‘ఆదర్శం’.. అధ్వానం | Building construction not complete of government model school | Sakshi
Sakshi News home page

‘ఆదర్శం’.. అధ్వానం

Published Sun, May 25 2014 12:57 AM | Last Updated on Sat, Sep 2 2017 7:48 AM

Building construction not complete of government model school

ఇచ్చోడ : బోథ్ నియోజకవర్గంలో గుడిహత్నూర్, బజార్‌హత్నూర్ మండలాలకు ప్రభుత్వం మోడల్ స్కూళ్లు మంజూరు చేసింది. వాటి భవన నిర్మాణాలకు నిధులు విడుదల చేసింది. 2012-13 విద్యాసంవత్సరంలోనే ఈ పాఠశాలల తరగతులు ప్రారంభించాల్సి ఉండగా.. అధికారుల నిర్లక్ష్యం, కాంట్రాక్టర్ అలసత్వంతో గుడిహత్నూర్‌లో పాఠశాల భవన నిర్మాణం నేటికీ పూర్తికాలేదు. దీంతో 2013-14 విద్యాసంవత్సరంలో ఆదర్శ విద్యకు మండల విద్యార్థులు నోచుకోలేదు.

ఈ ఏడాదైనా భవన నిర్మాణం పూర్తయితే పాఠశాల ప్రారంభమయ్యే అవకాశముందని ఆశించిన విద్యార్థుల తల్లిదండ్రులకు నిరాశే మిగులుతోంది. ప్రస్తుతం హాస్టల్ భవనం పనులు శరవేగంగా సాగుతుండగా భవన నిర్మాణ పనులు పిల్లర్లకే పరిమితం కావడంతో ఈ ఏడాది కూడా పాఠశాల తరగతులు ప్రారంభమయ్యేలా కనిపించడంలేదు. అధికారుల పర్యవేక్షణ కొరవడడంతోనే ఈ సమస్య తలెత్తిందని స్థానికులు విమర్శిస్తున్నారు. ఇక బజార్‌హత్నూర్‌లో చేపట్టిన ఆదర్శ పాఠశాల భవన నిర్మాణ పనులు పూర్తవడంతో గతేడాది తరగతులు ప్రారంభించారు. అయితే హాస్టల్ భవన నిర్మాణం పూర్తికాకపోవడంతో విద్యార్థులకు వసతి కల్పించలేదు. ఈ ఏడాది కూడా వారికి వసతి కల్పించే అవకాశాలు కనిపించడంలేదు.
 
 చెన్నూర్ : పేద విద్యార్థులకు ఇంగ్లిష్ మీడియంలో విద్యనందించేందుకు ప్రభుత్వం నియోజకవర్గంలోని చెన్నూర్, కోటపల్లి, జైపూర్, మందమర్రి మండలాలకు 2011లో ఆదర్శ పాఠశాలలు మంజూరు చేసింది. అధికారులు అలసత్వంతో చెన్నూర్, కోటపల్లి, జైపూర్ మండలాల్లో నేటికీ భవన నిర్మాణానికి స్థలం కేటాయించలేదు. దీంతో రెండేళ్లుగా అక్కడి విద్యార్థులు మోడల్ స్కూల్ విద్యకు దూరమయ్యారు. మందమర్రి మండలంలో 2011లో ఆదర్శ పాఠశాల భవన నిర్మాణానికి రూ.3.2 కోట్లు నిధులు మంజూరవగా.. 2012లో నిర్మాణ పనులు ప్రారంభించారు.

 ఏడాది వ్యవధిలో పనులు పూర్తి చేస్తామని కాంట్రాక్టర్ హామీ ఇవ్వడంతో సింగరేణికి చెందిన కొన్ని గదుల్లో తాత్కాలికంగా ఆదర్శ పాఠశాల తరగతులు ప్రారంభించారు. 275 మంది విద్యార్థులు చేరారు. ఆరకొర వసతుల మధ్య విద్యార్థులు ఏడాదిపాటు విద్యాభ్యాసం పూర్తిచేశారు. ఈ ఏడాది సైతం భవన నిర్మాణం పూర్తికావడం అనుమానమే. దీంతో మొదటి సంవత్సరం విద్యార్థులు 275 మందికి తోడు వచ్చే విద్యాసంవత్సరం అదనంగా మరో వంద మంది చేరనున్నారు. ఇప్పటికే సింగరేణి ఇరుకు గదుల్లో అసౌకర్యాల మధ్య కొట్టుమిట్టాడుతున్న విద్యార్థులకు వచ్చే విద్యాసంవత్సరం కొత్త విద్యార్థుల చేరికతో మరిన్ని తిప్పలు తప్పేలా లేవు. త్వరగా భవనం పనులు పూర్తిచేయించి విద్యార్థుల కష్టాలు దూరం చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నా పట్టించుకునేవారు కరువయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement