సాక్షి, ఆదిలాబాద్: సెల్ఫీ సరదా పీజీ వైద్యవిద్యార్ధి ప్రాణాలు తీసింది. ఆదివారం శివ్‌ఘాట్ సందర్శనకు వెళ్లి సాత్నాల వాగులో గల్లంతైన ఆదిలాబాద్ రిమ్స్‌లో పీజీ రెండో సంవత్సరం చదువుతున్న ఆర్థోపెడిక్ వైద్యుడు భుక్యా ప్రవీణ్ (27) మృతదేహం సోమవారం లభించింది.
పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ప్రవీణ్ రిమ్స్‌లో పీజీ సెకండియర్ చదువుతున్నాడు. ఆదివారం కావడంతో తొమ్మిది మంది మిత్రులు ఆదిలాబాద్ వినాయక్ చౌక్ నుంచి ఆదిలాబాద్ రూరల్ మండలం మీదుగా శివ్‌ఘాట్ వెళ్లారు. పక్కనే ఉన్న సాత్నాల వాగు వద్ద కోటి లింగాలను దర్శించుకున్నారు. అనంతరం వాగు అందాలను సెల్ఫీ తీసుకుంటుండగా.. ప్రవీణ్ ఫోన్ వాగులో పడిపోవడంతో, దాని కోసం అందులోకి దిగాడు. ఈ క్రమంలో ప్రవాహంలో కొట్టుకుపోయా డు.
అతడిని కాపాడేందుకు మరో ఇద్దరు స్నేహితులు వాగులోకి దిగగా ఉక్కిరిబిక్కిరి కావడంతో బయటకు వచ్చేశాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకొని గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. చీకటి పడటంతో గాలింపు కష్టంగా మారినట్లు తెలిపారు. నేడు మళ్లీ ఐదుగురు గజ ఈతగాళ్లతో అన్వేషణ చేపట్టగా ప్రవీణ్ మృతదేహం లభించింది. వాగులో నుంచి బయటకు తీసి పోలీసులకు అప్పగించారు.
కాగా సిరిసిల్లా జిల్లాకు చెందిన తల్లిదండ్రులకు పోలీసులు ప్రవీణ్ గల్లంతు సమాచారం ఇచ్చారు. వారు వాగువద్దకు చేరుకొని కొడుకు మరణ వార్త విని, మృతదేహం చూసి తీవ్రంగా విలపిస్తున్నారు. ఉన్నత చదువులు చదివి కుటుంబానికి భరోసానిస్తాడని భావించామని, తీరా ప్రాణాలు కోల్పోయాడని కుటుంబ సభ్యులు వాపోతున్నారు.ఇదిలా ఉండగా ప్రవీణ్‌నుక కాపాడేందుకు ప్రయత్నించిన స్నేహితుల్లో ఒకరైన కార్తీక్ అస్వస్థతకు గురికావడంతో రిమ్స్‌లో కోలుకుంటున్నాడు. ప్రవీణ్ తప్ప మిగిలిన ఎనిమిది మంది సురక్షితంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment