వేదశ్రీ, ప్రజ్ఞ, వెన్నెల (ఫైల్)
సాక్షి, ఆదిలాబాద్: కుటుంబ కలహాలకు మూడు నిండు ప్రాణాలు బలయ్యాయి. ఇద్దరు పిల్లలతో కలిసి ఒంటిపై కిరోసిన్ పోసుకుని తల్లీ నిప్పంటించుకుంది. తల్లి ఘటనా స్థలంలోనే మృతిచెందగా ఇద్దరు చిన్నారులు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. ఈ సంఘటన ఇచ్చోడ మండలం రెడ్డి కాలనీలో చోటు చేసుకుంది. తల్లీ ఇద్దరు పిల్లల మరణంతో విషాదం నెలకొంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బజార్‌హత్నూర్ మండలం పిప్రి గ్రామానికి చెందిన వేదశ్రీ (26)కి ఏడేళ్ల క్రితం ఇచ్చోడ మండల కేంద్రంలోని రెడ్డి కాలనీకి చెందిన బాబురెడ్డితో వివాహమైంది. వీరికి ఇద్దరు కూతుళ్లు ప్రజ్ఞ (5), వెన్నెల (3) ఉన్నారు.
కొద్దిరోజులుగా వీరి కుటుంబంలో కలహాలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో మనస్తాపానికి గురైన వేదశ్రీ గురువారం రాత్రి ఏడు గంటల ప్రాంతంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో వంట గదిలో ఇద్దరు చిన్నారులతో కలిసి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. ఇంటి నుంచి పొగలు రావడం గమనించిన ఇరుగు పొరుగువారు తలుపులు తెరిచి చూడగా వేదశ్రీ అప్పటికే మృతిచెందింది. తీవ్రంగా గాయపడిన ప్రజ్ఞ, వెన్నెలను వెంటనే ఆదిలాబాద్‌లోని రిమ్స్‌కు తరలించారు. చికిత్స పొందుతూ చిన్నారులిద్దరూ కొద్ది వ్యవధిలోనే మృతిచెందారు.
ఘటనా స్థలాన్ని ఆదిలాబాద్ డీఎస్పీ ఉమేందర్, ఇచ్చోడ సీఐ నైలునాయక్, ఇచ్చోడ ఎస్సై ఉదయ్‌కుమార్ పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, వివాహమైన నుంచే వేదశ్రీని భర్త, అత్త, ఆడబిడ్డలు చిత్రహింసలకు గురి చేసి ఆత్మహత్యకు ప్రేరేపించారని మృతురాలి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏదేమైనా కుటుంబ కలహాలకు తల్లితోపాటు ఇద్దరు ముక్కుపచ్చలారని చిన్నారులు బలవడంతో రెడ్డి కాలనీ, పిప్రిలో విషాదఛాయలు అలుముకున్నాయి.
చదవండి: ప్రియుడితో కలిసి భార్య వేధింపులు.. తట్టుకోలేక ఆర్మీ జవాన్!
Comments
Please login to add a commentAdd a comment