మండలంలోని సిరిచెల్మ చౌరస్తా బైపాస్ రోడ్డుపై టమాటాల మాటున అక్రమంగా కలప తరలిస్తున్న వ్యాన్‌ను అటవీ శాఖ అధికారులు సోమవారం ఉదయం పట్టుకున్నారు.
ఇచ్చోడ, న్యూస్‌లైన్ : మండలంలోని సిరిచెల్మ చౌరస్తా బైపాస్ రోడ్డుపై టమాటాల మాటున అక్రమంగా కలప తరలిస్తున్న వ్యాన్‌ను అటవీ శాఖ అధికారులు సోమవారం ఉదయం పట్టుకున్నారు. అటవీ అధికారుల కథనం ప్రకారం.. సిరిచెల్మ వైపు నుంచి టమాటాలు తరలిస్తున్న వాహనంలో అక్రమంగా కలప రవాణా చేస్తున్నట్లు అటవీ శాఖ అధికారులకు ముందస్తుగా సమాచారం అందింది. ఈ మేరకు అటవీ సిబ్బంది బైపాస్ రోడ్డు వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. ఇది గమనించిన స్మగ్లర్లు వాహనాన్ని జాతీయ రహదారిపైకి ఎక్కించి పరారవడానికి ప్రయత్నించారు. అయితే వెంటనే అప్రమత్తమైన సిబ్బంది వాహనాన్ని అడ్డగించారు. దీంతో వాహనం దిగి స్మగ్లర్లు పారిపోయారు. పట్టుకున్న వాహనాన్ని అటవీ శాఖ కార్యాలయానికి తరలించారు. అందులోని కలప విలువ రూ.లక్ష వరకు ఉంటుందని సిబ్బంది తెలిపారు. ఈ దాడిలో సిబ్బంది చిన్నయ్య, అహ్మద్‌ఖాన్, ఆత్రం సుందర్ పాల్గొన్నారు.