exploits
-
కామ్‌గా.. కానిచ్చేస్తున్నారు
దేశవ్యాప్తంగా కొన్నేళ్ల క్రితం వరకు దోపిడీలు, దొంగతనాలు, బ్యాంకు లూటీలు తదితర నేరాలు భారీ స్థాయిలో జరిగేవి. టెక్నాలజీ పెరగడం, కమ్యూనికేషన్ వ్యవస్థ విస్తరించడంతో దోపిడీ గ్యాంగ్‌లు రూట్మార్చి ఆర్థిక నేరాల ద్వారా వందల కోట్లు సునాయసంగా కొట్టేస్తున్నాయి. గడిచిన నాలుగేళ్లలో రాష్ట్రంలో దోపిడీ, దొంగతనాలు తగ్గి ఆర్థిక నేరాలు విపరీతంగా పెరిగిపోయాయి. కొన్ని చోట్ల ప్రతీ ఏటా ఏకంగా 100% పెరిగితే మరికొన్ని చోట్ల 50% పెర గడం ఆందోళన కలిగిస్తోంది. ఇలా రాష్ట్రంలో 2017 ఒక్క ఏడాదిలోనే రూ.2,739 కోట్ల మేర ప్రజలు ఆర్థిక నేరస్తుల ద్వారా నష్టపోయినట్లు రాష్ట్ర నేరపరిశోధన విభాగం తేల్చింది. వేల కోట్ల దోపిడీ... సాధారణ దోపిడీలు, దొంగతనాలు కాకుండా బ్యాంక్ మోసాలు, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్ షిప్, చిట్స్, మనీ సర్క్యులేషన్ స్కీములు, టెలీ మార్కెటింగ్, క్రెడిట్ కార్డ్ ఫ్రాడ్, హెల్త్‌కేర్ ఫ్రాడ్స్, ఇన్యూరెన్స్ ఫ్రాడ్స్, సాఫ్ట్వేర్ పైరసీ, హక్కు సంబంధిత మోసాలు, డిమాండ్ డ్రాఫ్ట్, ఎఫ్డీ రిసీట్, వీడియో పైరసీ, బహుమతులు, లక్కీ లాటరీ మోసాలు, ఎంప్లాయిమెంట్ చీటింగ్, సైబర్ క్రైమ్.. ఇలా అనేక రకాల వైట్ కాలర్ నేరాలు ఆర్థిక నేరాల్లో కీలకంగా మారుతూ వస్తున్నాయి. వీటి ద్వారా వందల నుంచి వేల కోట్ల వరకు మాఫియా దోపిడీకి పాల్పడుతోంది. అప్రమత్తత, ఆలోచన తప్పనిసరి.. ఆర్థిక నేరాల్లో మోసపోతున్న ప్రజలకు అప్రమత్తతే శ్రీరామ రక్ష అని సీఐడీ ఉన్నతాధికారులు సూచిస్తున్నారు. డిపాజిట్లు, లాటరీలు, చిట్‌ఫండ్, బ్యాంకింగ్, క్రెడిట్ కార్డు, షేర్ మార్కెటింగ్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పేర్కొంటున్నారు. ఒకటికి రెండుసార్లు ప్రకటనలిస్తున్న సంస్థ, దాని వెనకున్న జిమ్మిక్కులను అర్థం చేసుకోవాలని, కంపెనీ సంబంధించిన వివరాలు, అందులో తక్కువ కాలంలో ఎక్కువ డబ్బు సంపాదిస్తామని చెప్పే వాటిపై జాగ్రత్త వహించాలని సీఐడీ అవగాహన కల్పిస్తోంది. ఆర్థిక నేరాల్లో నిందితులు టెక్నాలజీని వాడుకుని మోసం చేస్తున్న కేసులే ఎక్కువగా ఉంటున్నాయని సీఐడీ అభిప్రాయపడింది. ఎక్కడో ఇతర దేశాల్లో ఉంటూ ఫోన్‌కాల్స్, ఈ–మెయిల్స్, లాటరీ పేరుతో బురిడీ కొట్టిస్తున్నారని, వీటి వల్లే నష్టం వందల కోట్లకు చేరుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. సైబరాబాద్‌కు మొదటిస్థానం... రాష్ట్రవ్యాప్తంగా అన్ని పోలీస్ యూనిట్లలో ఆర్థిక నేరాల నమోదులో సైబరాబాద్ కమిషనరేట్ మొదటి స్థానంలో ఉంది. రెండో స్థానంలో హైదరాబాద్, మూడో స్థానంలో రాచకొండ కమిషనరేట్లు ఉన్నాయి. రాజధాని ప్రాంతం చుట్టూ వైట్‌కాలర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. కేసులు నమోదవుతున్నా వాటిని ఛేదించడంలో సాంకేతిక సమస్యలు, సిబ్బంది కొరత, ట్రాకింగ్ లోపంతో నిందితులను పట్టుకోవడం కష్టసా«ధ్యమవుతోందని అధికారులు పేర్కొంటున్నారు. -
'చంద్రబాబు ఏమైనా పెదరాయుడా?'
-
ఈ నగరానికి ఏమైంది?
విస్తరిస్తున్న తుపాకీ సంస్కృతి పెరుగుతున్న దారుణాలు వరుస సంఘటనలతో పోలీసులు ఉక్కిరిబిక్కిరి ఈ నగరానికి ఏమైంది? ఓ వైపు దోపిడీలు...దొంగతనాలు... మరోవైపు లైంగిక దాడులు... హత్యా యత్నాలు... హ త్యోదంతాలు. ‘విశ్వ’ నగరం వైపు అడుగులు వేస్తున్నామని ఏలికలు చెబుతుంటే... వాస్తవ పరిస్థితులు భీతిగొల్పుతున్నాయి. గ్రేటర్... నేరాల రాజధానిగా మారుతోంది. తుపాకీ నీడలో...క్షణక్షణం భయంభయంగా జనం కాలం గడపాల్సి వస్తోంది. అత్యాధునిక సాంకేతికతను వినియోగించి... నేర రహిత రాజధానిగా మారుస్తామని చెబుతున్న పోలీసు పెద్దల మాటలు నీటి మూటలవుతున్నాయి. నిత్యం ఏదో ఒక మూల తుపాకులు పేలుతున్నాయి. అమాయకుల ప్రాణాలు గాలిలో కలసిపోతున్నాయి. బుధవారం మధ్యాహ్నం జింకలబావి కాలనీలో ఓ వ్యక్తిపై దుండగులు కాల్పులకు తెగబడగా...అదే రోజు అర్థరాత్రి సికింద్రాబాద్ పరిసరాల్లో వేర్వేరు చోట్ల ఇద్దరు వ్యక్తులపై దుండగులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ సంఘటనలు నగరంలోని నేర సంస్కృతికి అద్దం పడుతున్నాయి. ప్రజల భద్రతను ప్రశ్నిస్తున్నాయి. పోలీసుల పనితీరుకు సవాల్‌గా నిలుస్తున్నాయి. మహా నగరంలో తుపాకీ సంస్కృతి (గన్ కల్చర్) పెరుగుతోంది. చిన్నపాటి సంఘటనలకే తుపాకులు పేలుతున్నాయి. జనం ప్రాణాలు హరిస్తున్నాయి. దీని వెనుక అధికార యంత్రాంగం వైఫల్యం ఉందన్నది ఎవరూ కాదనలేని సత్యం. ఎంత మందికి రివాల్వర్ లెసైన్స్‌లు ఉన్నాయి? వారు చెప్పిన చిరునామాలో ఉంటున్నారా? రీ-రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారా? ఎన్నికలు, పండుగల సందర్భంగా స్థానిక ఠాణాల్లో ఆయుధాలను డిపాజిట్ చేస్తున్నారా? ఏ పోలీసు స్టేషన్లో ఎంత మందికి రివాల్వర్ లెసైన్సులు ఉన్నాయి? ఈ ప్రశ్నలను మన పోలీసుల ముందు ఉంచితే మౌనమే సమాధానంగా వస్తోంది. వ్యక్తిగత భద్రత వంటి కారణాలను చూపి అనేక మంది హోం మంత్రిత్వ శాఖ, జిల్లా మెజిస్ట్రేట్లు, కమిషనర్ల నుంచి ఆయుధ లెసైన్సులు తీసుకుంటున్నారు. సాధారణ డ్రైవింగ్ లెసైన్సు ఇవ్వడానికే సవాలక్ష పరీక్షలు పెడుతుంటారు. కానీ కీలకమైన ఆయుధాల లెసైన్స్‌ల విషయంలో అలాంటివేమీ లేవు.నివాస ధ్రువపత్రం, నేరచరిత్ర లేకపోవడం... దుర్వినియోగ పరచడనే నమ్మకం ఉంటే చాలు లెసైన్స్ వచ్చేస్తుంది. ఆయుధాన్ని ఎలా భద్రపరచాలి? ఎప్పుడు వినియోగించాలి? అనే అంశాలపై ఆ వ్యక్తికి అవగాహన ఉందా? శారీరక, మానసిక ఆరోగ్య పరిస్థితి ఏమిటనేది కూడా పరిశీలించడం లేదు. ఫలితంగా అనేక సందర్భాల్లో ఇవి దుర్వినియోగమవుతున్నాయి. జంట పోలీసు కమిషరేట్లలో ఉండే పోలీసు క్షేత్ర స్థాయి సిబ్బంది సంఖ్య దాదాపు 10 వేలు. ఇక్కడున్న లెసైన్సుడు ఆయుధాలను లెక్కిస్తే... అవీ దాదాపు 10 వేల వరకు ఉన్నాయి. ఇక అక్రమంగా ఉన్న ఆయుధాలకు అంతేలేదు. దీన్ని బట్టి నగరంలో ఏ స్థాయిలో గన్ కల్చర్ ఉందో తెలుసుకోవచ్చు. ప్రస్తుత లెక్కల ప్రకారం నగర పోలీసు కమిషనరేట్ పరిధిలో 4,685 మందికి లెసైన్సులు ఉండగా... వారి వద్ద ఉన్న ఆయుధాల సంఖ్య 6,054. అలాగే సైబారాబాద్‌లో 4,489 మందికి లెసైన్సులు ఉండగా 4,988 ఆయుధాలు కలిగి ఉన్నారు. జంట కమిషనరేట్ల పరిధిలో సుమారు 1622 మంది రీ-రిజిస్ట్రేషన్ చే యించుకోవడం లేదని...అవసరమైన సందర్భాల్లో ఠాణాలలో డిపాజిట్ చేయడం లేదని విచారణలో తేలింది. రవాణాకు ప్రత్యేక ముఠాలు.. నగరానికి ఉత్తరాది నుంచి తుపాకులు సరఫరా చేయడానికి ప్రత్యేక ముఠాలు పని చేస్తున్నాయి. రైళ్లలోనూ, ట్రాన్స్పోర్ట్ లారీల్లోనూ అక్రమంగా ఆయుధాలను చేరవేస్తున్నారు. అక్కడి నుంచి వచ్చే దినసరి కూలీలు సైతం ఆయుధ వ్యాపారాన్ని అదనపు ఆదాయ మార్గంగా భావిస్తున్నారు. నగరంలో స్థిరపడిన బీహారీలు కొందరు ఆయుధాలను తీసుకువ చ్చి విక్రయిస్తున్నారు. దీనిపై పోలీసు నిఘా అంతంత మాత్రమే. ఓ ముఠా దొరికినప్పుడు అరెస్టు చేయడంతో సరిపెడుతున్నారు. ఎవరైనా చొరవ తీసుకుని దర్యాప్తు కోసం రాష్ట్రం దాటినా.. వారికి అక్కడి పోలీసుల నుంచి సహకారం అందడంలేదు. ఒక్కోసారి ఎదురుదాడులు జరిగే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఆసక్తి ఉన్న అధికారులు సైతం మిన్నకుండి పోవాల్సి వస్తోంది. రెన్యూవల్ ఏదీ... లెసైన్స్‌లు పొంది, ఆయుధాలు తీసుకున్న వారిలో చాలా మంది తరచూ ఇళ్లు మారుతున్నారు. ఆ సమయాల్లో స్థానిక పోలీసులకు నెల రోజుల్లో తన ఆయుధం రెన్యూవల్ (రీ-రిజిస్టేషన్)కు దరఖాస్తు చే సుకోవాలి. ఇది పక్కాగా అమలు కావట్లేదు. దీనిపై వివిధ పోలీసు స్టేషన్లు, కమిషనరేట్ల మధ్య సమన్వయం కొరవడుతోంది. ఫలితంగా ఆయుధాలు కలిగిన వారు ఎక్కడ ఉన్నారు? వారి కదలికలేమిటనేది పోలీసులకు అంతు చిక్కడం లేదు. అవాంఛనీయ సంఘటనలు జరిగినప్పుడు చేష్టలుడిగి చూడాల్సి వస్తోంది. -
దోపిడీలు.. దారుణాలు
శాంతిభద్రతల అదుపులో పోలీసుల వైఫల్యం సమ్మక్క-సారలమ్మ జాతరలో అట్టర్ ఫ్లాప్ గణనీయంగా పెరిగిన దొంగతనాలు జంట హత్యలతో సంచలనం నకిలీ నక్సల్స్ పేరుతో ముఠాలు కొత్తగా సుపారీ గ్యాంగ్‌ల ఎంట్రీ పోలీస్ బాస్‌ల బదిలీలు 2014లో క్రైం రేట్ గణనీయంగా పెరిగింది. దోపిడీలు, హత్యలు జిల్లాను వణికించారుు. శాంతిభద్రతల పర్యవేక్షణలో పోలీస్ బాస్‌లు పూర్తిగా విఫలమయ్యూరు. కిడ్నాప్‌లు, దొంగతనాలు, హత్యలు, నకిలీ నక్సలైట్ల బెదిరింపులు, మాజీ నక్సలైట్ల భూపంచాయితీలతో పలుచోట్ల బాధితులు బెంబేలెత్తిపోయారు. నేరాలను నియంత్రించడం, నేరగాళ్లపై నిఘా ఉంచడంలో పోలీసులు ఈ ఏడాది చతికిలబడ్డారనే చెప్పవచ్చు. రఘునాథపల్లిలో దోపిడీ దొంగల మారణకాండ, భూపాలపల్లి, ఆజాంనగర్ బ్యాంకులదోపిడీ, నగరంలో జంట హత్యలు, ప్రముఖుల కిడ్నాప్‌నకు సుపారీ గ్యాంగ్‌ల ఎంట్రీ, నకిలీ నక్సల్స్ పేరుతో బెదిరింపుల వంటి అనేక ఘటనలు సంచలనం సృష్టించారుు. రోడ్డు ప్రమాదాలు అనేక కుటుంబాల్లో విషాదం నింపారుు. గడిచిన కొన్నేళ్లతో పోలిస్తే జిల్లాలో క్రైం రేట్ 2014లో గణనీయంగా పెరిగింది. శాంతిభద్రతలను అదుపు చేయడంలో పోలీసులు పూర్తి స్థాయిలో విఫలం కావడంతో వరంగల్ నేరగాళ్లకు నిలయంగా మారింది. కిడ్నాప్‌లు, దొంగతనాలు, హత్యలు, నకిలీ నక్సలైట్ల బెదిరింపులు, మాజీ నక్సలైట్ల భూపంచాయితీలతో అనేక మంది బెంబేలెత్తిపోయారు. నేరాలను నియంత్రించడం, నేరగాళ్లపై నిఘా ఉండడంలో పోలీసులు ఈ ఏడాది చతికిలబడ్డారనే చెప్పవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అనేక కేసులు ఈ ఏడాది ఈ జిల్లాలోనే జరిగాయంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. రఘునాథపల్లిలో పార్థీ దొంగల భీభత్సం, భూపాలపల్లి, ఆజంనగర్ బ్యాంకులదోపిడీ, నగరంలో జంట హత్యలు, ప్రముఖుల కిడ్నాప్‌కు సుపారీ గ్యాంగ్‌ల ఎంట్రీ, నకిలీ నక్సల్స్ పేరుతో బెదిరింపుల వంటి అనేక ఘటనలు చోటుచేసుకున్నాయి. - వరంగల్‌క్రైం నగరంపై రక్తపు మరకలు.. నగరంలో ఈ ఏడాది రెండు చోట్ల జంట హత్యలు చోటుచేసుకున్నాయి. హన్మకొండ హౌసింగ్ బోర్డు కాలనీలో తల్లి,కొడుకు హత్యకు గురయ్యారు. ఆస్తి కోసం ఆ ఇంటి ఆడపడుచే తన కుమారుడి సాయంతో తల్లిని, సోదరుడిని హత్య చేసింది. పోలీసులు ఈ కేసును ఛేదించి హత్యకు కారణమైన వారికి కటకటాల్లోకి నెట్టా రు. ఆ తర్వాత గొర్రెకుంట సమీపంలో కొలొం బో కాలనీలో వృద్ధ దంపతులు హత్యకు గురయ్యారు. డబ్బుల కోసం తెలిసినవారే ఎవరికీ అనుమానం రాకుండా ఎలాంటి ఆధారాలు పోలీసులకు దొరకకుండా వీరిని హత్య చేశారనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే హత్య జరిగి ఆరు నెలలు గడిచినా పోలీసులు ఈ కేసులో ఎలాంటి క్లూ సంపాదించలేకపోయా రు. అలాగే సుబేదారి స్టేషన్ పరిధిలోని విజయపాల్ కాలనీలో మార్చి 7న ఒక మహిళ హత్యకు గురైంది. అత్యంత సన్నిహితులే ఈ హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించినప్పటికీ నిందితులను పట్టుకోలేకపోయారు. ఈ ఘటనలు నగరంలో సంచలనం సృష్టించాయి. జిల్లాలో సుపారీ గ్యాంగ్‌ల ఎంట్రీ.. జిల్లాలో ఈ ఏడాది కొత్తగా సుపారీ గ్యాంగ్‌లు ఎంట్రీ ఇచ్చాయి. డబ్బులు తీసుకుని కిడ్నాప్‌లు, హత్యలు చేసేందుకు వీరు వెనుకాడరు. నగరంలో పేరు మోసిన పిల్లల వైద్యుడు సురేందర్‌రెడ్డిని సుపారీ తీసుకున్న కొందరు వ్యక్తులు కిడ్నాప్ చేశారు. లక్షలాది రూపాయలు వసూలు చేసి పోలీసులకు చిక్కారు. మరో ముఠా నగరంలో రియల్ ఎస్టేట్ వ్యాపారుల హత్యకు పథకం పన్నింది. పోలీసులకు ముందస్తు సమాచారం అందడంతో వీరిని కటకటాల్లోకి నెట్టారు. జిల్లాలో నేర చరిత్ర ఉన్న మాజీ నక్సలైట్లు, రౌడీషీటర్లు ముఠాలుగా ఏర్పడి సుపారీ తీసుకుంటూ కిడ్నాప్, హత్యలకు పథకం రచిస్తున్నారు. వీరిపై పోలీసు నిఘా ఉన్నా ఇలాంటివి జరుగుతుండడం కలకలం రేపుతోంది. నకిలీ నక్సలైట్ల పేరుతో... డబ్బు కోసం బరితెగించిన కొందరు వ్యక్తులు నక్సలైట్లుగా చలామణి అవుతూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. ముఠాలుగా ఏర్పడిన ఈ నకిలీలు కాంట్రాక్టర్లను, క్వారీ యజమానులను, లిక్కర్ వ్యాపారులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఈ క్రమంలోనే వసూళ్ల కోసం వచ్చిన ఒక ముఠా ఈ నెల 4న మహబూబాబాద్ సమీపంలో పట్టుబడింది. ఆ తర్వాత ములుగులో కూడా ఇలాంటి ముఠానే పట్టుకున్నారు. వారి వద్ద తపంచాలు, రివాల్వర్లను స్వాధీనం చేసుకున్నారు. బీహార్‌లో ఆయుధాలు కొనుగోలు చేస్తూ ఇక్కడ ఇలా ముఠాలుగా ఏర్పడి డబ్బుల కోసం బెదిరింపులకు పాల్పడుతున్న ముఠాలు ఇంకా జిల్లాలో ఉన్నాయి. వణికించిన దోపిడీలు.. అర్బన్, రూరల్ పరిధిలో దొంగతనాలు రికార్డు స్థాయిలో చోటుచేసుకున్నాయి. హన్మకొండ హంటర్‌రోడ్డులో మే 29న నందిహిల్స్‌లో ఒక అపార్ట్మెంట్లో రూ.50 లక్షలు ఎత్తుకెళ్లారు. సీబీఐ పేరుతో ఇంట్లోకి వచ్చిన నలుగురు వ్యక్తులు ఇంట్లోవారిని బెదిరించి పట్టపగలే దోపిడీకి పాల్పడ్డారు. అయితే ఇంతవరకు పోలీసులు ఈ కేసు మిస్టరీని ఛేదించలేకపోయారు. ఈ సంఘటన అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ తర్వాత సెప్టెంబర్ 12న రఘునాథపల్లిలో పార్థీ దొంగల ముఠా సృష్టించిన మారణకాండ మరిచిపోలేనిది. దోపిడీకి వచ్చిన ముఠా సభ్యులు ఇంట్లో ముగ్గురిని చంపి మరీ సొత్తును దోచుకెళ్లారు. ఈ దారుణానికి పాల్పడిన నిందితులను మెదక్ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే నవంబర్‌లో భూపాలపల్లి, ఆజంనగర్ గ్రామీణ వికాస్ బ్యాంక్ శాఖల్లో జరిగిన దోపిడీ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అందులో పనిచేసే మెస్సేంజర్ సుమారు 34 కేజీల బంగారు ఆభరణాలు, రూ.21 లక్షల నగదుతో పరారయ్యా డు. అయితే పోలీసులు వారంలోపే దొంగను పట్టుకుని సొత్తు రికవరీ చేశారు. అదే విధంగా వరంగల్ నగరంలో, గ్రామీణ ప్రాంతాల్లో చైన్‌స్నాచింగ్‌లు నిత్యకృత్యమయ్యాయి. ఒక్కోరోజు రెండు, మూడుచోట్ల స్నాచర్లు పంజా విసురుతున్నారు. చాలా కేసుల్లో పోలీసులు వీరిని పట్టుకోవడంలో విఫలమయ్యారు. -
ఇదిగో.. దండుపాళ్యం! మళ్లీ మొదలైన లైంగికదాడులు, దోపిడీలు
- చీరాల దండుబాటలో మళ్లీ మొదలైన లైంగికదాడులు, దోపిడీలు - పది రోజుల క్రితం 16 ఏళ్ల యువతిపై సామూహిక లైంగిక దాడి - లారీలు, ఇతర వాహనాలను ఆపి మరీ దోపిడీ - నేర ప్రవృత్తికి మళ్లీ తెరలేపిన పాత నిందితులు చీరాల : వరుస హత్యలు, లైంగిక దాడులు, దోపిడీలు, నాటుసారా విక్రయాలకు చీరాల దండుబాట గతంలో అడ్డాగా ఉండేది. రాత్రివేళ అటువైపు వెళ్లిన ఎందరో మహిళలు, యువతులు లైంగిక దాడులకు గురయ్యారు. వాహనాలు ఆపి మరీ దోపిడీలకు పాల్పడేవారు. అప్పట్లో నెల వ్యవధిలో నాలుగు హత్యలు జరిగేవి. నాటుసారాకు అడ్డాగా ఉండే దండుబాటపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టడంతో కొది ్దనెలలుగా రౌడీమూకలు తమ అఘాయిత్యాలు నిలిపారు. పోలీసులు కూడా అటువైపు దృష్టి సారించడం మానేశారు. రౌడీమూకలు మళ్లీ దండుబాటను దండుపాళ్యంగా మార్చారు. పదిరోజుల క్రితం 16 ఏళ్ల యువతిపై సామూహిక లైంగిక దాడికి పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గతంలో ఇటువంటి అఘాయిత్యాలకు పాల్పడిన గ్యాంగ్‌లో కొందరు 10రోజులు క్రితం నుంచి మళ్లీ చెలరేగుతున్నట్లు సమాచారం. దండుబాటలోని పోలేరమ్మ గుడి సమీపంలో కొందరు యానాదులు చేపలవేట సాగిస్తూ జీవిస్తుంటారు. పదిరోజులు క్రితం నలుగురు యువకులు మద్యం తాగి ఓ గుడిసెలోకి చొరబడి 16 ఏళ్ల యువతిపై సామూహిక లైంగిక దాడికి ప్రయత్నించారు. సదరు యువతి తల్లి వారిపై కారంచల్లి ప్రతిఘటించింది. అయినా కామాంధులు ఆమెపై దాడి చేసి యువతిని పక్కనే ఉన్న పొదల్లోకి తీసుకెళ్లి సామూహిక లైంగిక దాడికి పాల్పడినట్లు సంఘటన చూసిన కాలనీవాసి ఒకరు మీడియాకు సమాచారం అందించారు. భయపడిన యానాది కాలనీ వాసులు విషయాన్ని పోలీసుల వరకూ తీసుకెళ్లలేదు. అఘాయిత్యానికి పాల్పడిన వ్యక్తులకు చెందిన పెద్దలు జోక్యం చేసుకుని కాలనీవాసులతో రాజీకి ప్రయత్నించినట్లు సమాచారం. ఏదైనా యథేచ్ఛగానే.. రాత్రి వేళల్లో దండుబాట మీదగా రాకపోకలు చేస్తున్న వాహనదారులను అటకాయించి వారిపై దాడి చేసి నగదు, సెల్ఫోన్లు దోచుకుంటున్నారు. రాత్రివేళ దండుబాటపై రాకపోకలు సాగించాలంటే భయపడాల్సిన పరిస్థితులు మళ్లీ ఏర్పడ్డాయి. గతంలో ఇదే ముఠాలోని కొందరు అనేక అఘాయిత్యాలకు పాల్పడ్డారు. ఓ ఇంజినీరింగ్ విద్యార్థిని తన స్నేహితుడితో కలిసి మోటారుసైకిల్‌పై ఇంకొల్లు వెళ్తుండగా దారిలో అటకాయించి ఆ యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డారు. చాటుమాటుగా ఉంటుందని కొన్ని ప్రేమజంటలు అటువైపు వెళ్తుంటాయి. అటుగా వెళ్లే జంటలపై దాడి చేసి మహిళలను దూరంగా తీసుకెళ్లి లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. గతంలో వీటితో పాటు నలుగురు వరుస హత్యలకు గురయ్యారు. నాటుసారా కేంద్రాలపై కూడా దాడులు జరగడంతో దండుబాటలో ఏడాది పాటు ప్రశాంత వాతావరణం నెలకొంది. పోలీసులు ఎక్కడికక్కడ పికెట్లు ఏర్పాటు చేయడంతో అఘాయిత్యాలు తగ్గాయి. మళ్లీ కొద్దినెలలుగా అదే గ్యాంగ్‌లోని కొందరు యువకులు దుశ్చర్యలకు పాల్పడుతున్నట్లు సమాచారం. పోలీసులు ప్రత్యేక దృష్టి సారించి అఘాయిత్యాలకు పాల్పడుతున్న ముఠాలకు ముక్కుతాడు వేయకుంటే దండుబాట దండుపాళ్యంగా మారే పరిస్థితులు ఉన్నాయి. -
సినీఫక్కీలో దోపిడీలు
ఒకే రోజు నాలుగు ప్రాంతాల్లో ... ఒరిస్సాకు చెందిన ముఠా పనే బంగారు నగల దోపిడీ మచిలీపట్నం : జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో ఓ దొంగల ముఠా సోమవారం వీరంగం సృష్టించింది. ఒకే రోజు నాలుగు ప్రాంతాల్లో సీనీ ఫక్కిలో నగలు దోచుకుపోయారు. నాలుగు చోట్లా బంగారు నగలు అపహరించిన వారు ఇద్దరు వ్యక్తులేనని పోలీసులు అనుమానిస్తున్నారు. పట్టణంలో నాలుగు ప్రాంతాల్లో దోపీడీలు జరగ్గా రెండు చోట్ల మహిళలను మాటల్లో పెట్టి వారు ఆదమరచి ఉన్నపుడు మెడలోని బంగారు నగలు తెంచుకుపోగా, మరో రెండు ప్రాంతాల్లో వాకింగ్ చేస్తున్న మహిళల వెనుక నుంచి వేగంగా బైక్‌పై వచ్చి వారి మెడలోని బంగారు గొలుసులను తెంపుకుని పోయారు. ఈ ఘాతుకానికి పాల్పడిన వారు హిందీలో మాట్లాడుతున్నారని, ఈ తరహా దొంగతనాలు ఒరిస్సాకు చెందిన దొంగల ముఠాలే చేస్తుంటాయని పోలీసులు చెబుతున్నారు. ఈ నాలుగు సంఘటనల్లో 109 గ్రాముల బంగారాన్ని దుండగులు దోచుకుపోయారు. మాటలు కలిపి.... అడ్రసు అడిగి.... సర్కారుతోటకు చెందిన బొల్లు శ్రీలక్ష్మీ తన ఇంటిముందు వాకిలి ఊడుస్తుండగా ఓ యువకుడు అక్కడకు వచ్చాడు. తన వద్ద ఉన్న చిన్నపాటి కాగితం చూపి ఫలానా పేరున్న వ్యక్తి ఇల్లు ఇదేనా అడిగాడు. ఆ పేరు గలవారు ఇక్కడ ఎవరూ లేరనే సమాధానం ఇచ్చే లోపుగానే శ్రీలక్ష్మీమెడలో ఉన్న బంగారు గొలుసును లాక్కునేందుకు దుండగుడు ప్రయత్నించాడు, తేరుకున్న శ్రీలక్ష్మీ ప్రతిఘటించింది. నానుతాడుకు ఉన్న మంగళసూత్రాలు తెగి దుండగుడి చేతిలోకి రావడం, అతను పరిగెత్తడం అప్పటికే కొంచెం దూరంలో పల్సర్ ద్విచక్రవాహనంపై సిద్ధంగా ఉన్న యువకుడు దుండగుడితో సహా మాయం కావడం క్షణాల్లో జరిగిపోయాయి. స్థానిక యువకులు వారిని వెంటాడినా వారు చిక్కలేదు. ఈసంఘటనపై బాధితురాలు శ్రీలక్ష్మీ చిలకలపూడి పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేసింది. అలాగే ఆర్టీసీ కాలనీలో తన ఇంటిగుమ్మం వద్ద ముగ్గువేస్తున్న యలవర్తి సీతారావమ్మను అడ్రసు కావాలంటూ మాటల్లో పెట్టి దుండగులు ఇదే తరహాలో ఆమె మెడలో ఉన్న 24గ్రాముల బరువున్న బంగారు నానుతాడును తెంచుకుపోయారు. సీతారావమ్మ మచిలీపట్నం పోలీస్ స్టేషన్లో ఈ సంఘటనపై ఫిర్యాదు చేశారు. వాకింగ్ చేస్తుండగా...వేగంగా వాహనంపై వచ్చి ... హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన రాపర్ల రమణకుమారి బైపాస్ రోడ్డు వెంబడి వాకింగ్ చేస్తుండగా పల్సర్ వాహనంపై వేగంగా వచ్చిన దుండగులు ఆమె మెడలోని 34 గ్రాముల బంగారు గొలుసును తెంచుకుని పరారయ్యారు. రమణకుమారితో పాటు రోడ్డుపై ఉన్న జనం తేరుకునేలోపే వారు ద్విచక్రవాహనంతో సహా అదృశ్యమయ్యారు. మరో సంఘటనలో గంటా రామతారకం అనే మహిళ పరాసుపేటలోని సెయింట్ ఫ్రాన్సిస్ పాఠశాల వైపు నడచి వెళుతుండగా వెనుక నుంచి ద్విచక్రవాహనంపై వేగంగా వచ్చిన దుండగులు ఆమె మెడలో ఉన్న 43గ్రాముల బంగారు గొలుసును తెంపుకుపోయారు. ఈ రెండు సంఘటనలపైనా రమణకుమారి చిలకలపూడిపోలీస్ స్టేషన్లో, రామతారకం మచిలీపట్నం పోలీస్ స్టేషనో ఫిర్యాదు చేశారు. ఒకే రోజు ఇద్దరు యువకులు నాలుగు ప్రాంతాల్లో మహిళల నుంచి బంగారు నగలను దోచుకుపోవడం పట్టణంలో సంచలనం కలిగించింది. -
‘ఫైన్’గా కొట్టేశారు
=ట్రాఫిక్ చలాన్ల మోత =రాష్ట్రవ్యాప్త ఆదాయంలో సగానికి పైగా ఇక్కడి నుంచే =సిటీలో వాహనాల కంటే కేసుల సంఖ్యే ఎక్కువ =ప్రజలు నేరాల్లో కోల్పోయిన దాని కంటే =జరిమానా సొమ్మే అధికం సాక్షి, సిటీబ్యూరో : ‘గ్రేటర్’ మహానగరంలో నేరగాళ్లు కొల్లగొట్టిన దాని కంటే ట్రాఫిక్ పోలీసులు చేసిన దారి ‘దోపిడీ’నే ఎక్కువగా ఉంది. ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా వసూలు చేసిన జరిమానా మొత్తంలో సగానికి పైగా జంట కమిషనరేట్ల ట్రాఫిక్ పోలీసులే ఖజానాకు జమ చేశారు. గణాంకాలను విశ్లేషిస్తే ఈ విషయం స్పష్టంగా తెలుస్తోంది. 2013లో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ట్రాఫిక్, శాంతిభద్రతల విభాగం (కొన్ని చోట్ల వీరు కూడా చలాన్లు రాస్తారు) అధికారులు ఉల్లంఘనలకు పాల్పడిన వాహనచోదకుల నుంచి రూ.123 కోట్లు (నవంబర్ వరకు) వసూలు చేస్తే.. ఇందులో జంట కమిషనరేట్ల (హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు రూ.45 కోట్లు, సైబరాబాద్ వారు రూ.22 కోట్లు) వాటానే రూ.67 కోట్లు ఉంది. దీన్నిబట్టి మన ట్రాఫిక్ విభాగం వారి బాదుడు ఏ మేరకు ఉందో అర్థం చేసుకోవచ్చు. రెండు రకాలుగా.. రోడ్డు నిబంధనలు పాటించని, ఉల్లంఘనలకు పాల్పడే వారికి ట్రాఫిక్ విభాగం అధికారులు చలాన్లు రాయడం ద్వారా జరిమానాలు వసూలు చేస్తుంటారు. దీనికోసం పోలీసులు ప్రధానంగా రెండు రకాల పద్ధతుల్ని అవలంభిస్తున్నారు. నేరుగా రోడ్లపై నించొని చలాన్ పుస్తకంతో జరిమానా విధించే కాంటాక్ట్ ఎన్ఫోర్స్మెంట్ ఒకటి. కెమెరాలు వంటి పరికరాలను వినియోగించి ఉల్లంఘనల్ని గుర్తించడం ద్వారా ఇంటికి ఈ-చలాన్లు పంపే నాన్-కాంటాక్ట్ ఎన్ఫోర్స్మెంట్ మరొకటి. వాహనచోదకులతో ప్రత్యక్ష సంబంధం, ఘర్షణ వాతావరణం ఉండకూడదనే ఉద్దేశంతో నాన్-కాంటాక్ట్ ఎన్ఫోర్స్మెంట్ను ప్రారంభించారు. వివిధ జిల్లాల్లో ఉండే మౌలిక వసతుల నేపథ్యంలో కేవలం కాంటాక్ట్ ఎన్ఫోర్స్మెంట్ మాత్రమే అందుబాటులో ఉంది. సాంకేతిక ఉపకరణాలను సమకూర్చుకున్న కమిషనరేట్లలో ముఖ్యంగా హైదరాబాద్, సైబరాబాద్‌ల్లో నాన్-కాంటాక్ట్ ఎన్ఫోర్స్మెంట్నూ చేపడుతున్నారు. నేరాల కంటే ఎక్కువ వీటిలోనే... ప్రాపర్టీ అఫెన్సులుగా పిలిచే చోరీలు, దోపిడీలు, బందిపోటు దొంగతనాలతో పాటు వైట్ కాలర్ అఫెన్సులుగా పరిగణించే మోసాలు, సైబర్ నేరాల్లో నగరవాసులు కోల్పోయిన మొత్తం కంటే జరిమానాల రూపంలో ట్రాఫిక్ అధికారులకు సమర్పించుకున్నది ఎక్కువగా ఉంది. సిటీలో ప్రాపర్టీ అఫెన్సుల్లో నేరగాళ్లు కొల్లగొట్టిన మొత్తం రూ.42 కోట్లుగా ఉంది. ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడటం ద్వారా నగరవాసి చెల్లించిన జరిమానా మాత్రం రూ.45 కోట్లకు పైగా ఉంది. కేసుల విషయానికి వచ్చినా హైదరాబాద్‌లో నేరాలకు సంబంధించి 18,013 కేసులు నమోదు కాగా, ట్రాఫిక్ పోలీసులు జారీ చేసిన చలాన్ల సంఖ్య మాత్రం 30 లక్షలు దాటింది. సైబరాబాద్‌లో కేసుల సంఖ్య 27,156గా ఉండగా... చలాన్ల సంఖ్య 9,48,140గా ఉంది. పదేపదే ఉల్లంఘించేవారే ఎక్కువ నగరంలో రోడ్డు నిబంధనలు పాటించకుండా ట్రాఫిక్ అధికారుల ఆదేశాలను బేఖాతరు చేసే వారిలో పదే పదే ఉల్లంఘనలకు పాల్పడే వారే ఎక్కువగా ఉన్నారని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఆర్టీఏ గణాంకాల ప్రకారం సిటీలో ఉన్న వాహనాల సంఖ్య 26 లక్షలు. ఇందులో ప్రతి ఒక్క వాహనచోదకుడూ ఉల్లంఘనలకు పాల్పడటం అనేది జరుగదు. కనిష్టంగా తీసుకున్నా ఆరు లక్షల మంది ట్రాఫిక్ జరిమానాలకు పూర్తి దూరంగా ఉన్నారని లెక్కేయచ్చు. మిగిలిన 20 లక్షల వాహనాలకు అదనంగా బయట జిల్లాల నుంచి ప్రతి రోజూ వచ్చివెళ్లేవి రెండు లక్షలుగా లెక్కేసినా ఈ సంఖ్య 22 లక్షలే ఉంటుంది. అయితే ట్రాఫిక్ విభాగం అధికారులు జారీ చేసిన చలాన్ల సంఖ్య మాత్రం 30 లక్షలకు పైగా ఉంది. అనేకమంది వాహనచోదకులు పదేపదే ఉల్లంఘనలకు పాల్పడుతూ రిపీటెడ్ వైలేటర్స్‌గా ఉండటమే దీనికి కారణమని అధికారులు విశ్లేషిస్తున్నారు. ఎన్ఫోర్స్మెంట్తో ప్రమాదాల తగ్గుదల..! ట్రాఫిక్ పోలీసులు చేపట్టే ప్రాథమిక విధుల్లో ఎడ్యుకేషన్ (అవగాహన కల్పించడం), ఎన్ఫోర్స్మెంట్ (జరిమానాలు విధించడం), ఇంజనీరింగ్ (రోడ్లకు అవసరమైన మౌలిక మార్పులు చేయడం) ప్రధానమైనవని అధికారులు చెప్తున్నారు. ఈ మూడింటిలోనూ ఎన్ఫోర్స్మెంట్తో ప్రమాదాలను తగ్గించవచ్చని అభిప్రాయపడుతున్నారు. సిటీ కమిషరేట్ పరిధిలో గడిచిన మూడేళ్ల గణాంకాలను విశ్లేషిస్తే ఈ విషయం స్పష్టమవుతుందని చెప్తున్నారు. ఇటీవల ట్రాఫిక్ పోలీసులు ఓవర్ లోడింగ్, సెల్‌ఫోన్ డ్రైవింగ్, రాంగ్ పార్కింగ్ తదితర నిబంధనలకు జరిమానా మొత్తాన్ని పెంచి వసూలు చేయడం వల్లే జరిమానాల నగదు భారీగా కనిపిస్తోందని చెప్తున్నారు.