నెహ్రూ జూలాజికల్ పార్కు
బహదూర్‌పురా: నెహ్రూ జూలాజికల్ పార్కులోని ఫిష్ అక్వేరియం, నిశాచర జంతుశాల, ఫొసిల్ మ్యూజియం, మూత్రశాలల వినియోగానికి ఈ నెల 12 నుంచి ఎలాంటి రుసుం వసూలు చేయబోమని జూ క్యూరేటర్ క్షితిజా బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జూపార్కులోని ఫిష్ అక్వేరియానికి ప్రస్తుతం రూ.10, నిశాచర జంతుశాలకు పెద్దలకు రూ.20, పిల్లలకు రూ.10, ఫొసిల్ మ్యూజియానికి రూ.5, మూత్ర విసర్జనకు రూ.3, 5 చొప్పున రుసుం వసూలు చేస్తున్నారు. ఈ నెల 12 నుంచి వీటి ప్రవేశం ఉచితంగా పొందవచ్చన్నారు. కాగా జూపార్కు ప్రవేశ రుసుం పెద్దలకు రూ.40, చిన్నారులకు రూ.25గా ఉందని.. ఈ నెల 12 నుంచి పెద్దలకు రూ.50, చిన్నారులకు రూ.30 రుసుం తీసుకోనున్నామన్నారు. వారాంతపు సెలవు రోజులైన శని, ఆదివారాల్లో ప్రవేశ ముఖద్వారం రుసుం పెద్దలకు రూ.60, చిన్నారులకు రూ.40 వసూలు చేస్తున్నామని.. పెద్దలకు మాత్రం రూ.10ని పెంచి రూ.70 వసూలు చేయనున్నామన్నారు. వారాంతపు, సెలవు రోజు పెద్దలకు రూ.80, చిన్నారులకు రూ.50 వసూలు చేయనున్నామన్నారు. 10 సీట్ల కాలుష్య రహిత బ్యాటరీ వాహనం ప్రత్యేక రైడ్ కోసం 120 నిమిషాలకు రూ.2 వేలు, 14 సీట్ల వాహనానికి రూ.3 వేలు వసూలు చేయనున్నామన్నారు.
స్టిల్ కెమెరా రుసుం రూ.30 నుంచి 100కు, వీడియో కెమెరా రుసుం రూ.120 నుంచి 500కు పెంచామన్నారు. చిట్టి రైలు రుసుం పెద్దలకు రూ.20, చిన్నారులకు రూ.10, వారాంతపు, సెలవు రోజుల్లో పెద్దలకు రూ.30, చిన్నారులకు 15 వసూలు చేయనున్నామన్నారు. జూపార్కులో గెస్ట్‌హౌస్ రుసుం రూ.1000 నుంచి రూ.2 వేలకు పెంచామన్నారు. ఐదుగురు దాటితే అదనంగా ఒకరికి రూ.200 చార్జీ చేస్తామన్నారు. గెస్ట్‌హౌస్ వద్ద ఉన్న హాల్‌లో 40 మంది ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటలకు సమావేశం నిర్వహించుకునేందుకు రూ.10 వేల చార్జి వసూలు చేస్తున్నామన్నారు. లయన్ సఫారీ పార్కు వాహనం పెద్దలకు రూ.50, చిన్నారులకు రూ.30 ఉండగా... వారాంతపు, సెలవు రోజుల్లో రూ.60 వసూలు చేస్తున్నామన్నారు. సఫారీ వాహనంలో చిన్నారుల టికెట్టు రూ.30 నుంచి రూ.20కి తగ్గించామన్నారు. హెడ్ ఆఫ్ ది ఫారెస్ట్ ప్రిన్సిపాల్ చీఫ్ కన్జర్వేటర్ ప్రత్యేక ఆదేశాల మేరకు రుసుంలను పెంపుతో పాటు కొన్ని ప్రవేశాలు ఉచితం చేశామన్నారు. పెరిగిన ధరలు, ఉచిత సేవలు ఈ నెల 12 నుంచి అమల్లోకి వస్తాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment