విజేతలతో జూ అధికారులు
బహదూర్‌పురా: వన్యప్రాణుల పునరుత్పత్తిలో నెహ్రూ జూలాజికల్ పార్కు దేశంలో మొదటి స్థానంలో నిలిచిందని వైల్డ్‌లైఫ్ పీసీసీఎఫ్, చీఫ్ వైల్డ్‌లైఫ్ వార్డెన్ ఎ.కె. శ్రీవాత్సవ్ అన్నారు. జూపార్కు వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా గురువారం జూలో నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... సమష్టి కృషితో జూ పార్కు ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. దేశంలో మొట్ట మొదటిసారిగా ఓపెన్ లయన్ సఫారీ, సరిసృపాల జగత్తు, ఓపెన్ బటర్ ఫ్లై పార్కు ప్రారంభించామన్నారు.
సందర్శకుల సంఖ్యలో రెండో స్థానంలో ఉన్న జూను మొదటి స్థానంలో తీసుకొచ్చేందుకు జూ అ«ధికారులు కృషి చేయాలన్నారు. మౌస్ డీర్ సంతానోత్పత్తితో గణనీయమైన ఫలితాలను సాధించినట్లు తెలిపారు. ఫిస్ అక్వెరియాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్నారు. బెస్ట్ ఎన్క్లోజర్‌గా జిరాఫీ, సరిసృపాల జగత్తు, చింపాంజీ, మక్ హౌస్ ఎన్క్లోజర్లకు వరుసగా బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో అడిషనల్ పీసీసీఎఫ్ పృథ్వీరాజ్, క్యూరేటర్ శివానీ డోగ్రా, డిప్యూటీ చీఫ్ కన్జర్వేటర్, తదితరులు పాల్గొన్నారు.