సాక్షి, హైదరాబాద్: మహిళల భద్రత, రక్షణ కోసం ఆరేళ్ల కిందట హైదరాబాద్ నగరంలో ప్రారంభించిన ‘షీ టీమ్స్’ అద్భుత ఫలితాలు చూపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని మరికొన్ని పట్టణాలకూ ‘షీ టీమ్స్’ సేవలు విస్తరించాయి. ఇప్పుడు ఇదే కోవలో పల్లెల్లోని మహిళల కోసమూ ప్రత్యేక కమిటీలు ఏర్పాటుకానున్నాయి. గ్రామ, జిల్లా స్థాయిలో సామాజిక కార్యాచరణ కమిటీ(సోషల్ యాక్షన్ టీమ్)లు ఏర్పడనున్నాయి. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో అంతర్భాగంగా ఉన్న గ్రామీణ దారిద్య్ర నిర్మూలన సొసైటీ (సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ) ఆధ్వర్యంలో ఇవి ఏర్పడనున్నాయి. జిల్లా స్థాయి కమిటీలో కలెక్టర్, ఎస్పీ, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి (డీఆర్‌డీఓ)కీ చోటు కల్పిస్తారు. గ్రామ, మండల మండల స్థాయిలో పరిష్కారం కాని సమస్యలను జిల్లా స్థాయి కమిటీలు పరిష్కరించనున్నాయి.
శిక్షణ అనంతరం క్షేత్రస్థాయి కార్యాచరణలోకి...
రాష్ట్రంలోని ప్రతీ మండలంలో ముగ్గురు స్వయంశక్తి మహిళా సంఘాల సభ్యులతో సహా ఎమ్మార్వో, సబ్–ఇన్‌స్పెక్టర్, ఇందిరా క్రాంతి పథం ఏపీఎం, అంగన్‌వాడీ సూపర్‌వైజర్లు సభ్యులుగా కమిటీలు ఏర్పాటు చేస్తున్నారు. ఆయా మండలాల పరిధిలోని గ్రామాల్లో స్త్రీల సమస్యల పరిశీలన, తమ దృష్టికొచ్చే సమస్యల పూర్వాపరాలు తెలుసుకుని వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలను ఈ కమిటీలు తీసుకుంటాయి. ఇప్పటికే వివిధ జిల్లాల పరిధిలో పలుచోట్ల సామాజిక కమిటీలు ఏర్పడగా, విడతల వారీ పూర్తి స్థాయిలో శిక్షణ కార్యక్రమాలు చేపట్టాక క్షేత్రస్థాయిలో పనిచేయడం ప్రారంభిస్తాయి. ఈ కమిటీల సభ్యులకు న్యాయ, చట్ట, భద్రతా, రెవెన్యూ, ఇతరత్రా అంశాలపై ఆయా రంగాల నిపుణులతో శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ఇప్పటిదాకా రెండు, మూడు దశలుగా శిక్షణ కార్యక్రమాలు పూర్తికాగా వేలాది సభ్యులకు వివిధ అంశాలపై అవగాహన కల్పించినట్లు అధికారులు తెలిపారు. గతంలో ఏర్పాటుచేసిన జెండర్ కమిటీల్లో ఉన్నవారితోపాటు, గ్రామ, మండల సమాఖ్య పాల క మండళ్ల సభ్యులనూ ఈ కమిటీల్లోనూ నియమిస్తున్నారు. అలాగే కార్యాచరణ కమిటీకి గ్రామ స్థాయిలో ముగ్గురిని అనుబంధ సభ్యులుగా నియమిస్తారు. మహిళల సమస్యలను తక్షణం గుర్తించేందుకు వీరి నియామకం ద్వారా అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. గ్రామస్థాయి నుంచి ఆయా అంశాలకు సంబంధించిన బాధ్యతలను ఈ సోషల్ యాక్షన్ టీంలు నిర్వహించనున్నాయి.
ఏయే బాధ్యతలు అప్పగించనున్నారంటే..
- గ్రామీణ మహిళల సాధికారత సాధన దిశలో స్త్రీల హక్కులు, చట్టాలపై అవగాహన కల్పించడం. ఆర్థిక, సామాజిక, చట్టపరమైన అంశాల్లో అండగా ఉండడం.
- బాల్య వివాహాలు, వరకట్న, లైంగిక వేధింపులు, గృహ హింస, మహిళల అక్రమ రవాణా నివారణ, మూఢ నమ్మకాలు అరికట్టడం
- యుక్త వయసు దశ దాటే వరకు అమ్మాయిలు ఎదుర్కొనే వివిధ సమస్యలు అధిగమించేందుకు ఏం చేయాలనే దానిపై ప్రత్యేక అవగాహన కల్పించడం. కౌమార దశకు వచ్చే బాలికలకు వ్యక్తిగత పరిశుభ్రత, ఆరోగ్యపరంగా వచ్చే మార్పులపై అవగాహన కల్పించడం.
- లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించకుండా అవగాహన, ప్రచార కార్యక్రమాలు నిర్వహించడం.
- అనాథలు, వితంతువుల సమస్యలు అధ్యయనం చేసి, వాటి పరిష్కారానికి అవసరమైన సహాయం అందించడం.
- బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు చేపట్టాల్సిన చర్యలపై నిర్ణయం తీసుకునే అధికారమూ కమిటీలకే ఇవ్వాలని భావిస్తున్నారు.
- గ్రామీణ మహిళల రక్షణకు సోషల్ యాక్షన్ టీమ్‌లు
Comments
Please login to add a commentAdd a comment