ఇల్లాలే హంతకురాలు.. | Manikya Rao Murder Case In Chirala | Sakshi
Sakshi News home page

ఇల్లాలే హంతకురాలు..

Published Wed, Apr 3 2019 6:08 PM | Last Updated on Wed, Apr 3 2019 6:09 PM

Manikya Rao Murder Case In Chirala - Sakshi

కేసు వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ నాగరాజు, పక్కన సీఐ రాజమోహన్‌రావు  

సాక్షి, చీరాల రూరల్‌: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఓ ఇల్లాలు తన భర్తను చంపించింది. తండ్రి చనిపోవడం..తల్లి జైలుకు వెళ్లడంతో పిల్లలు అనాధలుగా మిగిలారు. ఈ సంఘటన చీరాలలో వెలుగు చూసింది. పట్ట పగలు అంతా చూస్తుండగా ఐదు రోజుల క్రితం మాణిక్యరావు అనే యువకుడిని ఇద్దరు కలసి అత్యంత పాశవికంగా కత్తితో పొడిచి హత్య చేశారు. ఈ కేసులో చీరాల టూటౌన్‌ పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. మంగళవారం టూటౌన్‌ పోలీసు స్టేషన్‌లో సీఐ రాజమోహన్‌రావు ఆధ్వర్యంలో డీఎస్పీ నాగరాజు మీడియా సమావేశం ఏర్పాటు చేసి నిందితుల వివరాలు వెల్లడించారు. డీఎస్పీ కథనం ప్రకారం.. చీరాల రంగారెడ్డి నగర్‌కు చెందిన పాశం మాణిక్యరావు (30), కృష్ణకుమారిలు ప్రేమ వివాహం చేసుకున్నారు.

వీరికి ఎనిమిదేళ్ల లోపు వయసున్న కుమారై, కుమారుడు ఉన్నారు. బెస్తపాలెంలో ఆర్యాస్‌ ఫ్యాషన్‌ పేరుతో బట్టల షాపు నిర్వహిస్తున్నారు. నిత్యం సెల్‌ఫోన్‌తో కాలక్షేపం చేసే కృష్ణకుమారికి ఫేస్‌బుక్‌ ద్వారా తమిళనాడు రాష్ట్రం గుడియాట్టానికి చెందిన వెంకట్‌ నాథన్‌ శివ అనే యువకుడు పరిచయమయ్యాడు. కొంతకాలం పాటు వీరు స్నేహం కొనసాగించారు. అనంతరం వెంకట్‌ నాథన్‌ శివతో తెగతెంపులు చేసుకుంది. వెంకట్‌ నాథన్‌ శివ స్నేహితుడు మధన్‌ కుమార్‌ మనోగరన్‌తో పరిచయం పెంచుకుంది. ఇద్దరూ కలిసి కొంతకాలం నుంచి వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నారు. కృష్ణకుమారి తన భర్త పాశం మాణిక్యరావుకు మధన్‌ కుమార్‌ మనోగరన్‌ను కూడా పరిచయం చేసింది. ఈ నేపథ్యంలో మధన్‌ అప్పుడప్పుడూ చీరాల వచ్చి కృష్ణకుమారి ఇంట్లో బస చేసేవాడు. భార్య ప్రవర్తనపై మాణిక్యరావుకు అనుమానం కలిగింది. ఎలాంటి బంధుత్వం లేని తమిళనాడుకు చెందిన యువకుడితో భార్య సన్నిహితంగా ఉంటడం భర్తకు నచ్చలేదు. తప్పుడు ప్రవర్తన మానుకోవాలని భార్యపై ఒత్తిడి తెచ్చాడు. ఇద్దరి మధ్య తరుచూ గొడవలూ జరిగాయి. 


భార్య పథకం ప్రకారమే హత్య
విసుగు చెందిన ఆమె భర్తను అడ్డు తొలగించుకోవాలని పథకం రచించింది. ఇదే విషయాన్ని మధన్‌తో చెప్పింది. ఇద్దరూ కలిసి మాణిక్యరావును చంపేయాలని నిర్ణయించుకున్నారు. అనుకున్న ప్రకారం ప్రణాళిక రచించారు. ఏ విధంగా హత్య చేయాలనే విషయంపై మధన్‌ తన సోదరుడైన దీపక్‌తో చర్చించాడు. దీపక్‌ అతని స్నేహితుడైన బ్లేడ్‌ అనేవ్యక్తి సాయంతో పది రోజుల క్రితం చీరాల చేరుకున్నారు. మాణిక్యరావుపై రెక్కీ నిర్వహించారు. గత నెల 29వ తేదీ ఉదయం వాకింగ్‌కు వెళ్లిన మాణిక్యరావును కొత్తపేటలోని ఏకేపీ జూనియర్‌ కళాశాల సమీపంలో దీపక్‌ అతని స్నేహితుడు బ్లేడు ద్విచక్ర వాహనంపై అనుసరించారు.

ఎవరూ గుర్తు పట్టకుండా ఉండేందుకు తలకు హెల్మెట్లు ధరించి మాణిక్యరావును అడ్డుకున్నారు. ఆ వెంటనే దీపక్, అతని స్నేహితుడు బ్లేడు కలిసి మాణిక్యరావు మెడపై కత్తితో తీవ్రంగా పొడిచి పరారయ్యారు. మాణిక్యరావు రక్తమోడుతున్న పరిస్థితిలో సమీపంలోనే ఉన్న టూటౌన్‌ పోలీసుస్టేషన్‌కు చేరుకుని దీపక్‌ అనే వ్యక్తి తనను పొడిచాడని పోలీసులకు చెప్పి అపస్మారక స్థితిలోకి చేరుకున్నాడు. స్పందించిన పోలీసులు ఆయన్ను చికిత్స కోసం ఏరియా వైద్యశాలకు తరలించారు. వైద్యులు తీవ్రంగా శ్రమించి శస్త్ర చికిత్స చేశారు. ఫలితం లేకపోవడంతో మెరుగైన వైద్యం కోసం గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అతని ఆరోగ్య పరిస్థితి విషమించడంతో గుంటూరులోనే మృతి చెందాడు. 


తండ్రి ఫిర్యాదులో కదిలిన డొంక 
తన కుమారుడిని పాత గొడవల నేపథ్యంలో తమిళనాడుకు చెందిన దీపక్‌ అనే వ్యక్తి కత్తితో పొడిచి హత్య చేశాడనే మృతుడి తండ్రి ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. కేసును పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టారు. డీఎస్పీ నాగరాజు ఆధ్వర్యంలో సీఐ రాజ మోహనరావు, ఎస్‌ఐ నాగేశ్వరరావుతో కూడిన ప్రత్యేక బృందాలు దర్యాప్తును ముమ్మరం చేశాయి. మాణిక్యరావు భార్య కృష్ణకుమారిని కూడా తమదైన శైలిలో విచారించడంతో అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయని డీఎస్పీ తెలిపారు. కేసులో దీపక్, అతని స్నేహితుడు బ్లేడు, మరికొందరిని కూడా అరెస్టు చేయాల్సి ఉందని పేర్కొన్నారు. కేసును ఐదు రోజుల్లో ఛేదించిన సీఐ రాజమోహన్‌రావు, ఎస్‌ఐ నాగేశ్వరరావు మరి కొందరు కానిస్టేబుళ్లను డీఎస్పీ నాగరాజు అభినందించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement