- చీరాల దండుబాటలో మళ్లీ మొదలైన లైంగికదాడులు, దోపిడీలు
- పది రోజుల క్రితం 16 ఏళ్ల యువతిపై సామూహిక లైంగిక దాడి
- లారీలు, ఇతర వాహనాలను ఆపి మరీ దోపిడీ
- నేర ప్రవృత్తికి మళ్లీ తెరలేపిన పాత నిందితులు
చీరాల : వరుస హత్యలు, లైంగిక దాడులు, దోపిడీలు, నాటుసారా విక్రయాలకు చీరాల దండుబాట గతంలో అడ్డాగా ఉండేది. రాత్రివేళ అటువైపు వెళ్లిన ఎందరో మహిళలు, యువతులు లైంగిక దాడులకు గురయ్యారు. వాహనాలు ఆపి మరీ దోపిడీలకు పాల్పడేవారు. అప్పట్లో నెల వ్యవధిలో నాలుగు హత్యలు జరిగేవి. నాటుసారాకు అడ్డాగా ఉండే దండుబాటపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టడంతో కొది ్దనెలలుగా రౌడీమూకలు తమ అఘాయిత్యాలు నిలిపారు. పోలీసులు కూడా అటువైపు దృష్టి సారించడం మానేశారు. రౌడీమూకలు మళ్లీ దండుబాటను దండుపాళ్యంగా మార్చారు.
పదిరోజుల క్రితం 16 ఏళ్ల యువతిపై సామూహిక లైంగిక దాడికి పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గతంలో ఇటువంటి అఘాయిత్యాలకు పాల్పడిన గ్యాంగ్‌లో కొందరు 10రోజులు క్రితం నుంచి మళ్లీ చెలరేగుతున్నట్లు సమాచారం. దండుబాటలోని పోలేరమ్మ గుడి సమీపంలో కొందరు యానాదులు చేపలవేట సాగిస్తూ జీవిస్తుంటారు. పదిరోజులు క్రితం నలుగురు యువకులు మద్యం తాగి ఓ గుడిసెలోకి చొరబడి 16 ఏళ్ల యువతిపై సామూహిక లైంగిక దాడికి ప్రయత్నించారు. సదరు యువతి తల్లి వారిపై కారంచల్లి ప్రతిఘటించింది.
అయినా కామాంధులు ఆమెపై దాడి చేసి యువతిని పక్కనే ఉన్న పొదల్లోకి తీసుకెళ్లి సామూహిక లైంగిక దాడికి పాల్పడినట్లు సంఘటన చూసిన కాలనీవాసి ఒకరు మీడియాకు సమాచారం అందించారు. భయపడిన యానాది కాలనీ వాసులు విషయాన్ని పోలీసుల వరకూ తీసుకెళ్లలేదు. అఘాయిత్యానికి పాల్పడిన వ్యక్తులకు చెందిన పెద్దలు జోక్యం చేసుకుని కాలనీవాసులతో రాజీకి ప్రయత్నించినట్లు సమాచారం.
ఏదైనా యథేచ్ఛగానే..
రాత్రి వేళల్లో దండుబాట మీదగా రాకపోకలు చేస్తున్న వాహనదారులను అటకాయించి వారిపై దాడి చేసి నగదు, సెల్‌ఫోన్లు దోచుకుంటున్నారు. రాత్రివేళ దండుబాటపై రాకపోకలు సాగించాలంటే భయపడాల్సిన పరిస్థితులు మళ్లీ ఏర్పడ్డాయి. గతంలో ఇదే ముఠాలోని కొందరు అనేక అఘాయిత్యాలకు పాల్పడ్డారు. ఓ ఇంజినీరింగ్ విద్యార్థిని తన స్నేహితుడితో కలిసి మోటారుసైకిల్‌పై ఇంకొల్లు వెళ్తుండగా దారిలో అటకాయించి ఆ యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డారు. చాటుమాటుగా ఉంటుందని కొన్ని ప్రేమజంటలు అటువైపు వెళ్తుంటాయి. అటుగా వెళ్లే జంటలపై దాడి చేసి మహిళలను దూరంగా తీసుకెళ్లి లైంగిక దాడులకు పాల్పడుతున్నారు.
గతంలో వీటితో పాటు నలుగురు వరుస హత్యలకు గురయ్యారు. నాటుసారా కేంద్రాలపై కూడా దాడులు జరగడంతో దండుబాటలో ఏడాది పాటు ప్రశాంత వాతావరణం నెలకొంది. పోలీసులు ఎక్కడికక్కడ పికెట్లు ఏర్పాటు చేయడంతో అఘాయిత్యాలు తగ్గాయి. మళ్లీ కొద్దినెలలుగా అదే గ్యాంగ్‌లోని కొందరు యువకులు దుశ్చర్యలకు పాల్పడుతున్నట్లు సమాచారం. పోలీసులు ప్రత్యేక దృష్టి సారించి అఘాయిత్యాలకు పాల్పడుతున్న ముఠాలకు ముక్కుతాడు వేయకుంటే దండుబాట దండుపాళ్యంగా మారే పరిస్థితులు ఉన్నాయి.
ఇదిగో.. దండుపాళ్యం! మళ్లీ మొదలైన లైంగికదాడులు, దోపిడీలు
Published Sat, Jul 26 2014 3:10 AM | Last Updated on Mon, Jul 30 2018 9:21 PM
Advertisement
Advertisement