బహదూర్‌పురా: బక్రీద్ పండుగను శాంతి యుత వాతావరణంలో నిర్వహించుకునేందుకు అన్ని రకాల చర్యలను తీసుకుంటున్నామని నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్ రెడ్డి తెలిపారు. సాలార్‌జంగ్ మ్యూజియంలో శనివారం ముస్లింలతో కలిసి బక్రీద్‌పై ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ... నగర వ్యాప్తంగా వివిధ కూడళ్లలో చెక్ పోస్టులు, 40 చెక్ పాయింట్లను ఏర్పాటు చేశామని... 20 వేల మంది పోలీసులతో బందోబస్తును నిర్వహిస్తూ పర్యవేక్షిస్తామన్నారు.
గోవుల తరలింపు లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటామన్నారు. చార్మినార్ ఎమ్మెల్యే సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రీ మాట్లాడుతూ... రోడ్లపై పశువులను విక్రయించుకునే వారికి విశాలమైన ప్రాంతాల్లో వసతులు ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయమన్నారు. జీహెచ్‌ఎంసీ దక్షిణ మండలం జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ... బక్రీద్‌లో వ్యర్ధాలను తొలగించేందుకు ఉన్న వాహనాలకు తోడు అదనంగా 150 వాహనాలను సమకూర్చామన్నారు. మైనార్టీ వెల్ఫేర్ సెక్రటరీ, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎండీ ఉమర్ జలీల్, షఫివుల్లా తదితరులు పాల్గొన్నారు.