- ఒకే రోజు నాలుగు ప్రాంతాల్లో ...
- ఒరిస్సాకు చెందిన ముఠా పనే
- బంగారు నగల దోపిడీ
మచిలీపట్నం : జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో ఓ దొంగల ముఠా సోమవారం వీరంగం సృష్టించింది. ఒకే రోజు నాలుగు ప్రాంతాల్లో సీనీ ఫక్కిలో నగలు దోచుకుపోయారు. నాలుగు చోట్లా బంగారు నగలు అపహరించిన వారు ఇద్దరు వ్యక్తులేనని పోలీసులు అనుమానిస్తున్నారు. పట్టణంలో నాలుగు ప్రాంతాల్లో దోపీడీలు జరగ్గా రెండు చోట్ల మహిళలను మాటల్లో పెట్టి వారు ఆదమరచి ఉన్నపుడు మెడలోని బంగారు నగలు తెంచుకుపోగా, మరో రెండు ప్రాంతాల్లో వాకింగ్ చేస్తున్న మహిళల వెనుక నుంచి వేగంగా బైక్‌పై వచ్చి వారి మెడలోని బంగారు గొలుసులను తెంపుకుని పోయారు.
ఈ ఘాతుకానికి పాల్పడిన వారు హిందీలో మాట్లాడుతున్నారని, ఈ తరహా దొంగతనాలు ఒరిస్సాకు చెందిన దొంగల ముఠాలే చేస్తుంటాయని పోలీసులు చెబుతున్నారు. ఈ నాలుగు సంఘటనల్లో 109 గ్రాముల బంగారాన్ని దుండగులు దోచుకుపోయారు.
మాటలు కలిపి.... అడ్రసు అడిగి....
సర్కారుతోటకు చెందిన బొల్లు శ్రీలక్ష్మీ తన ఇంటిముందు వాకిలి ఊడుస్తుండగా ఓ యువకుడు అక్కడకు వచ్చాడు. తన వద్ద ఉన్న చిన్నపాటి కాగితం చూపి ఫలానా పేరున్న వ్యక్తి ఇల్లు ఇదేనా అడిగాడు. ఆ పేరు గలవారు ఇక్కడ ఎవరూ లేరనే సమాధానం ఇచ్చే లోపుగానే శ్రీలక్ష్మీమెడలో ఉన్న బంగారు గొలుసును లాక్కునేందుకు దుండగుడు ప్రయత్నించాడు, తేరుకున్న శ్రీలక్ష్మీ ప్రతిఘటించింది.
నానుతాడుకు ఉన్న మంగళసూత్రాలు తెగి దుండగుడి చేతిలోకి రావడం, అతను పరిగెత్తడం అప్పటికే కొంచెం దూరంలో పల్సర్ ద్విచక్రవాహనంపై సిద్ధంగా ఉన్న యువకుడు దుండగుడితో సహా మాయం కావడం క్షణాల్లో జరిగిపోయాయి. స్థానిక యువకులు వారిని వెంటాడినా వారు చిక్కలేదు. ఈసంఘటనపై బాధితురాలు శ్రీలక్ష్మీ చిలకలపూడి పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేసింది.
అలాగే ఆర్టీసీ కాలనీలో తన ఇంటిగుమ్మం వద్ద ముగ్గువేస్తున్న యలవర్తి సీతారావమ్మను అడ్రసు కావాలంటూ మాటల్లో పెట్టి దుండగులు ఇదే తరహాలో ఆమె మెడలో ఉన్న 24గ్రాముల బరువున్న బంగారు నానుతాడును తెంచుకుపోయారు. సీతారావమ్మ మచిలీపట్నం పోలీస్ స్టేషన్‌లో ఈ సంఘటనపై ఫిర్యాదు చేశారు.
వాకింగ్ చేస్తుండగా...వేగంగా వాహనంపై వచ్చి ...
హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన రాపర్ల రమణకుమారి బైపాస్ రోడ్డు వెంబడి వాకింగ్ చేస్తుండగా పల్సర్ వాహనంపై వేగంగా వచ్చిన దుండగులు ఆమె మెడలోని 34 గ్రాముల బంగారు గొలుసును తెంచుకుని పరారయ్యారు.
రమణకుమారితో పాటు రోడ్డుపై ఉన్న జనం తేరుకునేలోపే వారు ద్విచక్రవాహనంతో సహా అదృశ్యమయ్యారు. మరో సంఘటనలో గంటా రామతారకం అనే మహిళ పరాసుపేటలోని సెయింట్ ఫ్రాన్సిస్ పాఠశాల వైపు నడచి వెళుతుండగా వెనుక నుంచి ద్విచక్రవాహనంపై వేగంగా వచ్చిన దుండగులు ఆమె మెడలో ఉన్న 43గ్రాముల బంగారు గొలుసును తెంపుకుపోయారు.
ఈ రెండు సంఘటనలపైనా రమణకుమారి చిలకలపూడిపోలీస్ స్టేషన్‌లో, రామతారకం మచిలీపట్నం పోలీస్ స్టేషనో ఫిర్యాదు చేశారు. ఒకే రోజు ఇద్దరు యువకులు నాలుగు ప్రాంతాల్లో మహిళల నుంచి బంగారు నగలను దోచుకుపోవడం పట్టణంలో సంచలనం కలిగించింది.