భద్రతలో భాగస్వాములు కండి
- సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోండి
- వ్యాపార సంస్థలకు నగర పోలీసు కమిషనర్ పిలుపు
మెహిదీపట్నం: నగరంలోని అన్ని వ్యాపార సంస్థలు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుని హైదరాబాద్ భద్రతలో భాగస్వాములు కావాలని నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. నగరాన్ని సేఫ్ అండ్ స్మార్ట్‌సిటీగా మార్చేందుకు కృషి చేస్తున్నామని, దానికి ప్రజలు సహ కరించాలని కోరారు. శనివారం మెహిదీపట్నంలోని క్రి స్టల్‌గార్డెన్‌లో ‘మన భద్రత మన చేతుల్లోనే’ పేరిట నిర్వహించిన కార్యక్రమంలో కమిషనర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటు ఆవశ్యకతను వివరించారు.
హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ప్రపంచానికి చాటి చెప్పాలంటే భద్రతపై అందరికి భరోసా కల్పించాలన్నారు. నేరాలను నిరోధించాలంటే నగరంలోని రద్దీ, సమస్యాత్మక ప్రాంతాలు, వ్యాపార సముదాయాల్లో విధిగా ఆయా సంస్థలు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. పోలీసుల సూచనల మేరకు కెమెరాలు బిగించుకోవాలన్నారు.
ప్రతి సంస్థ బయటకు వెళ్లే దారిలో 50 ఫీట్లు రోడ్డును కవర్ చేయడంతో పాటు 120 డిగ్రీల కోణంలో కెమెరాలు అమర్చాలన్నారు. వ్యాపార ధోరణితో కాకుండా సామాజిక కోణంలో ప్రతి దుకాణ యాజమాని సీసీ కెమెరాల ఏర్పాటుకు నడుం బిగించాలన్నారు. అలాగే, వ్యాపార సముదాయాలు లేని ప్రాంతల్లో జీహెచ్‌ఎంసీ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తోందన్నారు.
ఇందుకు ఈ నెల 24న జీహెచ్‌ఎంసీలో అన్ని విభాగాలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తున్నట్టు కమిషనర్ మహేందర్‌రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ అంజనీకుమార్, వెస్ట్‌జోన్ డీసీపీ సత్యనారాయణ, టాస్క్‌ఫోర్స్ అడిషనల్ డీసీపీ కోటిరెడ్డి, ఏసీపీలు శ్రీనివాస్, రాంభూపాల్‌రెడ్డి, ఉదయ్‌కుమార్‌తో పాటు పలువురు ఇన్‌స్పెక్టర్లు, వ్యాపార సంస్థల యజమానులు పాల్గొన్నారు.
బోనాలకు భారీ బందోబస్తు...
ఆది, సోమవారాల్లో లాల్‌దర్వాజాతో పాటు పాబస్తీలోని ఇతర ప్రాంతాల్లో జరిగే బోనాలకు 6 వేల మందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు కమిషనర్ మహేందర్‌రెడ్డి తెలిపారు. భక్తులు ఆధ్యాత్మిక వాతావరణంలో బోనాల పండుగను ఘనంగా జరుపుకోవాలన్నారు.