న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో రేపు (ఫిబ్రవరి 5) మొత్తం 70 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. పొలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభంకానుంది. ఒక కోటీ 55 లక్షల మంది ఓటర్లు ఢిల్లీకి నూతన ముఖ్యమంత్రిని ఎన్నుకోనున్నారు. ఎన్నికలకు సంబంధించిన సన్నాహాలు ఇప్పటికే పూర్తయ్యాయి. పోలీసులు, భద్రతా దళాలను ఢిల్లీ అంతటా మోహరించారు.
ఢిల్లీ పోలీసులు ఆదివారం రాత్రంతా సున్నితమైన ప్రాంతాల్లో ఫ్లాగ్ మార్చ్‌లు నిర్వహించారు. 35 వేలకు పైగా పోలీసులను ఎన్నికల విధుల్లో నియమించారు. 220 కంపెనీల కేంద్ర రిజర్వ్ దళాలను కూడా భద్రత కోసం రంగంలోకి దింపారు. 19 వేల మంది హోమ్ గార్డ్ సిబ్బంది కూడా ఎన్నికల విధుల్లో పాల్గొననున్నారు. ఆదివారం సాయంత్రం ప్రచారం ముగిసిన తర్వాత బయటి వ్యక్తులు ఢిల్లీ విడిచి వెళ్లాలని పోలీసు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. అక్రమంగా తిరుగుతున్న పలు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఓటింగ్ జరగనుంది. 83.76 లక్షల మంది పురుషులు, 72.36 లక్షల మంది మహిళలు, 1,267 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఓటు వేయనున్నారు. దివ్యాంగ ఓటర్ల కోసం 733 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈసారి ఢిల్లీలో గరిష్ట ఓటింగ్ జరిగేలా చూసేందుకు, ఎన్నికల సంఘం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. ఇందుకోసం ఎన్నికల సంఘం క్యూ మేనేజ్‌మెంట్ సిస్టమ్ యాప్‌ను ప్రారంభించింది. దీని ద్వారా ఓటర్లు తమ పోలింగ్ బూత్ వద్ద ఎంత జనసమూహం ఉందో సులభంగా తెలుసుకోవచ్చు.
ఈసారి ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ మధ్య గట్టి పోటీ నెలకొంది. దీనికి తోడు కాంగ్రెస్‌కు ఇక్కడున్న బలమైన ఉనికి ఈ ఎన్నికలను త్రిముఖ పోరుగా మార్చింది. హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, జేపీ నడ్డాతో పాటు పలువురు ముఖ్యమంత్రులు బీజేపీ తరపున ప్రచారం చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ సీఎం అతిషి నియోజకవర్గంలో మూడు ర్యాలీలు నిర్వహించారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కల్కాజీ, కస్తూర్బా నగర్‌లలో రోడ్ షో చేశారు.
ఇది కూడా చదవండి: 12న ప్రధాని మోదీ అమెరికా పర్యటన.. ట్రంప్‌తో భేటీ?
Comments
Please login to add a commentAdd a comment