ఆమెకు ఆమే అభయం | She Teams assure to the affected womens | Sakshi
Sakshi News home page

ఆమెకు ఆమే అభయం

Published Sun, Aug 11 2019 1:45 AM | Last Updated on Sun, Aug 11 2019 11:42 AM

She Teams assure to the affected womens  - Sakshi

కౌన్సెలింగ్‌ ఇస్తున్న షీ టీమ్‌ (ఫైల్‌)

సాక్షి, హైదరాబాద్‌: ఆమెకు ‘ఆమే’అభయం.. ఆమెను వేధిస్తే ఇక అంతే. వెకిలిచేష్టలు, మకిలి మనుషులపై కొరఢా ఝళిపిస్తోంది. పోకిరీలపై ప్రతాపం చూపుతోంది. ఆకతాయిల ఆగడాలకు అడ్డుకట్ట వేస్తోంది. పాఠశాలలు, కాలేజీల్లో చదివే విద్యార్థినులు.. కార్యాలయాలకు వెళ్లే మహిళలు... షాపింగ్‌ కోసమని ఇంటి నుంచి బయటకు వచ్చే గృహిణులు... ఇలా ఎవరు ఏ పనిమీద వెళుతున్నా ఎవరైనా వేధిస్తే షీటీమ్‌లు ఇట్టే పట్టేస్తున్నాయి. బాధిత మహిళలకు మేమున్నామంటూ భరోసా ఇస్తున్నాయి. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ షీ బృందాలు గత మూడేళ్లలో 5,432 కేసులు నమోదు చేశాయి. అయితే, వీటిల్లో 4,830 కేసు లు మేజర్లపై, 602 కేసులు మైనర్లు నమోదయ్యాయి. మహిళలను వేధించేవారిలో కాలేజీల విద్యార్థులు, వివిధ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులు, స్వయం ఉపాధి పొందుతున్న మరికొందరు ఉన్నట్లు షీ బృందాలు సేకరించిన గణాంకాలు వెల్లడిస్తున్నాయి.  

పనిచేస్తున్న అవగాహన మంత్రం... 
బస్టాప్‌లు, ఆటోస్టాండ్‌లు, రైల్వేస్టేషన్లు, మెట్రోస్టేషన్లు, పనిచేసే ప్రాంతాలు, విద్యాసంస్థలు... ఇలా ఏ ప్రాంతమైనా సరే బాలికలు, యువతులు, మహిళలను వేధిస్తే షీ బృందాలను ఆశ్రయించాలని చేస్తున్న విస్తృత ప్రచారం బాగానే పనిచేస్తోంది. లైంగిక వేధింపులకు గురయ్యే యువతులకు మేమున్నామనే భరోసా ఇచ్చేందుకు గత మూడేళ్లలో దాదాపు ఐదువేల వరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి దాదాపు పది లక్షల మందిలో మార్పు తీసుకురాగలిగాయి. ముఖ్యంగా పాఠశాలలు, కాలేజీలు, గ్రామాలు, మురికివాడ లు, పనిచేసేప్రాంతాల్లో విస్తృతంగా జాగృతి కార్యక్రమాలు నిర్వహించారు. మహిళాచట్టాల గురించి వివరించారు. పోలీసుస్టేషన్లే కాకుండా వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విట్టర్, ఈమెయిల్, హాక్‌ ఐ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని ప్రచారం చేయడం అమ్మాయిలకు, మహిళల్లో భరోసా కలిగించింది. ఫలితంగా వాట్సాప్, ఫేస్‌బుక్, ఈ–మెయిల్, ట్విట్టర్, డయల్‌ 100 ద్వారా ఫిర్యాదుల తాకిడి పెరిగింది. ఫిర్యాదు అందిన వెంటనే మఫ్టీ దుస్తుల్లో షీ బృందాలు అక్కడికి చేరుకొని వీడియో చిత్రీకరణ ద్వారా ఆకతాయిల వెకిలి చేష్టలను చిత్రీకరించి సాక్ష్యాలుగా కోర్టులో సమరి్పస్తున్నాయి.  

అతి గారాబంతో దారి తప్పి.. 
- చిన్నప్పటి నుంచి స్త్రీలపట్ల గౌరవం పెంచేలా తల్లిదండ్రులు, గురువులు చొరవ చూపకపోవడం  
తల్లిదండ్రుల అతి గారాబం  
షీ బృందాలకు చిక్కుతున్నవారిలో 19 నుంచి 55 ఏళ్ల వయసువారే ఎక్కువ  

నోరెళ్లబెడుతున్నారు... 
‘మేమేమీ తప్పుచేయలేదంటూ చిలుకపలుకులు పలికే ఈవ్‌ టీజర్లకు తల్లిదండ్రుల సమక్షంలోనే వీడియో ప్రదర్శించడంతో కిమ్మనకుండా ఉండిపోతున్నారు. ‘మేం పట్టుకున్న ఈవ్‌టీజర్లలో 80 శాతం మంది రోజూ సిగరెట్లు తాగుతున్నారు. వారాంతాల్లో మద్యం పారీ్టలు చేసుకుంటున్నారు. హుక్కా కేంద్రాలకు వెళ్తూ మత్తును రుచిచూస్తున్నారు’ అని షీ టీమ్‌ సభ్యులు తెలిపారు. 

కౌన్సెలింగ్‌తో మార్పు కనబడుతోంది... 
షీ బృందాలకు చిక్కిన ఆకతాయిలకీ కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నాం. మార్పు వస్తోంది. పశ్చాత్తాపపడేలా చేయడంతోపాటు మరోమారు ఈవ్‌టీజింగ్‌ చేస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరిస్తున్నాం. వేధింపులపై ఫిర్యాదు అందగానే రంగంలోకి దిగి మేమున్నామనే భరోసాను కల్పిస్తున్నాం. ఫలితంగా కేసుల సంఖ్య పెరుగుతోంది.  
– అనసూయ, సైబరాబాద్‌ షీ టీమ్‌ ఇన్‌చార్జి 

మనస్తత్వం మంచిగా ఉండేలా చూడాలి 
పిల్లల ముందే ఇంట్లో తల్లిదండ్రులు గొడవపడటం కూడా ఎదుటివారంటే లెక్కలేనితనాన్ని పెంచుతుంది. మగపిల్లలకు ఇష్టానుసారంగా డబ్బులు, స్వేచ్ఛ ఇవ్వడం వల్ల దారి తప్పుతున్నారు. అమ్మాయి కనబడితే కామెంట్‌ చేయడం మామూలు విషయమేనని భావిస్తున్నారు. అందుకే చిన్నప్పుడే పిల్లల మనస్తత్వం బాగుండేలా చూడాలి..      – లావణ్య, క్లినికల్‌ సైకోథెరపిస్ట్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement