
‘ఫైన్’గా కొట్టేశారు
=ట్రాఫిక్ చలాన్ల మోత
=రాష్ట్రవ్యాప్త ఆదాయంలో సగానికి పైగా ఇక్కడి నుంచే
=సిటీలో వాహనాల కంటే కేసుల సంఖ్యే ఎక్కువ
=ప్రజలు నేరాల్లో కోల్పోయిన దాని కంటే
=జరిమానా సొమ్మే అధికం
సాక్షి, సిటీబ్యూరో : ‘గ్రేటర్’ మహానగరంలో నేరగాళ్లు కొల్లగొట్టిన దాని కంటే ట్రాఫిక్ పోలీసులు చేసిన దారి ‘దోపిడీ’నే ఎక్కువగా ఉంది. ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా వసూలు చేసిన జరిమానా మొత్తంలో సగానికి పైగా జంట కమిషనరేట్ల ట్రాఫిక్ పోలీసులే ఖజానాకు జమ చేశారు. గణాంకాలను విశ్లేషిస్తే ఈ విషయం స్పష్టంగా తెలుస్తోంది. 2013లో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ట్రాఫిక్, శాంతిభద్రతల విభాగం (కొన్ని చోట్ల వీరు కూడా చలాన్లు రాస్తారు) అధికారులు ఉల్లంఘనలకు పాల్పడిన వాహనచోదకుల నుంచి రూ.123 కోట్లు (నవంబర్ వరకు) వసూలు చేస్తే.. ఇందులో జంట కమిషనరేట్ల (హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు రూ.45 కోట్లు, సైబరాబాద్ వారు రూ.22 కోట్లు) వాటానే రూ.67 కోట్లు ఉంది. దీన్నిబట్టి మన ట్రాఫిక్ విభాగం వారి బాదుడు ఏ మేరకు ఉందో అర్థం చేసుకోవచ్చు.
రెండు రకాలుగా..
రోడ్డు నిబంధనలు పాటించని, ఉల్లంఘనలకు పాల్పడే వారికి ట్రాఫిక్ విభాగం అధికారులు చలాన్లు రాయడం ద్వారా జరిమానాలు వసూలు చేస్తుంటారు. దీనికోసం పోలీసులు ప్రధానంగా రెండు రకాల పద్ధతుల్ని అవలంభిస్తున్నారు. నేరుగా రోడ్లపై నించొని చలాన్ పుస్తకంతో జరిమానా విధించే కాంటాక్ట్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఒకటి. కెమెరాలు వంటి పరికరాలను వినియోగించి ఉల్లంఘనల్ని గుర్తించడం ద్వారా ఇంటికి ఈ-చలాన్లు పంపే నాన్-కాంటాక్ట్ ఎన్‌ఫోర్స్‌మెంట్ మరొకటి. వాహనచోదకులతో ప్రత్యక్ష సంబంధం, ఘర్షణ వాతావరణం ఉండకూడదనే ఉద్దేశంతో నాన్-కాంటాక్ట్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ను ప్రారంభించారు. వివిధ జిల్లాల్లో ఉండే మౌలిక వసతుల నేపథ్యంలో కేవలం కాంటాక్ట్ ఎన్‌ఫోర్స్‌మెంట్ మాత్రమే అందుబాటులో ఉంది. సాంకేతిక ఉపకరణాలను సమకూర్చుకున్న కమిషనరేట్లలో ముఖ్యంగా హైదరాబాద్, సైబరాబాద్‌ల్లో నాన్-కాంటాక్ట్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌నూ చేపడుతున్నారు.
నేరాల కంటే ఎక్కువ వీటిలోనే...
ప్రాపర్టీ అఫెన్సులుగా పిలిచే చోరీలు, దోపిడీలు, బందిపోటు దొంగతనాలతో పాటు వైట్ కాలర్ అఫెన్సులుగా పరిగణించే మోసాలు, సైబర్ నేరాల్లో నగరవాసులు కోల్పోయిన మొత్తం కంటే జరిమానాల రూపంలో ట్రాఫిక్ అధికారులకు సమర్పించుకున్నది ఎక్కువగా ఉంది. సిటీలో ప్రాపర్టీ అఫెన్సుల్లో నేరగాళ్లు కొల్లగొట్టిన మొత్తం రూ.42 కోట్లుగా ఉంది. ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడటం ద్వారా నగరవాసి చెల్లించిన జరిమానా మాత్రం రూ.45 కోట్లకు పైగా ఉంది. కేసుల విషయానికి వచ్చినా హైదరాబాద్‌లో నేరాలకు సంబంధించి 18,013 కేసులు నమోదు కాగా, ట్రాఫిక్ పోలీసులు జారీ చేసిన చలాన్ల సంఖ్య మాత్రం 30 లక్షలు దాటింది. సైబరాబాద్‌లో కేసుల సంఖ్య 27,156గా ఉండగా... చలాన్ల సంఖ్య 9,48,140గా ఉంది.
పదేపదే ఉల్లంఘించేవారే ఎక్కువ
నగరంలో రోడ్డు నిబంధనలు పాటించకుండా ట్రాఫిక్ అధికారుల ఆదేశాలను బేఖాతరు చేసే వారిలో పదే పదే ఉల్లంఘనలకు పాల్పడే వారే ఎక్కువగా ఉన్నారని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఆర్టీఏ గణాంకాల ప్రకారం సిటీలో ఉన్న వాహనాల సంఖ్య 26 లక్షలు. ఇందులో ప్రతి ఒక్క వాహనచోదకుడూ ఉల్లంఘనలకు పాల్పడటం అనేది జరుగదు. కనిష్టంగా తీసుకున్నా ఆరు లక్షల మంది ట్రాఫిక్ జరిమానాలకు పూర్తి దూరంగా ఉన్నారని లెక్కేయచ్చు. మిగిలిన 20 లక్షల వాహనాలకు అదనంగా బయట జిల్లాల నుంచి ప్రతి రోజూ వచ్చివెళ్లేవి రెండు లక్షలుగా లెక్కేసినా ఈ సంఖ్య 22 లక్షలే ఉంటుంది. అయితే ట్రాఫిక్ విభాగం అధికారులు జారీ చేసిన చలాన్ల సంఖ్య మాత్రం 30 లక్షలకు పైగా ఉంది. అనేకమంది వాహనచోదకులు పదేపదే ఉల్లంఘనలకు పాల్పడుతూ రిపీటెడ్ వైలేటర్స్‌గా ఉండటమే దీనికి కారణమని అధికారులు విశ్లేషిస్తున్నారు.
ఎన్‌ఫోర్స్‌మెంట్‌తో ప్రమాదాల తగ్గుదల..!
ట్రాఫిక్ పోలీసులు చేపట్టే ప్రాథమిక విధుల్లో ఎడ్యుకేషన్ (అవగాహన కల్పించడం), ఎన్‌ఫోర్స్‌మెంట్ (జరిమానాలు విధించడం), ఇంజనీరింగ్ (రోడ్లకు అవసరమైన మౌలిక మార్పులు చేయడం) ప్రధానమైనవని అధికారులు చెప్తున్నారు. ఈ మూడింటిలోనూ ఎన్‌ఫోర్స్‌మెంట్‌తో ప్రమాదాలను తగ్గించవచ్చని అభిప్రాయపడుతున్నారు. సిటీ కమిషరేట్ పరిధిలో గడిచిన మూడేళ్ల గణాంకాలను విశ్లేషిస్తే ఈ విషయం స్పష్టమవుతుందని చెప్తున్నారు. ఇటీవల ట్రాఫిక్ పోలీసులు ఓవర్ లోడింగ్, సెల్‌ఫోన్ డ్రైవింగ్, రాంగ్ పార్కింగ్ తదితర నిబంధనలకు జరిమానా మొత్తాన్ని పెంచి వసూలు చేయడం వల్లే జరిమానాల నగదు భారీగా కనిపిస్తోందని చెప్తున్నారు.