
ప్రతీకాత్మక చిత్రం
విజయవాడ: ఒంటరి మహిళలను నమ్మించి.. వారి బంగారు ఆభరణాలు కాజేస్తున్న వ్యక్తిని విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి రూ. 5 లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు 12 ఏళ్లుగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఎంతో మంది మహిళలను మోసం చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను స్థానిక కమాండ్ కంట్రోల్ రూంలో గురువారం ఎన్టీఆర్ జిల్లా డెప్యూటీ పోలీస్ కమిషనర్ విశాల్ గున్నీ వెల్లడించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..
చదవండి: కలిసి బతకలేమని.. చావులోనైనా ఒక్కటవ్వాలని..
ఒంటరిగానే జీవనం..
నెల్లూరు జిల్లా కోట మండలానికి చెందిన చేవూరి చంద్ర అలియాస్ వెందేటి చంద్ర చిన్నతనంలోనే తల్లిదండ్రులను వదిలేసి ఒంటరిగా జీవిస్తున్నాడు. కొన్నాళ్లు గూడూరు, తిరుపతిలోని ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగం చేశాడు. తిరుపతిలో పని చేస్తున్న రోజుల్లో జల్సాలకు అలవాటు పడి బస్టాండ్ చుట్టుపక్కల ఒంటరిగా జీవిస్తున్న మహిళలను టార్గెట్ చేశాడు. తాను ధనవంతుడినని, బంగారం వ్యాపారం చేస్తానని మహిళలతో పరిచయం పెంచుకునేవాడు.
చనువుగా ఉంటూ మహిళలను అదే ప్రాంతంలోని హోటల్‌కు తీసుకెళ్లి ముందుగానే తెచ్చుకున్న నిద్రమాత్రలు ఇచ్చి బంగారు ఆభరణాలు, డబ్బు తీసుకుని ఉడాయించేవాడు. 2010 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఈ తరహా నేరాలకు పాల్పడుతున్న నిందితుడిపై తిరుపతి, నెల్లూరు, విజయవాడ, గుంటూరు, ఏలూరు పోలీస్‌స్టేషన్‌లలో 20 కేసులు నమోదయ్యాయి. పలు మార్లు జైలు జీవితం అనుభవించినా.. చంద్ర ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు.
విజయవాడలో మరోసారి..
ఈ ఏడాది జనవరిలో చివరిగా జైలు నుంచి బయటకు వచ్చిన చంద్ర విజయవాడలోని భవానీపురానికి చెందిన మహిళను టార్గెట్ చేశారు. ఆమె వద్ద నుంచి 36 గ్రాముల బంగారు ఆభరణాలు కాజేసి పరారయ్యాడు. జూలైలో కృష్ణలంకలో నివాసం ఉంటున్న మరో మహిళను ఇదే తరహాలో మోసం చేసి 61.5 గ్రాముల బంగారు ఆభరణాలు కాజేశాడు.
కృష్ణలంకకు చెందిన మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు, నిందితుడిని స్థానిక పండిట్ నెహ్రూ బస్టాండ్ వద్ద గురువారం అదుపులోకి తీసుకుని అతని వద్ద నుంచి 97.5 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాదీనం చేసుకున్నారు. నిందితుడిని చాకచక్యంగా అదుపులోకి తీసుకున్న కృష్ణలంక సీఐ దుర్గారావు, క్రైం ఎస్‌ఐ కృష్ణబాబు, హెడ్‌కానిస్టేబుల్ సాంబయ్య, కాన్‌స్టేబుల్ బాబురావును డీసీపీ విశాల్ గున్నీ ప్రత్యేకంగా అభినందించి రివార్డు అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment