
సాక్షి, ఆదిలాబాద్: ఇచ్చోడ సీఐ శ్రీనివాస్‌పై వేటు పడింది. కరీంనగర్ డీఐజీ కార్యాలయానికి అటాచ్డ్ చేస్తూ ఉత్తర్వులు వెలబడ్డాయి. వివిధ అవినీతి, ఆరోపణలపై శాఖ పరమైన విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారం జిల్లా పోలీసు శాఖలో సంచలనం కలిగిస్తుంది. ఇచ్చోడ సీఐ శ్రీనివాస్ ఏడాదిగా ఇక్కడ ఇచ్చోడ సీఐగా పనిచేస్తున్నారు. అంతకుముందు జిల్లాలోనే ఎస్సైగా వివిధ పోలీసు స్టేషన్లలో పనిచేశారు. గతంలో ఇచ్చోడ సీఐగా ఉన్న సతీష్‌పై అవినీతి, ఆరోపణలు రావడంతో సస్పెన్షన్ వేటు వేశారు. అప్పుడే ఎస్సై నుంచి పదోన్నతి పొందిన శ్రీనివాస్‌ను ఇచ్చోడ సీఐగా నియమించారు. (కరీంనగర్ టు టౌన్ సీఐపై ఫోర్జరీ, చీటింగ్ ఆరోపణలు )
అయితే అతి తక్కువ కాలంలోనే ఆయన అవినీతి, ఆరోపణలు మూటగట్టుకున్నారు. వరుసగా ఇక్కడ పనిచేసిన ఇద్దరు అధికారులు అవినీతి, ఆరోపణలు ఎదుర్కోవడం గమనించదగ్గ విషయం. ఇదిలా ఉంటే ఈ అవినీతి, ఆరోపణలు ఎస్పీ విష్ణు ఎస్.వారియర్ దృష్టికి రావడంతో ఆయన విచారణ జరిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే సీఐ శ్రీనివాస్‌ను డీఐజీ కార్యాలయానికి అటాచ్డ్ చేసినట్లు సమాచారం. ఈ విషయమై ఉట్నూర్ డీఎస్పీ ఉదయ్‌రెడ్డిని ‘సాక్షి’ వివరణ కోరగా, రెండు రోజుల కిందట ఇచ్చోడ సీఐ శ్రీనివాస్‌ను డీఐజీ కార్యాలయానికి అటాచ్డ్ చేస్తూ ఉత్తర్వులు వెలబడినట్లు తెలిపారు. ఉత్తర్వుల్లో కారణాలు తెలవలేదన్నారు. ప్రస్తుతం ఇచ్చోడ సీఐగా ఎవరిని నియమించలేదని పేర్కొన్నారు. (ఆ రైలు ఇకపై ఇక్కడ ఆగదు: సీఎం )