‘షీ’కి చిక్కారు
- వారంలో 40 మంది ఈవ్‌టీజర్లపై కేసు
- నిందితులు 16-68 ఏళ్ల వయస్సు వారు
సాక్షి, సిటీబ్యూరో: మహిళల భద్రత కోసం నగర పోలీసులు రంగంలోకి దింపిన షీ టీమ్‌లకు వారంలో 40 మంది ఈవ్‌టీజర్లు పట్టుబడినట్లు అదనపు పోలీసు కమిషనర్ (క్రైమ్స్) స్వాతిలక్రా తెలిపారు. తన కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో షీ టీమ్స్ పనితీరు, ఈవ్‌టీజర్ల వివరాలను వెల్లడించారు. గత నెల 24న నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి వంద మంది పోలీసులతో‘ షీ టీమ్’లను రంగంలోకి దింపిన విషయం తెలిసిందే.
ఈ టీమ్‌లు ఉదయం, సాయంత్రం వేళల్లో కళాశాలలు, షాపింగ్ సెంట ర్లు, రైల్వే, బస్సు స్టేషన్‌ల వద్ద కాపు కాశాయి. 40 మంది ఈవ్‌టీజర్లను అదుపులోకి తీసుకుని పిటీ కేసు నమోదు చేశారు. అంతేకాకుండా వారి కుటుంబ సభ్యుల సమక్షంలో సీసీఎస్ పోలీసులు కౌన్సెలింగ్ చేసి పంపించారు. పట్టుబడిన వారిలో 16 నుంచి 68 ఏళ్ల వయస్సు కలిగిన వారు ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది యువకులు, ఇంటర్ విద్యార్థులు, ప్రయివేటు ఉద్యోగులు, ఒక సర్పంచ్ ఉన్నారు. ఈ సమావేశంలో సీసీఎస్ డీసీపీ పాలరాజు, అదనపు డీసీపీ రంజిత్త్రన్‌కుమార్, ఏసీపీ కవిత పాల్గొన్నారు.
ఈ మేరకు ‘షీ టీమ్స్ మీ వెంటే ఉన్నాయి, ఆపదలో ఉంటే వెంటనే 100 నంబర్‌కు ఫోన్ చేయండి’ అనే వాల్ పోస్టర్‌ను విడుదల చేశారు. షీ టీమ్‌లు ఈవ్‌టీజర్ల ఆట కట్టించడమే కాకుండా ఫిర్యాదులు చేసే విధంగా మహిళలలో ధైర్యం కల్పిస్తున్నాయి. ఈవ్‌టీజింగ్ బారిన పడితే ధైర్యంగా ఫిర్యాదు చేయవచ్చని, బాధితుల పేర్లు, వివరాలు గోప్యంగా ఉంచుతామని నగర పోలీసులు ఎంఎంటీఎస్ రైలు ఎక్కి మహిళలు, విద్యార్థినిలను స్వయంగా కలుసుకుని భరోసా ఇస్తున్నారు.
ఈవ్‌టీజర్లతో అవగాహన తరగతులు..
ఈవ్‌టీజింగ్‌ను మరింత కట్టడి చేసేందకు పట్టుబడిన వారితో ఆయా కళాశాలల్లో అవగాహన తరగతులు నిర్వహించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. తాము ఈవ్ టీజింగ్ చేయడం వల్ల ఎలాంటి దుష్ఫలితాలు వచ్చాయి, దాని వల్ల పోయిన పరువు, ఎంత నష్టం కలుగుతుందో స్వయంగా వివరించేందుకు పట్టుబడిన నిందితులు అంగీకరించారు. వీరితో పాటు పోలీసులు కూడా కళాశాలలకు వెళ్లి ఈవ్‌టీజింగ్ చేయరాదని వారిలో చైతన్యం తీసుకువచ్చే కార్యక్రమాన్ని త్వరలో శ్రీకారం చుట్టేందుకు సిద్ధమవుతున్నారు.
ఇలా పట్టుబడ్డారు..
20 ఏళ్ల ఓ యువకుడు మెహిదిపట్నం బస్టాప్‌లో నిల్చున్నాడు. అక్కడికి వ చ్చే ఏ బస్సు ఎక్కలేదు.ప్రయాణిలకు చూస్తూ ఈవ్‌టీజింగ్‌కు పాల్పడుతూ షీ టీమ్‌కు చిక్కాడు.
సికింద్రాబాద్‌లో 30 ఏళ్ల యువకుడు బస్సులోకి మహిళలు ఎక్కే ముందు డోర్ నుంచి ఎక్కడం, వారికి తగలడం చేస్తూ షీ టీమ్స్‌కు పట్టుబడ్డాడు.
అమీర్‌పేటలో ఓ ప్రయివేటు ఉద్యోగి (36) బస్టాప్‌లో నిల్చున్న మహిళలపై పట్ల అసభ్యకరంగా చూడటంతో పాటు మాట్లాడుతూ ఈవ్‌టీజింగ్‌కు పాల్పడి దొరికిపోయాడు.
సుల్తాన్‌బాజర్‌లో ఈవ్‌టీజింగ్‌కు పాల్పడిన ఓ వ్యక్తి ఏకంగా మహిళను లాడ్జికి రమ్మని కోరాడు. ఆమె నిరాకరించడం, ఈ దృశ్యం షీ టీమ్స్ కంట్లో పడడంతో అతగాడి ఆటలకు అడ్డుకట్ట వేశారు.
ఈవ్‌టీజింగ్‌కు పాల్పడితే చర్యలు: స్వాతిలక్రా
‘నగరంలో ఏ మూలన కూడా ఈవ్‌టీజింగ్ జరగడానికి వీలులేదు. ఈవ్‌టీజింగ్‌కు యత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. షీ టీమ్స్ నిరంతరం పర్యవేక్షిస్తాయి. మొదటిసారి పట్టుబడితే పిటీ కేసుతో పాటు కౌన్సెలింగ్ చేస్తాం. మరోసారి దొరికితే నిర్భయ చట్టం కింద కేసులు నమోదు చేస్తాం.’