
సాక్షి, సిటీబ్యూరో: మహిళల రక్షణ కోసం సైబరాబాద్ షీ బృందాలు ఎంతో కృషి చేస్తున్నాయి. వేధింపులకు గురవుతున్న మహిళలు ఫిర్యాదు చేసేందుకు ధైర్యంగా ముందుకొస్తున్నారు. సామాజిక మాధ్యమాలతో పాటు నేరుగా బాధిత మహిళలు ఫిర్యాదు చేస్తుండటంతో వీరి అవసరాలకు అనుగుణంగా షీ బృందాలను ఆరు నుంచి ఎనిమిది బృందాలకు పెంచినట్లు షీ టీం ఇన్‌చార్జి అనసూయ తెలిపారు. ఏ సమయంలో ఫిర్యాదు వచ్చినా తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకుంటూ అతివల్లో ఆత్మస్థైర్యాన్ని కల్పిస్తున్నామని ఆమె చెప్పారు. పాఠశాల, కళాశాలల విద్యార్థినులు, ఉద్యోగినులు.. ఇలా ప్రతి ఒక్కరూ వేధింపులపై ధైర్యంగా ఫిర్యాదు చేస్తున్నారని ఆమె చెప్పారు. అనసూయ మాటల్లోనే ఆ వివరాలు..
కౌన్సెలింగ్‌తో తప్పు తెలుసుకుంటున్నారు..
ముఖ్యంగా కళాశాలల ప్రాంగణాలు, బస్టాండ్‌లు, రైల్వే స్టేషన్‌లు, మాల్స్‌లో ఆకతాయిల బారిన పడిన మహిళలు వాట్సాప్ ద్వారా షీ బృందాలకు ఫిర్యాదు చేస్తున్నారు. తక్షణమే సంబంధిత షీ బృందాలు మఫ్టీలో వెళ్లి ఈవ్‌టీజర్ల అకృత్యాలను పరిశీలించి లైవ్ రికార్డు చేస్తున్నారు. ఆ వెంటనే ఆకతాయిని పట్టుకొని స్థానిక పోలీసులకు అప్పగిస్తున్నాయి. మేజర్ అయితే పెట్టీ కేసులు, మైనర్ అయితే తల్లిదండ్రుల సమక్షంలోనే కౌన్సెలింగ్ ఇస్తున్నాం. తద్వారా 90 శాతం మంది తమ తప్పును తెలుసుకుంటున్నారు. షీ బృందాలకు చిక్కుతున్న వారిలో అన్ని వయసుల వారూ ఉన్నారు.
‘ఆమె’కు అవగాహన కలిగిస్తూ..
పాఠశాలలు, కాలేజీలు, ట్యుటోరియల్స్, రైల్వే స్టేషన్లు, మాల్స్, బస్తీ తదితర ప్రాంతాల్లో మహిళా చట్టాలపై షీ బృందాలు పూర్తి స్థాయిలో అవగాహన కలిగిస్తున్నాయి. సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారం చేస్తూ భరోసా కల్పిస్తున్నాయి. తద్వారా అతివలు వేధింపులు ఎదురైతే వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేస్తున్నారు. నేరుగా ఫోన్‌కాల్స్ కూడా చేస్తున్నారు. గతంలో ఠాణా గడప తొక్కేందుకు ఆలోచించిన మహిళలు ఇప్పుడూ అవే వేధింపులపై గళం విప్పుతుండటం శుభ పరిణామం.
రేపు మహిళా సమాఖ్య రాష్ట్రస్థాయి సదస్సు హిమాయత్‌నగర్: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఉమెన్ ఆధ్వర్యంలో ‘పెట్టుబడిదారుల ధోరణులు, ఫాసిస్ట్ శక్తులకు తిప్పికొడదాం– మహిళా సాధికారత సాధిద్దాం’ అంశంపై శుక్రవారం రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ మేరకు సదస్సుకు సంబంధించిన పోస్టర్‌ను బుధవారం హిమాయత్‌నగర్‌లోని మఖ్దూం భవన్‌లో ఆవిష్కరించారు. కార్యక్రమంలో భారత జాతీయ మహిళా సమాఖ్య తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు పోటు కళావతి, తెలంగాణ శ్రామిక మహిళా ఫోరం రాష్ట్ర అధ్యక్షురాలు ప్రేంపావని, ఛాయాదేవి, నండూరి కరుణకుమారి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment