ఇక ప్రతి అడుగు రికార్డు
జంట కమిషనరేట్లలో వేల సీసీ కెమెరాలు
ప్రతి అడుగు రికార్డు.. నేరాలు, నేరగాళ్లపై నిత్యం నిఘా
కమ్యూనిటీ భాగస్వామ్యంతోనూ ఏర్పాటు
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అనుసంధానం
త్వరితగతిన దొరికిపోతున్న నేరస్తులు
ఈ ఏడాది చివరి నాటికి లక్ష సీసీ కెమెరాల ఏర్పాటు లక్ష్యం
సాక్షి, హైదరాబాద్: పట్టపగలు చైన్ స్నాచింగ్.. శివార్లలో దొంగల బీభత్సం.. ఇలాంటి వార్తలు మనకు రోజూ కనిపిస్తూ ఉంటాయి. వీటికి చెక్ చెప్పేందుకు పోలీసులు నగర వీధుల్లో లక్ష సీసీ కెమెరాల ఏర్పాటుకు సిద్ధమయ్యారు. దేశ రాజధాని ఢిల్లీ, ముంబై, సూరత్ తదితర నగరాలకు దీటుగా జంట కమిషనరేట్ల పరిధిలో సీసీ కెమెరాల ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేశారు. పలు కాలనీలు, వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా ముందుకు వస్తుండటంతో ఈ ఏడాది చివరికి వీటిని లక్షకు చేర్చాలనే లక్ష్యంతో హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్లు ముందుకు వెళ్తున్నారు. నగరంపై నిరంతర పర్యవేక్షణ, నేరగాళ్లపై నిఘా, కేసుల్ని కొలిక్కి తీసుకురావడంలో ఈ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. వీటన్నింటినీ ఆయా కమిషనరేట్లలో ఉన్న కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్స్(సీసీసీ)కు అనుసంధానం చేశారు. ఈ వ్యవస్థకు అత్యాధునిక పరిజ్ఞానాన్ని జోడించే పనిలో ఉన్నారు అధికారులు. ప్రభుత్వం ఈ ఏడాది రూ.వెయ్యి కోట్లు కేటాయించడంతో డిసెంబర్ నాటికి ప్రభుత్వ, ప్రైవేట్‌వి కలిపి లక్ష కెమెరాల ఏర్పాటు, కనెక్టివిటీ లక్ష్యంతో జంట కమిషనర్లు ముందుకు వెళ్తున్నారు. ఈ కల సాకారమైతే అలాంటి నిఘాతో కూడిన నగరంగా హైదరాబాద్ దేశంలోనే ప్రముఖ స్థానాన్ని ఆక్రమించనుంది.
ఏ మాత్రం ‘తేడా’ రాకుండా చర్యలు..
2014లో అమలులోకి వచ్చిన ప్రజాభద్రతా చట్టాన్ని కమిషనరేట్ల అధికారులు పక్కాగా అమలు చేస్తున్నారు. వ్యాపార సముదాయాలు, వాణిజ్య ప్రాంతాల్లో వ్యక్తిగతంగా, కమ్యూనిటీ మొత్తం కలసి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడాన్ని కచ్చితం చేశారు. పోలీస్‌స్టేషన్ల వారీగా బాధ్యతలు అప్పగించిన కమిషనర్లు.. ప్రజల్లో చైతన్యం తీసుకురావడంతో పాటు వీటి ఆవశ్యకతనూ వివరిస్తూ ఎవరికివారు ముందుకొచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా ఏర్పాటవుతున్న కమ్యూనిటీ కెమెరాలను ఎవరికి నచ్చిన మోడల్, సామర్థ్యం కలిగినని వారు ఏర్పాటు చేసుకుంటే సీసీసీతో అను సంధానం, పర్యవేక్షణలో ఇబ్బందులు ఎదురవుతాయి. అలా కాకుండా యూనిఫామిటీ కోసం పోలీసులు కొన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. పోలీసు విభాగమే ప్రముఖ కంపెనీతో సంప్రదింపులు జరిపి.. సీసీ కెమెరాలకు ఉండాల్సిన స్పెసిఫికేషన్స్‌ను నిర్దేశించి అంతా వాటినే ఏర్పాటు చేసుకునేలా చర్యలు తీసుకుంటోంది. జంట కమిషనరేట్లలో పోలీసు, ట్రాఫిక్ విభాగాలు ఏర్పాటు చేసిన కెమెరాలు సీసీసీతో అనుసంధానించి ఉన్నాయి. వీటి సంఖ్య పరిమితం కావడంతో అన్నిచోట్లా నిఘా సాధ్యం కావట్లేదు. దీంతో వ్యాపార సముదాయాలు, వాణిజ్య కూడళ్లతో పాటు దుకాణాల్లో ఏర్పాటు చేస్తున్న వాటినీ బ్రాడ్‌బ్యాండ్ ద్వారా సీసీసీతో అనుసంధానిస్తున్నారు.
కొలిక్కి వచ్చిన ‘కేస్ స్టడీస్’
మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జ్యువెలరీ దుకాణాలకు బంగారు ఆభరణాలు సరఫరా చేసే వ్యక్తి నుంచి 2.3 కేజీల బంగారం ఎత్తుకుపోయిన దుండగుడిని పట్టుకోవడానికి మూడు ప్రాంతాల్లోని సీసీ కెమెరాల్లో రికార్డైన ఫీడ్ కీలకంగా మారింది.
అబిడ్స్ పరిధిలో ఆరు నెలల బాలుడిని దుండగులు అపహరించారు. సీసీ కెమెరాల్లోని ఫీడ్ ఆధారంగా కిడ్నాపర్లు వాడిన ఆటో నంబర్ గుర్తించి బాబును కాపాడారు.
మారేడ్‌పల్లి పోలీసుస్టేషన్ పరిధిలో ప్రయాణికురాలి నుంచి నగలున్న బ్యాగ్‌ను ఆటోడ్రైవర్ అపహరించాడు. అనేక ప్రాంతాల్లోని కెమెరాల ఫీడ్‌ను అధ్యయనం చేసిన పోలీసులు కేసును కొలిక్కి తీసుకురాగలిగారు.
సంచలనం సృష్టించిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అభయపై సామూహిక అత్యాచారం కేసు మాదాపూర్ పరిధిలో జరిగింది. సీసీ కెమెరా ఫీడ్ ఆధారంగానే ఆమె ప్రయాణించిన కారును గుర్తించి నిందితుల్ని పట్టుకోగలిగారు.
శంషాబాద్ మండలంలోని పెద్దగోల్కొండలో బందిపోటు దొంగతనం చోటు చేసుకుంది. బాధితుడి ఇంటి వద్ద ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఫీడ్ ఆధారంగానే ఆ నేరం చేసింది పెద్దింటిగొల్ల గ్యాంగ్‌గా గుర్తించి.. అరెస్టు చేశారు.
ప్రజల స్పందన మరువలేం
సీసీ కెమెరాల ఏర్పాటు విషయంలో మా పిలుపునకు స్పందించి, ప్రజలు ఇస్తున్న సహకారం మరువలేనిది. వ్యాపార, వాణిజ్య వర్గాలే కాకుండా కాలనీలతో పాటు సామాన్య ప్రజలు సైతం ముందుకు వస్తున్నారు. రానున్న రోజుల్లో ప్రజలకు ఉపకరించే, నేరగాళ్ల కట్టడికి ఉపయుక్తమయ్యే సాంకేతిక పరిజ్ఞానాలను అందుబాటులోకి తీసుకువస్తున్నాం. ఈ ఏడాది హైదరాబాద్ పోలీసులు ‘ఇయర్ ఆఫ్ టెక్నాలజీ’గా మారుస్తాం. - ఎం.మహేందర్‌రెడ్డి, హైదరాబాద్ కొత్వాల్
అవగాహన కలిగించటంలో విజయవంతం
నేరాలు నిరోధించడం, కేసులు కొలిక్కి తీసుకురావడంలో సీసీ కెమెరాల పాత్ర కీలకంగా మారింది. వీటిని ఏర్పాటు చేసుకోవడం ఓ సామాజిక బాధ్యత అనే అంశాన్ని ప్రజల్లోకి సమర్థంగా తీసుకువెళ్ళడంలో విజయవంతమయ్యాం. కమిషనరేట్ వ్యాప్తంగా ఎక్కడికక్కడ మినీ కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసి పర్యవేక్షణ బాధ్యతల్లో ప్రజల్నీ భాగస్వాముల్ని చేస్తున్నాం. - సీవీ ఆనంద్, సైబరాబాద్ పోలీసు కమిషనర్