సిద్దిపేటటౌన్: వినోద్(పేరు మార్చాం) కాలేజీకి వెళ్లకుండా జులాయిగా తిరుగుతుంటాడు. అతని గ్రామం మీదుగా రోజు సిద్దిపేటకు బస్సులో వేళ్లే కాలేజీ అమ్మాయిని ఆటపట్టించే వాడు. రోజురోజుకు వినోద్ అల్లరి ఎక్కువ కావడంతో బాధితురాలు భరించలేక.. ఓ రోజు ఇంట్లో వాళ్లకు విషయం చెప్పంది. వెంటనే సదరు అమ్మాయి వాళ్ల నాన్న తనకు తెలిసిన వాళ్ల ద్వారా షీ టీం బృందానికి విషయం చెప్పారు.
వెంటనే రంగంలోకి దిగిన షీ టీం బృందం సాధారణ ప్రయాణికుల మాదిరిగా రెండు రోజులు బస్సులో ప్రయాణం చేసి.. వినోద్ ఆటపట్టించడాన్ని పూర్తిగా వీడియో తీశారు. ఆ తర్వాత అతడిని అదుపులోకి తీసుకొని కౌన్సెలింగ్ కోసం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అతని తల్లిదండ్రులను పిలిపించి.. వారికి అమ్మాయిని ఆట పట్టించిన వీడియో చూపించారు. అనంతరం వారి తల్లిదండ్రుల సమక్షంలో సీఐ నేతృత్వంలో కౌన్సెలింగ్ నిర్వహించారు.
మొదటి అవకాశంగా కౌన్సెలింగ్ ఇచ్చి విడిచిపెడుతున్నామని, బుద్ధిగా ఉండాలని హెచ్చరించి వదిలేశారు. అప్పటి నుంచి వినోద్ బుద్ధిగా కాలేజీకి వెళ్లడం ప్రారంభించారు. ఈ ఒక్క సంఘటనలోనే కాదు.. అమ్మాయిలను, మహిళలను వేధించే వారిని వదిలిపెట్టకుండా కౌన్సెలింగ్ నిర్వహిస్తోంది షీ టీం బృందం. సిద్దిపేటలో షీ టీం ఏర్పాటు తర్వాత అమ్మాయిలకు వేధింపులు చాలా వరకు తగ్గాయి.
2015లో షీ టీం ఏర్పాటు
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మహిళలు, అమ్మాయిల భద్రత కోసం టీఆర్‌ఎస్ ప్రభుత్వం షీ టీం బృందాలను ఏర్పాటు చేసింది. మొట్టమొదటి సారిగా ప్రయోగాత్మకంగా హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్‌లో ఈ షీటీం బృందాలు విజయవంతంగా విధులు నిర్వహిస్తుండటంతో మిగతా జిల్లాల్లోనూ బృందాలను ఏర్పాటుచేశారు. అలా 2015 ఫిబ్రవరి 9న ఉమ్మడి మెదక్ జిల్లాలో అప్పటి ఎస్సీ సుమతి ఆధ్వర్యంలో సిద్దిపేటలో షీ టీం బృందం ఏర్పాటైంది.
షీ టీం బృందం విధులు
షీ టీం మహిళలు, అమ్మాయిలను ఆకతాయిల బారి నుంచి రక్షించి.. ఆటపట్టించే వారిని పట్టుకుని వారికి కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. పని ప్రదేశాలలో మహిళలు, కాలేజీ అమ్మాయిలు.. అబ్బాయిల నుంచి ఎదుర్కొనే ఇబ్బందులను తగ్గిస్తారు. ఉపాధి పనులకు వెళ్లే మహిళలకు పని ప్రదేశాలలో ఎదురయ్యే వేధింపులను ఎలా ఎదుర్కొవాలి, వేధింపుల నుంచి ఎలా రక్షణ పొందాలి అనే అంశాలను వివరించనున్నారు.
కాలేజీల్లో అమ్మాయిలకున్న రక్షణ చట్టాలపై అవగాహన కలిగించడం, కేసు తీవ్రత ఎక్కువగా ఉంటే ఆ కేసును సంబంధిత పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేస్తారు. ఆట పట్టిస్తూ షీ టీం బృందానికి పట్టుబడిన వారికి కౌన్సెలింగ్ నిర్వహించడంతో పాటు మళ్లీ ఎలాంటి పొరపాటు చేయకుండా సంజాయిషీ లెటర్ తీసుకుని విడిచి పెడుతారు. అమ్మాయిలు, మహిళలపై జరిగే వేధింపుల రకాలను కళాజాత బృందాల ద్వారా గ్రామాలు, పట్టణాల్లో అవగాహన కల్పిస్తారు.
చైల్డ్ అబ్యూజింగ్ జరగకుండా చూడటం, మొబైల్ ఫోన్ ద్వారా అభ్యంతరకర మెసేజ్‌లు చేసే వారిని, రాంగ్ కాల్స్ చేసి ఇబ్బంది పెట్టే వారి గురించి కేసు పెడితే.. వెంటనే వారిని అరెస్టు చేసి, వారిని హెచ్చరిస్తారు. లేడీస్ హాస్టల్స్, మహిళలు ఎక్కువగా ఉండే ప్రాంతాలలో మహిళలకు, అమ్మాయిలకు అవగాహన కలిగిస్తారు.
బస్టాండ్‌లలో గస్తీ
షీ టీం బృందంలో ఒక కానిస్టేబుల్, ముగ్గురు లేడీ కానిస్టేబుల్స్ ఉంటారు. ఇలా రెండు టీంలు ఉదయం, సాయంత్రం బస్టాండ్, ప్రధాన చౌరస్తాల వద్ద గస్తీ ఉండి అమ్మాయిలతో అసభ్యకరంగా ప్రవర్తించేవారిని గుర్తించడంతో పాటు వారికి కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. ఉదయం 8.30 నుంచి 11 గంటల వరకు ఒక టీం, సాయంత్రం 4 నుంచి 7.30 గంటల వరకు మరో టీం విధులు నిర్వహిస్తారు.
సామాజిక మాధ్యమాల ద్వారా..
షీ టీం బృందాలు ఇకపై కమిషనరేట్ పరిధిలోని విద్యాసంస్థలు, ప్రయాణ ప్రాంగణాలు, ప్రధాన చౌరస్తాలలో విద్యార్థులను, యువతులను, మహిళలను అప్రమత్తం చేసేలా విస్తృత ప్రచారం చేస్తారు. ఆకతాయిలు మహిళలను, యువతులను వేధింపులకు గురి చేస్తే తక్షణమే 100 నెంబర్‌కు, ఫేస్‌బుక్, ఈమెయిల్, వాట్సాప్, ట్విట్టర్ ద్వారా ఫిర్యాదు చేసిన వెంటనే నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు.
మహిళలు ఉన్న చోట అవగాహన
కాలేజీలు, ఇతర సంస్థలు, స్థలాలలో మహిళలు, అమ్మాయిలు ఎక్కువ సంఖ్యలో ఒకే దగ్గర ఉండే అవకాశం ఉంది. అలాంటి చోట అభ్యంతరకర చర్యలను ఎలా ఎదుర్కొవాలి? వాటిని ఎలా తిప్పికొట్టాలి? అనే అంశాలను, చట్టాల ద్వారా ఎలా రక్షణ పొందాలి అనే విషయాలను నెలలో ఒకరోజు అవగాహన కల్పిస్తున్నాం. అమ్మాయిలు, మహిళలు, వృద్ధుల మీద హింస, అభ్యంతరకర ప్రవర్తన ఏ రూపంలో ఉన్నా చర్యలు తీసుకుంటున్నాం.
– పద్మ, సీఐ, ఉమెన్ పోలీస్‌స్టేషన్, సిద్దిపేట
సక్రమ మార్గంలో నడిచేలా..
అమ్మాయిలను చూసి అబ్బాయిలు, అబ్బాయిలను చూసి అమ్మాయిలు ఆకర్షితులు అవ్వడం యుక్త వయస్సులో సహజం. కానీ, దాని గురించి విడమరిచి చెప్పకపోతే అది తీవ్రరూపం దాల్చి విపరీత ధోరణికి దారితీస్తుంది. ఏది మంచి? ఏది చెడు? అనే విషయాలను వారికి తెలియజేయాలి.
– ఉమాపతి, సైకాలజిస్ట్, ఉమెన్ పీఎస్, సిద్దిపేట
అద్భుతంగా పని చేస్తున్నారు..
సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో షీ టీం బృం దాలు అద్భుతంగా పనిచేస్తున్నాయి. ఉదయం, సా యంత్రం ప్రధాన చౌరస్తా వద్ద ఉంటూ ఆకతాయిలను పట్టుకుని వారికి కౌన్సెలింగ్ ఇస్తున్నారు. – జోయల్ డేవిస్, సిద్దిపేట పోలీస్ కమిషనర్
Comments
Please login to add a commentAdd a comment