గంజాయి మత్తులో యువతిపై ఇద్దరు యువకుల అత్యాచారం
అనంతరం మొహంపై కొట్టి.. ముక్కు, నోరు మూసి హత్య
వివరాలు వెల్లడించిన ఎస్పీ వకుల్ జిందాల్
చీరాల/చీరాల అర్బన్: బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపూరుపాలెం సీతారాంపేటకు చెందిన యువతిపై హత్యాచారం కేసును పోలీసులు ఛేదించారు. అదే గ్రామానికి చెందిన ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. ఎస్పీ వకుల్ జిందాల్ శనివారం రాత్రి మీడియాకు వెల్లడించిన వివరాల ప్రకారం.. సీతారాంపేటకు చెందిన పౌజుల సుచరిత (21) ఇంటర్ వరకు చదివి టైలరింగ్ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది.
శుక్రవారం ఉదయం 5.45 గంటలకు ఆ యువతి ఇంటి సమీపంలోని రైల్వే ట్రాక్ సమీపంలో బహిర్భూమికి వెళ్లింది. ఆ తరువాత రైల్వే ట్రాక్ పక్కన ముళ్లపొదల్లో వివస్త్రగా ఆమె మృతదేహం కనిపించింది. గుర్తు తెలియని వ్యక్తులు ఆమెపై అత్యాచారం జరిపి, హత్య చేశారని హతురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు చీరాల రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారడంతో పోలీసులు సవాల్‌గా తీసుకుని 10 బృందాలను రంగంలోకి దించి దర్యాప్తు చేపట్టారు.
గంజాయి మత్తులో..
అనుమానితులను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ చేపట్టగా.. ఈపూరుపాలెం గ్రామానికే చెందిన దేవరకొండ విజయ్, కారంకి మహే‹Ù, దేవరకొండ శ్రీకాంత్ ఈ దురాగతానికి పాల్పడినట్టు తేలింది. నిందితులు ముగ్గురినీ శనివారం సాయంత్రం చీరాల బైపాస్ రోడ్డు వద్ద హాయ్ రెస్టారెంట్ సమీపంలోని వాడరేవు వెళ్లే రోడ్డులో 50 మీటర్లు దూరంలో అరెస్ట్ చేసినట్టు ఎస్పీ వకుల్ జిందాల్ చెప్పారు.
గంజాయి మత్తుకు బానిసలైన నిందితులు శుక్రవారం తెల్లవారుజామున రైల్వేట్రాక్ సమీపంలో బహిర్భూమికి వెళ్లిన యువతిని ఏ1 విజయ్, ఏ2 మహేష్ బలవంతంగా చెట్ల పొదల్లోకి లాక్కెళ్ళారు. యువతి నోరుమూసి బలవంతంగా అత్యాచారం చేసి అనంతరం ముఖంపై దాడి చేయడంతోపాటు నోరు, ముక్కు మూసి హత్య చేశారన్నారు. ఆ ఇద్దరికీ ఏ3 శ్రీకాంత్ ఆశ్రయం కల్పించాడన్నారు. ముగ్గురు నిందితులకు నేరచరిత్ర ఉందని.. వారిపై చీరాల రూరల్ పోలీస్‌స్టేషన్‌లో గతంలో పలు కేసులు నమోదై ఉన్నాయని ఎస్పీ చెప్పారు.
అడిషనల్ ఎస్పీ టీపీ విఠలేశ్వర్ ఆధ్వర్యంలో చీరాల డీఎస్పీ బేతపూడి ప్రసాద్, బాపట్ల డీఎస్పీ సీహెచ్ మురళీకృష్ణ పర్యవేక్షణలో చీరాల రూరల్ సీఐ నిమ్మగడ్డ సత్యనారాయణ దర్యాప్తు చేశారన్నారు. ముగ్గురు నిందితులపై కోర్టులో చార్జిïÙట్ వేసి నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామన్నారు. మహిళలపై నేరాలకు పాల్పడే వారికి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
నిందితుల్ని కఠినంగా శిక్షించాలి
యువతి హత్యాచార ఘటన సభ్యసమాజం తలదించుకునేలా ఉందని వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ పోతుల సునీత అన్నారు. నిందితుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. యువతి కుటుంబ సభ్యులను శనివారం సునీత పరామర్శించారు. రాష్ట్రంలో ఇటువంటి ఘటనలు జరగడం దారుణమన్నారు.
ఆమె వెంట జెడ్పీటీసీ ఆకురాతి పద్మిని, గంజి చిరంజీవి ఉన్నారు. ఇదిలావుండగా.. హత్యాచారానికి గురైన పౌజుల సుచరిత కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి శనివారం పరామర్శించారు. ఆ కుటుంబానికి ధైర్యం చెప్పి వారికి భరోసా కల్పించారు. యువతిపై హత్యాచార ఘటన దారుణమని, నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment