పోలీస్ స్టేషన్‌లో కుటుంబ సభ్యులతో శీను
ఇచ్చోడ: అప్పు చెల్లించేవరకు ఇంటికి తాళం వేసి ఉంచాలన్న పంచాయితీ పెద్దల తీర్పు కారణంగా బాధిత కుటుంబం రాత్రంతా చీకట్లోనే ఇంటి ముందు జాగరణ చేసిన ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. ఇచ్చోడ మండలం సిరిచెల్మకు చెందిన రాజేందర్ అనే ఆసామి వద్ద అదే గ్రామానికి చెందిన తాత్ర శీను పాలేరుగా పనిచేసేందుకు మూడునెలల క్రితం ఒప్పందం చేసుకున్నాడు.
నెలకు రూ.7 వేల చొప్పున ఒప్పందం కుదుర్చుకుని రూ.34 వేలు అడ్వాన్స్ తీసుకున్నాడు. గత జూలై 30వ తేదీ వరకు (దాదాపు మూడు నెలలపాటు) పనిచేశాడు. అయితే ఎడ్లజత సరిగా లేక, వాటితో వేగలేక తాను పనిచేయలేకపోతున్నానని యజమానికి పలుమార్లు చెప్పాడు. కానీ, రాజేందర్ స్పందించకపోవడంతో శీను సోమవారం పనికి వెళ్లలేదు. రాజేందర్ ఫిర్యాదు మేరకు సర్పంచ్ భర్త కన్నమయ్యతోపాటు గ్రామానికి చెందిన కుమ్మరి సాయన్న, కాళ్ల భూమయ్య పంచాయితీ పెట్టారు.
శీను పనికి రాకుంటే తీసుకున్న డబ్బులు వెంటనే ఇవ్వా లని తీర్పు చెప్పారు. కొంత సమయం ఇవ్వాలని బాధితుడు ప్రాధేయపడినా వారు పట్టించుకోలేదు. డబ్బులు చెల్లించేవరకు ఇంటికి తాళం వేస్తామని చెప్పా రు. పంచాయితీ పెద్దల తీర్పు మేరకు ఇంటికి తాళం వేయడంతో శీను భార్య గంగమణి, తల్లి పోసాని, కుమారులు మల్లేశ్, నవీన్‌తోపాటు కోడలు లక్ష్మి ఇంటి ఆవరణలోనే సోమవారం రాత్రంతా జాగరణ చేశారు. బాధితుడు శీను మంగళవారం ఇచి్చన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేశ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment