Safe and Smart City
-
‘సేఫ్’ సిటీకి సీసీటీవీలు కీలకం
- దాతల సహకారంతో కమ్యూనిటీ సీసీటీవీ ప్రాజెక్ట్ - సీసీ కెమెరాల కోసం రూ. 50 కోట్లు కేటాయించిన ప్రభుత్వం - అన్ని పోలీస్ స్టేషన్లలో సీసీటీవీలు - సైబరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ గచ్చిబౌలి: ‘సేఫ్ ఆండ్ స్మార్ట్ సిటీ’ సాకారం కావాలంటే సీసీటీవీలు అమర్చడం తప్పనిసరి అని సైబరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు. నేరాలను ఛేదించడంలో సీసీటీవీల పాత్ర కీలకంగా మారిందన్నారు. గురువారం సైబరాబాద్ కమిషనరేట్‌లో ‘కమ్యూనిటీ సీసీటీవీ ప్రాజెక్ట్-2015తో పాటు మరో మూడు సీసీటీవీ ప్రాజెక్టుల గురించి ఆయన వివరించారు. నేరాలు జరిగే కాలనీలు, ముఖ్యమైన అంతర్గత కూడళ్లు, జనసమర్థ ప్రాంతాల్లో కమ్యూనిటీ సీసీటీవీ ప్రాజెక్ట్ చేపట్టేందుకు ఆరు నెలలుగా సెంటర్ ఫర్ గుడ్ గవర్నెస్ (సీజీజీ) సంస్థ సహకారంతో కసరత్తు చేస్తున్నామన్నారు. సీసీటీవీల ఏర్పాటుకు మాత్రమే కాలనీవారిపై భారం పడుతుందని, ఎక్కువ మొత్తాన్ని పరిశ్రమలు, వాణిజ్య సంస్థలు, సంపన్న వర్గాల నుంచి ఆర్థిక సహకారం తీసుకుంటున్నామని చెప్పారు. 11 సబ్ డివిజన్ల పరిధిలో కమ్యూనిటీ సీసీటీవీలను ఏసీపీలు డివిజన్లో, డీసీపీలు జోన్లు, కమిషనరేట్‌లోని కమాండ్ కంట్రోల్లో వి జువల్స్ చూసేందుకు వీలుంటుందన్నారు. బాలానగర్ డివిజన్లో ఇప్పటికే కమ్యూనిటీ సీసీటీవీ ప్రాజెక్ట్ కోసం ఆయా సంస్థలు, వ్యక్తుల నుంచి రూ.1.34 కోట్ల విరాళాలు ఇచ్చేందుకు మందుకు వచ్చాయన్నారు. ఈ నిధులతో బాలానగర్ జోన్ పరిధిలో 250 సీసీటీవీలు అమర్చేందుకు వీలుంటుందన్నారు. ఇప్పటికే రూ.28 లక్షల చెక్కులను ఆయా సంస్థల ప్రతినిధులు తమకు అందించారన్నారు. ఐటీ కారిడార్‌లో... ఐటీ కారిడార్‌లో సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ సహకారంతో ఇప్పటికే 47 సీసీ కెమెరాలు అమర్చామని, టీఎస్ఐఐసీ కేటాయించిన రూ. 5 కోట్లతో, మరో 85 కెమెరాలను,75 కిలోమీటర్ల ఆప్టిక్ ఫైబర్ కేబుల్ పనులు రక్షా సెక్యూరిటీ సంస్థ చేపట్టనుందన్నారు. 70 ఫిక్స్డ్ కెమెరాలు, 15 పీటీజెడ్ కెమెరాలు అమర్చనున్నారన్నారు. వీటిలో 2 మెగా ఫిక్సెల్, నైట్ విజన్ కెమెరాలుంటాయని, సోలార్ బ్యాక్అప్, 30 రోజుల స్టోరేజీ, 5 ఏళ్ల వారంటీ ఉంటుందన్నారు. రూ. 50 కోట్ల నిధులు.. సేఫ్ అండ్ స్మార్ట్ సిటీలో భాగంగా సైబరాబాద్ కమిషనరేట్‌లో సీసీ కెమెరాలు అమర్చేందుకు 2014-15, 2015-16 లలో రాష్ట్ర ప్రభుత్వం రూ. 50 కోట్లు మంజూరు చేసిందని కమిషనర్ తెలిపారు. సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సహకారంతో సైబరాబాద్ కమిషనరేట్‌లో 1000 ప్రధాన జంక్షన్లు, 5 జాతీయ రహదారులు, 10 రాష్ట్ర రహదారులపై 800 నుంచి 1000 సీసీటీవీలు అమర్చేందుకు రంగం సిద్ధం చేశామన్నారు. వీటికి తర్వలోనే టెండర్లు పిలుస్తామన్నారు. సైబరాబాద్ కమిషన రేట్ కార్యాలయంపై మరో రెండు అంతస్తులు నిర్మించేందుకు రూ.7 కోట్లు మంజూరు అయ్యాయని కమిషనర్ చెప్పారు. ఇక్కడ కమాండ్ కంట్రోల్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. అన్ని పోలీస్ స్టేషన్లలో సీసీటీవీలు.. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని 44 పోలీస్ స్టేషన్లలో 6-12 సీసీటీవీలు అమర్చనున్నారు. సబ్ డివిజన్, జోన్, కమిషనరేట్‌లో వాటిని అనుసంధానం చేస్తారు. ఇందుకు రూ. 60 లక్షలు మంజూరయ్యాయని కమిషనర్ తెలిపారు. సీసీ కెమెరాల ప్రాముఖ్యత... నేరాలు ఛేదించడంలో సీసీ కెమెరాల విజువల్స్ ఎంతో కీలకంగా మారుతున్నాయని కమిషనర్ ఆనంద్ అన్నారు. కొల్లూరులోని ఓ పాఠశాల ద్వారం ముందు అమర్చిన సీసీ కెమెరా విజువల్స్ ద్వారా మాదాపూర్‌లో అభయ రేప్ కేసును ఛేదించామన్నారు. మహేష్ బ్యాంక్‌లోని కెమెరా విజువల్స్ ఆధారంగా బంగారం దొంగిలించిన ఇంటి దొంగను పట్టుకున్నారు. పెద్దింటి గొల్ల దోపిడీ గ్యాంగ్, బైక్‌లు తగలబెట్టిన నిందితులను సీసీ కెమెరాలే పట్టించాయన్నారు. సీసీటీవీ టెక్నికల్ కన్సల్టెన్సీ జీవన్‌రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో జూబ్లీహిల్స్‌లో కమాండ్ సెంటర్ ఉంటుందని, సైబరాబాద్ కమిషనరేట్‌లో మరో కమాండ్ సెంటర్ ఉంటుందన్నారు. ఈ రెండింటినీ అనుసంధానం చేసి సేవలు అందిస్తారని చెప్పారు. కార్యక్రమంలో సీజీజీ ప్రతినిధి షబ్బీర్, మాదాపూర్ అడిషనల్ డీసీపీ మద్దిపాటి శ్రీనివాస్, బాలానగర్ ఏసీపీ నంద్యాల నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పోలీసు పోలీసు... నో పోలీసు
హైదరాబాద్ నగర పోలీసులు అంతర్జాతీయ ఖ్యాతీ నార్జించాలి.... హైదరాబాద్ సేఫ్ అండ్ స్మార్ట్ సిటీ కావాలి ... తెలంగాణలో ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థ ఏర్పడాలి... మూడు నెలల్లో అన్ని ప్రాంతాలలో అత్యాధునిక సీసీ కెమెరాలు.... గ్రేటర్ హైదరాబాద్ మహానగరాన్ని సేఫ్ అండ్ స్మార్ట్ సిటీ కార్యక్రమం (ఆగస్టు 14)లో భాగంగా మొదటి విడతలో 100 ఇన్నోవాలు, 300 బైక్‌లను పోలీసు శాఖకు అందజేస్తు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నమాటలివి. 100 ఇన్నోవాలు, 300 బైకులపై పోలీసులు నిరంతరం గస్తీతో తమకిక గుండెలమీద చేయి వేసుకుని పడుకోవచ్చనుకున్నారు నగరవాసులు. అయితే ప్రజల నమ్మకాన్ని ఖాకీలు మరోసారి వమ్ము చేశారు. సీనియర్ నటి శ్రీలక్ష్మి గొలుసు చోరీ ఉదంతమే పోలీసుల నిర్లక్ష్యానికి నిలువుటద్దం. అంత పోలీసుల గస్తీలోను, కెమెరాల పహారాలోను ఆమె మెడలోని బంగారపు గొలుసును దుండగులు తెంపుకుని పోయారు. ఆ ఘటన నుంచి తేరుకునే లోపే దుండగులు పరారైయ్యారు. స్థానికులు వెంటనే స్పందించి దుండగులను పట్టుకునేందుకు ప్రయత్నించిన అప్పటికే వారు మామమైయ్యారు. శ్రీలక్ష్మి షాక్ నుంచి తెరుకుని పోలీస్, పోలీస్ అని పిలిచినా పలికే నాధుడే లేడు. పెట్రోలింగ్ చేస్తున్న పోలీసుల కోసం 100 డయల్ చేసినా అటువైపు నుంచి స్పందన శూన్యం. చేసేదీలేక ఆమె ఎస్ఆర్ నగర్ పోలీసు స్టేషన్ దాకా వెళ్లి ఫిర్యాదు చేశారు. పోలీసులు ఎట్టకేలకు కేసు నమోదు చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఇంత అట్టహాసంగా పెట్రోలింగ్ కోసం అంటూ వందల ఇన్నోవా... వందల బైకులు తీసుకువచ్చినా పోలీసులు స్పందనలో మార్పులేకపోవడం శోచనీయం.అదికాక ఇన్నోవా డ్రైవర్లు, నిర్వహణదారులకు ఏపీ పోలీసు అకాడమితోపాటు అడ్మినిష్ట్రేన్ స్టాఫ్ కాలేజీలో శిక్షణ ఇప్పించారు. అంతేకాకుండా ఆ వాహనాల్లో ఏసీ, జీపీఎస్ సిస్టమ్, ట్యాబెట్లు పీసీలు, కెమెరాలు, వీహెచ్ఎఫ్ సెట్స్ వంటి అత్యాధునిక సౌకర్యాలు కల్పించారు. ఇన్ని చేసినా స్పందనారాహిత్యంతో పోలీసు వ్యవస్థ అభాసుపాలవుతోంది.హైదరాబాద్ మహానగరంలో గొలుసు చోరీలు అత్యధికంగా జరుగుతున్నాయి. దీంతో బాధితులంతా పోలీసులను ఆశ్రయిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామంటూన్నారు. కానీ ఆ కేసుల్లో మాత్రం పురోగతి ఎండమావిని తలపిస్తోంది. రక్షక భటులు ఇకనైనా మేల్కోపోతే సామాన్యులకు తిప్పలు తప్పవు. -
'పేకాట క్లబ్ అనే మాట వినపడకూడదు'
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థ ఏర్పడాలని ఆ రాష్ట్ర సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. గురువారం నగరంలోని ట్యాంక్ బండ్‌పై హైదరాబాద్ సేఫ్ అండ్ స్మార్ట్ సిటీలో భాగంగా.. మొదటి విడతలో పోలీస్‌శాఖకు 300 బైక్‌లు, 100 ఇన్నోవాలను పోలీసు శాఖకు తెలంగాణ సీఎం కేసీఆర్ అందజేశారు. అనంతర కేసీఆర్ మాట్లాడుతూ... హైదరాబాద్ నగరం అంతట మూడు నెలల్లో సీసీ కెమెరా నిఘా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అధునాతన సౌకర్యాలతో పోలీస్ హెడ్ క్వార్టర్స్ నిర్మిస్తామన్నారు. అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్ పోలీసింగ్ వ్యవస్థను రూపుదిద్దుతామన్నారు. హైదరాబాద్‌లో పేకాట క్లబ్ అనే మాట వినపడకూడదని... అందుకు తగు విధంగా చర్యలు తీసుకుంటామని కేసీఆర్ చెప్పారు. వాహనాలను రికార్డు స్థాయిలో సమకూర్చిన పోలీసులకు ఆయన ఈ సందర్బంగా అభినందనలు తెలిపారు. స్టేషన్ పరిధితో సంబంధం లేకుండా సర్వీస్ చేయాలని పోలీసులకు కేసీఆర్ హితబోధ చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర హోం శాఖ మంత్రి నాయిని నర్శింహరెడ్డితోపాటు తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ, హైదరాబాద్, సైబరాబాద్ పోలీసు కమిషనర్లు మహేందర్ రెడ్డి, సీవీ ఆనంద్లతోపాటు ఇతర ఉన్నతాధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. నాయని నర్సింహరెడ్డి మాట్లాడుతూ.... పోలీస్ వ్యవస్థపై ప్రజలలో ఉన్న అపోహలను పారదోలాలని హోం మంత్రి నాయిని నర్శింహారెడ్డి హైదరాబాద్, సైబరాబాద్ నగరాల పోలీసులకు సూచించారు. అలాగే జంట నగరాలలో నేర నిరోధక వ్యవస్థ నిర్మూలనకు కృషి చేయాలని హితవు పలికారు. -
భద్రతలో భాగస్వాములు కండి
సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోండి వ్యాపార సంస్థలకు నగర పోలీసు కమిషనర్ పిలుపు మెహిదీపట్నం: నగరంలోని అన్ని వ్యాపార సంస్థలు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుని హైదరాబాద్ భద్రతలో భాగస్వాములు కావాలని నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. నగరాన్ని సేఫ్ అండ్ స్మార్ట్‌సిటీగా మార్చేందుకు కృషి చేస్తున్నామని, దానికి ప్రజలు సహ కరించాలని కోరారు. శనివారం మెహిదీపట్నంలోని క్రి స్టల్గార్డెన్లో ‘మన భద్రత మన చేతుల్లోనే’ పేరిట నిర్వహించిన కార్యక్రమంలో కమిషనర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటు ఆవశ్యకతను వివరించారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ప్రపంచానికి చాటి చెప్పాలంటే భద్రతపై అందరికి భరోసా కల్పించాలన్నారు. నేరాలను నిరోధించాలంటే నగరంలోని రద్దీ, సమస్యాత్మక ప్రాంతాలు, వ్యాపార సముదాయాల్లో విధిగా ఆయా సంస్థలు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. పోలీసుల సూచనల మేరకు కెమెరాలు బిగించుకోవాలన్నారు. ప్రతి సంస్థ బయటకు వెళ్లే దారిలో 50 ఫీట్లు రోడ్డును కవర్ చేయడంతో పాటు 120 డిగ్రీల కోణంలో కెమెరాలు అమర్చాలన్నారు. వ్యాపార ధోరణితో కాకుండా సామాజిక కోణంలో ప్రతి దుకాణ యాజమాని సీసీ కెమెరాల ఏర్పాటుకు నడుం బిగించాలన్నారు. అలాగే, వ్యాపార సముదాయాలు లేని ప్రాంతల్లో జీహెచ్ఎంసీ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తోందన్నారు. ఇందుకు ఈ నెల 24న జీహెచ్ఎంసీలో అన్ని విభాగాలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తున్నట్టు కమిషనర్ మహేందర్‌రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ అంజనీకుమార్, వెస్ట్‌జోన్ డీసీపీ సత్యనారాయణ, టాస్క్‌ఫోర్స్ అడిషనల్ డీసీపీ కోటిరెడ్డి, ఏసీపీలు శ్రీనివాస్, రాంభూపాల్‌రెడ్డి, ఉదయ్‌కుమార్‌తో పాటు పలువురు ఇన్స్పెక్టర్లు, వ్యాపార సంస్థల యజమానులు పాల్గొన్నారు. బోనాలకు భారీ బందోబస్తు... ఆది, సోమవారాల్లో లాల్‌దర్వాజాతో పాటు పాబస్తీలోని ఇతర ప్రాంతాల్లో జరిగే బోనాలకు 6 వేల మందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు కమిషనర్ మహేందర్‌రెడ్డి తెలిపారు. భక్తులు ఆధ్యాత్మిక వాతావరణంలో బోనాల పండుగను ఘనంగా జరుపుకోవాలన్నారు.