M.Mahendar Reddy
-
బక్రీద్‌ను శాంతియుతంగా జరుపుకోవాలి
బహదూర్‌పురా: బక్రీద్ పండుగను శాంతి యుత వాతావరణంలో నిర్వహించుకునేందుకు అన్ని రకాల చర్యలను తీసుకుంటున్నామని నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్ రెడ్డి తెలిపారు. సాలార్జంగ్ మ్యూజియంలో శనివారం ముస్లింలతో కలిసి బక్రీద్‌పై ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ... నగర వ్యాప్తంగా వివిధ కూడళ్లలో చెక్ పోస్టులు, 40 చెక్ పాయింట్లను ఏర్పాటు చేశామని... 20 వేల మంది పోలీసులతో బందోబస్తును నిర్వహిస్తూ పర్యవేక్షిస్తామన్నారు. గోవుల తరలింపు లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటామన్నారు. చార్మినార్ ఎమ్మెల్యే సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రీ మాట్లాడుతూ... రోడ్లపై పశువులను విక్రయించుకునే వారికి విశాలమైన ప్రాంతాల్లో వసతులు ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయమన్నారు. జీహెచ్ఎంసీ దక్షిణ మండలం జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ... బక్రీద్‌లో వ్యర్ధాలను తొలగించేందుకు ఉన్న వాహనాలకు తోడు అదనంగా 150 వాహనాలను సమకూర్చామన్నారు. మైనార్టీ వెల్ఫేర్ సెక్రటరీ, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎండీ ఉమర్ జలీల్, షఫివుల్లా తదితరులు పాల్గొన్నారు. -
‘షీ’కి చిక్కారు
వారంలో 40 మంది ఈవ్‌టీజర్లపై కేసు నిందితులు 16-68 ఏళ్ల వయస్సు వారు సాక్షి, సిటీబ్యూరో: మహిళల భద్రత కోసం నగర పోలీసులు రంగంలోకి దింపిన షీ టీమ్‌లకు వారంలో 40 మంది ఈవ్‌టీజర్లు పట్టుబడినట్లు అదనపు పోలీసు కమిషనర్ (క్రైమ్స్) స్వాతిలక్రా తెలిపారు. తన కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో షీ టీమ్స్ పనితీరు, ఈవ్టీజర్ల వివరాలను వెల్లడించారు. గత నెల 24న నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి వంద మంది పోలీసులతో‘ షీ టీమ్’లను రంగంలోకి దింపిన విషయం తెలిసిందే. ఈ టీమ్‌లు ఉదయం, సాయంత్రం వేళల్లో కళాశాలలు, షాపింగ్ సెంట ర్లు, రైల్వే, బస్సు స్టేషన్ల వద్ద కాపు కాశాయి. 40 మంది ఈవ్‌టీజర్లను అదుపులోకి తీసుకుని పిటీ కేసు నమోదు చేశారు. అంతేకాకుండా వారి కుటుంబ సభ్యుల సమక్షంలో సీసీఎస్ పోలీసులు కౌన్సెలింగ్ చేసి పంపించారు. పట్టుబడిన వారిలో 16 నుంచి 68 ఏళ్ల వయస్సు కలిగిన వారు ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది యువకులు, ఇంటర్ విద్యార్థులు, ప్రయివేటు ఉద్యోగులు, ఒక సర్పంచ్ ఉన్నారు. ఈ సమావేశంలో సీసీఎస్ డీసీపీ పాలరాజు, అదనపు డీసీపీ రంజిత్త్రన్కుమార్, ఏసీపీ కవిత పాల్గొన్నారు. ఈ మేరకు ‘షీ టీమ్స్ మీ వెంటే ఉన్నాయి, ఆపదలో ఉంటే వెంటనే 100 నంబర్‌కు ఫోన్ చేయండి’ అనే వాల్ పోస్టర్‌ను విడుదల చేశారు. షీ టీమ్‌లు ఈవ్టీజర్ల ఆట కట్టించడమే కాకుండా ఫిర్యాదులు చేసే విధంగా మహిళలలో ధైర్యం కల్పిస్తున్నాయి. ఈవ్‌టీజింగ్ బారిన పడితే ధైర్యంగా ఫిర్యాదు చేయవచ్చని, బాధితుల పేర్లు, వివరాలు గోప్యంగా ఉంచుతామని నగర పోలీసులు ఎంఎంటీఎస్ రైలు ఎక్కి మహిళలు, విద్యార్థినిలను స్వయంగా కలుసుకుని భరోసా ఇస్తున్నారు. ఈవ్‌టీజర్లతో అవగాహన తరగతులు.. ఈవ్‌టీజింగ్‌ను మరింత కట్టడి చేసేందకు పట్టుబడిన వారితో ఆయా కళాశాలల్లో అవగాహన తరగతులు నిర్వహించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. తాము ఈవ్ టీజింగ్ చేయడం వల్ల ఎలాంటి దుష్ఫలితాలు వచ్చాయి, దాని వల్ల పోయిన పరువు, ఎంత నష్టం కలుగుతుందో స్వయంగా వివరించేందుకు పట్టుబడిన నిందితులు అంగీకరించారు. వీరితో పాటు పోలీసులు కూడా కళాశాలలకు వెళ్లి ఈవ్‌టీజింగ్ చేయరాదని వారిలో చైతన్యం తీసుకువచ్చే కార్యక్రమాన్ని త్వరలో శ్రీకారం చుట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఇలా పట్టుబడ్డారు.. 20 ఏళ్ల ఓ యువకుడు మెహిదిపట్నం బస్టాప్‌లో నిల్చున్నాడు. అక్కడికి వ చ్చే ఏ బస్సు ఎక్కలేదు.ప్రయాణిలకు చూస్తూ ఈవ్‌టీజింగ్‌కు పాల్పడుతూ షీ టీమ్‌కు చిక్కాడు. సికింద్రాబాద్‌లో 30 ఏళ్ల యువకుడు బస్సులోకి మహిళలు ఎక్కే ముందు డోర్ నుంచి ఎక్కడం, వారికి తగలడం చేస్తూ షీ టీమ్స్‌కు పట్టుబడ్డాడు. అమీర్‌పేటలో ఓ ప్రయివేటు ఉద్యోగి (36) బస్టాప్‌లో నిల్చున్న మహిళలపై పట్ల అసభ్యకరంగా చూడటంతో పాటు మాట్లాడుతూ ఈవ్‌టీజింగ్‌కు పాల్పడి దొరికిపోయాడు. సుల్తాన్బాజర్లో ఈవ్‌టీజింగ్‌కు పాల్పడిన ఓ వ్యక్తి ఏకంగా మహిళను లాడ్జికి రమ్మని కోరాడు. ఆమె నిరాకరించడం, ఈ దృశ్యం షీ టీమ్స్ కంట్లో పడడంతో అతగాడి ఆటలకు అడ్డుకట్ట వేశారు. ఈవ్‌టీజింగ్‌కు పాల్పడితే చర్యలు: స్వాతిలక్రా ‘నగరంలో ఏ మూలన కూడా ఈవ్‌టీజింగ్ జరగడానికి వీలులేదు. ఈవ్‌టీజింగ్‌కు యత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. షీ టీమ్స్ నిరంతరం పర్యవేక్షిస్తాయి. మొదటిసారి పట్టుబడితే పిటీ కేసుతో పాటు కౌన్సెలింగ్ చేస్తాం. మరోసారి దొరికితే నిర్భయ చట్టం కింద కేసులు నమోదు చేస్తాం.’ -
అది చెప్పుల దుకాణదారుల కుట్ర
వీడిన రూ. 30 లక్షల దోపిడీ కేసు ఆరుగురు నిందితుల అరెస్ట్ రూ. 26.7 లక్షల స్వాధీనం చాంద్రాయణగుట్ట: కలెక్షన్ ఏజెంట్ కళ్లల్లో కారం చల్లి... రూ. 30 లక్షల దోపిడీ కేసును ఈస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఛేదించారు. చెప్పులు దుకాణదారులే ఈ దోపిడీకి కుట్రదారులని తేల్చారు. ఆరుగురిని అరెస్టు చేసి... వారి వద్ద నుంచి రూ. 26.70 లక్షల నగదు, కత్తి, రెండు బైక్‌లు, మూడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పురానీహవేళీలోని దక్షిణ మండలం డీసీపీ కార్యాలయంలో గురువారం నగర పోలీస్ కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... పహాడీషరీఫ్ ఠాణా పరిధిలోని జల్పల్లికి చెందిన షేక్ ఇమ్రాన్(21) చెత్తబజార్‌లో ‘ఎంఎస్ గ్రాండ్ ’ పేరిట చెప్పుల దుకాణం నడుపుతున్నాడు. మీర్‌చౌక్ లక్కడ్కోట్కి చెందిన విద్యార్థి షెహ్బాజ్ ఖాన్ (20) తండ్రి కూడా చెత్తబజార్లోనే డాలర్ చెప్పుల షాపు నిర్వహిస్తున్నాడు. చెత్త బజార్‌లోని దుకాణదారుల నుంచి శ్యాం సుందర్ అనే కలె క్షన్ ఏజెంటు ప్రతి రోజు రూ. 20 నుంచి రూ. 30 లక్షల వరకూ వసూలు చేసి సుల్తాన్‌బజార్‌లో బ్యాంక్‌లో జమ చేస్తుంటాడు. ఇది గమనించిన షేక్ ఇమ్రాన్, షెహ్బాజ్ ఖాన్లు అతడి నుంచి డబ్బు దోచుకోవాలని పథకం వేశారు. ఇందులో భాగంగా మూడు నెలల క్రితం ఛత్రినాక లిమ్రా కాలనీలో ఉండే పండ్ల వ్యాపారి మహ్మద్ ఇమ్రాన్ (21)తో కలిసి రెక్కీ నిర్వహించారు. ఆ తర్వాత ఇమ్రాన్ ఛత్రినాకలో ఉండే బీటెక్ విద్యార్థి మహ్మద్ జీషాన్‌అలీ (22), శాలిబండకు చెంది మహ్మద్ అబ్దుల్ ఖాదర్ అన్సారీ (24), డిగ్రీ విద్యార్థి మహ్మద్ సల్మాన్‌ఖాన్ (20)లతో కలిసి దోపిడీ చేయాలని నిర్ణయించుకున్నాడు. అనంతరం నలుగురూ కలిసి శ్యాంసుందర్ కదలికలపై రెక్కీ నిర్వహించారు. ఆగస్టు 23న చెత్త బజార్లో డబ్బు వసూలు చేసుకొని బైక్‌పై వెళ్తున్న శ్యాంసుందర్‌ను కోఠిలోని 94 బస్టాప్ లైన్ వరకు రెండు బైక్‌లపై అనుసరించారు. అక్కడ శ్యాం సుందర్ బైక్‌ను అడ్డగించి.. అతడి కళ్లల్లో కారం చల్లి, తలపై కత్తితో దాడి చేశారు. అతడి వద్ద రెండు బ్యాగ్‌లలో ఉన్న రూ. 30 లక్షలు దోచుకెళ్లారు. ఈ మొ త్తాన్ని ఆరుగురూ పంచుకున్నారు. మొదట్లో బాధితుడు రూ. 40 లక్ష లు పోయినట్టు సుల్తాన్‌బజార్‌లో ఫిర్యాదు చేశాడు. అయితే, పోలీ సులు అతడి వద్ద ఉన్న పత్రాలను పరిశీలించగా దోపిడీకి గురైంది రూ. 30 లక్షలని తేలింది. విశ్వసనీయ సమాచారం అందుకున్న ఈస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్ ఎస్సై ఎ.సుధాకర్ గురువారం లిమ్రా కాలనీలో ఉన్న నలుగురు నిందితులతో పాటు చెత్తా బజార్ షేక్ ఇమ్రాన్, షానబాజ్ ఖాన్‌లను అరెస్ట్ చే శారు. వారి వద్ద నుంచి రూ. 26.7 లక్షల నగదు, కత్తి, బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పట్టుకోవడంలో చొరవ చూపిన ఎస్సై సుధాకర్‌కు కమిషనర్ అభినందనలు తెలిపి నగదు పురస్కారంఅందించారు. కాగా నిందితులను ‘నిందితుల గు ర్తింపు పరీక్ష’ కోసం మీడియా ముందు ప్రవేశపెట్టలేదు. తదుపరి విచారణ నిమిత్తం నిందితులను సుల్తాన్‌బజార్ పోలీసులకు అప్పగించారు. విలేకరుల సమావేశంలోఅదనపు పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్, జాయింట్ కమిషనర్ (ఎస్.బి) మల్లారెడ్డి, దక్షిణ మండలం డీసీపీ సర్వశ్రేష్ట త్రిపాఠీ, నగర టాస్క్‌ఫోర్స్ అదనపు డీసీపీ కోటిరెడ్డి, దక్షిణ మండలం అదనపు డీసీపీ బాబురావు, ఈస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ శ్రీధర్, ఎస్సైలు శేఖర్ రెడ్డి, రవికుమార్ పాల్గొన్నారు. జల్సాల కోసం చోరీల బాట... ఈ ఆరుగురు నిందితులలో ఇద్దరు విద్యార్థులు న్నారు. వీరిలో బీటెక్ ఫైనలియర్ చదివే మహ్మద్ జీషాన్ అలీ, బీకాం సెకండ్ ఇయర్ విద్యార్థి సల్మాన్‌ఖాన్, షహబాజ్ ఖాన్ ఉన్నారు. వీరికి ఫీజు రీయింబర్స్మెంట్, తల్లిదండ్రుల నుంచి డబ్బులు వస్తున్నప్పటికీ కూడా జల్సాల కోసం చోరీల బాట పట్టి కటకటాలపాలయ్యారు. వడ్డీ వ్యాపారులపై పీడీ యాక్ట్ : కమిషనర్ పాతబస్తీలో పేదల నుంచి అధిక వడ్డీ వసూలు చేస్తూ వేధిస్తున్న వడ్డీ వ్యాపారులపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని నగర పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి తెలిపారు. పాతబస్తీలో ప్రత్యేక నిఘా పెట్టి ప్రజలను పీడిస్తున్న వడ్డీ వ్యాపారాలను అరెస్ట్ చేస్తున్నామన్నారు. అలాగే, సూడో పోలీసులు, చైన్‌స్నాచర్లు, ప్రజలను భయబ్రాంతులకు గురిచేసే వారందరిపై కూడా పీడీ యాక్ట్ నమోదు చేస్తామన్నారు. హుమాయన్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన ఘటన కోసం ప్రత్యేక విచారణ కమిటీ, బంగారం దోపిడీ ఘటనలో కేసు దర్యాప్తు కొనసాగుతుందని విలేకరులు అడిగిన ప్రశ్నలకు బదులిచ్చారు. కలెక్షన్ ఏజెంట్లు కూడా ఇలా పెద్ద ఎత్తున డబ్బులను తీసుకెళ్లరాదని....ప్రస్తుతం అందుబాటులో ఉన్న మొబైల్ బ్యాంకింగ్‌ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. -
వేడుక వేళ..
నేడు గోల్కొండ కోటపై జెండా పండుగ కనువిందు చేసేలా ఏర్పాట్లు మెరిసిపోతున్న కోట గోల్కొండ: పంద్రాగస్టు వేడుకల కోసం గోల్కొండ కోటను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. రాత్రి వేళ విద్యుత్ దీపాలతో కోట ధగధగ మెరిసిపోతుంది. పరిసరాలను చూడముచ్చటగా అలంకరించారు. ఈ ఏర్పాట్లను చూసి పర్యాటకులు సైతం ఆశ్చర్యపోతున్నారు. గురువారం నుంచి పోలీసు, ఇంటలిజెన్స్ అధికారులు గోల్కొండ కోటలో జరుగుతున్న ఏర్పాట్లను పర్యవేక్షించారు. సాయంత్రం వరకు జెండా వే దిక సిద్ధం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగించే వేదిక చుట్టూ సెక్యూరిటీ అధికారులు మెటల్ డిటెక్టర్‌తో అణువణువు గాలించారు. గోల్కొండ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. అదిరిన కల్చరల్ ఫెస్ట్ డెమో.. వేడుకల్లో భాగంగా సాంస్కృతిక శాఖ వారు రిహార్సల్స్ నిర్వహించారు. రాణిమహల్ టైస్, ఆయుధగారం వెనుక భాగంలో తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు అద్దంపట్టేలా కళాకారులు అద్భుతంగా ప్రదర్శనలిచ్చారు. కొమ్ము, డప్పు, బూర, డోలు తదితర సంగీత వాయిద్యాల మాధుర్యాలు ఓ పక్కన మరోవైపు లంబాడి నృత్యాలతో కోట పరిసరాలు హోరెత్తాయి. పటిష్ట బందోబస్తు... వేడుక ల నిర్వహణ కోసం పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని నగర పోలీస్ కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి అన్నారు. గురువారం ఆయన గోల్కొండలో ఏర్పాట్లను పర్యవేక్షించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. కోటలోని వివిధ భవనాలు, శిథిలాలు ఉండడంతో ఏర్పాట్లు కష్టతరమైనా ఆయా శాఖల అధికారుల స మన్వయంతో పకడ్బందీ ఏర్పాట్లు చేశామన్నారు. అనంతరం ఆయన ప్రొటోకాల్ డిప్యూటీ సెక్రెటరీ అరవిందర్‌సింగ్, ఇతర అధికారులతో కలిసి కోటలోకి ముఖ్యమంత్రి, ఇతర వీఐపీలు వచ్చే మార్గాలు, వేదికలను క్షుణ్ణంగా పరిశీలించారు. -
అందరి దృష్టి గోల్కొండపైనే..
పంద్రాగస్టు నేపథ్యంలో... బారికేడ్లు, వేదిక,సుందరీకరణ పనులు ముమ్మరం అడుగడుగునా తనిఖీలు వేడుకల ప్రాంతాన్ని సందర్శించిన జీహెచ్ఎంసీ మేయర్, కమిషనర్ సాక్షి, సిటీబ్యూరో: పంద్రాగస్టు వేడుకల నేపథ్యంలో అందరి దృష్టి గోల్కొండపై పడింది. ఇందుకు గాను ఏర్పాట్లు ముమ్మరం చేశారు. అన్ని శాఖల అధికారులు గోల్కొండను సందర్శించి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. పరిసరాలను చదును చేయడం, సుందరీకరణ పనులు చేపడుతున్నారు. వాహనాల పార్కింగ్, వీఐపీలు కూర్చునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గోల్కొండకు దారి తీసే మార్గాలను కూడా ముస్తాబు చేస్తున్నారు. గస్తీ ముమ్మరం.. నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి నేతృత్వంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఏర్పాట్లను వెస్ట్‌జోన్ డీసీపీ సత్యనారాయణ పర్యవేక్షిస్తున్నారు. పంద్రాగస్టు రోజున మాసబ్‌ట్యాంక్ నుంచి గోల్కొండలోని స్వాతంత్ర వేడుకలు జరిగే ప్రదేశం వరకు మొత్తం 26 సెక్టార్లుగా విభజించారు. ఒక్కో సెక్టార్లో నలుగురు సీఐలు, 10 మంది ఎస్ఐలు, 40 మంది కానిస్టేబుళ్లు ఉంటారు. కార్యక్రమానికి హాజరయ్యే వీఐపీలు, వీవీఐపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు వాహనాల పార్కింగ్ ప్రదేశాలను ఇప్పటికే గుర్తించారు. వేడుకకు హాజరయ్యే వారి కోసం నానల్‌నగర్ చౌరస్తా నుంచి టిప్పుసుల్తాన్ బ్రిడ్జి, గొల్కొండ ప్రధాన దర్వాజా నుంచి మకాయిదర్వాజా, బంజారా దర్వాజా నుంచి షేక్‌పేట్ నాలా ఇలా ఆరు రూట్లను కేటాయించారు. ఎవరు ఏ రూట్లో వెళ్లాలో ముందుగానే పోలీసులు సూచనలతో కూడిన కరపత్రాలు, పాస్‌లను అందరికి అందజేయనున్నారు. బాంబ్ స్క్వాడ్ తనిఖీలు ముమ్మరం చేశారు. అసలే మిలటరీ ఏరియా కావడం.. ఒక రూట్లో వెళ్లాల్సిన అతిథులు మరో దారిలో వెళ్తే మిలటరీ వారితో తలనొప్పి వచ్చే అవకాశాలు ఉన్నందున వాహనాలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాలనే విషయమై ట్రాఫిక్ పోలీసులు అడుగడుగునా రూట్లను సూచించేలా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. 45 నిమిషాల పాటు సాగే స్వాతంత్య్ర వేడుకల కోసం బందోబస్తు ఏర్పాటుపై పూర్తి స్థాయిలో దృష్టి సారించినట్టు డీసీపీ సత్యనారాయణ తెలిపారు. సివిల్ పోలీసులు, ఆర్మ్డ్ రిజర్వు, తెలంగాణ స్పెషల్ పోలీసులతో పాటు గ్రేహౌండ్స్ దళాలు బందోబస్తులో పాల్గొంటున్నాయన్నారు. కోటను సందర్శించిన మేయర్, కమిషనర్ గోల్కొండ : వేడుకలను పురస్కరించుకుని గోల్కొండ కోట ప్రాంతాన్ని శనివారం నగర మేయర్ మాజిద్ హుస్సేన్, జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్, స్థానిక ఎమ్మెల్యే కౌసర్ మొయినుద్దీన్ తదితరులు సందర్శించారు. టోలిచౌకి నుంచి ఏర్పాట్ల పనులు పరిశీలిస్తూ కోటకు వచ్చారు. బంజార దర్వాజ వద్ద జరుగుతున్న సుందరీకరణ పనులను పూర్తి చేసి ఆ ప్రాంతంలో పూల మొక్కలు నాటాలని వారు ఆదేశించారు. కోటలో సీఎం కేసీఆర్ స్వీకరించే గౌరవ వందనం ప్రాంతాన్ని పరిశీలించి అక్కడ చేపట్టాల్సిన పనులను అధికారులకు సూచించారు. -
పక్కా సమాచారంతోనే నాయక్ అరెస్ట్: నగర సీపీ
హైదరాబాద్: పాక్ మహిళకు దేశ రక్షణ సమాచారం చేరవేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్మీ అధికారి పటన్‌కుమార్ పొద్దార్ నాయక్ కేసు విచారణ కొనసాగుతుందని నగర పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డి వెల్లడించారు. గురువారం హైదరాబాద్‌లో మహేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ... పక్కా సమాచారంతోనే పటన్ కుమార్‌ను అరెస్టు చేసినట్లు చెప్పారు. పాక్ మహిళ, పటన్ నాయక్‌ల మధ్య మనీ సర్క్యూలేషన్ జరిగిందా లేదా అనే విషయం తదుపరి విచారణలో తేలుతుందని తెలిపారు. నాయక్ అరెస్టు విషయాన్ని ఆర్మీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు మహేందర్ రెడ్డి వివరించారు. -
భద్రతలో భాగస్వాములు కండి
సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోండి వ్యాపార సంస్థలకు నగర పోలీసు కమిషనర్ పిలుపు మెహిదీపట్నం: నగరంలోని అన్ని వ్యాపార సంస్థలు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుని హైదరాబాద్ భద్రతలో భాగస్వాములు కావాలని నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. నగరాన్ని సేఫ్ అండ్ స్మార్ట్‌సిటీగా మార్చేందుకు కృషి చేస్తున్నామని, దానికి ప్రజలు సహ కరించాలని కోరారు. శనివారం మెహిదీపట్నంలోని క్రి స్టల్గార్డెన్లో ‘మన భద్రత మన చేతుల్లోనే’ పేరిట నిర్వహించిన కార్యక్రమంలో కమిషనర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటు ఆవశ్యకతను వివరించారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ప్రపంచానికి చాటి చెప్పాలంటే భద్రతపై అందరికి భరోసా కల్పించాలన్నారు. నేరాలను నిరోధించాలంటే నగరంలోని రద్దీ, సమస్యాత్మక ప్రాంతాలు, వ్యాపార సముదాయాల్లో విధిగా ఆయా సంస్థలు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. పోలీసుల సూచనల మేరకు కెమెరాలు బిగించుకోవాలన్నారు. ప్రతి సంస్థ బయటకు వెళ్లే దారిలో 50 ఫీట్లు రోడ్డును కవర్ చేయడంతో పాటు 120 డిగ్రీల కోణంలో కెమెరాలు అమర్చాలన్నారు. వ్యాపార ధోరణితో కాకుండా సామాజిక కోణంలో ప్రతి దుకాణ యాజమాని సీసీ కెమెరాల ఏర్పాటుకు నడుం బిగించాలన్నారు. అలాగే, వ్యాపార సముదాయాలు లేని ప్రాంతల్లో జీహెచ్ఎంసీ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తోందన్నారు. ఇందుకు ఈ నెల 24న జీహెచ్ఎంసీలో అన్ని విభాగాలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తున్నట్టు కమిషనర్ మహేందర్‌రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ అంజనీకుమార్, వెస్ట్‌జోన్ డీసీపీ సత్యనారాయణ, టాస్క్‌ఫోర్స్ అడిషనల్ డీసీపీ కోటిరెడ్డి, ఏసీపీలు శ్రీనివాస్, రాంభూపాల్‌రెడ్డి, ఉదయ్‌కుమార్‌తో పాటు పలువురు ఇన్స్పెక్టర్లు, వ్యాపార సంస్థల యజమానులు పాల్గొన్నారు. బోనాలకు భారీ బందోబస్తు... ఆది, సోమవారాల్లో లాల్‌దర్వాజాతో పాటు పాబస్తీలోని ఇతర ప్రాంతాల్లో జరిగే బోనాలకు 6 వేల మందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు కమిషనర్ మహేందర్‌రెడ్డి తెలిపారు. భక్తులు ఆధ్యాత్మిక వాతావరణంలో బోనాల పండుగను ఘనంగా జరుపుకోవాలన్నారు. -
టీవీ చానల్స్ ప్రసారాల పైరసీదారుల అరెస్టు
పరారీలో ప్రధాన సూత్రధారి హైదరాబాద్ : వందలాది టీవీ ఛానల్స్ ప్రసారాల పైరసీ నిందితులను హైదరాబాద్ సీసీఎస్ సైబర్‌క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. వివరాలను పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి ఆదివారం తన కార్యాలయంలో మీడియాకు వివరించారు. అమెరికా కేంద్రంగా ఫైసల్అఫ్తాబ్, సాజిద్సోహల్, సుమిత్హౌజాలు ‘జాదు టీవీ’ నిర్వహిస్తున్నారు. సాంకేతికత, సెటప్‌బాక్స్ లను ఉపయోగించుకొని మన దేశంలోని 115 చానల్స్‌ను పైరసీ చేశారు. వీటి కార్యక్రమాలను కొద్ది తేడాతో వారి సెటప్ బాక్స్ ల్లో ప్రసారమయ్యేలా చేసేవారు. అమెరికాలో తెలుగు టీవీ చానల్స్ సరిగా రాకపోవడంతో కొన్ని టీవీ చానల్స్ చొరవతో పోలీసులు రంగంలోకి దిగి ఈ ముఠా గుట్టును రట్టు చేశారు. బోయిన్‌పల్లిలోని మానసరోవర్ అపార్ట్‌మెంట్‌పై సీసీఎస్ సైబర్ క్రైమ్ ఠాణా ఇన్స్పెక్టర్లు మాజిద్, కరుణాకర్‌రెడ్డిలు తమ బృందంతో దాడి చేసి కాషిఫ్ అలీ ఖాన్(27), జగదీశ్వర్‌చారి, యన్.సాయికుమార్, జె.బి.మేఘనాథలను అరెస్టు చేశారు. ప్రధాన సూత్రధారి సుమిత్ హౌజా పరారీలో ఉన్నాడు. త్వరలో ఇతనిపై రెడ్‌కార్నర్ నోటీసు జారీ చేస్తామని కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కమిషనర్ అంజనీకుమార్జైన్, జాయింట్ పోలీసు కమిషనర్ మల్లారెడ్డి, డీసీపీ పాలరాజులు పాల్గొన్నారు.