సేఫ్టీ మంత్ర ‘షీ టీమ్స్’!
♦ మహిళల భద్రత చర్యలు అద్భుతమంటున్న నగరవాసులు
♦ 76 శాతం మందికి షీ టీమ్స్‌పై అవగాహన
♦ ఓ ఎన్జీవో సర్వేలో వెల్లడి
సాక్షి, సిటీబ్యూరో: వాట్సాప్ ద్వారా వేధింపులపై పీడీ యాక్ట్... సెల్‌ఫోన్ ద్వారా మెసేజ్‌లతో వేధించిన అడ్వకేట్ అరెస్టు... సోషల్ మీడియా, ఫేస్‌బుక్ ద్వారా వేధించిన వారిపై కేసులు... బహిరంగ ప్రాంతాల్లో అమ్మాయిలను ఈవ్‌టీజింగ్ చేసిన వారిపై చర్యలు... ఇలా అతివలను బహిరంగ ప్రాంతాల్లో, కార్యాలయాల్లో వేధిస్తున్న వారి భరతం పడుతుండటంతో ‘షీ టీమ్స్’పై నగరవాసుల్లో రోజురోజుకు భరోసా పెరుగుతోంది. ఇందుకు తార్కాణమే ఓ స్వచ్ఛంద సేవా సంస్థ(ఎన్జీవో) నిర్వహించిన తాజా సర్వేలో 76 శాతం మంది మహిళలు షీ టీమ్స్ పనితీరు తెలుసని చెప్పడం. అంతే కాదు సేఫ్టీ మంత్ర షీ టీమ్స్ అని ముక్తకంఠంతో వారు నినదించారు.
బస్సుస్టాప్‌లు, రైల్వేస్టేషన్లు, దేవాలయాలు, పార్కులు...ఇలా ఏ వీధిలోనైనా వేధింపులకు గురవుతున్నామని అమ్మాయిలు ఫిర్యాదుచేయడంతో సత్వరమే రంగంలోకి దిగి వారి వెకిలిచేష్టలను వీడియోలతో చిత్రీకరించి సాక్ష్యాలతో సహా కోర్టుకు సమర్పించి ఈవ్‌టీజర్ల ఆటకట్టిస్తున్నాయి షీటీములు. అంతేకాదు..వాట్సాప్, సామాజిక అనుసంధాన వేదికలైన ఫేస్‌బుక్, సెల్‌ఫోన్ ఎస్‌ఎంఎస్‌లు, సెల్‌ఫోన్ కాల్స్ ద్వారా వేధిస్తున్న వారినీ జైల్లో కూర్చోబెడుతున్నాయి. తమ తెలివితేటలతో తప్పించుకునేందుకు యత్నిస్తున్న నేరగాళ్లను ఆధునిక సాంకేతికతతో వారు ఉంటున్న జాడను గుర్తించి పట్టుకుంటున్నాయి.
షీ టీమ్స్ మహిళల భద్రత విషయంలో వారి అభిమానం చూరగొనడం మంచి సక్సెస్‌గా భావిస్తున్నామని షీ టీమ్స్ ఇన్‌చార్జి స్వాతిలక్రా తెలిపారు. ‘నగరంలోని వివిధ హాట్‌స్పాట్‌లకు వెళ్లి షీ టీమ్స్ 548 మందిని సాక్ష్యాలతో రెడ్‌హ్యండెడ్‌గా పట్టుకున్నాయి. డయల్ 100, ఫేస్‌బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఈ-మెయిల్‌లతో పాటు నేరుగా 1800 ఫిర్యాదులు వచ్చాయి. ఈ కేసులపై విచారణ చేసి ఇప్పటికే చర్యలు తీసుకున్నాం.కొందరిని కటకటాల్లోకి పంపగా, మరికొందరిని కౌన్సెలింగ్ నిర్వహించి మరోమారు వెకిలి చేష్టలు చేయవద్దని హెచ్చరిక చేసి పంపామ’ని ఆమె వివరించారు.
వాట్సాప్ ద్వారా వేధించిన వ్యక్తిపై పీడీ యాక్ట్
ఆదిలాబాద్ జిల్లాకు చెందిన అడె రంజిత్ మహిళలకు అశ్లీల వీడియోలు, ఫొటోలు వాట్సాప్ ద్వారా పంపేవాడు. డబ్బులు ఇవ్వాలంటూ బ్లాక్‌మెయిల్ చేసేవాడు. ఈ వేధింపులు భరించలేని ఓ యువతి షీ టీమ్‌ను ఆశ్రయించడంతో అతడి ఫోన్‌కాల్స్‌ను పరిశీలించారు. ఇతని ఖాతాలో ఎంతో మంది బాధితులు ఉన్నారని గుర్తించారు. బాధితులిచ్చిన ఫిర్యాదుమేరకు ఎస్‌ఆర్ నగర్ పోలీసు స్టేషన్‌లో ఒకటి, మియాపూర్ ఠాణాల్లో రెండు కేసులు నమోదుచేసి అతడిని జైలుకు తరలించారు. అతడి నేరప్రవృత్తి, కేసుల తీవ్రతను పరిగణనలోకి తీసుకొని పీడీ యాక్ట్ నమోదుచేశారు.
వృద్ధుడిపై...
రిటైర్డ్ ఉద్యోగి అయిన విశ్వనాథమ్ తన మనవరాలిని స్కూల్‌కు తీసుకెళ్లి దింపేవాడు. ఇదే సమయంలో అతడి మనవరాలి స్నేహితురాలిని అసభ్యంగా తాకేవాడు. అతడి ప్రవర్తనతో విసిగిన పదేళ్ల బాలిక తన తల్లికి చెప్పి ఏడ్చింది. బాధితురాలి తల్లి స్కూల్ యజమాన్యానికి ఫిర్యాదు చేయగా తరగతిలోని సీసీ కెమెరాల్లోని ఫుటేజీలను చూడగా విశ్వనాథమ్ కావాలనే ఆ అమ్మాయిని వేధిస్తున్నాడనే విషయం స్పష్టంగా కనిపించింది. బాధితురాలి తల్లి ఫిర్యాదుమేరకు షీ టీమ్స్ ఐపీసీ 354(ఏ). పీవోసీఎస్‌వో యాక్ట్ సెక్షన్ 8 కింద కేసు నమోదు చేశారు.