సైబరాబాద్‌లో స్టూడెంట్‌ పోలీస్‌ క్యాడెట్‌ | SPP In hyderabad | Sakshi
Sakshi News home page

సైబరాబాద్‌లో స్టూడెంట్‌ పోలీస్‌ క్యాడెట్‌

Published Mon, Aug 13 2018 9:23 AM | Last Updated on Fri, Nov 9 2018 4:32 PM

SPP In hyderabad - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: విద్యార్థులు నేరాల బాట పట్టకుండా సమాజాన్ని సానుకూల ధృక్పథంతో చూడాలనే ఉద్దేశంతో సైబరాబాద్‌ పోలీసులు ‘స్టూడెంట్‌ పోలీసు క్యాడెట్‌’(ఎస్‌పీసీ) ప్రాజెక్టును అమలుచేసే దిశగా అడుగులు వేస్తున్నారు. చెడు అలవాట్లకు దూరంగా సివిల్‌ డ్రెస్‌లో ఉన్న పోలీసుల్లా తీర్చిదిద్దితే ఎక్కడా ఎటువంటి నేరాలకు అస్కారం ఉందడదనే భావనతో ఇప్పటికే తెలంగాణలోని ఆదిలాబాద్, నాగర్‌ కర్నూలు జిల్లాల్లో అమలుచేస్తున్న ఈ కార్యక్రమాన్ని సైబరాబాద్‌లోనూ అమలు చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా మియాపూర్, శివరాంపల్లి, మైలార్‌దేవ్‌పల్లిలోని మూడు ప్రభుత్వ పాఠశాలకు చెందిన విద్యార్థులకు గచ్చిబౌలిలోని సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయంలో ఎస్‌పీసీ ప్రాజెక్టుపై సోమవారం అవగాహన కల్పించనున్నారు. రెండేళ్ల వ్యవధి గల ఈ ప్రాజెక్టుకు ఎంపికైన ఎనిమిది, తొమ్మిదో తరగతి విద్యార్థులకు చట్టాలతో పాటు పోలీసింగ్‌ వ్యవస్థ, సమాజంలోని సామాజిక సమస్యలపై పూర్తి అవగాహన కలిగించనున్నారు. పోలీసులతో పాటు అటవీ, అగ్నిమాపకశాఖ, మహిళ, శిశు సంక్షేమ శాఖ, విద్యా విభాగాలకు చెందిన అధికారులు కూడా పాఠాలు బోధించనున్నారు. 

సమాజహితులుగా...
బ్యూరో ఆఫ్‌ పోలీస్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ తయారుచేసిన పాఠ్యాంశాల్లో భాగంగా ట్రాఫిక్‌ నియమాలతో పాటు రోడ్డు భద్రతపై విద్యార్థులకు అవగాహన కలిగిస్తారు. బాల్యవివాహలు, మహిళలు, పిల్లల భద్రతపై పాఠాలు చెబుతారు. అవినీతి నిరోధానికి పోలీసులు తీసుకుంటున్న చర్యలను వివరిస్తారు. ప్రకృతి విపత్తుల వేళ పౌరుడిగా వ్యవహరించాల్సిన తీరును కళ్లకు కట్టినట్లు చూపిస్తారు. చట్టాలపై అవగాహన కలిగిస్తారు. సమాజంలో పెరుగుతున్న నేరాలను నిరోధించేందుకు పోలీసులు తీసుకుంటున్న చర్యలు, నేరగాళ్లకు పడుతున్న శిక్షలను కూడా పూర్తి స్థాయిలో తెలియ చెబుతారు. కమ్యూనిటీ పోలీసింగ్‌ పనితీరును వివరిస్తారు. జీవితంలో కష్టాలు ఎదురొచ్చినప్పుడూ ఒత్తిడికి లోనవకుండా వ్యవహరించాల్సిన తీరు, టీమ్‌ స్పిరిట్‌తో నలుగురికి ఆదర్శంగా ఉండేలా తీర్చిదిద్దుతారు. నేషనల్‌ క్యాడెట్‌ కాప్స్‌ (ఎన్‌సీసీ) తరహాలో విద్యార్థులకు ఫిజికల్‌ ట్రైనింగ్‌ (అవుట్‌డోర్‌), స్టడీ క్లాసెస్‌ (ఇండోర్‌), జిల్లా రాష్ట్ర స్థాయిలో ఫీల్డ్‌ విజిట్స్‌ నిర్వహించనున్నారు.

ఒక్కో విద్యార్థికి రెండు జతల దుస్తులు ఒకటి ఫిజికల్‌ ట్రైనింగ్, మరొకటి పరేడ్‌ కోసం అందజేయనున్నారు. ఈ ప్రాజెక్టు కోసం ఎన్‌రోల్‌ చేసుకున్న విద్యార్థులకు గుర్తింపు కార్డులు కూడా జారీ చేయనున్నారు. అవసరమైతే  వలంటీర్లుగా వీరు సేవలను పోలీసులు ఉపయోగించుకోనున్నారు. 2010లో కేరళలోని 127  పాఠశాలల్లో అమలుచేసిన ఈ కార్యక్రమానికి మంచి స్పందన రావడంతో దేశవ్యాప్తంగా గతేడాది నుంచి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాల్లో చేయాలని సూచించింది. దీనిద్వారా విద్యార్థులు నేరబాట పట్టకుండా, ఉగ్రవాద భావజాలాల్లో చిక్కుకోకుండా ఉంటారని, సమాజంపై పూర్తిస్థాయి అవగాహన ఉంటుందని పేర్కొనడంతో అన్ని రాష్ట్రాలు ఎస్‌పీసీ ప్రాజెక్టును సమర్థంగా అమలు చేస్తున్నాయి. ఈ మేరకు సైబరాబాద్‌ పోలీసులు విద్యార్థులకు సామాజిక స్పృహ కలిగించే బాధ్యతను తీసుకున్నారు. వీరికి ల్యాప్‌టాప్‌లు, ప్రొజెక్టర్లు, ప్రింటర్లు తదితర సామగ్రిని అందజేయనున్నారు. ప్రతి వారం ఒక్కో గంట అవుట్‌డోర్‌ కార్యక్రమాల్లో శిక్షణ ఇవ్వనున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement