సాక్షి, వరంగల్ క్రైం: మహిళలు, యువతుల రక్షణకు చట్టసభల్లో ఎన్ని చట్టాలు చేసినా ఆకతాయిల ఆగడాలు ఆగడం లేదు. వారు ఇంట్లో, బయటా, ఆఫీసులో, కళాశాలలో, అడుగడుగునా వేధింపులకు గురవుతునే ఉన్నారు. పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానం కూడా వేధింపులకు మార్గం అవుతోంది. ఫోన్లలో యువతుల ఫొటోలు మార్ఫింగ్ చేసి బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు. ఒంటరిగా కళాశాలకు వెళ్లే యువతుల కోసం బస్టాండ్ల వద్ద కాచుకుకూర్చుంటున్నారు. పోకిరీలు చేసే హేళన, సూటిపోటి మాటలను విద్యార్థినులు మౌనంగా భరిస్తున్నా రు. ఏం చేయాలో తెలియక బాధను గుండెల్లోనే దాచుకుంటున్నారు. వేధింపులు శృతి మించితేనే ఫిర్యాదు వరకు వెళ్తున్నా యి. వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో మహిళలు, యువతులకు రక్షణ కల్పించడానికి మూడు షీ టీమ్స్ పనిచేస్తున్నాయి. అయినప్పటికీ వేధింపులు ఆగడం లేదు.
పరువు కోసం..
కళాశాలలు, పనిచేస్తున్న కార్యాలయాలు, బంధువులు ఇలా అనేక రూపాల్లో యువతులు వేధింపులకు గురవుతున్నారు. అయినా వాటిని మౌనంగా భరిస్తూనే ఉన్నారు. పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేస్తే కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుందని, పరువు పోతుందనే ఉద్దేశంతో ఎవ్వరూ ముందుకు రావడం లేదు. ఎవరైనా ముందుకు వచ్చి కేసులు పెడితే వారికి కుటుంబ సభ్యుల నుంచి, సమాజం నుంచి ఆశించిన స్థాయిలో మద్దతు దొరకడం లేదు. దీంతో ఎన్ని వేధింపులు ఎదుర్కొన్నా మనసులో కుమిలిపోతున్నారే తప్పా బయటపడడం లేదు. ఈ పరిస్థితుల నుంచి మహిళలు, యువతులు బయటికి రావడానికి పోలీసు శాఖ ఎన్ని కార్యక్రమాలు చేపట్టినా ఆశించిన ఫలితాలు రావడం లేదు.
ప్రభుత్వ కార్యాలయాల్లో..
గౌరవప్రదమైన ఉద్యోగాలు చేసే చోట కూడా తోటి పురుష ఉద్యోగులు మహిళా ఉద్యోగులను ద్వంద్వార్థాలతో వేధిస్తున్నారు. వారిని ప్రతిఘటిస్తే అది చేయడం లేదు.. ఇది చేయడం లేదు అంటూ కక్ష సాధింపునకు పాల్పడుతున్నారు. అర్బన్ జిల్లాలో ఇటీవల ఇద్దరు ఉన్నతాధికారులు మహిళ అధికారులను సూటిపోటి మాటలతో వేధించడంతో వారు ఏకంగా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో జరుగుతున్న వేధింపులను మహిళా అధికారులు, కింది స్థాయి మహిళా ఉద్యోగులు విధిలేని పరిస్థితుల్లో మౌనంగా భరిస్తున్నారు. అయితే వారు ఫిర్యాదు చేస్తే చాలు చర్యలు తీసుకునేందుకు షీ టీమ్స్ అధికారులు సిద్ధంగా ఉన్నప్పటికీ తమ పరువు బజారుకెక్కుతుందనే భయంతో వెనుకడుగు వేస్తున్నారు. ఇలాంటి దుశ్శాసనుల పీచమణచాలంటే రావల్సిందల్లా మహిళల్లో చైతన్యమే.
పెరుగుత్ను కేసులు...
వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో రోజురోజుకు వేధింపులు పెరుగుతున్నాయి. మహిళలు, యువతులు ఇప్పుడిప్పుడే పోలీస్ స్టేషన్ వచ్చి ధైర్యంగా ఫిర్యాదు చేయగలుగుతున్నారు. పోలీస్ కమిషనరేట్ పరిధిలో 2015లో 188 కేసులు నమోదు కాగా, 2016లో 208 కేసులు, 2017లో 185 కేసులు, 2018లో ఇప్పటి వరకు 169 కేసులు నమోదయ్యాయి. ఈవ్‌టీజింగ్ కేసుల్లో పట్టుబడిన బాలురపై పోలీసులు కేసులు పెట్టకుండా తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇచ్చి వదిలేస్తున్నారు. పిల్లలపై తల్లిదండ్రుల పర్యవేక్షణ లేకపోవడం, చేతుల్లో వేలాది రూపాయల విలువ చేసే స్మార్ట్‌ఫోన్లు ఉండడం, ఇంటర్‌నెట్‌లో ఇష్టారాజ్యంగా లాగిన్ కావడం, వాట్సప్, ఫేస్‌బుక్ పేరిట పరిచయం లేని వ్యక్తులతో చనువుగా మాట్లాడడం, ప్రైవేట్ హాస్టళ్ల నిర్వాహకుల పర్యవేక్షణ లేకపోవడం తదితర కారణాలతో యువతులు అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఈవ్‌టీజర్లపై కఠిన చర్యలు
మహిళలు, యువతులను వేధింపులకు గురిచేసే ఈవ్‌టీజర్లపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం. ఎవరైనా వేధింపులకు గురైతే ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలి. కమిషనరేట్ పరిధిలో మూడు బృందాలు, ఒక్కో బృందంలో నలుగురు సభ్యులు పనిచేస్తున్నారు. అందరు మఫ్టీలో ఉంటారు. కళాశాలలు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, షాపింగ్ మాల్స్ వద్ద షీటీమ్స్ పోలీసులు మఫ్టీలో ఉండి అకతాయిలను అదుపులోకి తీసుకుంటారు. ప్రతి శనివారం కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నాం. ఎవ్వరికైనా ఇబ్బందులు ఉంటే క్రైం ఏసీపీ 9491089112, కమిషనరేట్ వాట్సప్ నంబర్ 9491089257, షీటీమ్స్ ఇన్‌స్పెక్టర్ 7382294058 నంబర్లకు సమాచారమిస్తే వెంటనే స్పందిస్తాం.
– శ్రీనివాస్‌రావు, షీ టీమ్స్ ఇన్‌స్పెక్టర్
Comments
Please login to add a commentAdd a comment