‘సీసీ’ పెట్టు.. సర్టిఫికెట్ పట్టు!
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో లక్ష సీసీ కెమెరాల ఏర్పాటును లక్ష్యంగా నిర్ణయించుకున్న పోలీసుల శాఖ దానిని నెరవేర్చేందుకు వివిధ ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే ‘గుడ్ సిటిజన్ ఆఫ్ హైదరాబాద్’ పేరుతో సర్టిఫికెట్ల అమలులోకి తీసుకురావాలని నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి నిర్ణయించారు. దీనిపై భారీ స్థాయిలో ప్రచారం సైతం నిర్వహించనున్నారు. ఇప్పటికే దాదాపు 10 వేల మార్క్ దాటిన సీసీ కెమెరాల ఏర్పాటును లక్షకు చేర్చడం, వాటిని కమిషనరేట్‌లోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానించడం పోలీసుల ప్రధాన లక్ష్యాలుగా కనిపిస్తున్నాయి.
అనేక కేసుల్లో కీలకాధారాలు...
కేబీఆర్ పార్క్ వద్ద బడా వ్యాపారవేత్త మీద కాల్పులు, వెస్ట్‌జోన్ పరిధిలో జరిగిన టెన్త్ క్లాస్ విద్యార్థి అభయ్ కిడ్నాప్, హత్య కేసులతో పాటు నగరంలో అనేక కీలక, సంచలనాత్మక నేరాలు కొలిక్కిరావడానికి సీసీ కెమెరాలే ఆధారమయ్యాయి. కేవలం కేసుల్ని పరిష్కరించి నేరగాళ్ళను పట్టుకోవడంతో పాటు న్యాయస్థానాల్లో వారిని దోషులుగా నిరూపించడంలోనూ ఈ ఫీడ్ కీలకపాత్ర పోషిస్తోంది. ఈ నేపథ్యంలోనే నగర వ్యాప్తంగా సీసీ కెమెరాల ఏర్పాటును పోలీసు విభాగం ప్రోత్సహిస్తోంది.
ఓపక్క ప్రభుత్వం ఇచ్చే నిధులతో పాటు మరోపక్క వృత్తి, వ్యాపార, వాణిజ్య, వర్తక సంఘాలతో పాటు అపార్ట్‌మెంట్లు, స్కూళ్ళు, కాలనీ అసోసియేషన్లనూ కలుపుకుంటూ ముందుకు వెళ్తోంది. ఆయా ఠాణాల్లో ఉండే ఇన్ స్పెక్టర్లకు ఈ బాధ్యతల్ని అప్పగిస్తూ వీలున్నంత వరకు భారీ స్థాయిలో సీసీ కెమెరాలు ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకుంటోంది.
తాజాగా సర్టిఫికెట్ల ఆలోచన...
ఈ చర్యలకు కొనసాగింపుగా సర్టిఫికెట్ల అందజేత అంశాన్నీ నగర పోలీసులు పరిశీలిస్తున్నారు. నగరంలో ఏర్పాటయ్యే ఒక్కో కెమెరా వంద మంది పోలీసులతో సమానమంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ప్రజాభద్రతా చట్టంలోని అంశాలు, లండన్ నగరంలో ప్రభుత్వం ప్రజలు కలిసి సీసీ కెమెరాలు ఏర్పాటులో సాధించిన విజయాలను ప్రజలకు వివరిస్తూ కరపత్రాలు ముద్రిస్తున్నారు. వీటిని పోలీసుస్టేషన్ల వారీగా పంపిణీ చేస్తూ సీసీ కెమెరాల ఏర్పాటు, వాటి ఫీడ్‌ను కనీసం 30 రోజులైనా భద్రపరిచేలా చర్యలు తీసుకోవడం వంటి అంశాలపై అవగాహన కల్పించడానికి సంసిద్ధమయ్యారు.
ఈ కెమెరాలు ఎవరికి వారుగా ఏర్పాటు చేసుకునేలా ప్రజల్ని ప్రోత్సహించడంలో భాగంగా సర్టిఫికెట్ల జారీ విధానానికి శ్రీకారం చుట్టనున్నారు. స్వీయ భద్రతలో పాటు నగర భద్రతలో భాగస్వాములవుతూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్న వారికి ‘గుడ్ సిటిజన్ ఆఫ్ హైదరాబాద్’ పేరుతో నగర పోలీసు కమిషనర్ సర్టిఫికెట్లు జారీ చేయనున్నారు. ఈ అంశాలపై ‘నేను సైతం’ పేరిట ఉండే కరపత్రాలను ముద్రించి వ్యాపార, వాణిజ్య కేంద్రాలతో పాటు పోలీసుస్టేషన్ల వారీగానూ విస్తత స్థాయిలో ప్రచారం చేయడానికి సిటీ కాప్స్ సన్నాహాలు చేస్తున్నారు.