ఆమెకు అండగా ‘షీ టీమ్‌’ | Special story On She Teams | Sakshi
Sakshi News home page

ఆమెకు అండగా ‘షీ టీమ్‌’

Published Thu, Aug 1 2019 12:10 PM | Last Updated on Thu, Aug 1 2019 3:04 PM

Special story On She Teams - Sakshi

సాక్షి, మంచిర్యాల : సృష్టికి మూలమైన మహిళకు ఆత్మరక్షణ కరవైంది. మూడుముళ్లు.. ఏడడుగులు... వేదమంత్రాలు.. ఆగ్ని సాక్షిగా మనువాడిన భర్త  అయినా... తోటి ఉద్యోగి అయినా... విద్యాబుద్ధులు చెప్పే గురువైనా... ప్రేమ పేరిటా నయవంచనకు గురిచేసే మగాల్‌లైనా బలయ్యేది మాత్రం అబలనే, మనకు జన్మనిచ్చిన అమ్మ... తోడ బుట్టిన చెల్లి... కట్టుకున్న భార్య ఆడదే అయినా... వారి పట్ల వేధింపులు ఆగడం లేదు.. పాఠశాల మొదలుకొని... ఇంటా.. బయటా... ఎక్కడా చూసిన మహిళలపై అభం శుభం తెలియని బాలికలపై అత్యాచారాలు ఆగడం లేదు... ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తెచ్చిన తుడుచుకపోతున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం మహిళల రక్షణ కోసం ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మహిళలకు అండగా షీ టీమ్‌ ఉందిని మహిళల్లో ఆత్మస్థైర్యాన్ని నింపుతూ మంచిర్యాల డీసీపీ రక్షిత క్రిష్ణమూర్తి్త షీ టీమ్‌ పని విధానంపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి అవగాహన కల్పిస్తున్నారు. దీనిపై ప్రత్యేక కథనం.

షీ టీమ్‌ ఆవిర్భావం
మహిళల ఆత్మరక్షణ కోసం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత  2014 అక్టోబర్‌ 24న తెలంగాణ పోలీస్‌శాఖలో షీ టీమ్‌ పేరుతో ప్రత్యేక పోలీస్‌ బృందాలను హైదరాబాద్‌లో మొట్టమొదటిసారి షీటీమ్‌ బృందాలను నియమించింది. ఏడాది పాటు హైదరాబాద్‌ నగరంలో మంచి ఫలితాలు రావడంతో రాష్ట్రంలోని అన్ని జిల్లాలో షీ టీమ్‌ బృందాలను ఏర్పాటు చేసింది. 2015 అక్టోబర్‌ 31న ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో 23 షీ టీమ్‌ బృందాలను ఏర్పాటు చేసి రంగంలోకి దింపారు. మఫ్టీలో ఉంటు ఆకతాయిల భరతం çపడుతుండే వారు. ఇటీవల కొంత డీలా పడినట్లు ఆరోపనలు ఉన్నాయి. అయితే ఇటీవల రామగుండం పోలీస్‌ కమిషనర్‌గా వి.సత్యనారాయణ బాధ్యతలు స్వీకరించిన అనంతం షీ టీమ్‌పై ప్రత్యేక దృష్టి సారించారు. గోదావరిఖనిలో ఏసీపీగా రక్షిత కే మూర్తి (ప్రస్తుతం మంచిర్యాల డీసీపీ)పని చేసిన సమయంలో పెద్దపెల్లి, మంచిర్యాల రెండు జిల్లాలకు షీ టీమ్‌ ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. దీంతో రక్షిత కే మూర్తి షీ టీమ్‌ కార్యకలపాలపై ప్రత్యేక దృష్టి సారించారు. 

షీ టీమ్స్‌ పని విధానం
మహిళల రక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై షీ టీమ్‌ పోలీసులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ భరోసా కల్పిస్తున్నారు. షీ టీమ్స్‌ పోలీసులు చేసిన ఆపరేషన్స్, అవగాహన సదస్సులు మహిళ భద్రతకు రక్షణ కవచంగా మారింది. రోజురోజుకు జిల్లా కేంద్రాల్లోనే కాకుండా మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్లి ఈవ్‌ టీజర్లపై ఉక్కుపాదం మోపుతున్నారు. పట్టణంలోని ప్రధాన కూడళ్ల వద్ద పబ్లిక్‌ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోనూ, పార్కులు, బస్టాండ్, బస్‌ స్టాప్‌లు, కళాశాలలు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల వద్ద షీ టీమ్‌ పోలీసులు మఫ్టీలో నిఘా వేసి ఉంటారు. వారి వద్ద స్పై కెమెరాలు సైతం ఉంటాయి. 

ర్యాగింగ్‌ నిరోధానికి  పాటించాల్సిన నిబంధనలు
విద్యార్థులకు  కళాశాలల్లో అడ్మిషన్లును ఇచ్చే సమయంలో ర్యాగింగ్, ఈవ్‌టీజింగ్‌ వ్యతిరేక విధానాలపై అవగాహన కల్పించాలి. ప్రతి కళాశాలలో ర్యాగింగ్‌ వ్యతిరేక కమిటీని ఏర్పాటు చేయాలి. ఆ కమిటీలో విద్యార్థుల  తరుపున కొందరు, అధ్యాపకుల తరుపున కొందరు ఉండాలి. కొంత మంది విద్యార్థుల నేరుగా చెప్పుకోలేని పరిస్థితి ఉంటే కళాశాలలో ఫిర్యాదుల పెట్టెలను ఏర్పాటు చేయాలి. ప్రతి కళాశాలలో నోటీస్‌ బోర్డుపై పోలీసు అధికారుల ఫోన్‌ నెంబర్లు టోల్‌ఫ్రీ నెంబర్‌ 100ను విధిగా ఏర్పాటు చేయాలి.

విద్యాసంస్థలు సైతం 
ర్యాగింగ్‌కు పాల్పడితే వారిపై చర్యలు తీసుకోని విద్యాసంస్థల యాజమాన్యాలు శిక్షార్హమవుతాయి. ర్యాగింగ్, ఈవ్‌టీజింగ్‌కు గురైన బాధిత విద్యార్థులు ఫిర్యాదు చేసినప్పటికీ ఉద్దేశపూర్వకంగా కళాశాల యాజమాన్యాలు నిర్లక్ష్యం వహిస్తే  ప్రోత్సహించినట్లవుతుంది. చట్ట ప్రకారం యాజమా¯న్యాలను సైతం శిక్షించే అవకాశం ఉంటుంది.

సమాచారం ఇవ్వడం ఇలా...
చాలామంది పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసేందుకు భయపడుతారు. ఇలాంటి వారిని దృష్టిలో ఉంచుకొని పోలీస్‌ శాఖ వాట్సాప్‌ ద్వారా ఫిర్యాదుల స్వీకరణకు ప్రత్యేక నెంబర్లను అందుబాటులో ఉంచారు. ఫోన్‌లో సమాచారం ఇచ్చేందుకు 100 నెంబరుకు డయల్‌ చేసి సమాచారం అందించవచ్చు. 100కు ఇచ్చిన సమాచారం హైదరాబాద్‌లోని పోలీస్‌ కంట్రోల్‌రూంకు వెళుతుంది. అక్కడికి సమాచారం అందిన వెంటనే సంబంధిత పోలీస్‌ స్టేషన్లకు సెకన్లలో సమాచారం వెళ్తోంది. సదరు పోలీస్‌ అధికారులు షీటీమ్‌ బృందాలు ఘటన స్థలానికి రహస్యంగా చేరుకొని సమస్యలను పరిష్కరిస్తారు.

అమలయ్యే శిక్షలు... 
విద్యార్థులు, మహిళలను వేధింపులకు గురిచేసినట్లు రుజువైతే చట్టపరమైన శిక్షలతో పాటు విద్యాపరంగా శిక్షలు ఉంటాయి. విద్యాలయాల నుంచి తాత్కాలికంగా లేదా శాశ్వతంగా తొలగించడానికి, మరే విద్యాలయంలో ప్రవేశాలు లేకుండా చేసేందుకు అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హత లేకుండా చేయడం, పాస్‌పోర్టు జారీచేయకుండా చర్యలు తీసుకోవచ్చు. యూజీసీ విధానాల ప్రకారం ర్యాగింగ్, ఈవ్‌టీజింగ్‌లకు పాల్పడిన వారి ఉపకారవేతనాలు నిలిపివేయడం, పోటీపరీక్షలకు హాజరుకాకుండా చేయడం, రూ.2.50లక్షల వరకు జరిమానా విధిస్తుంది.

నిర్భయంగా సమాచారం ఇవ్వాలి
ఎవరైన వేధించిన వెంటనే 100కు నిర్భయంగా సమాచారం ఇవ్వాలి. ప్రభుత్వం మహిళల రక్షణ కోసం ప్రత్యేకంగా షీటీమ్‌లను ఏర్పాటు చేసింది. కాలేజ్‌ విద్యార్థులు మహిళలపై ఎవరైనా అసభ్యకరంగా ప్రవర్తించినా, ఈవ్‌టీజింగ్‌కు గురిచేసినా, సెల్‌ఫోన్‌ల ద్వారా వేధింపులకు గురి చేసిన వెంటనే 100 డయల్‌కు గాని, వాట్సాప్‌ నెంబర్‌ 6303923700కు సమాచారం అందిస్తే తక్షణమే రక్షణ చర్యలు చేపడుతాం. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగ ఉంచబడుతాయి. 
– రక్షిత కే మూర్తి డీసీపీ, మంచిర్యాల 

ధైర్యంగా వెళ్తున్నాం... 
షీటీమ్‌ వచ్చినప్పటి నుంచి ఎక్కడికైనా ధైర్యంగా వెళ్తున్నాం. మా కాలేజీలో ఇప్పటి వరకు షీ టీంపై ఐదుసార్లు అవగాహన సదస్సు నిర్వహించారు. షీటీం ఏర్పడినప్పటి నుంచి యువకులు ఆమ్మాయిలను ఈవ్‌టీజింగ్‌ చేసేందుకు బయపడుతున్నారు. ఇప్పుడు బయటకు వెళ్లే ముందు దైర్యంగా అనిపిస్తుంది.
– డాలి,  ఎంబీఏ విద్యార్థిని,  మంచిర్యాల

ఒక్క కాల్‌తో రక్షణ
షీటీమ్‌ మహిళలకు ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. 100 నెంబర్‌కు ఒక కాల్‌చేస్తే చాలు పక్కనే ఉంటారు. ఇంట్లో నుంచి వెళ్లి తిరిగి ఇంటికి రావాలంటే ఒకప్పుడు భయంగా ఉండేది. ఇప్పుడు ఎలాంటి భయం లేదు. సివిల్‌ డ్రెస్‌లో పోలీసులు ఎవరో తెలియకుండానే మన మధ్యన ఉంటూ రక్షణ కల్పిస్తున్నారు.
– రత్నం రోజ, విద్యార్థిని, మంచిర్యాల

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement