరిగా అత్యవసర వైద్యసహాయం కోసం రోగులను తీసుకొచ్చే అంబులెన్స్‌లకు కూడా పెట్రోలింగ్ వాహనాలకు మాదిరిగానే ఈ సెంటర్‌తో అనుసంధానం చేయాలి. ప్రమాదసమయాల్లో ప్రాధమ్యంగా భావించే గోల్డెన్ అవర్‌లో రోగి సమీప ఆసుపత్రికి వెళ్లే దారి చూపేలా వైద్యారోగ్య శాఖతో మాట్లాడి అనుసంధానం చేయాల’ని సంబంధిత అధికారులకు కేటీఆర్ సూచించారు. బంజారాహిల్స్‌లో నిర్మిస్తున్న పోలీసు ట్విన్ టవర్స్ రెండు నెలల్లో అందుబాటులోకి వస్తుందని కేటీఆర్ పేర్కొన్నారు. ప్రపంచంలోని ఎక్కడి పోలీసులకైనా ఇది ఐకానిక్‌గా నిలుస్తుందని అన్నారు. ప్రతి వెయ్యిమందికి 30 సీసీటీవీలు: మహమూద్ అంతకుముందు హోంమంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ హైదరాబాద్‌లో ప్రతి వెయ్యి మందికి 30 సీసీటీవీ కెమెరాలున్నాయని, ఇది ఎంతో భద్రతపరమైన నగరమని అన్నారు. ‘ఈ సెంటర్ వల్ల కిందిస్థాయి సిబ్బందికి మెరుగైన ఫలితాలు ఉంటాయి. నేరం జరిగే ప్రాంతానికి వెళ్లేలోపు సమగ్ర సమాచారం చేతికి అందేలా ఈ సెంటర్ చూస్తుంద’ని డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు. సైబర్ సెక్యూరిటీలో పోలీసులకు శిక్షణ కోసం తెలంగాణ పోలీసు శాఖ, ఐటీఈఎస్ ఎంవోయూ కుదుర్చుకున్నాయి. కార్యక్రమంలో హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ పోలీసు కమిషనర్లు అంజనీకుమార్, మహేష్ భగవత్, వీసీ సజ్జనార్, ఐటీ కార్యదర్శి జయేష్ రంజన్, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ,ఎమ్మెల్సీ నవీన్‌కుమార్, ఇతర పోలీసు సిబ్బంది, ఎల్ అండ్ టీ స్మార్ట్ ప్రతినిథి జేవీఎస్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
మహిళా సాధికారతే ముఖ్యం
కోల్‌కతా: మహిళల భద్రత, సాధికారతకు తన ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. పశ్చిమబెంగాల్లో బీజేపీ నిర్వహించిన నవరాత్రి ఉత్సవాల్లో వర్చువల్ విధానంలో గురువారం ప్రధాని మోదీ పాల్గొన్నారు. ‘మహాషష్టి రోజు దుర్గామాత పూజలో పాల్గొనే అవకాశం లభించడం అదృష్టంగా భావిస్తున్నాను. కరోనా సంక్షోభం నెలకొన్న సమయంలో ఈ ఉత్సవాలను జరుపుకుంటున్నాం. దుర్గామాత భక్తులు, మండపాల నిర్వాహకులు, ప్రజలు గొప్ప సంయమనం పాటిస్తున్నారు. కరోనా కారణంగా స్వల్పస్థాయిలోనే అయినా, స్ఫూర్తిదాయకంగా, భక్తిశ్రద్ధలతో పండుగ జరుపుకుంటున్నాం’ అని వ్యాఖ్యానించారు. కరోనా సోకకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని భక్తులకు సూచించారు. ‘దుర్గామాత పూజలో గొప్ప శక్తి ఉంటుంది. ఇంత దూరంలో ఢిల్లీలో ఉన్నప్పటికీ.. నాకు అక్కడ కోల్‌కతాలో మీతో ఉన్నట్లే ఉంది’ అని వ్యాఖ్యానించారు. ప్రసంగాన్ని బెంగాలీలో ప్రారంభించిన ప్రధాని మోదీ.. ముగించే సమయంలోనూ బెంగాలీలో రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని ప్రసంగానికి పశ్చిమబెంగాల్ బీజేపీ శాఖ భారీ ప్రచారం కల్పించింది. సాల్ట్‌లేక్ వద్ద ఏర్పాటు చేసిన దుర్గామాత మండపంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన 10 మండపాల్లో ప్రధాని ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారం చేశారు. 78 వేల పోలింగ్ బూత్‌ల్లోనూ మోదీ ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారం చేశారు. ఏప్రిల్– మే నెలల్లో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశముంది. 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో 42 స్థానాలకు గానూ 18 సీట్లను బీజేపీ గెలుచుకుంది. దుర్గామాత ఉత్సవాల్లో ప్రధాని పాల్గొనడంపై అధికార టీఎంసీ స్పందించింది. దుర్గామాత పూజను కూడా బీజేపీ రాజకీయం చేస్తోందని విమర్శించింది. ‘బెంగాలీలో మాట్లాడి బెంగాల్ ప్రజలతో కనెక్ట్ కావాలని ప్రధాని విఫలయత్నం చేశారు’ అని టీఎంసీ నేత, ఎంపీ సౌగత రాయ్ వ్యాఖ్యానించారు. -
నేడు అసెంబ్లీలో మహిళా భద్రత బిల్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలకు పాల్పడితే మరణశిక్ష విధించేలా సరి కొత్త చట్టం తేవడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో భాగంగా భారత శిక్షా స్మృతి(ఐపీసీ–ఇండియన్ పీనల్ కోడ్)లోని సెక్షన్ 354కు సవరణలు చేసి.. కొత్తగా 354–ఈని చేర్చనుంది. మహిళలు, చిన్నారులపై అత్యాచారాలకు, అఘాయిత్యాలకు పాల్పడితే.. అలాంటి కేసులపై వారం రోజుల్లోగా విచారణ పూర్తి చేసి, ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసి రెండు వారాల్లోగా ట్రయల్ పూర్తి చేసి శిక్షపడేలా చేయడం ఈ చట్టం ఉద్దేశం. ఇలాంటి కేసుల్లో రెడ్ హ్యాండెడ్‌గా ఆధారాలుంటే నిందితులకు మూడు వారాల్లోగా ఉరిశిక్ష విధించడానికి ఈ చట్టం దోహదం చేస్తుంది. ఈ విప్లవాత్మక చట్టాన్ని అమల్లోకి తేవడానికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నడుంబిగించారు. ఇందుకు సంబంధించిన బిల్లుపై చర్చించి.. ఆమోదించడానికి సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలో మంత్రివర్గం బుధవారం సమావేశం కానుంది. మహిళా భద్రత బిల్లుపై ఆమోదముద్ర వేశాక శాసనసభ, మండలిలో దీన్ని ప్రవేశపెట్టనున్నారు. -
మహిళా భద్రతలో షీటీమ్స్ దూకుడు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో మహిళల భద్రత విషయంలో వినూత్న కార్యక్రమాలు చేపడుతున్న పోలీస్ శాఖ షీటీమ్స్‌తో మంచి విజయం సాధించింది. ఈవ్‌టీజింగ్, వేధింపుల నియంత్రణకు విశేష స్థాయిలో కృషిచేస్తున్న ఈ బృందాల వల్ల ఏటా వేధింపుల కేసులు తగ్గుతున్నాయని మహిళా భద్రతా విభాగం ఐజీ స్వాతిలక్రా శుక్రవారం విడుదలు చేసిన ఒక పత్రికా ప్రకటనలో స్పష్టంచేశారు.హైదరాబాద్ కమిషనరేట్‌లో ప్రవేశపెట్టిన షీటీమ్స్ గత రెండేళ్లుగా జిల్లాల్లోనూ ఏర్పాటు చేశామని, ఈ సందర్భంగా షీటీమ్స్ ఈ ఏడాది చేసిన కృషి, వార్షిక నివేదికను స్వాతిలక్రా విడుదల చేశారు. మొత్తంగా 320 నిర్భయ కేసులు... రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాలు, వివిధ వేదికలు, సోషల్ మీడియాలో మహిళలు, యువతులను లైంగిక వేధింపులకు గురిచేయడం, ఈవ్‌టీజింగ్‌కు పాల్పడటం కింద 1,655 ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్టు స్వాతిలక్రా వెల్లడించారు. వీటిలో 320 నిర్భయ యాక్ట్ కేసులు, 73 ఐటీ యాక్ట్ కేసులు, 104 పోక్సో యాక్ట్ కేసులున్నట్టు పేర్కొన్నారు. సాధారణంగా వేధింపులకు పాల్పడుతున్న వారిలో మార్పు కోసం అవకాశాలిస్తున్నామని, వీరిలో చాలా మంది మారినా కొంత మంది మాత్రం పదే పదే వేధింపులకు పాల్పడటంతో ఈ కేసులు నమోదు చేసినట్టు వెల్లడించారు. ఇలాంటి వారిపై పీడీయాక్ట్‌కు సైతం వెనుకాడటం లేదని తేల్చిచెప్పారు. 3,876 పెట్టీ కేసులను నమోదు చేయగా, 10,644 మందికి కౌన్సెలింగ్ ఇవ్వడంతో పాటు వారిపై నిఘా పెట్టినట్టు తెలిపారు. ఇకపోతే 4,008 మందికి కఠిన వైఖరితో వ్యవహరిస్తామని హెచ్చరించామని, మరోసారి వేధింపులకు పాల్పడితే ఎఫ్ఐఆర్ నమోదు చేసేలా ఆదేశాలిస్తున్నామని తెలిపారు. ఇకపోతే రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్లు, కళాశాలలు, వసతి గృహాలు ఇతర ప్రాంతాల్లో అవగాహన చేపట్టినట్టు తెలిపారు. ఇలా 7,354 అవగాహన సదస్సుల ద్వారా 40.12లక్షల మందికి షీటీమ్స్ ఉద్దేశం చేర్చినట్టు తెలిపారు. 2018లో 2,709 మంది నేరుగా షీటీమ్స్‌కు ఫిర్యాదు చేయగా, వాట్సాప్ ద్వారా 2,825మంది, డయల్ 100 ద్వారా 2,270మంది, ఫేస్బుక్ పేజీల ద్వారా 26మంది, ఈమెయిల్స్ ద్వారా 351మంది, హాక్ఐ ద్వారా 100 మంది ఫిర్యాదు చేసినట్టు స్వాతిలక్రా తెలిపారు. గడిచిన ఏడాదిలో 8,578మందిని పట్టుకున్నామని, వీరిలో 771మందిపై ఎఫ్ఐఆర్ నమోదు కాగా, 1,351మందిపై పెట్టీ కేసులు, 3,379మందికి కౌన్సెలింగ్, 3,077మందిని హెచ్చరించినట్లు తెలిపారు. వేధింపులకు పాల్పడుతున్న వారిలో 18ఏళ్లలోపు 12శాతం మంది ఉండగా, 19–24 ఏళ్ల వారు 38.06శాతం, 25–35ఏళ్లలోపు వారు 36.02శాతం, 36–50ఏళ్ల లోపు 13శాతం, 50ఏళ్ల పైబడిన వారు 0.02శాతం ఉన్నట్టు తేలిందన్నారు. ఇక వేధింపులు సైతం రకరకాలుగా ఉన్నాయని, వీటిలో ఎక్కువ శాతం టీజింగ్, అసభ్యప్రవర్తన కిందే 38శాతం ఉన్నట్టు గుర్తించామన్నారు. ఫోన్లలో వేధింపులు 31శాతం, 10.5శాతం స్టాకింగ్‌కు గురి అవుతున్నట్టు వెల్లడించారు. సామాజిక మాధ్యమాల ద్వారా 6శాతం మంది, అభ్యంతరకర సందేశాలతో 13శాతం మంది, అసంబద్ధ తాకడాల ద్వారా 1.5శాతం మంది వేధింపులకు పాల్పడ్డారని స్పష్టంచేశారు. ఆధారాలతో సహా... వేధింపులకు పాల్పడుతున్న వారిని పూర్తి స్థాయి వీడియో ఆధారాలతో సహా పట్టుకుంటున్నామని స్వాతిలక్రా తెలిపారు. ఇది ఒక పద్ధతి అయితే, బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించి డెకాయి ఆపరేషన్ ద్వారా కూడా వేధింపుల నియంత్రణకు కృషిచేస్తున్నామని తెలిపారు. షీటీమ్స్ పనితీరుతో ఏటా మహిళల వేధింపుల కేసులు భారీ స్థాయిలో తగ్గుముఖం పట్టినట్టు స్పష్టంచేశారు. 2014–15లో 26శాతం మంది మైనర్లు లైంగిక వేధింపులకు పాల్పడగా, 2017–18లో 12శాతానికి తగ్గుముఖం పట్టినట్టు తెలిపారు. ఇదే రీతిలో మిగిలిన వారిలోనూ మార్పు వస్తుందని, రాష్ట్రంలో మహిళా భద్రత విషయంలో రాజీపడే సమస్యలేదని స్పష్టంచేశారు. -
‘వావ్’ హైదరాబాద్!
భరోసా, షీ–టీమ్స్ ఏర్పాటుతో ఇప్పటికే మహిళల భద్రతలో తనకంటూ ప్రత్యేకముద్ర వేసుకున్న సిటీ పోలీసు విభాగం మరో అడుగు ముందుకు వేసింది. గస్తీలో మహిళా సిబ్బందికి ప్రాధాన్యం కల్పిస్తూ ‘ఉమెన్ ఆన్ వీల్స్’(వావ్) పేరుతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. దేశంలోనే తొలిసారిగా కంబాట్ సిస్టమ్‌లో శిక్షణ తీసుకుని రంగంలోకి దిగుతున్న ఈ టీమ్స్‌ను నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ సోమవారం ఇక్కడ గోషామహల్ పోలీసుస్టేడియంలో ఆవిష్కరించారు. తొలిదశలో డివిజన్‌కు ఒకటి చొప్పున కేటాయించారు. త్వరలో ప్రతిఠాణాకు ఒక బృందం ఉండేవిధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఈ టీమ్స్ పోలీసు ఉన్నతాధికారుల ఎదుట ప్రతిభాపాటవాలను ప్రదర్శిస్తూ డెమో ఇచ్చాయి. సుశిక్షితులైన ఈ 43 మందితో 20 వావ్ టీమ్స్ ఏర్పాటు చేశారు. వీరు బ్లూకోల్ట్స్లో అంతర్భాగంగా ఒక్కో ద్విచక్రవాహనంపై ఇద్దరు చొప్పున గస్తీ తిరుగుతూ ఉంటారు.తొలిదశలో నగరంలోని 17 డివిజన్లకూ ఒక్కొక్కటి చొప్పున కేటాయించారు. మరో మూడింటిని ప్రత్యేక సందర్భాలు, పర్యాటక ప్రాంతాల్లో వినియోగిస్తారు. భవిష్యత్తులో ప్రతి పోలీసుస్టేషన్‌కు ఒక వావ్ టీమ్ ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. సాధారణ గస్తీతోపాటు డయల్–100కు వచ్చే కాల్స్ ఆధారంగానూ ఈ టీమ్స్ పనిచేస్తుంటాయి. నేరాలు నిరోధించడం, సమాచారం సేకరించడంతో పాటు ఎమర్జెన్సీ రెస్పాన్స్ బాధ్యతల్నీ నిర్వర్తించనున్నాయి. ప్రత్యేక లోగోతో కూడిన ద్విచక్ర వాహనంపై సంచరించే బ్లూకోల్ట్స్ యూనిఫామ్‌తోపాటు వారికి కమ్యూనికేషన్ పరికరాలు, ప్లాస్టిక్ లాఠీ తదితరాలూ అందించారు. రెండు నెలల కఠోర శిక్షణ... ఇప్పటివరకు నగరంలో కేవలం పురుష పోలీసులు మాత్రమే బ్లూకోల్ట్స్ పేరుతో గస్తీ విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే, మహిళా పోలీసులకూ అన్ని రకాలైన విధుల్లోనూ భాగస్వామ్యం కల్పించాలని నిర్ణయించిన సిటీ పోలీసు కమిషనర్ ‘వావ్’బృందాలకు అంకురార్పణ చేశారు. గత ఏడాది కానిస్టేబుళ్లుగా ఎంపికై, ఇటీవలే శిక్షణ పూర్తిచేసుకుని వచ్చిన యువ మహిళా కానిస్టేబుళ్ల నుంచి అవసరమైన అర్హతలు ఉన్న 43 మందిని ఎంపిక చేశారు. వీరికి రెండు నెలలపాటు కఠోర శిక్షణ ఇచ్చారు. ఇందులో ఎలాంటి ఆయుధం లేకుండా అసాంఘిక శక్తుల్ని ఎదుర్కోవడం నుంచి ఉగ్రవాదులతోనూ పోరాడే పాటవాలను నేర్పించారు. ఏడీబీ టూల్స్, టీడీ 9 కాంబోస్ వంటి అత్యాధునిక శిక్షణలు ఇచ్చారు. మహిళా పోలీసులకు ఈ తరహా శిక్షణలు ఇవ్వడం ఇదే తొలిసారి. పురుషులతో సమానంగా ఎదిగేలా.. మహిళాపోలీసులకు ఇదో మైలురాయి. పోలీసు విభాగంలోని మహిళాసిబ్బంది పురుష సిబ్బందితో సమానంగా ఎదిగేలా అనేక చర్యలు తీసుకుంటున్నాం. ఇందులో భాగంగానే ఉమెన్ ఆన్ వీల్స్ బృందాలను ఏర్పాటు చేశాం. ఈ ఏడాది అక్టోబర్‌లో జరిగిన ‘వీ కెన్’అనే కార్యక్రమంలో పోలీసు విభాగంలో ఉత్తమ సేవలు అందించిన 63 మంది మహిళల్ని సన్మానించుకున్నాం. అప్పుడే మహిళా పోలీసుల్నీ అన్ని రకాలైన విధుల్లోనూ వినియోగించుకోవాలని, ఆ దిశలో చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకున్నాం. అందులో భాగంగానే ఈ టీమ్స్ అందుబాటులోకి వచ్చాయి. – షికా గోయల్, అదనపు సీపీ ప్రతి మహిళా టెక్నిక్స్ నేర్చుకోవాలి ఈ బృందాల ఏర్పాటు మహిళా సాధికారతలో కీలక పరిణామం.ఈ ‘ఉమెన్ ఆన్ వీల్స్’బృందాలు మనందరికీ సేవ చేస్తాయి. ప్రతి మహిళా కొన్ని కాంబాక్ట్ టెక్నిక్స్ నేర్చుకోవాల్సిందే. నిత్యజీవితంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించడానికి వాటిని వాడాలి. సమాజంలో తిరగాల్సి వచ్చినప్పుడు ఎవరి సహాయం లేకుండా ఒంటరిగా వెళ్లడానికి ఇవి ఎంతో ఉపయుక్తం. – మెహరీన్ కౌర్,హీరోయిన్ సిటీ రోల్ మోడల్‌గా మారింది ‘భరోసా, షీ టీమ్స్తోపాటు మహిళల భద్రత కోసం తీసుకున్న అనేక చర్యలతో హైదరాబాద్ ఇతర నగరాలకు, రాష్ట్రాలకు రోల్ మోడల్‌గా మారింది. ప్రతివారం ఎవరో ఒకరు వచ్చి అధ్యయనం చేసి వెళ్తున్నారు. ఉమెన్ ఆన్ వీల్స్ బృందాల ఏర్పాటుతో మరో రికార్డు సొంతం చేసుకుంది. రాష్ట్రంలో గడిచిన మూడేళ్లుగా మహిళల కోసం అనేక చర్యలు తీసుకుంటున్నాం. పోలీసు రిక్రూట్మెంట్ లోనూ వీరి కోసం స్పెషల్‌డ్రైవ్స్ చేపడుతున్నాం. పోలీసింగ్ అంటే రఫ్ అండ్ టఫ్ ఉద్యోగమని, మహిళలు ఈ విధులు నిర్వర్తించలేరనే అభిప్రాయం ఈ బృందాల ఏర్పాటుతో పోతుంది. సమాజంలో సగం ఉండటమే కాదు పోలీసుస్టేషన్‌కు వచ్చేవారిలోనూ మహిళాబాధితులు ఎక్కువే. వీరి భద్రతకు కీలకప్రాధాన్యం ఇస్తున్నాం. ఎవరైనా ఎక్కడైనా తప్పు జరుగుతున్నట్లు గమనిస్తే కనీసం ముగ్గురికి చెప్పండి... లేదా 100కు ఫోన్ చేయండి’ – అంజనీకుమార్, కొత్వాల్ – సాక్షి, హైదరాబాద్ -
ఆమెకు అండగా పోలీస్ నిఘా !
శ్రీకాకుళం క్రైం : మహిళలపై దాడులు జరగకుండా త్వరలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయనున్నట్టు శ్రీకాకుళం మహిళా పోలీస్‌స్టేషన్ విభాగం డీఎస్పీ ఆవుల శ్రీనివాసరావు వెల్లడించారు. పబ్లిక్ పార్కులు, జనం గుమిగూడి ఉండే ప్రాంతాల్లో మహిళా కానిస్టేబుళ్లు, సిబ్బందితో కూడిన బృందాల నిఘా ఉంటుందన్నారు. డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. బాధితులు నేరుగా రావచ్చు శ్రీకాకుళం పరిధిలో రణస్థలం, పొందూరు, లావేరు, గార, శ్రీకాకుళం, ఆమదాలవలస, సరుబుజ్జిలి, ఎల్‌ఎన్‌పేట, నరసన్నపేట, జలుమూరు తదితర ప్రాంతాల్లో మహిళలపై జరిగే ఎలాంటి సంఘటన పైనైనా కేసులు నమోదు చేస్తామన్నారు. మహిళా పోలీస్‌స్టేషన్ తొలుత హోంగార్డులతో ప్రారంభమై ప్రస్తుతానికి డీఎస్పీ స్థాయికి ఎదిగినట్టు వివరించారు. మొదట్లో కేవలం భార్యభర్తల మధ్య తలెత్తే వివాదాలపై ఇద్దరికీ కౌన్సెలింగ్ నిర్వహించి వారు కలిసి ఉండేలా ప్రయత్నించేవాళ్లమన్నారు. ఇప్పుడు తమ బాధ్యతలు పెరిగాయన్నారు. మహిళల్ని చిన్నచూపు చూడడం, గృహహింస, వరకట్న వేధింపులు, నిర్బంధం, చులకనగా మాట్లాడడం, హత్యలు, ఆత్మహత్యాయత్నాలు, మానభంగం, కొట్లాట వంటి కేసుల్ని శాంతిభద్రతల పోలీస్‌స్టేషన్‌కు సమానంగా మహిళా పోలీస్‌స్టేషన్‌లో నమోదు చేస్తామన్నారు. నాలుగు రకాలుగా కౌన్సెలింగ్ కేసు తీవ్రతను బట్టి నాలుగు రకాలుగా కౌన్సెలింగ్ చేస్తున్నట్టు డీఎస్పీ తెలిపారు. న్యాయవాదుల బృందం, ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్, డీఆర్డీఏ పరిధిలోని బృందంతో పాటు పోలీసుల ద్వారా కౌన్సెలింగ్ చేస్తూ కుటుంబాల్లో రాజీ కుదిర్చేందుకు ప్రయత్నిస్తుంటామన్నారు. ఇంకా తప్పదు అనుకుంటేనే కేసు నమోదు చేస్తామన్నారు. మహిళా పోలీస్‌స్టేషన్‌లో కేసుల నమోదు సంఖ్య పెరుగుతున్నందున.. అందుకు తగ్గ సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. మహిళా ఎస్ఐతో పాటు సిబ్బంది నియామకం, వాహనాల మంజూరుకు ఉన్నతాధికారులు చర్యలు చేపట్టాలని డీఎస్పీ కోరారు. గతంలో కేవలం మహిళా పోలీస్‌స్టేషన్‌గా ఉంటూ శ్రీకాకుళం పరిధిలోనే కేసులు నమోదు చేసేవారమని, ఇప్పుడు పరిధి పెరగడంతో ఒత్తిడి తప్పడం లేదన్నారు. కేసు నమోదు, అరెస్టు, చార్జిషీటు తయారు చేయడం, శిక్ష పడేందుకు అవసరమైన పత్రాల్ని కోర్టుకు సమర్పించేందుకు మరికొంత మంది సిబ్బంది అవసరం ఉందన్నారు. త్వరలో చైతన్య సదస్సులు మహిళలపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో త్వరలో చైతన్య సదస్సులు నిర్వహించనున్నట్టు డీఎస్పీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఇందుకోసం మహిళా సంఘాల సభ్యులు, స్వచ్ఛందసంస్థలు, విద్యార్థులు, కళాశాల, పాఠశాలల నిర్వహకులు, పోలీస్‌శాఖ ఉన్నతాధికారులు, వివిధ ప్రభుత్వ విభాగాల సహాయం అవసరమన్నారు. ప్రతీ వారం ఒక్కో చోట చట్టం, న్యాయం, పోలీసుల విధులు వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు. నిర్భయ చట్టం అమల్లోకి వచ్చిన తరువాత మహిళలపై దాడులు తగ్గుతున్నా అక్కడక్కడా తీవ్ర నేరాలు నమోదవుతున్నట్టు వివరించారు. ఇందుకోసం జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో మహిళా పోలీసులకు పలుమార్లు శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. కేసుల నమోదు విషయంలో అలసత్వం వహించకుండా చర్యలు చేపడతున్నామన్నారు. కడియం నుంచి మొక్కల్ని తీసుకువచ్చి మహిళా పోలీస్‌స్టేషన్ ఆవరణలో గ్రీనరీ పెంపునకు కృషి చేస్తున్నట్టు తెలిపారు. త్వరలో టెక్కలి, పలాస వంటి ప్రాంతాల్లో సబ్ సెంటర్లు పెట్టే అవకాశం ఉందన్నారు. మహిళల హక్కులకు భంగం వాటిల్లకుండా జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో బాధ్యతాయుతంగా విధులు నిర్వహించనున్నట్టు చెప్పారు.