ఆదిలాబాద్‌లోని మారుమూల ప్రాంతంలో పోకిరీల వేధింపులపై యువతి ఫోన్ చేయగానే.. 10 నిమిషాల్లో ఘటనాస్థంలో చేరుకుని ఆకతాయిల భరతం పట్టి ఆ యువతిని సురక్షితంగా ఇంటికి చేర్చింది ‘షీ టీమ్’.
హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ఉత్తర భారతదేశానికి చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి తాను అర్ధరాత్రి 2 గంటలకు సైతం ఎలాంటి ఇబ్బంది లేకుండా క్షేమంగా ఇంటికి చేరుకోగలుతుంది. ఆ యువతి వెనుక ధైర్యం ‘షీ టీమ్’.
సాక్షి, హైదరాబాద్: మహిళ అర్ధరాత్రి సమయంలోనూ స్వేచ్ఛగా రోడ్డుమీద నడిచే పరిస్థితి ఉన్నప్పుడే దేశానికి నిజమైన స్వాతంత్య్రం వచ్చినట్లన్న మహాత్మా గాంధీ మాటల స్ఫూర్తిగా ఆకతాయిల ఆటకట్టి అతివలకు అండగా ఉండేందుకు ఏర్పడిన షీ టీమ్ (ఆమె సేన) ఇప్పుడు ఐదేళ్లు పూర్తి చేసుకుంది. ఈ ఐదేళ్లలో ఎంతోమంది మహిళల్ని లైంగిక వేధింపుల నుంచి, యువతుల్ని ఈవ్‌టీజింగ్ నుంచి రక్షించింది. షీ టీమ్ ప్రస్థానంలో ఎన్నో మైలురాళ్లు ఈ ఐదేళ్లలో వచ్చి చేరాయి. వేయి మైళ్ల ప్రయాణమైనా ఒక్క అడుగుతో మొదలుపెడతాం అన్నట్లుగా ఐదేళ్ల క్రితం నగరంలో మహిళల రక్షణకు మొదలుపెట్టిన ఆమె సేన.. నేడు రాష్ట్రవ్యాప్తంగా తన సేవలను విస్తరించింది. 33 జిల్లాల్లో 300 పైగా షీ టీమ్స్ మహిళలకు భద్రత కల్పిస్తున్నాయి. 2015, అక్టోబరు 24న అప్పటి డీజీపీ అనురాగ్‌శర్మ ఆధ్వర్యంలో తెలంగాణ పోలీసులు మహిళల రక్షణ కోసం హైదరాబాద్‌లో ప్రయోగాత్మకంగా ప్రారంభించిన షీటీమ్స్ నేడు రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్నాయి. నగరంలోని మూడు కమిషనరేట్లలో షీటీమ్స్ ఇచ్చిన ప్రేరణే ఇందుకు కారణం. ఇపుడు వేలాది కేసులు, ఫిర్యాదులతో ప్రజలకు ముఖ్యంగా విద్యార్దినులు, మహిళలకు చేరువైంది. అన్నివర్గాల ప్రశంసలు అందుకుంటోంది.
పొరుగు రాష్ట్రాలకు స్ఫూర్తిగా..
మహిళలపై వేధింపులకు వ్యతిరేకంగా పనిచేసే షీటీమ్స్ కేవలం కేసుల నమోదుకే పరిమితమవలేదు. వేధింపులు జరిగినపుడు ఎలా ఎదుర్కోవాలి? ఆపద సమయాల్లో ఎలా వ్యవహరించాలి? అన్న విషయాలపై వివిధ కార్యక్రమాల ద్వారా విస్తృతంగా అవగాహన కల్పిస్తోంది. రోజూ రాష్ట్రవ్యాప్తంగా కనీసం 70 నుంచి 80 అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుండటం షీటీమ్స్ పనితీరుకు నిదర్శనం. ఈ ఫలితాలు చూసి పొరుగు రాష్ట్రం ఏపీ తరువాత దేశంలోని అన్ని మెట్రోనగరాల్లో షీటీమ్స్ సేవలు ప్రవేశపెట్టేలా స్ఫూర్తిగా నిలిచింది. ఇప్పుడు ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో కేసులను నిరంతరం పర్యవేక్షిస్తుండటం గమనార్హం.
వేధింపులు ఎక్కువగా జరిగే ప్రదేశాల(హాట్‌స్పాట్‌లు)ను గుర్తించి అందుకు అనుగుణంగా పోలీసుల మోహరింపు చేస్తున్నారు. ముఖ్యంగా పోలీసు కళా బృందాలు షీటీమ్స్‌పైనా ప్రచారం చేస్తుండటంతో ఫిర్యాదులు పెరుగుతున్నాయి. మొత్తం ఫిర్యాదుల్లో సోషల్ మీడియా ద్వారానే అధికంగా వస్తుండటం గమనార్హం. ఆఫీస్‌లు, స్కూళ్లు, విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ, ప్రైవేటు సెక్టార్లలో పనిప్రదేశాల్లో చేస్తోన్న అవగాహన కార్యక్రమాలు మహిళలపై వేధింపుల సమస్యలు వెలుగులోకి వస్తున్నాయి. మరోవైపు షీటీమ్స్ పోలీసులు నమోదు చేసే పెట్టీ కేసులను సైతం సీసీటీఎన్‌ఎస్ (క్రైమ్ అండ్ క్రిమినల్ నెట్‌వర్కింగ్ సిస్టమ్)తో అనుసంధానిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment