దేశవ్యాప్తంగా కొన్నేళ్ల క్రితం వరకు దోపిడీలు, దొంగతనాలు, బ్యాంకు లూటీలు తదితర నేరాలు భారీ స్థాయిలో జరిగేవి. టెక్నాలజీ పెరగడం, కమ్యూనికేషన్ వ్యవస్థ విస్తరించడంతో దోపిడీ గ్యాంగ్‌లు రూట్‌మార్చి ఆర్థిక నేరాల ద్వారా వందల కోట్లు సునాయసంగా కొట్టేస్తున్నాయి. గడిచిన నాలుగేళ్లలో రాష్ట్రంలో దోపిడీ, దొంగతనాలు తగ్గి ఆర్థిక నేరాలు విపరీతంగా పెరిగిపోయాయి. కొన్ని చోట్ల ప్రతీ ఏటా ఏకంగా 100% పెరిగితే మరికొన్ని చోట్ల 50% పెర గడం ఆందోళన కలిగిస్తోంది. ఇలా రాష్ట్రంలో 2017 ఒక్క ఏడాదిలోనే రూ.2,739 కోట్ల మేర ప్రజలు ఆర్థిక నేరస్తుల ద్వారా నష్టపోయినట్లు రాష్ట్ర నేరపరిశోధన విభాగం తేల్చింది.
వేల కోట్ల దోపిడీ... సాధారణ దోపిడీలు, దొంగతనాలు కాకుండా బ్యాంక్ మోసాలు, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్ షిప్, చిట్స్, మనీ సర్క్యులేషన్ స్కీములు, టెలీ మార్కెటింగ్, క్రెడిట్ కార్డ్ ఫ్రాడ్, హెల్త్‌కేర్ ఫ్రాడ్స్, ఇన్యూరెన్స్ ఫ్రాడ్స్, సాఫ్ట్‌వేర్ పైరసీ, హక్కు సంబంధిత మోసాలు, డిమాండ్ డ్రాఫ్ట్, ఎఫ్‌డీ రిసీట్, వీడియో పైరసీ, బహుమతులు, లక్కీ లాటరీ మోసాలు, ఎంప్లాయిమెంట్ చీటింగ్, సైబర్ క్రైమ్.. ఇలా అనేక రకాల వైట్ కాలర్ నేరాలు ఆర్థిక నేరాల్లో కీలకంగా మారుతూ వస్తున్నాయి. వీటి ద్వారా వందల నుంచి వేల కోట్ల వరకు మాఫియా దోపిడీకి పాల్పడుతోంది.
అప్రమత్తత, ఆలోచన తప్పనిసరి..
ఆర్థిక నేరాల్లో మోసపోతున్న ప్రజలకు అప్రమత్తతే శ్రీరామ రక్ష అని సీఐడీ ఉన్నతాధికారులు సూచిస్తున్నారు. డిపాజిట్లు, లాటరీలు, చిట్‌ఫండ్, బ్యాంకింగ్, క్రెడిట్ కార్డు, షేర్ మార్కెటింగ్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పేర్కొంటున్నారు.
ఒకటికి రెండుసార్లు ప్రకటనలిస్తున్న సంస్థ, దాని వెనకున్న జిమ్మిక్కులను అర్థం చేసుకోవాలని, కంపెనీ సంబంధించిన వివరాలు, అందులో తక్కువ కాలంలో ఎక్కువ డబ్బు సంపాదిస్తామని చెప్పే వాటిపై జాగ్రత్త వహించాలని సీఐడీ అవగాహన కల్పిస్తోంది. ఆర్థిక నేరాల్లో నిందితులు టెక్నాలజీని వాడుకుని మోసం చేస్తున్న కేసులే ఎక్కువగా ఉంటున్నాయని సీఐడీ అభిప్రాయపడింది. ఎక్కడో ఇతర దేశాల్లో ఉంటూ ఫోన్‌కాల్స్, ఈ–మెయిల్స్, లాటరీ పేరుతో బురిడీ కొట్టిస్తున్నారని, వీటి వల్లే నష్టం వందల కోట్లకు చేరుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
సైబరాబాద్‌కు మొదటిస్థానం...
రాష్ట్రవ్యాప్తంగా అన్ని పోలీస్ యూనిట్లలో ఆర్థిక నేరాల నమోదులో సైబరాబాద్ కమిషనరేట్ మొదటి స్థానంలో ఉంది. రెండో స్థానంలో హైదరాబాద్, మూడో స్థానంలో రాచకొండ కమిషనరేట్లు ఉన్నాయి. రాజధాని ప్రాంతం చుట్టూ వైట్‌కాలర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. కేసులు నమోదవుతున్నా వాటిని ఛేదించడంలో సాంకేతిక సమస్యలు, సిబ్బంది కొరత, ట్రాకింగ్ లోపంతో నిందితులను పట్టుకోవడం కష్టసా«ధ్యమవుతోందని అధికారులు పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment