Ichoda
-
అప్పు చెల్లించలేదని ఇంటికి తాళం.. పంచాయితీ తీర్పు, రాత్రంతా చీకట్లోనే
ఇచ్చోడ: అప్పు చెల్లించేవరకు ఇంటికి తాళం వేసి ఉంచాలన్న పంచాయితీ పెద్దల తీర్పు కారణంగా బాధిత కుటుంబం రాత్రంతా చీకట్లోనే ఇంటి ముందు జాగరణ చేసిన ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. ఇచ్చోడ మండలం సిరిచెల్మకు చెందిన రాజేందర్ అనే ఆసామి వద్ద అదే గ్రామానికి చెందిన తాత్ర శీను పాలేరుగా పనిచేసేందుకు మూడునెలల క్రితం ఒప్పందం చేసుకున్నాడు. నెలకు రూ.7 వేల చొప్పున ఒప్పందం కుదుర్చుకుని రూ.34 వేలు అడ్వాన్స్ తీసుకున్నాడు. గత జూలై 30వ తేదీ వరకు (దాదాపు మూడు నెలలపాటు) పనిచేశాడు. అయితే ఎడ్లజత సరిగా లేక, వాటితో వేగలేక తాను పనిచేయలేకపోతున్నానని యజమానికి పలుమార్లు చెప్పాడు. కానీ, రాజేందర్ స్పందించకపోవడంతో శీను సోమవారం పనికి వెళ్లలేదు. రాజేందర్ ఫిర్యాదు మేరకు సర్పంచ్ భర్త కన్నమయ్యతోపాటు గ్రామానికి చెందిన కుమ్మరి సాయన్న, కాళ్ల భూమయ్య పంచాయితీ పెట్టారు. శీను పనికి రాకుంటే తీసుకున్న డబ్బులు వెంటనే ఇవ్వా లని తీర్పు చెప్పారు. కొంత సమయం ఇవ్వాలని బాధితుడు ప్రాధేయపడినా వారు పట్టించుకోలేదు. డబ్బులు చెల్లించేవరకు ఇంటికి తాళం వేస్తామని చెప్పా రు. పంచాయితీ పెద్దల తీర్పు మేరకు ఇంటికి తాళం వేయడంతో శీను భార్య గంగమణి, తల్లి పోసాని, కుమారులు మల్లేశ్, నవీన్‌తోపాటు కోడలు లక్ష్మి ఇంటి ఆవరణలోనే సోమవారం రాత్రంతా జాగరణ చేశారు. బాధితుడు శీను మంగళవారం ఇచి్చన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేశ్ తెలిపారు. -
పెళ్లైనప్పటి నుంచి వేధింపులు.. మూడు నిండు ప్రాణాలు బలి
సాక్షి, ఆదిలాబాద్: కుటుంబ కలహాలకు మూడు నిండు ప్రాణాలు బలయ్యాయి. ఇద్దరు పిల్లలతో కలిసి ఒంటిపై కిరోసిన్ పోసుకుని తల్లీ నిప్పంటించుకుంది. తల్లి ఘటనా స్థలంలోనే మృతిచెందగా ఇద్దరు చిన్నారులు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. ఈ సంఘటన ఇచ్చోడ మండలం రెడ్డి కాలనీలో చోటు చేసుకుంది. తల్లీ ఇద్దరు పిల్లల మరణంతో విషాదం నెలకొంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బజార్హత్నూర్ మండలం పిప్రి గ్రామానికి చెందిన వేదశ్రీ (26)కి ఏడేళ్ల క్రితం ఇచ్చోడ మండల కేంద్రంలోని రెడ్డి కాలనీకి చెందిన బాబురెడ్డితో వివాహమైంది. వీరికి ఇద్దరు కూతుళ్లు ప్రజ్ఞ (5), వెన్నెల (3) ఉన్నారు. కొద్దిరోజులుగా వీరి కుటుంబంలో కలహాలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో మనస్తాపానికి గురైన వేదశ్రీ గురువారం రాత్రి ఏడు గంటల ప్రాంతంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో వంట గదిలో ఇద్దరు చిన్నారులతో కలిసి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. ఇంటి నుంచి పొగలు రావడం గమనించిన ఇరుగు పొరుగువారు తలుపులు తెరిచి చూడగా వేదశ్రీ అప్పటికే మృతిచెందింది. తీవ్రంగా గాయపడిన ప్రజ్ఞ, వెన్నెలను వెంటనే ఆదిలాబాద్‌లోని రిమ్స్‌కు తరలించారు. చికిత్స పొందుతూ చిన్నారులిద్దరూ కొద్ది వ్యవధిలోనే మృతిచెందారు. ఘటనా స్థలాన్ని ఆదిలాబాద్ డీఎస్పీ ఉమేందర్, ఇచ్చోడ సీఐ నైలునాయక్, ఇచ్చోడ ఎస్సై ఉదయ్‌కుమార్ పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, వివాహమైన నుంచే వేదశ్రీని భర్త, అత్త, ఆడబిడ్డలు చిత్రహింసలకు గురి చేసి ఆత్మహత్యకు ప్రేరేపించారని మృతురాలి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏదేమైనా కుటుంబ కలహాలకు తల్లితోపాటు ఇద్దరు ముక్కుపచ్చలారని చిన్నారులు బలవడంతో రెడ్డి కాలనీ, పిప్రిలో విషాదఛాయలు అలుముకున్నాయి. చదవండి: ప్రియుడితో కలిసి భార్య వేధింపులు.. తట్టుకోలేక ఆర్మీ జవాన్! -
పేద విద్యార్థికి ఎన్నారై చేయూత.. ఐఐటీలో సీటు
ఇచ్చోడ(ఆదిలాబాద్ జిల్లా): పేద విద్యార్థికి చేయూతనిచ్చి ఓ ఎన్నారై ఉదారత చాటుకున్నాడు. నేరడిగొండ మండలం బోందిడి గ్రామానికి చెందిన అడె సుదర్శన్–విజయ దంపతులు వ్యవసాయ కూలీలు. వీరి కుమారుడు చంద్రకాంత్ ఒకటి నుంచి ఇంటర్ వరకు ప్రభుత్వ పాఠశాలల్లో చదివి అత్యుత్తమ ప్రతిభ కనబరిచాడు. ఐఐటీ జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లోనూ సత్తాచాటాడు. ఎస్టీ కేటగిరీలో ఆలిండియా 787 ర్యాంక్ సాధించాడు. ఐఐటీ జోధ్‌పూర్‌లో సీటు లభించింది. సరస్వతీ కరుణ ఉన్నా లక్ష్మీ కటాక్షం లేకపోవడంతో చంద్రకాంత్ ఐఐటీలో ప్రవేశరుసుం కట్టే ఆర్థిక స్తోమత లేక ఇంటివద్దనే ఉండి పోయాడు. విషయం తెలుసుకున్న ఇచ్చోడకు చెందిన ఓ ప్రైవేట్ పాఠశాల కరస్పాండెంట్ మౌనిక రాథోడ్ ఇటీవల ఐటీ మంత్రి కేటీఆర్‌కు ట్వీట్ చేశారు. మంత్రి సన్నిహితుడి ద్వారా విషయం తెలుసుకున్న యూఎస్‌లో స్థిరపడ్డ ఎన్నారై శశికాంత్ స్పందించాడు. కనపర్తి ఐఐటీ జోధ్‌పూర్‌లో ప్రవేశరుసుం కట్టి చంద్రకాంత్‌ను చేర్పించాడు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌కు, సాయం అందించిన ఎన్నారై శశికాంత్‌కు, అలాగే మౌనిక రాథోడ్‌కు చంద్రకాంత్ తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. (క్లిక్ చేయండి: గురుకులాల్లో కొలువులు 12,000.. అతి త్వరలో నోటిఫికేషన్లు?) -
బాలిక ప్రాణం తీసిన ఇన్స్టాగ్రాం.. అసభ్య మెసేజ్‌లు పోస్టు చేస్తూ.
సాక్షి, ఆదిలాబాద్: ఇన్స్టాగ్రాం నకిలీ ఐడీ ఓ బాలిక ప్రాణం తీసింది. గుర్తు తెలియని వ్యక్తులు బాలిక పేరిట ఇన్స్టాగ్రాం ఐడీ క్రియేట్ చేసి అశ్లీల చిత్రాలు, మెస్సేజ్‌లు చేస్తుండడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుంది. తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యా దు చేయడంతో ఆలస్యంగా గురువారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇచ్చోడ మండలంలోని నర్సాపూర్ గ్రామానికి చెందిన ముస్లె సాక్షి(17) గత ఏడాది పదో తరగతి పూర్తి చేసి ఇంటి వద్ద ఉంటోంది. కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటోంది. ఇటీవల ఆమె పేరు, ఫొటోతో గుర్తు తెలియని వ్యక్తులు ఇన్స్టాగ్రాం ఫేక్ ఐడీ క్రియేట్ చేశారు. అశ్లీల చిత్రాలు, అసభ్య మెసేజ్‌లు పోస్టు చేస్తున్నారు. గుర్తించిన సాక్షి కు టుంబ సభ్యులకు తెలిపింది. అయినా పోస్టులు కొనసాగుతుండడంతో మనస్తాపం చెంది మే 29న ఇంట్లోనే పురుగుల మందు తాగింది. కుటుంబ సభ్యులు రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు హైదరాబాద్‌కు రెఫర్ చేయగా.. ఆదిలాబాద్‌లోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గత నెల 30న చనిపోయింది. మృతురాలి తల్లి యశోదాబాయి బుధవారం ఇచ్చోడ పోలీ సులకు ఫిర్యాదు చేయగా కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఫేక్ ఐడీ క్రియేట్ చేసినవారి కోసం ఆరా తీస్తున్నారు. -
రెండేళ్లుగా సంబంధాల కోసం ఎదురుచూపు.. ఎంతకీ కుదరకపోవడంతో
ఇచ్చోడ: జీవితంపై విరక్తి చెందిన ఓ యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఎస్సై ఫరీద్ తెలిపిన వివరాలు.. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని సిరిచెల్మ గ్రామానికి చెందిన ఆశాబీ (22) రెండేళ్ల నుంచి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. అయితే వచ్చిన సంబంధాలన్నీ రద్దవుతున్నాయి. దీంతో కొన్ని రోజులుగా ఆషాబీ మనస్తాపంతో దిగాలుగా ఉంటోంది. ఇక తనకు పెళ్లి కాదేమోనని బుధవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడింది. కొద్దిసేపటికి గమనించిన కుటుంబీకులు, స్థానికులు ఆమెను వెంటనే రిమ్స్‌కు తరలించారు. చికిత్స పొందుతూ గురువారం మృతిచెందింది. మృతురాలి తండ్రి అబ్దుల్ జాఫర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. చదవండి: 8 మంది భర్తలను మోసగించి, తొమ్మిదో పెళ్లికి రెడీ.. ట్విస్ట్ ఏంటంటే! చదవండి: కూరగాయలు కోయమన్న అత్త.. చేతకాక కత్తితో కోడలు దాడి -
ఇచ్చోడ సీఐపై బదిలీ వేటు
సాక్షి, ఆదిలాబాద్: ఇచ్చోడ సీఐ శ్రీనివాస్‌పై వేటు పడింది. కరీంనగర్ డీఐజీ కార్యాలయానికి అటాచ్డ్ చేస్తూ ఉత్తర్వులు వెలబడ్డాయి. వివిధ అవినీతి, ఆరోపణలపై శాఖ పరమైన విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారం జిల్లా పోలీసు శాఖలో సంచలనం కలిగిస్తుంది. ఇచ్చోడ సీఐ శ్రీనివాస్ ఏడాదిగా ఇక్కడ ఇచ్చోడ సీఐగా పనిచేస్తున్నారు. అంతకుముందు జిల్లాలోనే ఎస్సైగా వివిధ పోలీసు స్టేషన్లలో పనిచేశారు. గతంలో ఇచ్చోడ సీఐగా ఉన్న సతీష్‌పై అవినీతి, ఆరోపణలు రావడంతో సస్పెన్షన్ వేటు వేశారు. అప్పుడే ఎస్సై నుంచి పదోన్నతి పొందిన శ్రీనివాస్‌ను ఇచ్చోడ సీఐగా నియమించారు. (కరీంనగర్ టు టౌన్ సీఐపై ఫోర్జరీ, చీటింగ్ ఆరోపణలు ) అయితే అతి తక్కువ కాలంలోనే ఆయన అవినీతి, ఆరోపణలు మూటగట్టుకున్నారు. వరుసగా ఇక్కడ పనిచేసిన ఇద్దరు అధికారులు అవినీతి, ఆరోపణలు ఎదుర్కోవడం గమనించదగ్గ విషయం. ఇదిలా ఉంటే ఈ అవినీతి, ఆరోపణలు ఎస్పీ విష్ణు ఎస్.వారియర్ దృష్టికి రావడంతో ఆయన విచారణ జరిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే సీఐ శ్రీనివాస్‌ను డీఐజీ కార్యాలయానికి అటాచ్డ్ చేసినట్లు సమాచారం. ఈ విషయమై ఉట్నూర్ డీఎస్పీ ఉదయ్‌రెడ్డిని ‘సాక్షి’ వివరణ కోరగా, రెండు రోజుల కిందట ఇచ్చోడ సీఐ శ్రీనివాస్‌ను డీఐజీ కార్యాలయానికి అటాచ్డ్ చేస్తూ ఉత్తర్వులు వెలబడినట్లు తెలిపారు. ఉత్తర్వుల్లో కారణాలు తెలవలేదన్నారు. ప్రస్తుతం ఇచ్చోడ సీఐగా ఎవరిని నియమించలేదని పేర్కొన్నారు. (ఆ రైలు ఇకపై ఇక్కడ ఆగదు: సీఎం ) -
కరోనా : అయ్యో! తిరుపతికి ఎంత కష్టం..
సాక్షి, ఆదిలాబాద్ : ప్రపంచవ్యాప్తంగా గడగడలాడిస్తోన్న కరోనా మహమ్మారి తెలంగాణలోని మారుమూల గ్రామాల ప్రజలను కూడా వణికిస్తుంది. కరోనా మహమ్మారిని తరిమికొట్టడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ను విధించిన సంగతి తెలిసిందే. అయితే పట్టణాలతో పోలిస్తే గ్రామాల్లోనే లాక్‌డౌన్‌ను సంపూర్ణంగా పాటిస్తున్నారనే చెప్పాలి. అది ఎంతలా అంటే ఎవరైనా కొత్తవారు ఊరికి వస్తే వారిని ఊర్లోకి అడుగుపెట్టనివ్వకుండా ఊరి బయటే ఉంచుతున్నారు. కానీ ఇక్కడ మాత్రం ఒక లారీ డ్రైవర్‌కు వింత అనుభవం ఎదురైంది. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం మాన్కపూర్ గ్రామానికి చెందిన తిరుపతి వృత్తిరిత్యా లారీ డ్రైవర్. కాగా తిరుపతి ఇటీవలే తన లారీలో గుజరాత్‌కు వెళ్లి అక్కడి నుంచి మందుల లోడ్ తీసుకొని విశాఖపట్నంకు వెళ్లాడు. విశాఖలో మెడిసిన్స్ అన్లోడ్ చేసి అక్కడి నుంచి ఏప్రిల్ 5న తన సొంత గ్రామమైన మాన్కపూర్‌కు చేరుకున్నాడు. అయితే సొంతూరు వచ్చిన తిరుపతిని గ్రామస్తులు ఊర్లోకి రానీయకుండా ఊరి బయటే అడ్డుకున్నారు. లాక్డౌన్ నేపథ్యంలో గుజరాత్‌కు వెళ్లి వచ్చిన తిరుపతిని ఊరి బయట వేసిన టెంట్లో 14 రోజుల పాటు క్వారంటైన్లో ఉంచాలంటూ గ్రామస్తులు నిర్ణయం తీసుకున్నారు. 14 రోజుల తర్వాత కరోనా లక్షణాలు లేకుంటేనే తిరుపతిని ఊర్లోకి అడుగుపెట్టనీయాలని తీర్మానించకున్నారు. అప్పటివరకు తిరుపతి ఊరి బయట వేసిన టెంట్లో ఉంటూ అక్కడి పొలాల్లోనే స్నానం,మిగతా కార్యక్రమాలను తీర్చుకోవాలన్నారు. కాగా తిరుపతికి భోజనం అందించేందుకు వచ్చే కుటుంబసభ్యులు ఎవరైనా సరే కొంత దూరానా పెట్టి తిరిగి వెళ్లిపోవాలని నిశ్చయించారు. ఇదే విషయమై గ్రామ సర్పంచ్ అడగ్గా.. ఆయన మాట్లాడుతూ.. 'మా గ్రామం లాక్‌డౌన్‌ను సమర్థంగా అమలు చేస్తుంది. తిరుపతి మా గ్రామస్తుడే అయినా బయటికి వెళ్లి వచ్చాడు కాబట్టి 14రోజుల పాటు క్వారంటైన్లో ఉండాల్సిందే. ఇది ఒక్క తిరుపతికే కాదు.. మా ఊరి నుంచి ఎవరు బయటికి వెళ్లినా ఇదే వర్తిస్తుంది' అంటూ చెప్పుకొచ్చాడు. కరోనా కట్టుబాటుతో ఇప్పటికే ఐదు రోజులుగా తిరుపతి ఒక రకంగా గ్రామ బహిష్కరణ అనుభవిస్తున్నాడు. కరోనా అరికట్టెందుకు గ్రామస్తుల నిర్ణయం మేరకు మరో తొమ్మిది రోజులు తిరుపతి ఊరి బయట టెంట్లో ఉండక తప్పదని ఆ ఊరి గ్రామస్తులు పేర్కొన్నారు. -
ఆదిలాబాద్:కొలిచే వారేరి?
సాక్షి, ఇచ్చోడ(బోథ్): ఇద్దరు రైతుల మధ్య భూ తగాదా ఏర్పడినప్పుడు ఆ భూమిని కొలిచి సమస్యను పరిష్కరించాలి. కానీ జిల్లాలో సర్వేయర్ల కొరతతో ఎక్కడి భూ సమస్యలు అక్కడే ఉంటున్నాయి. వందలాది కేసులు పెండింగ్‌లో పడిపోతున్నాయి. అత్యవసరంగా భూములు కొలవాల్సి వచ్చినప్పుడు సర్వేయర్ల కోసం రోజుల తరబడి వేచిచూడాల్సి వస్తోంది. ఏటా ఫిబ్రవరి నుంచి జూన్ వరకు భూ సమస్యలపై అధికంగా దరఖాస్తులు వస్తుంటాయి. భూ వివాదాల కోసం దరఖాస్తు చేసుకున్న భూముల్లో పంటలు ఉండటంతో ఎక్కువగా ఫిబ్రవరి నుంచి జూన్ మధ్యలోనే సర్వేయర్లు భూములను కొలిచి హద్దులు నిర్ణయిస్తారు. కానీ జిల్లాలో సర్వేయర్ల కొరత ఉండటంతో ఏళ్లుగా భూ సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. వేధిస్తున్న ఖాళీలు.. జిల్లాలో 18 మండలాల్లో 18 మంది సర్వేయర్లు ఉండాలి. కానీ కేవలం 8 మంది సర్వేయర్లు మాత్రమే పనిచేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 10 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గత నాలుగైదు సంవత్సరాల నుంచి సర్వేయర్లు లేకపోవడంతో ఒక్కో సర్వేయర్‌కు రెండు మూడు మండలాలు ఇన్చార్జి ఇవ్వడంతో భూ సమస్యలు పరిష్కారానికినోచుకోవడం లేదు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన భూ సర్వేలో భూ వివాదాలపై జిల్లా వ్యాప్తంగా 2 వేలకుపైగా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. అయితే సర్వేయర్లు అందుబాటులో లేక పనులు ముందుకు సాగడం లేదు. ఏళ్లుగా డిప్యూటేషన్లే.. జిల్లాలోని 8 మంది సర్వేయర్లలో కొంత మంది సంవత్సర కాలంగా డిప్యూటేషన్‌పై ప్రాజెక్టుల్లో భూసేకరణ కోసం పనిచేస్తున్నారు. జిల్లాలో నిర్మిస్తున్న కోరాట–చనాఖా, పిప్పల్‌కోటి ప్రాజెక్టుల భూ సేకరణ కోసం గత సంవత్సరం నుంచి 8 మంది సర్వేయర్లలో ముగ్గురు ఈ పనుల్లోనే ఉన్నారు. అంటే ప్రసుతం జిల్లాలో 8 మంది సర్వేయర్లలలో ఐదుగురు మాత్రమే మండలాల్లో విధులు నిర్వహిస్తున్నారు. ప్రైవేట్ సర్వేయర్లకు భలే గిరాకీ.. ప్రభుత్వ సర్వేయర్ల కొరత ఉండటంతో ప్రైవేట్ సర్వేయర్లకు భలే గిరాకీ ఉంది. అన్నదమ్ముల భూ పంపకాలు, ఇద్దరు రైతుల మధ్య భూతగదాలు, భూవిక్రయాలు జరిగినప్పుడు భూ లెక్కలు తేల్చడానికి సర్వేయర్లు అవసరం. ప్రభుత్వ సర్వేయర్ల కొరత ఉండటం, ఉన్న వారు కూడ అత్యవసరంగా రాకపోవడంతో పలువురు రైతులు ప్రైవేట్ సర్వేయర్లను ఆశ్రయించక తప్పడం లేదు. దీంతో ప్రైవేట్ సర్వేయర్లకు భలే గిరాకీ ఉంటోంది. ఫిబ్రవరి నుంచి జూన్ వరకు అంటే.. వర్షాలు పడేంత వరకు ప్రైవేట్ సర్వేయర్లు భూ లెక్కల్లో చాలా బిజీగా ఉంటున్నారు. అత్యవసర సమయంలో ప్రైవేటు సర్వేయర్లకు అన్నంత ఇవ్వాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. ప్రైవేట్ సర్వేయర్‌తో భూమి కొలిపించాం సర్కారు సర్వేయర్ కోసం కార్యాలయం చుట్టూ తిరిగినం. సంవత్సరం నుంచి ఆయన డిప్యూటేషన్‌లో ఉన్నాడని తెలిసింది. దీంతో అత్యవసరంగా మా భూమి కొలవాల్సి రావడంతో గత్యంతరం లేక ప్రైవేటు సర్వేయర్‌ను కొలిపించాం. – రాథోడ్ దినేశ్‌నాయక్, దాబా(కె), ఇచ్చోడ మండలం -
‘ఆదర్శం’.. అధ్వానం
ఇచ్చోడ : బోథ్ నియోజకవర్గంలో గుడిహత్నూర్, బజార్హత్నూర్ మండలాలకు ప్రభుత్వం మోడల్ స్కూళ్లు మంజూరు చేసింది. వాటి భవన నిర్మాణాలకు నిధులు విడుదల చేసింది. 2012-13 విద్యాసంవత్సరంలోనే ఈ పాఠశాలల తరగతులు ప్రారంభించాల్సి ఉండగా.. అధికారుల నిర్లక్ష్యం, కాంట్రాక్టర్ అలసత్వంతో గుడిహత్నూర్‌లో పాఠశాల భవన నిర్మాణం నేటికీ పూర్తికాలేదు. దీంతో 2013-14 విద్యాసంవత్సరంలో ఆదర్శ విద్యకు మండల విద్యార్థులు నోచుకోలేదు. ఈ ఏడాదైనా భవన నిర్మాణం పూర్తయితే పాఠశాల ప్రారంభమయ్యే అవకాశముందని ఆశించిన విద్యార్థుల తల్లిదండ్రులకు నిరాశే మిగులుతోంది. ప్రస్తుతం హాస్టల్ భవనం పనులు శరవేగంగా సాగుతుండగా భవన నిర్మాణ పనులు పిల్లర్లకే పరిమితం కావడంతో ఈ ఏడాది కూడా పాఠశాల తరగతులు ప్రారంభమయ్యేలా కనిపించడంలేదు. అధికారుల పర్యవేక్షణ కొరవడడంతోనే ఈ సమస్య తలెత్తిందని స్థానికులు విమర్శిస్తున్నారు. ఇక బజార్హత్నూర్లో చేపట్టిన ఆదర్శ పాఠశాల భవన నిర్మాణ పనులు పూర్తవడంతో గతేడాది తరగతులు ప్రారంభించారు. అయితే హాస్టల్ భవన నిర్మాణం పూర్తికాకపోవడంతో విద్యార్థులకు వసతి కల్పించలేదు. ఈ ఏడాది కూడా వారికి వసతి కల్పించే అవకాశాలు కనిపించడంలేదు. చెన్నూర్ : పేద విద్యార్థులకు ఇంగ్లిష్ మీడియంలో విద్యనందించేందుకు ప్రభుత్వం నియోజకవర్గంలోని చెన్నూర్, కోటపల్లి, జైపూర్, మందమర్రి మండలాలకు 2011లో ఆదర్శ పాఠశాలలు మంజూరు చేసింది. అధికారులు అలసత్వంతో చెన్నూర్, కోటపల్లి, జైపూర్ మండలాల్లో నేటికీ భవన నిర్మాణానికి స్థలం కేటాయించలేదు. దీంతో రెండేళ్లుగా అక్కడి విద్యార్థులు మోడల్ స్కూల్ విద్యకు దూరమయ్యారు. మందమర్రి మండలంలో 2011లో ఆదర్శ పాఠశాల భవన నిర్మాణానికి రూ.3.2 కోట్లు నిధులు మంజూరవగా.. 2012లో నిర్మాణ పనులు ప్రారంభించారు. ఏడాది వ్యవధిలో పనులు పూర్తి చేస్తామని కాంట్రాక్టర్ హామీ ఇవ్వడంతో సింగరేణికి చెందిన కొన్ని గదుల్లో తాత్కాలికంగా ఆదర్శ పాఠశాల తరగతులు ప్రారంభించారు. 275 మంది విద్యార్థులు చేరారు. ఆరకొర వసతుల మధ్య విద్యార్థులు ఏడాదిపాటు విద్యాభ్యాసం పూర్తిచేశారు. ఈ ఏడాది సైతం భవన నిర్మాణం పూర్తికావడం అనుమానమే. దీంతో మొదటి సంవత్సరం విద్యార్థులు 275 మందికి తోడు వచ్చే విద్యాసంవత్సరం అదనంగా మరో వంద మంది చేరనున్నారు. ఇప్పటికే సింగరేణి ఇరుకు గదుల్లో అసౌకర్యాల మధ్య కొట్టుమిట్టాడుతున్న విద్యార్థులకు వచ్చే విద్యాసంవత్సరం కొత్త విద్యార్థుల చేరికతో మరిన్ని తిప్పలు తప్పేలా లేవు. త్వరగా భవనం పనులు పూర్తిచేయించి విద్యార్థుల కష్టాలు దూరం చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నా పట్టించుకునేవారు కరువయ్యారు. -
టమాటాల మాటున కలప రవాణా
ఇచ్చోడ, న్యూస్‌లైన్ : మండలంలోని సిరిచెల్మ చౌరస్తా బైపాస్ రోడ్డుపై టమాటాల మాటున అక్రమంగా కలప తరలిస్తున్న వ్యాన్‌ను అటవీ శాఖ అధికారులు సోమవారం ఉదయం పట్టుకున్నారు. అటవీ అధికారుల కథనం ప్రకారం.. సిరిచెల్మ వైపు నుంచి టమాటాలు తరలిస్తున్న వాహనంలో అక్రమంగా కలప రవాణా చేస్తున్నట్లు అటవీ శాఖ అధికారులకు ముందస్తుగా సమాచారం అందింది. ఈ మేరకు అటవీ సిబ్బంది బైపాస్ రోడ్డు వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. ఇది గమనించిన స్మగ్లర్లు వాహనాన్ని జాతీయ రహదారిపైకి ఎక్కించి పరారవడానికి ప్రయత్నించారు. అయితే వెంటనే అప్రమత్తమైన సిబ్బంది వాహనాన్ని అడ్డగించారు. దీంతో వాహనం దిగి స్మగ్లర్లు పారిపోయారు. పట్టుకున్న వాహనాన్ని అటవీ శాఖ కార్యాలయానికి తరలించారు. అందులోని కలప విలువ రూ.లక్ష వరకు ఉంటుందని సిబ్బంది తెలిపారు. ఈ దాడిలో సిబ్బంది చిన్నయ్య, అహ్మద్‌ఖాన్, ఆత్రం సుందర్ పాల్గొన్నారు.