సాక్షి, హైదరాబాద్: గ్రిల్స్, ఇంటి తలుపునకు వేసిన తాళాన్ని చాకచక్యంగా తొలగించి ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు ఇంట్లో దాచిన బీరువా తాళాలు తీసుకుని అందులో ఉన్న 31తులాల బంగారం, రూ.2.23లక్షల నగదు ఎత్తుకెళ్లిన సంఘటన ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. స్థానికులు, ఇన్‌స్పెక్టర్ రాంచంద్రారెడ్డి కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీనివాసాచారి అనే వ్యక్తి బాకారం వెస్లీ చర్చి ఎదురుగా ఉన్న తన అమ్మమ్మ ఇంట్లో ఆర్డర్‌పై బంగారు ఆభరణాలను తయారు చేసేవాడు. మౌళాలి ఎన్‌ఎఫ్‌సి కాలనీలో ఉండే అతను ప్రతిరోజు ఇక్కడికి వచ్చి వెళ్లేవాడు. ప్రస్తుతం ఆ ఇంట్లో ఎవరూ ఉండటం లేదు. పైన ఉన్న గదిని బ్యాచిలర్స్‌కు అద్దెకు ఇచ్చారు. ఇంటి ముందు ఉన్న షట్టర్‌లో బంగారు ఆభరణాలు తయారుచేసి బంగారు ఆభరణాలు, నగదు ఇంట్లోని బీరువాలో దాచి తాళం వేసి తాళం చెవులను ఇంట్లోనే ఒక రహస్యంగా ఉంచి తలుపులు, గ్రిల్స్‌కు తాళం వెళ్లేవాడు.
శనివారం రాత్రి ఇంటికి తాళం వేసి వెళ్లిన శ్రీనివాసాచారి సోమవారం ఉదయం వచ్చి చూసేసరికి ఇంటి తలుపులు తెరచి ఉండటమేగాక, ఇంటి నిండా కారంపొడి చల్లిఉంది. తాను దాచి ఉంచిన బీరువా తాళం చెవి కనిపించలేదు. నాలుగు సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ వాటి డీబీఆర్ బాక్సు సైతం కనిపించకపోవడంతో ముషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చిక్కడపల్లి ఏసీపీ ప్రదీప్‌కుమార్ రెడ్డి, ఇన్‌స్పెక్టర్ రాంచంద్రారెడ్డి, డిఎస్‌ఐ బాలరాజు, క్లూస్ టీం సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. వినియోగదారులు ఆభరణాల కోసం ఇచ్చిన బంగారం, తన అమ్మమ్మ బంగారం కలిపి 31తులాలు, రూ.2.23 లక్షల నగదు చోరీకి గురైనట్లు తెలిపాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment