సాక్షి, అమరావతి : నేరాల నియంత్రణ, మెరుగైన భద్రతకు సీసీటీవీ కెమెరాలు అత్యావశ్యకమని దేశంలోని పట్టణ ప్రాంత ప్రజలు గాఢంగా విశ్వసిస్తున్నారు. అందుకే దేశవ్యాప్తంగా నగరాలు, పట్టణాల ప్రజలు తమ నివాస ప్రాంతాల్లో వీటి ఏర్పాటుకు మొగ్గుచూపుతున్నారు. కాలనీలు, అపార్ట్‌మెంట్లు, ఇతర నివాస ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటుచేసుకోవడం ఐదేళ్లుగా భారీగా పెరుగుతోందని ఫోర్బ్స్ సంస్థ ‘పోలీసింగ్ ఇన్ ఇండియా–2023’ నివేదిక వెల్లడించింది.
ఆధునిక సమాచార సాంకేతిక పరిజ్ఞానం విస్తతితో భద్రత, వ్యక్తిగత ప్రైవసీ అనే రెండింటిలో ఎటువైపు మొగ్గుచూపాలి అనే అంశంపై ఐదేళ్ల క్రితం వరకు దేశ ప్రజల్లో ఓ సందిగ్థత ఉండేదని ఆ నివేదిక పేర్కొంది. కాలనీలు, నివాస ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటుచేయడం తమ వ్యక్తిగత గోప్యతకు భంగకరమని భావించేవారు. బహిరంగ ప్రదేశాల్లో పోలీసు, మున్సిపల్ శాఖలు సీసీటీవీ కెమెరాలు ఏర్పాటుచేస్తున్నారు.
కాబట్టి తమ నివాస ప్రాంతాల్లో ఇవి వద్దనే భావన ఉండేది. కానీ, నగర, పట్టణ ప్రాంత ప్రజల్లో ఆలోచనా దృక్పథం ఐదేళ్లలో మారిందని ఆ నివేదిక వెల్లడించింది. ప్రజలు తమ నివాసాలకు సీసీటీవీ కెమెరాలు ఏర్పాటుచేసుకుంటున్నారని తెలిపింది. నివేదికలోని ప్రధాన అంశాలు ఇవీ..
- దేశంలో నగరాలు, ప్రధాన పట్టణ ప్రాంతాల్లో 51 శాతం మంది ప్రజలు తమ నివాస ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటుచేసుకున్నారు. నగరాల్లో 61 శాతం, ప్రధాన పట్టణాల్లో 46 శాతం ప్రాంతాల్లో ఇవి ఉన్నాయి.
- నగరాలు, పట్టణ ప్రాంతాల్లోని కాలనీల్లో సీసీటీవీ కెమెరాల ఏర్పాటులో కర్ణాటక మొదటిస్థానంలో ఉండగా రెండు, మూడు స్థానాల్లో హరియాణా, ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి. కర్ణాటకలో 68శాతం, హరియాణాలో 67శాతం, ఆంధ్రప్రదేశ్‌లో 33శాతం ప్రాంతాల్లో వీటిని ఏర్పాటుచేసుకున్నారు.
- ప్రభుత్వం అత్యధికంగా ఈ కెమెరాలు ఏర్పాటుచేసిన వాటిలో ఢిల్లీ మొదటిస్థానంలో ఉంది. ఇక్కడ 54 శాతం ప్రాంతాల్లో ప్రభుత్వమే వీటిని ఏర్పాటుచేసింది.
- అలాగే, అత్యధిక ఆదాయ వర్గాల ప్రాంతాల్లో 73 శాతం, ఎగువ మధ్యతరగతి వర్గాల ప్రాంతాల్లో 63 శాతం, మధ్య తరగతి వర్గాలుండే చోట 45 శాతం, అంతకంటే తక్కువ ఆదాయ వర్గాల ప్రాంతాల్లో 28శాతం వరకు ఈ కెమెరాలు ఉన్నాయి.
- సీసీటీవీ కెమెరాలతో ‘ఫేషియల్ రికగ్నైజేషన్ టెక్నాలజీ (ఎఫ్‌ఆర్‌టీ) పోలీసులకు అందుబాటులోకి వస్తోంది. దాంతో నేరాల నియంత్రణ, కేసుల దర్యాప్తు మరింత సమర్థంగా నిర్వర్తించేందుకు ఆ శాఖకు ఇది ఉపయోగపడుతోంది. ఈ కెమెరాలు లేని ప్రాంతాల్లో కంటే ఉన్న ప్రాంతాల్లో నేరాలు 30 శాతం తగ్గినట్లు.. కేసుల ఛేదన 28 శాతం పెరిగినట్లు నివేదిక వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment