‘సేఫ్’ సిటీకి సీసీటీవీలు కీలకం | CCTV cameras are important for safe city | Sakshi
Sakshi News home page

‘సేఫ్’ సిటీకి సీసీటీవీలు కీలకం

Published Fri, May 29 2015 1:38 AM | Last Updated on Sun, Sep 3 2017 2:50 AM

‘సేఫ్’ సిటీకి సీసీటీవీలు కీలకం

‘సేఫ్’ సిటీకి సీసీటీవీలు కీలకం

- దాతల సహకారంతో కమ్యూనిటీ సీసీటీవీ ప్రాజెక్ట్
- సీసీ కెమెరాల కోసం రూ. 50 కోట్లు కేటాయించిన ప్రభుత్వం
- అన్ని పోలీస్ స్టేషన్లలో సీసీటీవీలు
- సైబరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్
గచ్చిబౌలి:
‘సేఫ్ ఆండ్ స్మార్ట్ సిటీ’ సాకారం కావాలంటే సీసీటీవీలు అమర్చడం తప్పనిసరి అని సైబరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు.  నేరాలను ఛేదించడంలో సీసీటీవీల పాత్ర కీలకంగా మారిందన్నారు. గురువారం సైబరాబాద్ కమిషనరేట్‌లో ‘కమ్యూనిటీ సీసీటీవీ ప్రాజెక్ట్-2015తో పాటు మరో మూడు సీసీటీవీ ప్రాజెక్టుల గురించి ఆయన వివరించారు. నేరాలు జరిగే కాలనీలు, ముఖ్యమైన అంతర్గత కూడళ్లు, జనసమర్థ  ప్రాంతాల్లో కమ్యూనిటీ సీసీటీవీ ప్రాజెక్ట్ చేపట్టేందుకు ఆరు నెలలుగా సెంటర్ ఫర్ గుడ్ గవర్నెస్ (సీజీజీ) సంస్థ సహకారంతో కసరత్తు చేస్తున్నామన్నారు.

సీసీటీవీల ఏర్పాటుకు మాత్రమే కాలనీవారిపై భారం పడుతుందని, ఎక్కువ మొత్తాన్ని పరిశ్రమలు, వాణిజ్య సంస్థలు, సంపన్న వర్గాల నుంచి ఆర్థిక సహకారం తీసుకుంటున్నామని చెప్పారు. 11 సబ్ డివిజన్ల పరిధిలో కమ్యూనిటీ సీసీటీవీలను ఏసీపీలు డివిజన్‌లో, డీసీపీలు జోన్‌లు, కమిషనరేట్‌లోని కమాండ్ కంట్రోల్‌లో వి జువల్స్ చూసేందుకు వీలుంటుందన్నారు. బాలానగర్ డివిజన్‌లో ఇప్పటికే కమ్యూనిటీ సీసీటీవీ ప్రాజెక్ట్ కోసం ఆయా సంస్థలు, వ్యక్తుల నుంచి రూ.1.34 కోట్ల విరాళాలు ఇచ్చేందుకు మందుకు వచ్చాయన్నారు. ఈ నిధులతో బాలానగర్ జోన్ పరిధిలో 250 సీసీటీవీలు అమర్చేందుకు వీలుంటుందన్నారు. ఇప్పటికే రూ.28 లక్షల చెక్కులను ఆయా సంస్థల ప్రతినిధులు తమకు అందించారన్నారు.

ఐటీ కారిడార్‌లో...
ఐటీ కారిడార్‌లో సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ సహకారంతో ఇప్పటికే 47 సీసీ కెమెరాలు అమర్చామని, టీఎస్‌ఐఐసీ కేటాయించిన రూ. 5 కోట్లతో, మరో 85 కెమెరాలను,75 కిలోమీటర్ల ఆప్టిక్ ఫైబర్ కేబుల్ పనులు రక్షా సెక్యూరిటీ సంస్థ చేపట్టనుందన్నారు. 70 ఫిక్స్‌డ్ కెమెరాలు, 15 పీటీజెడ్ కెమెరాలు అమర్చనున్నారన్నారు. వీటిలో 2 మెగా ఫిక్సెల్, నైట్ విజన్ కెమెరాలుంటాయని, సోలార్ బ్యాక్‌అప్, 30 రోజుల స్టోరేజీ, 5 ఏళ్ల వారంటీ ఉంటుందన్నారు.

రూ. 50 కోట్ల నిధులు..
సేఫ్ అండ్ స్మార్ట్ సిటీలో భాగంగా సైబరాబాద్ కమిషనరేట్‌లో సీసీ కెమెరాలు అమర్చేందుకు 2014-15, 2015-16 లలో రాష్ట్ర ప్రభుత్వం రూ. 50 కోట్లు మంజూరు చేసిందని కమిషనర్ తెలిపారు. సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సహకారంతో సైబరాబాద్ కమిషనరేట్‌లో 1000 ప్రధాన జంక్షన్లు, 5 జాతీయ రహదారులు, 10 రాష్ట్ర రహదారులపై 800 నుంచి 1000 సీసీటీవీలు అమర్చేందుకు రంగం సిద్ధం చేశామన్నారు. వీటికి తర్వలోనే టెండర్లు పిలుస్తామన్నారు. సైబరాబాద్ కమిషన రేట్ కార్యాలయంపై మరో రెండు అంతస్తులు నిర్మించేందుకు రూ.7 కోట్లు   మంజూరు అయ్యాయని కమిషనర్ చెప్పారు. ఇక్కడ కమాండ్ కంట్రోల్‌ను ఏర్పాటు చేస్తామన్నారు.

అన్ని పోలీస్ స్టేషన్లలో సీసీటీవీలు..
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని 44 పోలీస్ స్టేషన్లలో 6-12 సీసీటీవీలు అమర్చనున్నారు. సబ్ డివిజన్, జోన్, కమిషనరేట్‌లో వాటిని అనుసంధానం చేస్తారు. ఇందుకు రూ. 60 లక్షలు మంజూరయ్యాయని కమిషనర్ తెలిపారు.

సీసీ కెమెరాల ప్రాముఖ్యత...
నేరాలు ఛేదించడంలో సీసీ కెమెరాల విజువల్స్ ఎంతో కీలకంగా మారుతున్నాయని కమిషనర్ ఆనంద్ అన్నారు.  కొల్లూరులోని ఓ పాఠశాల ద్వారం ముందు అమర్చిన సీసీ కెమెరా విజువల్స్ ద్వారా మాదాపూర్‌లో అభయ రేప్ కేసును ఛేదించామన్నారు. మహేష్ బ్యాంక్‌లోని కెమెరా విజువల్స్ ఆధారంగా బంగారం దొంగిలించిన  ఇంటి దొంగను పట్టుకున్నారు. పెద్దింటి గొల్ల దోపిడీ గ్యాంగ్, బైక్‌లు తగలబెట్టిన నిందితులను సీసీ కెమెరాలే పట్టించాయన్నారు.  సీసీటీవీ టెక్నికల్ కన్సల్టెన్సీ జీవన్‌రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో  జూబ్లీహిల్స్‌లో కమాండ్ సెంటర్ ఉంటుందని, సైబరాబాద్ కమిషనరేట్‌లో మరో కమాండ్ సెంటర్ ఉంటుందన్నారు. ఈ రెండింటినీ అనుసంధానం చేసి సేవలు అందిస్తారని చెప్పారు.  కార్యక్రమంలో సీజీజీ ప్రతినిధి షబ్బీర్, మాదాపూర్ అడిషనల్ డీసీపీ మద్దిపాటి శ్రీనివాస్, బాలానగర్ ఏసీపీ నంద్యాల నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement