bahadurpura
-
Hyderabad: పక్కకు ఒరిగిన నిర్మాణంలో ఉన్న భవనం
బహుదూర్‌పురా: హైదరాబాద్ నగరంలోని బహదూర్‌పురాలో నిర్మాణంలో ఉన్న ఓ భవనం పక్కకు ఒరిగిపోయింది. నిర్మాణ పనులు జరుగుతున్న క్రమంలో ఆ బహుళ అంతస్తుల భవనం ఓ వైపునకు ఒరిగింది. దాంతో భయాందోళన చెందిన స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేశారు. దాంతో సంఘటనా స్థలికి చేరుకుని భవనాన్ని పరిశీలించారు అధికారులు. ఆ భవనం యజమానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. భవనం పక్కకు ఒరిగిపోవడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో చుట్టుపక్కల వారిని ఖాళీ చేయించే ప్రయత్నాలను ముమ్మరం చేశారు అధికారులు. -
బహదూర్‌పురా ఫ్లై ఓవర్ ప్రారంభం.. జూపార్కు టూరిస్టులకు ఇక సాఫీ ప్రయాణం
సాక్షి, సిటీబ్యూరో: నగరం కోర్‌సిటీ వైపు నుంచి శంషాబాద్ విమానాశ్రయం, మహబూబ్‌నగర్ జిల్లా వైపు (పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్‌వే మీదుగా కాకుండా) రాకపోకలు సాగించే వారికి ట్రాఫిక్ చిక్కుల నుంచి ఉపశమనం కలిగించేలా పాతబస్తీలో ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చింది. బహదూర్‌పురా ఫ్లైఓవర్‌ను మున్సిపల్, ఐటీ శాఖల మంత్రి కె. తారకరామారావు.. ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీతో కలిసి మంగళవారం ప్రారంభించారు. బహదూర్‌పురా జంక్షన్ వద్ద నిర్మించిన ఈ ఫ్లైఓవర్‌తో ఆ మార్గంలో రాకపోకలు సాగించే వారికి, జూపార్కు సందర్శించే టూరిస్టులకు సాఫీ ప్రయాణం సాధ్యం కానుంది. రాబోయే 20 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకొని దీన్ని నిర్మించారు. ఫ్లై ఓవర్‌తోపాటు మీరాలం ట్యాంక్ వద్ద మ్యూజికల్ ఫౌంటెన్, ముర్గీచౌక్, మీరాలంమండి, సర్దార్ మహల్ ఆధునికీకరణ పనులకు కేటీఆర్ శంకుస్థాపన చేశారు. కార్యక్రమాల్లో ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. వీటితోపాటు కార్వాన్ నియోజకవర్గంలో మూడు ప్రాంతాల్లో రూ.297 కోట్ల విలువైన సివరేజి పనులకు, కాలాపత్తర్ పోలీస్‌స్టేషన్ పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ అభివృద్ధి కార్యక్రమాల అంచనా వ్యయం దాదాపు రూ. 500 కోట్లు. బహదూర్‌పురా ఫ్లై ఓవర్ నిర్మాణ వ్యయం: రూ. 69 కోట్లు పొడవు: 690 మీటర్లు వెడల్పు: 24 మీటర్లు క్యారేజ్‌వే: రెండు వైపులా(ఒక్కోవైపు 3లేన్లు) ► ప్రాజెక్టులో భాగంగా జరిపిన భూసేకరణ, యుటిలిటీస్ షిఫ్టింగ్ తదితరాలు కలిపితే మొత్తం వ్యయం రూ.108 కోట్లు. ► ట్రాఫిక్ చిక్కులు తప్పడంతోపాటు ప్రయాణ సమయం, వాహన.. ధ్వని కాలుష్యం, ఇంధనం, వాహన నిర్వహణ వ్యయం వంటివి తగ్గుతాయి. ► ఫ్లై ఓవర్ కింద పచ్చదనం ప్రజలకు ఆహ్లాదం కలిగించనుంది. ► క్రాష్‌బారియర్స్, ఫ్రిక్షన్ శ్లాబ్స్ తదితర పనులకు ఆర్సీసీ ప్రీకాస్ట్ టెక్నాలజీ వినియోగించినట్లు, పాతబస్తీలో ఈ టెక్నాలజీ వాడటం దీనితోనే ప్రారంభించినట్లు సూపరింటెండింగ్ ఇంజినీర్ దత్తుపంత్ తెలిపారు. పాతబస్తీలో పనులు.. కొన్ని ప్రాంతాల్లోనే అభివృద్ధి పనులు చేస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో పాత బస్తీలోనూ పలు పనులు చేపట్టారు. పాతబస్తీ వైపు ప్రయాణించే వారికి ఇప్పటికే ఏపీజీ అబ్దుల్‌కలాం ఫ్లై ఓవర్, బైరామల్‌గూడ ఫ్లై ఓవర్లు అందుబాటులోకి రావడం తెలిసిందే. కొత్తగా చేపట్టినవి.. ముర్గీచౌక్ (మహబూబ్‌చౌక్) ఆధునికీకరణ వ్యయం : రూ. 36 కోట్లు. మాంసం మార్కెట్‌గా పేరుగాంచిన ముర్గీచౌక్ కాంప్లెక్స్‌ను సంప్రదాయ డిజైన్‌ను మార్చకుండా అదనపు అంతస్తుతో ఆధునికీకరించనున్నారు. ప్లాజా ఎంట్రెన్స్ వరకు లైటింగ్, బెంచీలు, పచ్చదనం వంటివాటితో నవీకరించనున్నారు. ప్రదేశం చరిత్రను కాపాడుతూనే నగరీకరణకు అనుగుణంగా మార్చనున్నారు. మీరాలం మండి.. వ్యయం: రూ.21.90 కోట్లు అతి పెద్ద, పురాతన మీరాలం మండిని విక్రేతలకు తగిన ప్లాట్‌ఫారాలు, షెడ్లు, అంతర్గత రోడ్లు, నడక దారులు వంటి వాటితోపాటు ప్రస్తుత అవసరాలకనుగుణంగా ఆధునికీకరించనున్నారు. ఈ మార్కెట్లో 43 హోల్సేల్దుకాణాలతోపాటు దాదాపు 300 మంది విక్రేతలు ఇక్కడ వ్యాపారం సాగిస్తున్నారు. సర్దార్‌మహల్.. వ్యయం : రూ. 30 కోట్లు వారసత్వ భవనమైన సర్దార్‌మహల్‌ను 1900 సంవత్సరంలో నిర్మించారు. శిథిలావస్థకు చేరడంతో పునరుద్ధరణ, ఆధునికీకరణలతో పాటు సాంస్కృతిక కేంద్రంగా, పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయనున్నారు. మీరాలంట్యాంక్ మ్యూజికల్ ఫౌంటెన్.. వ్యయం: రూ. 2.55 కోట్లు జూపార్కు సందర్శకులకు మరో ఆకర్షణగా దగ్గర్లోనే ఉన్న మీరాలంట్యాంక్ వద్ద వినియోగంలోకి రానున్న మల్టీ మీడియా మ్యూజికల్ ఫౌంటెన్ ప్రత్యేక రంగుల లైటింగ్, మ్యూజిక్లతో పర్యాటకులను ఆకట్టుకోనుంది. ప్రతిరోజు సాయంత్రం 15 నిమిషాల వ్యవధితో రెండు షోలు నిర్వహించనున్నట్లు సమాచారం. ఎస్సార్డీపీతో.. జీహెచ్ఎంసీలో ఫ్లైఓవర్లు వంటి పనులకు ప్రత్యేకంగా ఎస్సార్డీపీని ఏర్పాటు చేయడం తెలిసిందే. ఎస్సార్డీపీ మొదటిదశలో చేపట్టిన 47 నుల్లో దాదాపు 30 పూర్తయినట్లు జీహెచ్ఎంసీ పేర్కొంది. వాటిలో 13 ఫ్లైఓవర్లు, 7 అండర్ పాస్‌లున్నాయి. మ్యూజికల్ ఫౌంటెన్.. డ్యాన్సింగ్ అదిరెన్ నగరవాసులకు ఆహ్లాదకరమైన అనుభూతిని అందజేసే అద్భుతమైన మల్టీమీడియా మ్యూజికల్ ఫౌంటెన్ మంగళవారం ప్రారంభమైంది.పాతబస్తీ వాసులతో పాటు జూపార్కు సందర్శనకు వచ్చే పర్యాటకులకు దీంతో ఎంతగానో ఆహ్లాదం కలగనుంది. ఈ ఫౌంటెన్ ఒక వినూత్నమైన అనుభవాన్ని అందజేయనుంది. రంగు రంగుల హరివిల్లులతో మ్యూజికల్ ఫౌంటెన్ ఒకేసారి సంగీతాన్ని, డ్యాన్సింగ్ ఎఫెక్ట్‌ను కూడా ప్రదర్శిస్తుంది. ఈ మొత్తం వ్యవస్థ ఆధునిక సాంకేతికత, సంగీతాలను మేళవించుకొని పని చేసేవిధంగా సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు. -
తెలంగాణలో ఎకరం రూ.24.22 కోట్లు.. ఎక్కడంటే?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వ్యవసాయ భూముల ప్రభుత్వ విలువలూ ఖరారయ్యాయి. హైదరాబాద్‌లోని సరూర్‌నగర్, బహదూర్‌పురా మండలాల్లో ఎకరం రూ.22.02 కోట్లుగా ఉన్న ప్రభుత్వ విలువను రాష్ట్రంలోనే అత్యధికంగా రూ.24.22 కోట్లకు పెంచారు. ఆ తర్వాత హైదర్‌నగర్, కూకట్పల్లి, బాలానగర్, మూసాపేట్ మండలాల్లో ప్రస్తుతం ఎకరం రూ.18.87 కోట్లు, కర్మన్‌ఘాట్‌లో రూ. 13.55 కోట్లు, మాదాపూర్‌లో రూ. 12.58 కోట్లు ఉండగా.. ఈ విలువను 10 శాతం పెంచారు. ఆ తర్వాత గచ్చిబౌలి, మియాపూర్, నానక్‌రాంగూడ లో రూ.9.43 కోట్లు, నిజాంపేట, అత్తాపూర్‌లో రూ.6.29 కోట్లు, నాగోల్ బండ్లగూడలో రూ. 5.03 కోట్లుగా ఉన్న విలువను 20 శాతం పెంచారు. కాగా సాగు, సాగేతర భూముల విలువలన్నిటినీ శనివారం జిల్లాల్లో జరిగే కమిటీలు ఆమోదించనున్నాయి. -
మటన్ కత్తి తగిలి బాలుడు మృతి
బహదూర్‌పురా: ప్రమాదవశాత్తు మటన్ షాపులో ఉన్న కత్తి తగిలి ఓ బాలుడు మృతి చెందిన సంఘటన కాలాపత్తర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ సుదర్శన్ తెలిపిన వివరాల ప్రకారం... కాలాపత్తర్ ప్రాంతానికి చెందిన మహ్మద్ ఖురేషి తన ఇంటి వద్ద మటన్ షాపును నిర్వహిస్తున్నాడు. ఈ నెల 26వ తేదీన మహ్మద్ ఖురేషి కుమారుడు రియాజ్ ఖురేషి (13) మటన్ షాపులోకి వెళ్లాడు. ప్రమాదవశాత్తు కత్తి కాలుకు తగలడంతో తీవ్ర రక్తస్రావం అయింది. బాలుడిని చికిత్స నిమిత్తం స్థానికంగా ఉన్న ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం మరో ఆసుపత్రికి తరలించగా... రెండు రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందాడు. దీంతో తండ్రి మహ్మద్ ఖురేషి నుంచి ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ( చదవండి: వాడిని చంపేయండి.. వదలొద్దు! ) -
లైసెన్స్ తుపాకీతో భార్య, కుమారుడిపై కాల్పులు
సాక్షి, బహదూర్‌పురా: కుటుంబ కలహాల నేపథ్యంలో లైసెన్స్ తుపాకీతో భార్య, కుమారుడిపై ఓ వ్యక్తి కాల్పులు జరిపిన సంఘటన కాలాపత్తర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం సాయంత్రం చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ సుదర్శన్ తెలిపిన వివరాల ప్రకారం..కాలాపత్తర్ బిలాల్‌నగర్ ప్రాంతానికి చెందిన హబీబ్ హష్మీ (52) రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. గత కొంతకాలంగా చెడు వ్యసనాలకు బానిసైన హబీబ్.. సోమవారం సాయంత్రం 5.30 గంటలకు ఇంటి పేపర్లు ఇవ్వాలంటూ భార్య, కుమారుడితో గొడవ పడ్డాడు. పేపర్లు ఇవ్వమంటూ చెప్పడంతో ఆగ్రహించిన హబీబ్ ఇంట్లోకి వెళ్లి సాయంత్రం 5.45 గంటలకు లైసెన్స్ తుపాకీతో భార్య, కుమారుడిపై కాల్పులు జరిపాడు. తృటిలో కాల్పుల నుంచి తప్పించుకున్న కుమారుడు ఉమర్ హష్మీ వెంటనే కాలాపత్తర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంటనే స్పందించిన పోలీసులు హబీబ్ హష్మీని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. -
తెల్ల పులులను చూడాలా..?
సాక్షి, బహదూర్‌పురా: నెహ్రూ జూలాజికల్ పార్కుకు ప్రత్యేకమైన రాయల్ బెంగాల్ వైట్ టైగర్లు కొత్త సంవత్సరం నుంచి జూ సందర్శకులను అలరించనున్నాయి. జూపార్కు వ్యవస్థాపక దినమైన అక్టోబర్ 6న కునాల్, దివ్యానీ దంపతులకు నాలుగు పులి కూనలు జన్మించాయి. వాటిని కలుపుకొని జూలో మొత్తం 14 రాయల్ బెంగాల్ వైట్ టైగర్లు ఉన్నాయి. ఇందులో మగవి ఆరు, ఆడవి మూడు ఉన్నాయి. జూపార్కులో చేపట్టిన సంతానోత్పత్తిలో పుట్టిన ఈ పులులకు జూ అధికారులు, అటవీ శాఖ మంత్రులు పేర్లు పె ట్టారు. జూలో తెల్ల పులుల పేర్లు నాగమణి, కవి, సమీరా, అభిమన్యు, శంకర్ పేర్లు పెట్టారు. మన దేశంలో రాయల్ బెంగాల్ వైట్ టైగర్లు ప్రత్యేకమైనవి. ఇతర దేశాల్లో ఇవి అరుదు. -
బహదూర్‌పుర ఎమ్మెల్యేకు గుండెపోటు
సాక్షి, హైదరాబాద్ : బహదూర్‌పుర ఎమ్మెల్యే మొజంఖాన్‌కు గుండెపోటు వచ్చింది. దీంతో అతని కుటుంబ సభ్యులు హుటాహుటిన నానల్‌నగర్ ఆలివ్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఐసీయూలో ఉంచి మొజంఖాన్‌కు చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ ఆస్పత్రికి వెళ్లి ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. బహదూర్‌పుర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎంఐఎం శాసన సభ్యుడిగా మొజంఖాన్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. -
జూపార్కులో ధరల పెంపు
బహదూర్‌పురా: నెహ్రూ జూలాజికల్ పార్కులోని ఫిష్ అక్వేరియం, నిశాచర జంతుశాల, ఫొసిల్ మ్యూజియం, మూత్రశాలల వినియోగానికి ఈ నెల 12 నుంచి ఎలాంటి రుసుం వసూలు చేయబోమని జూ క్యూరేటర్ క్షితిజా బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జూపార్కులోని ఫిష్ అక్వేరియానికి ప్రస్తుతం రూ.10, నిశాచర జంతుశాలకు పెద్దలకు రూ.20, పిల్లలకు రూ.10, ఫొసిల్ మ్యూజియానికి రూ.5, మూత్ర విసర్జనకు రూ.3, 5 చొప్పున రుసుం వసూలు చేస్తున్నారు. ఈ నెల 12 నుంచి వీటి ప్రవేశం ఉచితంగా పొందవచ్చన్నారు. కాగా జూపార్కు ప్రవేశ రుసుం పెద్దలకు రూ.40, చిన్నారులకు రూ.25గా ఉందని.. ఈ నెల 12 నుంచి పెద్దలకు రూ.50, చిన్నారులకు రూ.30 రుసుం తీసుకోనున్నామన్నారు. వారాంతపు సెలవు రోజులైన శని, ఆదివారాల్లో ప్రవేశ ముఖద్వారం రుసుం పెద్దలకు రూ.60, చిన్నారులకు రూ.40 వసూలు చేస్తున్నామని.. పెద్దలకు మాత్రం రూ.10ని పెంచి రూ.70 వసూలు చేయనున్నామన్నారు. వారాంతపు, సెలవు రోజు పెద్దలకు రూ.80, చిన్నారులకు రూ.50 వసూలు చేయనున్నామన్నారు. 10 సీట్ల కాలుష్య రహిత బ్యాటరీ వాహనం ప్రత్యేక రైడ్ కోసం 120 నిమిషాలకు రూ.2 వేలు, 14 సీట్ల వాహనానికి రూ.3 వేలు వసూలు చేయనున్నామన్నారు. స్టిల్ కెమెరా రుసుం రూ.30 నుంచి 100కు, వీడియో కెమెరా రుసుం రూ.120 నుంచి 500కు పెంచామన్నారు. చిట్టి రైలు రుసుం పెద్దలకు రూ.20, చిన్నారులకు రూ.10, వారాంతపు, సెలవు రోజుల్లో పెద్దలకు రూ.30, చిన్నారులకు 15 వసూలు చేయనున్నామన్నారు. జూపార్కులో గెస్ట్‌హౌస్ రుసుం రూ.1000 నుంచి రూ.2 వేలకు పెంచామన్నారు. ఐదుగురు దాటితే అదనంగా ఒకరికి రూ.200 చార్జీ చేస్తామన్నారు. గెస్ట్‌హౌస్ వద్ద ఉన్న హాల్లో 40 మంది ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటలకు సమావేశం నిర్వహించుకునేందుకు రూ.10 వేల చార్జి వసూలు చేస్తున్నామన్నారు. లయన్ సఫారీ పార్కు వాహనం పెద్దలకు రూ.50, చిన్నారులకు రూ.30 ఉండగా... వారాంతపు, సెలవు రోజుల్లో రూ.60 వసూలు చేస్తున్నామన్నారు. సఫారీ వాహనంలో చిన్నారుల టికెట్టు రూ.30 నుంచి రూ.20కి తగ్గించామన్నారు. హెడ్ ఆఫ్ ది ఫారెస్ట్ ప్రిన్సిపాల్ చీఫ్ కన్జర్వేటర్ ప్రత్యేక ఆదేశాల మేరకు రుసుంలను పెంపుతో పాటు కొన్ని ప్రవేశాలు ఉచితం చేశామన్నారు. పెరిగిన ధరలు, ఉచిత సేవలు ఈ నెల 12 నుంచి అమల్లోకి వస్తాయన్నారు. -
జూలాలా.. తిరిగొచ్చెయ్యాలా!
పార్కులో 120, 85 ఏళ్ల వయసున్న తాబేళ్లు ఉన్నాయి. నాంపల్లి జూపార్కు నుంచి ప్రస్తుత పార్కు వరకు పెద్ద తాబేలు ప్రస్థానం కొనసాగుతోంది. ఈ రెండు జీవులు జూ పార్కులో అంత్యంత ఓల్డేస్ట్గా గుర్తింపు పొందాయి. పార్కులో 163 జాతులకు చెందిన 1600 రకాల జంతువులు, 72 జాతులకు చెందిన 700 పక్షులతో పాటు సరిసృపాలు ఉన్నాయి. ఇందులో 30 క్రూరమృగాల జాతులు, 30 శాకాహార జంతు జాతులు ఉన్నాయి. 50కి పైగా పక్షి జాతులు ఉన్నాయి. జంతువులకు ప్రతిరోజు సమృద్ధిగా ఆహారం అందజేస్తారు. వారాంతంలో ఒక రోజు (శుక్రవారం) మాత్రం పస్తులు ఉంచుతారు. ఇది వాటి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని అధికారులు చెబుతున్నారు. జూ పార్కును సందర్శించిన అరబ్ యువరాజులు ఏషియాటిక్ సింహాలు, చీతాలను బహుమతిగా అందించారు. జంతు మార్పిడిలో జత ఖడ్గ మృగాలు ఇక్కడికొచ్చాయి. జకోస్లోవియా నుంచి అరుదైన చీతాలు, షీసెల్ నుంచి అల్దాబ్రా తాబేళ్లు మన జూకు వచ్చాయి. బహదూర్‌పురా: కాంక్రీట్ జంగిల్‌గా మారిన మహానగరంలో మనుషులు యంత్రాలుగా బతకాల్సి వస్తోంది. ఇలాంటి చోట ఓ చిక్కని చిట్టడవి... అందులో పులుల గాండ్రింపులు, సింహాల గర్జనలు, ఏనుగుల ఘీంకారాలు వినిపిస్తే.? జింకల పరుగులు, పక్షుల సందళ్లు కనిపిస్తే.? ఎలా ఉంటుంది. అవి మనకు అతి చేరువగా తిరుగుతుంటే... ఎంతటి ఒత్తిడి అయినా వెంటనే మాయమవుతుంది. ఇంతటి అద్భుత అనుభూతిని పంచుతోంది నగరంలోని నెహ్రూ జూలాజికల్ పార్కు. నిత్యం రణగొణ ధ్వనులతో సతమతమయ్యే జనారణ్యానికి భిన్నంగా అరుదైన వన్యప్రాణి ప్రపంచాన్ని పరిచయం చేసే పర్యాటక కేంద్రమిది. పాతబస్తీ బహదూర్‌పురాలోని నెహ్రూ జూలాజికల్ పార్కు పరిశోధనలకు, అరుదైన జంతువుల పునరుత్పత్తికి కేంద్రంగా వర్ధిల్లుతోంది. అంతరించిపోయే స్థితిలో ఉన్న ఎన్నో జీవులను పునఃసృష్టి చేసి ప్రపంచానికి అందిస్తోంది. అక్టోబర్ 6న జూపార్కు వ్యవసాప్థక దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం. నెహ్రూ జూలాజికల్ పార్కు సుమారు 380 ఎకరాల్లో విస్తరించి ఉంది. 1963 అక్టోబర్ 6న అప్పటి గవర్నర్ నగేశ్ చేతుల మీదుగా హైదరాబాద్ జూలాజికల్ గార్డెన్ ప్రారంభమైంది. అదేరోజు సందర్శకులకు అనుమతి ఇచ్చారు. అంతకముందు 1926లో ఏడో నిజాం ఈ మినీ జూను పబ్లిక్ గార్డెన్లో ఏర్పాటు చేశారు. 1959లో మీరాలం ట్యాంక్ వద్ద జూ గార్డెన్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. అప్పటి ప్రధాని నెహ్రూ మరణానంతరం 1967లో నెహ్రూ జూలాజికల్ పార్కుగా పేరు మార్చారు. నాలుగు సఫారీలు... అడవిని పోలిన నాలుగు సఫారీలను (లయన్, టైగర్, బేర్, బైసన్ (ప్రస్తుతం నీల్గాయ్)) ఏర్పాటు చేసిన ఘనత నెహ్రూ జూలాజికల్ పార్కుకే దక్కింది. తొలినాళ్లలో జూలో బంధించిన జంతువులను సందర్శకులు చూసేవారు. 1970 తర్వాత జూపార్కు నిర్వహణలో అనేక మార్పులు వచ్చాయి. వన్యప్రాణుల ఆవాసాలకు అనుగుణంగా సహజమైన వాతావరణాన్ని కల్పించాలని జూ అధికారులు నిర్ణయించారు. అందుకు అనుగుణంగా 1974లో లయన్ సఫారీ, 1983లో టైగర్ సఫారీ, 1992 బేర్, బైసన్ సఫారీ పార్కులను ఏర్పాటు చేశారు. జంతువులు బయట తిరుగుతూ ఉంటే సందర్శకులు వాహనాల్లో నుంచి చూసే విధానమిది. అనంతరం 2000 నుంచి జూలోని జంతువులు కేజ్, మోట్, ఎన్క్లోజర్లకు పరిమితం కాకుండా, వాటి జీవన పరిస్థితులకు అనుగుణంగా సహజమైన వాతావరణాన్ని కల్పించి బయోలాజికల్ పార్కుగా తీర్చిదిద్దేందుకు సెంట్రల్ జూ అథారిటీ కృషి చేస్తోంది. 36 ఎకరాల్లో ఏర్పాటు చేసిన లయన్ సఫారీ గుజరా>త్ ఘిర్ ఫారెస్ట్ తరహాలో ప్రాముఖ్యతను సంతరించుకుంది. 1970కి ముందు ఘిర్ నేషనల్ ఫారెస్ట్‌తో పాటు దేశంలోనే వివిధ జూల్లోని సింహాల సంతతి వేగంగా క్షీణించసాగింది. అయితే ఇక్కడి సఫారీలో మాత్రం ఆయా ప్రాణులు వాటి సంతానాన్ని వృద్ధి చేసుకుంటున్నాయి. ఇక్కడి నుంచి సింహాలు, ఎలుగుబంట్లు, పులులను ఇతర జూలకు పంపిస్తూ, అక్కడి అరుదైన జీవులను ఇక్కడకు తీసుకొస్తున్నారు. ఇక్కడి ప్రయోగాల ఫలితంగా 20 పులులు జూలో ప్రాణం పోసుకున్నాయి. అంతేగాక అరుదైన కృష్ణ జింకలు, మూషిక జింకలు, తామిన్ డీర్, మణిపూర్ జింకల సంతతి ఇబ్బడిముబ్బడిగా పెరిగింది. ఇలా పెరిగిన జంతువులకు సహజ ఆవాసం కల్పించేందుకు అడవుల్లో వదులుతున్నారు. టికెట్లధరలు.. పార్కులో ప్రవేశానికి పెద్దలకు రూ.40, పిల్లలకు రూ.25. రైలు బండిలో పెద్దలకు రూ.20, పిల్లలకు రూ.10, కెమెరాకు రూ.30, వీడియో కెమెరాకు రూ.120, బ్యాటరీ వాహనంలో ప్రయాణానికి పెద్దలకు రూ.50, చిన్నారులకు రూ.40, సఫారీలో తిరిగేందుకు రూ.50, పిల్లలకు రూ.30. ప్రతి సోమవారం జూ పార్కుకు సెలవు ఉంటుంది. జూ రైడ్: విజటర్స్ వ్యాన్‌లో 10 మందిని ఎక్కించుకొని 40 నిమిషాలు జూపార్కులో తిప్పుతారు. పార్కు గేట్ నుంచి ప్రారంభమై తాబేలు, జింకలు, ఏనుగులు, తెల్లపులి, జాగ్వార్, ఉడ్స్, తొడేళ్లు, సింహం, చిరుతలు, నీటి గుర్రం, ఖడ్గమృగం, నిప్పుకోళ్లు, కొంగలు, జిరాఫీ, చిలుకలు, పచ్చ పాములు, నెమళ్లు, హిమాలయన్ ఎలుగుబంట్లను చూపించి తిరిగి జూపార్కు గేట్ వద్దకు చేరుకుంటుంది. సఫారీ రైడ్: పార్కులోని లయన్స్ సఫారీలో 30 నిమిషాలు తిరగవచ్చు. కేవలం 10 అడుగుల దూరం నుంచి పులులు, సింహాలు, ఎలుగుబంట్లు, అడవి దున్నలను చూడొచ్చు. ఇక చిట్టి రైల్లో 20 నిమిషాల్లో జూపార్కులోని జంతువులు, పక్షులను చూడొచ్చు. సంతానోత్పత్తిలో గణనీయఫలితాలు.. అంతరించిపోతున్న అరుదైన వన్యప్రాణుల సంతానోత్పత్తిని జూలో చేపట్టి గణనీయమైన ఫలితాలు సాధించారు. మూషిక జింక (మౌస్ డియర్), ముళ్ల పందులు, చిన్న చిన్న పక్షులు, రాబందులతో పాటు మొసళ్లు, తెల్లజాతి పులులు, రాయల్ బెంగాల్ టైగర్లను ఇక్కడే పెంచారు. పరిశోధనలకు కేంద్రం... 53 వసంతాలు పూర్తి చేసుకున్న జూ పార్కు పరిశోధనలకు, అరుదైన జంతువుల పునరుత్పత్తి కేంద్రంగా విరాజిల్లుతోంది. అడవిని పోలిన సఫారీలు, పగలే వెన్నెల వాతావరణంతో నిషాచర జీవులకు అనువుగాను మారింది. ఎన్నో రకాల పక్షులు, కీటకాలకు ఈ ప్రదేశం ఆలవాలం. దేశంలో పూర్తిగా కనుమరుగవుతున్న ఆసియాటిక్ సింహాల పరిరక్షణ, వాటి పునరుత్పత్తికి ఇక్కడ పరిశోధనలు జరుగుతున్నాయి. అంతేగాక తెల్ల పులుల సంతానోత్పత్తి కేంద్రం కూడా ఇక్కడే ఉంది. కృత్రిమ గర్భోత్పత్తి, సీసీఎంబీ పరిశోధనలకు కేంద్రంగాను ఉంది. పార్కు విహారానికి మాత్రమే గాక జంతువులు, పక్షుల్లోని కొత్త విషయాలను ప్రపంచానికి పరిచయం చేసే పరిశోధన కేంద్రంగాను రూపుదిద్దుకుంది. ‘జూ కారŠప్స్’ పేరుతో విద్యార్థులు, ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీ సభ్యులు సందర్శకులకు వన్యప్రాణులపై అవగాహన కల్పిస్తున్నారు. అటవీ శాఖ ఉద్యోగాలకు శిక్షణ కేంద్రంగాను ఇది కొనసాగుతోంది. -
ఆ హోంగార్డులకు హ్యాట్సాఫ్
సాక్షి, హైదరాబాద్ : గుండెపోటుకు గురైన వాహనదారుడి ప్రాణాలు కాపాడిన హోంగార్డులపై ప్రశంసలు కురుస్తున్నాయి. మంత్రి కేటీఆర్ వారికి అభినందనలు తెలుపుతూ గురువారం ఉదయం ట్వీటర్లో ఓ సందేశం ఉంచారు. బహదూర్‌పుర పీఎస్‌లో పని చేసే హోంగార్డులు చందన్‌సింగ్, ఇనాయాతుల్లా ఖాన్లు గుండెపోటుకు గురైన వ్యక్తి ప్రాణాలు కాపాడారు. వారికి అభినందనలు. నగరంలో మరింత మంది కానిస్టేబుల సీపీఆర్ విధానంపై శిక్షణ తీసుకోవాల్సిన అవసరం ఉందని.. ఇలాంటి సమయాల్లో అది పనికొస్తుంది అంటూ కేటీఆర్ ట్వీట్లో పేర్కొన్నారు. ఆ వీడియోను కూడా మంత్రి పోస్టు చేశారు. బహుదూర్‌పుర ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఏ శ్రీనివాస్, నగర ట్రాఫిక్ డీసీపీ రఘనాథ్ కూడా వారిపై ప్రశంసలు కురిపించారు. బుధవారం ఉదయం పురానాపూల్ మీదుగా జహనుమా వైపు బైక్ పై వెళ్తున్న ఓ వ్యక్తి హఠాత్తుగా కిందపడిపోయాడు. ఇది గమనించిన చందన్‌సింగ్, ఇనాయాతుల్లా ఖాన్లు వెంటనే ఆ వ్యక్తి దగ్గరకు పరిగెత్తారు. ఆ వ్యక్తి ఛాతిపై సీపీఆర్(కార్డియోపల్మనరి రెససిటేషన్) పద్ధతి ద్వారా ఛాతీపై మసాస్ చేసి.. ఊపిరి పీల్చుకునేలా ప్రథమ చికిత్స చేశారు. ఆ తర్వాత 108కు ఫోన్ చేసి అంబులెన్స్‌లో అతన్ని ఆస్పత్రికి తరలించారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి వాహనదారుడి ప్రాణాలు కాపాడిన ఆ ఇద్దరిపై స్థానికులు ప్రశంసలు కురిపించారు. ఆ వీడియో ఇప్పుడు నెట్లో వైరల్ అవుతోంది. Yesterday Homeguards K. Chandan & Inayathulla Khan of Bahadurpura PS saved the life of a person who had suddenly undergone a cardiac arrest at Puranapul Darwaja in Old City🙏🙏 Many Constables & Homeguards in Hyderabad have undergone CPR (cardio pulmonary resuscitation) training pic.twitter.com/k7D13RwqHL — KTR (@KTRTRS) 1 February 2018 -
వైద్యానికి వెళ్తే అత్యాచారం చేశాడు..
హైదరాబాద్: రోగం నయం చేస్తానంటూ ఓ నాటు వైద్యుడు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే బహదూర్‌పురాకు చెందిన అహ్మద్(45)కి మంత్ర వైద్యుడిగా ఈ ప్రాంతంలో పేరుంది. అనారోగ్యం పాలైన ఓ బాలిక(17)ను అహ్మద్ దగ్గరకు తల్లిదండ్రులు తీసుకువచ్చి వ్యాధి నయం చేయాలని కోరారు. ఇందుకు అంగీకరించిన అహ్మద్ కొన్ని రోజులుగా వైద్యం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే సోమవారం సాయంత్రం తన వద్దకు వచ్చిన బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం తెలిసిన బాలిక కుటుంబసభ్యులు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అహ్మద్‌పై కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తు ప్రారంభించామని, ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని ఇన్స్పెక్టర్ గురు నాయుడు చెప్పారు. -
వాటి పునరుత్పత్తిలో జూకు మొదటిస్థానం
బహదూర్‌పురా: వన్యప్రాణుల పునరుత్పత్తిలో నెహ్రూ జూలాజికల్ పార్కు దేశంలో మొదటి స్థానంలో నిలిచిందని వైల్డ్‌లైఫ్ పీసీసీఎఫ్, చీఫ్ వైల్డ్‌లైఫ్ వార్డెన్ ఎ.కె. శ్రీవాత్సవ్ అన్నారు. జూపార్కు వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా గురువారం జూలో నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... సమష్టి కృషితో జూ పార్కు ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. దేశంలో మొట్ట మొదటిసారిగా ఓపెన్ లయన్ సఫారీ, సరిసృపాల జగత్తు, ఓపెన్ బటర్ ఫ్లై పార్కు ప్రారంభించామన్నారు. సందర్శకుల సంఖ్యలో రెండో స్థానంలో ఉన్న జూను మొదటి స్థానంలో తీసుకొచ్చేందుకు జూ అ«ధికారులు కృషి చేయాలన్నారు. మౌస్ డీర్ సంతానోత్పత్తితో గణనీయమైన ఫలితాలను సాధించినట్లు తెలిపారు. ఫిస్ అక్వెరియాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్నారు. బెస్ట్ ఎన్క్లోజర్గా జిరాఫీ, సరిసృపాల జగత్తు, చింపాంజీ, మక్ హౌస్ ఎన్క్లోజర్లకు వరుసగా బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో అడిషనల్ పీసీసీఎఫ్ పృథ్వీరాజ్, క్యూరేటర్ శివానీ డోగ్రా, డిప్యూటీ చీఫ్ కన్జర్వేటర్, తదితరులు పాల్గొన్నారు. -
బక్రీద్‌ను శాంతియుతంగా జరుపుకోవాలి
బహదూర్‌పురా: బక్రీద్ పండుగను శాంతి యుత వాతావరణంలో నిర్వహించుకునేందుకు అన్ని రకాల చర్యలను తీసుకుంటున్నామని నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్ రెడ్డి తెలిపారు. సాలార్జంగ్ మ్యూజియంలో శనివారం ముస్లింలతో కలిసి బక్రీద్‌పై ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ... నగర వ్యాప్తంగా వివిధ కూడళ్లలో చెక్ పోస్టులు, 40 చెక్ పాయింట్లను ఏర్పాటు చేశామని... 20 వేల మంది పోలీసులతో బందోబస్తును నిర్వహిస్తూ పర్యవేక్షిస్తామన్నారు. గోవుల తరలింపు లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటామన్నారు. చార్మినార్ ఎమ్మెల్యే సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రీ మాట్లాడుతూ... రోడ్లపై పశువులను విక్రయించుకునే వారికి విశాలమైన ప్రాంతాల్లో వసతులు ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయమన్నారు. జీహెచ్ఎంసీ దక్షిణ మండలం జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ... బక్రీద్‌లో వ్యర్ధాలను తొలగించేందుకు ఉన్న వాహనాలకు తోడు అదనంగా 150 వాహనాలను సమకూర్చామన్నారు. మైనార్టీ వెల్ఫేర్ సెక్రటరీ, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎండీ ఉమర్ జలీల్, షఫివుల్లా తదితరులు పాల్గొన్నారు. -
క్రికెట్ బాల్ తగిలి మహిళ మృతి
బహదూర్‌పురా (హైదరాబాద్): క్రికెట్ బాల్ తగిలి ఓ మహిళ మృతిచెందిన ఘటన హైదరాబాద్‌లోని ఓల్డ్‌సిటీలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. కాలాపత్తర్ బిలాల్‌నగర్ ప్రాంతానికి చెందిన ఎంఏ ఖయ్యూం కూతురు సబాన్ తస్లీమీన్ (31) గత నెల 26న మధ్యాహ్నం టెర్రాస్ పైకి వెళ్లింది. ఆ సమయంలో కింద కొందరు క్రికెట్ ఆడుతున్నారు. ఆటగాడు కొట్టిన బంతి టైరాస్పై ఉన్న తస్లీమీన్కు తగలింది. దీంతో ఆమె గాయపడి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. ఆమెను చికిత్స కోసం స్థానికంగా ఉన్న ఓ ఆస్పత్రికి తీసుకెళ్లగా నిమ్స్‌కు పంపించారు. నిమ్స్‌లో చికిత్స పొందుతున్న తస్లీమీన్ సోమవారం ఉదయం మృతి చెందింది. తస్లీమీన్ సోదరుడు మహ్మద్ డ్యానీస్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
జైలుకు పంపాడని 13 పోట్లు పొడిచాడు..
హైదరాబాద్: జైలుకు వెళ్లేందుకు కారణమయ్యాడంటూ ఓ బాలుడ్ని ఇద్దరు వ్యక్తులు దారుణంగా హత్యచేవారు. బహదూర్‌పురా పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం జరిగిన ఈ సంఘటనకు సంబంధించి నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఏసీపీ అశోక చక్రవర్తి తెలిపిన వివరాల ప్రకారం.. కాలాపత్తర్‌కు చెందిన జావేద్ (22)లు చైన్ స్నాచింగ్ తోపాటు ఇతర కేసుల్లో పట్టుబడి జైలుకు వెళ్లొచ్చారు. అతడికి జైలు శిక్ష పడేందుకు శాస్త్రిపురం ఓవైసీహిల్స్ ప్రాంతానికి చెందిన షాబాద్ (17) సాక్ష్యం ఉపకరించింది. నిజానికి షాబాద్ కూడా చిన్నపాటి నేరస్తుడే. గత నెలలో పోలీసులు నగరంలోని నేరగాళ్ల వివరాలు తెలుసుకునేందుకు సమగ్ర సర్వే చేపట్టారు. ఆసమయంలో పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో షాబాద్.. జావేద్ దగ్గర ఆశ్రయం పొందాడు. ఎప్పటినుంచో షాబాద్ పై కక్ష పెట్టుకున్న జావెద్.. కాలాపత్తర్ ప్రాంతానికి చెందిన మహ్మద్ ఇజముల్లా (19)తో కలిసి షాబాద్‌ను బైక్‌పై మీరాలం ట్యాంక్ వద్దకు తీసుకెళ్లారు. షాబాద్‌ను ఇజముల్లా పట్టుకోగా... జావేద్ కత్తితో గొంతుపై పొడిచాడు. జైలుకు పంపాడన్న పగతో షాబాద్ కడుపు, ఛాతీలపై 13 సార్లు పొడిచాడు. చనిపోయాడని నిర్దారించుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. నవంబర్ 29వ తేదీన ఉదయం అటుగా వచ్చిన వారు మృతదేహన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు విచారణ చేయగా మృతుడి పూర్తి వివరాలు, హత్యకు గల కారణాలు వెల్లడయ్యాయి. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితులను అరెస్ట్ చేసి శుక్రవారం రిమాండ్‌కు తరలించారు. నిందితుడు జావేద్‌పై హుస్సేనీఆలం, కాలాపత్తర్ పోలీస్‌స్టేషన్‌లో స్నాచింగ్, తదితర కేసులున్నాయి. అతనిపై పీడీ యాక్ట్ ప్రయోగించనున్నట్లు పోలీసులు తెలిపారు. -
పాతబస్తీలో యువకుడి దారుణ హత్య
పాతబస్తిలో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన బహాదూర్పుర పోలీస్ స్టేషన్ పరిధిలోని పహాడిమీర్ ఆలం చెరువు వద్ద ఆదివారం వెలుగుచూసింది. చెరువు సమీపంలోని పొదల్లో ఓ యువకుడిని కొందరు దుండగులు కత్తితో దారుణంగా గొంతుకోసి హత్య చేశారు. ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి వివరాలు తెలియరాలేదు. -
భర్తతో గొడవపడి భార్య అదృశ్యం
బహదూర్‌పురా (హైదరాబాద్) : కుటుంబ సభ్యులకు చెప్పకుండా బయటకు వెళ్లిన గృహిణి కనిపించకుండాపోయిన ఘటన బహదూర్‌పురా పోలీస్‌స్టేషన్‌లో చోటుచేసుకుంది. ఎస్సై ఎం.విజయ్ భాస్కర్ తెలిపిన వివరాల ప్రకారం... కిషన్‌బాగ్ నందిముస్లాయిగూడ ప్రాంతానికి చెందిన సయ్యద్ యాకుబ్ మజానీ, ఆస్రా పర్వీన్ (27)లు దంపతులు. వీరిది ఉమ్మడి కుటుంబం. కాగా యాకుబ్ మజానీ డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే గత కొన్నిరోజులుగా ఆస్రా పర్వీన్ వేరు కాపురం పెడదామంటూ భర్తతో గొడవ పడుతోంది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 9వ తేదీన సాయంత్రం 4 గంటల సమయంలో ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోయింది. తిరిగి ఇంటికి చేరుకోలేదు. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు స్నేహితులు, బంధువుల వద్ద వెతికినా ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. దీంతో యాకుబ్ మజానీ శుక్రవారం బహదూర్‌పురా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆచూకీ తెలిసిన వారు బహదూర్‌పురా పోలీస్‌స్టేషన్ ఫోన్ 040-27854794 నంబర్‌కు సమాచారం అందించాలని కోరారు.